Thursday, September 28, 2023
HomeArchieveకేంద్రం తిరోగ‌మ‌న విధానాలు

కేంద్రం తిరోగ‌మ‌న విధానాలు

రైతాంగాన్ని నిరుత్సాహ‌ప‌రిచే చ‌ర్య‌లు
అప‌స‌వ్య కార్య‌క్ర‌మాల అమ‌లు బాధాక‌రం
వ్య‌వ‌సాయంపై ఉన్న‌త స్థాయి స‌మీక్ష‌లో సీఎం కేసీఆర్ మండిపాటు
లాభ‌సాయ‌క సాగుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక సిద్ధం చేయాలి
హైద‌రాబాద్‌, ఏప్రిల్ 19:
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారత దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న దేశ రైతాంగాన్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం, దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమని సిఎం కెసిఆర్ అన్నారు.
వ్యవసాయానికి మరింత ఊతం
ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని సిఎం స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని సిఎం పునరుద్ఘాటించారు. వానాకాలం మరికొద్ది నెలల్లో రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి అధికారులకు సిఎం సూచించారు. పత్తి, మిర్చి, కంది, వాటర్ మిలన్ తదితర ప్రత్యామ్న్యాయ పంటల సాగును ప్రోత్సహించాలని సిఎం అన్నారు.
ఉన్నతస్థాయి సమీక్ష
ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధతపై ప్రగతి భవన్‌లో మంగళవారం సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన వరి ధాన్యం సేకరణ పురోగతి పై అధికారులను సిఎం ఆరాతీసారు.
లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు నిరంతరం పంటపొలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలన్నారు. ఆ దిశగా అవగాహన పెంపొందించాలని, అందుకు ఏఈ అధికారులకు నిరంతరం శిక్షణా తరగతులను నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సిఎం సూచించారు. వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణ పై జాబ్ చార్ట్ తయారు చేయాలన్నారు.
పురోగమ‌న బాట‌లో తెలంగాణ వ్యవసాయం
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో వ్యవసాయానికి వాతావరణం అనుకూలంగా ఉంది. సరిపడా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉండబోతున్నది. రైతులు యాసంగి పనులను ముగించుకున్నరు. వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. ఈలోపే అవసరమయ్యే ఎరువులు విత్తనాలు సరిపడా సమకూర్చుకోవాలి. రైతులకు ఎటువంటి లోటు రాకుండా వాటిని అందుబాటులో ఉంచుకోవాలి. కల్తీ విత్తనాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.‘ నేడు తెలంగాణ వ్యవసాయం గొప్పగా పురోగమిస్తున్నది. ఉమ్మడి పాలనలో నాడు నామమాత్రంగా వున్న వ్యవసాయ రంగం, నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్ర జిఎస్డిపీకి 21 శాతం దోహదపడుతున్నది. ఇది మామూలు విషయం కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయ రంగం కీలకంగా మారింది. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రానున్న ఏడాదిలో పూర్తవుతాయి.’’ అని సిఎం అన్నారు.
తెలంగాణకు కరువన్నదే రాదన్న కేసీఆర్‌
‘‘భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయ రంగానికి ఇక కరువు అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగ వేగాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అందుకుంటూ ముందుకు సాగాల్సి వున్నది. వ్యవసాయ శాఖ నిరంతరం వైబ్రంట్ గా, బిజీ బిజీగా వుండాల్సి వున్నది..’’ అని వ్యవసాయ శాఖ మంత్రికి, అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు.
వ్యవసాయ రంగం బలోపేతానికి, జిల్లా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను ( డిస్ట్రిక్ అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్) చేపట్టాలని సిఎం అన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లను, ఆర్డీవోలను కూడా భాగస్వాములను చేయాలన్నారు.
ఎరువుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించాలి
యూరియా, ఎరువుల వాడకాన్ని తగ్గించి, శాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తూ, మోతాదుగా వాడేలా రైతులకు అవగాహన పెంచాలని సిఎం అధికారులకు సూచించారు. విపరీతమైన ఎరువులు, పురుగుమందుల వాడకం తో భూములు పాడవుతాయన్నారు. పంటలమార్పిడి చేయకుండా వొకే పంటనే ఏండ్ల కొద్దీ వేయడం ద్వారా, నేల సహజ స్వభాఃవం తగ్గి రోజు రోజుకూ భూసారాన్ని కోల్పోతున్నదని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. పంటల మార్పిడితో భూసారాన్ని పరిరక్షించుకోవడం తక్షణావసరమని సిఎం అన్నారు. ఈ దిశగా తగు ప్రణాళికలను సిద్దం చేసుకుని రైతులను చైతన్య పరచాలని మంత్రిని, అధికారులను సిఎం ఆదేశించారు.
