జగన్ తత్వం అర్థంకాక కొందరి కుప్పిగంతులు
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
మంత్రివర్గ విస్తరణ తరవాత పదవులు కోల్పోయిన మంత్రులు ఏం చేస్తున్నారు? ఇదివరకటి రోజులు కావు కదా! పదవిని తిరిగి ఎలా తెచ్చుకోవాలి అని కొందరు ఆలోచిస్తుంటే మరికొందరు అధిష్ఠానంపై ఒత్తిడి ఎలా పెంచాలా అని వ్యూహాలు పన్నుతున్నారు. ఇదెక్కడో కాదు ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు.
ఆయన స్థానంలో కాకాణి గోవర్దన రెడ్డికి మంత్రి పదవి దక్కింది. తాను జగన్ వీరభక్తుడిననీ, ఆయనేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన అనిల్ ఏం చేస్తున్నారిప్పుడు? తన నియోజకవర్గంలో విజయయాత్ర చేస్తున్న మంత్రి కాకాణికి తన బలం చూపించడానికి పోటీ యాత్రను తలపెట్టారు.. ఇది దేనికి సంకేతం? జగన్ మాటను గౌరవించడమా! కొందరు తమకేమీ అసంతృప్తి లేదంటూనే లోలోపల ఉడికిపోతున్నారు. పాయకరావు పేట ఎమ్మెల్యే అయితే ఒక అడుగు ముందుకు వేశారు.
తనకు ఈసారి తప్పని సరిగా మంత్రి పదవి లభిస్తుందని నమ్మకంతో ఉన్న గొల్ల బాబూరావు అది వమ్ము కావడంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను అనుకున్నంత మంచివాణ్ణి కాదు… నేను హింసావాదిని. పెట్టుకుంటే జైల్లో పెట్టుకోండి.. అంటూ సవాలు కూడా విసిరారు. ఒక పేర్ని నాని, ఆళ్ళ నాని, ధర్మాన కృష్ణదాస్ పైకి గుంభనంగా కనిపిస్తున్నప్పటికీ… లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నారని వార్తలు వినవస్తున్నాయి. అనంతపురంలో ఉష శ్రీచరణ్‌కు పదవి వచ్చిందనే కోపం ప్రత్యర్థులలో నెలకొంది. ఏక వ్యక్తి పార్టీ కావడంతోనూ, అత్యధిక మెజారిటీ ఉండడంతోనూ గట్టిగా నోరు విప్పే ధైర్యాన్ని అసంతృప్తవాదులు చేయలేకపోతున్నారు. ఇదంతా ఒకలా ఉంటే పదవిని కోల్పోయిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వైఖరి మరొకలా ఉంది. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నారు. టొమేటో తోటలో పళ్ళను కోసుకుంటున్న చిత్రాలు కొన్ని నిన్న సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
మంత్రి పదవి వస్తే ఓకే.. లేకపోతే… నా పని నేను చేసుకుంటాననే ఆమె వైఖరి సమంజసమే.
మేకతోటి సుచరిత వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది. ఆమె నేరుగా మాట్లాడకుండా తన అభిప్రాయాన్ని ఇతర మార్గాల ద్వారా వెల్లడిస్తున్నారు. ఇక్కడో విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వైయస్ జగన్మోహన్ రెడ్డిలాంటి బలీయమైన నేత దగ్గర ఎలాంటి నిరసన తెలపాలని ప్రయత్నించినప్పటికీ అవి కుప్పిగంతులే కాగలవు. ఈ పరమార్థాన్ని అర్థం చేసుకున్న వారు సహనంతో ఉన్నారు. అర్థం చేసుకోని వారు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం తమను మంత్రులుగా ఉంచడమే అదృష్టమని భావిస్తున్న వారూ లేకపోలేదు.