అన్నం అంతా ఒక్క‌సారే తింటామా?
యూరియాను ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా పద్ధతిగా వినయోగించాలని సిఎం అన్నారు. ఇందుకు వ్యవసాయ అధికారుల సలహాలను రైతులు తీసుకోవాలన్నారు. ‘‘ కొంతమంది రైతులు ఎరువులు ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతదని అనుకుంటరు. కానీ కాదు. ఏదైనా మోతాదుగా వాడుకోవాల్సిందే. మనం అన్నం తింటే ఒక్క‌సారే తింటమా? తినం కదా…ఎరువులు కూడా అంతే. పంటలు కూడా మానవ శరీరం లాంటివే. వాటికి ఆహారం ఎంతకావాల్నో అంతే తీసుకుంటాయి. మోతాదుకు మించి తిండి తింటే మనకు రోగాలు వచ్చినట్టు వరిపంటకు కూడా మోతాదు మించి ఎరువులు చల్లితే ఏపుగా ఎదగాల్సిన పంట ఆగమైతది..’’ అని సిఎం వివరించారు.
ఎకరానికి ఒక యూరియా బస్తాను ఒకసారే వేయవద్దని, వరి పెరుగుతున్నా కొద్దీ సమయానుకూలంగా మూడు నాలుగు సార్లు వినియోగించాలని సిఎం తెలిపారు. డిఎపి తదితర కాంప్లెక్సు ఎరువులను కూడా విపరీతంగా వాడకుండా, తగు పాళ్ళ‌లో వాడాలని రైతాంగాన్ని కోరారు. మారుతున్న కాలాన్ని బట్టి ఎరువులను ఎట్లా వాడాల్నో వ్యవసాయ అధికారులు రైతువేదికల ద్వారా రైతులను సమావేశ పరిచి అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని సిఎం అన్నారు.
ఎరువుల నిల్వలపై ఆరా
కాగా…రానున్న వానాకాలం సీజన్‌లో అందుబాటులో ఉంచాల్సిన డిఎపి, యూరియా తదితర ఎరువుల నిల్వలపై అధికారుల నుంచి సిఎం ఆరా తీశారు. యూరియా, డిఎపి తదితర ఎరువుల నిల్వలు చాలినంతగా వున్నాయని సిఎం కు అధికారులు నివేదిక అందించారు.
డిఎపి తయారీలో వినియోగించే ముడిసరుకులు రష్యా, ఉక్రేయిన్ తదితర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ యుద్ధం జరుగుతున్నదని ఈ పరిస్థితుల్లో డిఎపి లభ్యత అవసరానికి మించి ఉండబోదని సిఎం కెసిఆర్ దృష్టికి అధికారులు తెచ్చారు. ఈ పరిస్థితుల్లో విచ్చలవిడిగా డిఎపి వాడకాన్ని తగ్గించి తగు మోతాదులో పొదుపుగా వాడుకోవాలనే విషయం పట్ల రైతులకు అవగాహన కల్పించాలని సిఎం అన్నారు. భూసారాన్ని పెంచే దిశగా కార్బన్ కంపోనెంట్ల వాడకం ఉండాలనీ, పచ్చిరొట్ట వాడకాన్ని పెంచాలనీ సూచించారు.
వరి పంటకు ప్రత్యామ్నాయం
వరిపంటను విపరీతంగా వేయడం ద్వారా భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉంటుందనే శాస్త్రీయ అధ్యయనాలను అధికారులు సిఎం కెసిఆర్ దృష్టికి తెచ్చారు. లాభదాయక పంటలను ఎంచుకుని పంటల మార్పిడి దిశగా రైతులను చైతన్య పరచాలని సిఎం అధికారులకు సూచించారు.
తెలంగాణ పత్తికి డిమాండు ఎక్కువ‌
కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్లో చైనా తదితర దేశాల పత్తి దిగుబడి తగ్గిపోతున్న నేపథ్యంలో, తెలంగాణ పత్తికి డిమాండు పెరుగుతున్న అంశం పై సిఎం సమీక్షించారు. క్వింటాల్ పత్తికి 10 వేలనుంచి 13 వేలదాకా ధర పలుకుతున్న విషయాన్నిసమావేశం చర్చించింది. రానున్న కాలంలో మరింతగా పత్తికి గిరాకీ పెరగనున్నదనే విషయాన్ని గుర్తించింది. ఈ నేపథ్యంలో పత్తి పంట సాగును మరింతగా ప్రోత్సహించాలని సిఎం అధికారులను ఆదేశించారు.
అదే సందర్భంలో మిర్చి కి కూడా ఊహించని రీతిలో క్వింటాల్ కు 42 వేలకు పైగా ధర పలకడం గొప్ప విషయమని సిఎం అన్నారు. కంది కూడా మార్కెట్లో డిమాండు వున్న పంటేనని, కందిసాగు విషయంలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వహించరాదన్నారు. సన్ ఫ్లవర్ పంట విస్తీర్ణాన్ని పెంచాలన్నారు.
వెదజల్లితే లాభం
వరి సాగులో వెదజల్లుడు విధానాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా రైతుకు అన్ని విధాలుగా ఖర్చు తగ్గించవచ్చన్నారు. ఎరువుల వాడకం వెదజల్లడం తదితర వ్యవసాయ అంశాలకు సంబంధించి రైతులను చైతన్యపరిచే దిశగా డాక్యుమెంటరీలు తదితర ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సిఎం సూచించారు.
కల్తీపై ఉక్కుపాదం
కల్తీ విత్తన తయారీ దారులను వారి మూలాలను గుర్తించి కట్టడి చేయాలని సిఎం అన్నారు. అందుకోసం పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని వ్యవసాయ శాఖకు సిఎం సూచించారు. ఇప్పటినుంచే ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించాలన్నారు.
ధాన్యం సేకరణ పై సిఎం ఆరా
రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన కార్యాచరణ ఎట్లా కొనసాగుతున్నదనే విషయాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ నుంచి సిఎం కెసిఆర్ ఆరా తీసారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పుంజుకున్నదనీ., గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితర అవసరాలను సమకూర్చుకున్నామని అనిల్ కుమార్ సిఎం కు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6983 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటికే 536 కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 కేంద్రాల నుంచి సేకరణ మొదలయ్యిందని ఇప్పటికే 1200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని కమిషనర్ సిఎం కు వివరించారు.
దళిత బంధును వేగవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేయబడిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రోజుకు 400 వందల మంది చొప్పున ఇప్పటి వరకు 25,000 మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందించామని సిఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా సిఎం కెసిఆర్ కు నివేదిక అందిచారు.
ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే దళితబంధు కోసం నిధులను విడుదల చేసింది.ఈ నేపథ్యంలో గుర్తించిన అర్హులకు నిధులను అందించడంలో జాప్యం జరగరాదు’’..అని సిఎం స్పష్టం చేశారు.
దళితబంధు పథకాన్ని మరింత ప్రభావవంతంగా వేగవంతంగా అమలు చేసేందుకు గాను త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సిఎం తెలిపారు.
‘‘ దళితబంధు పథకం అమలవుతున్న విధానం పట్ల దేశం నలుమూలలనుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. ఈ పథకం అమలు ద్వారా మనం అనుకున్నదానికంటే ఎక్కువగా ఫలితాలు అందుతాయి. దళితబంధు కోసం చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి తిరిగి లాభాలను ఆర్జించి పెడుతాయి. సామాజిక పెట్టుబడిగా మారి, వ్యవసాయ రంగానికంటే గొప్పగా స్పిల్ ఎకానమీకి దోహదపడుతుంది. దళితబంధు పెట్టుబడి ద్వారా జరిగే వ్యాపార వాణిజ్యాలు తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జిఎస్డిపీని పెంచడంలో దోహదపడుతుంది..’’ అని సిఎం అన్నారు.
ఇప్పటికే దళితబంధు ద్వారా అందిన ఆర్థిక సాయం ద్వారా వ్యాపార, వృత్తి రంగాల్లో దళితులు సాధిస్తున్న విజయాలే అందుకు తార్కాణం అని సిఎం అన్నారు.
ఏటా రెండు ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం
‘‘ ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలి. తద్వారా దళిత యువతలో వున్న నిరాశానిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుంది. వారు వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది’’ అని సిఎం అన్నారు. దవాఖానాలు ఫెర్టిలైజర్ షాపుల వంటి ప్రభుత్వం లైసెన్స్ అమలు పరుస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వారికి అవకాశాలు కల్పించాలని సిఎం పునరుధ్ఘాటించారు.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు భూపాల్ రెడ్డి, రాహుల్ బొజ్జా, స్మితా సభర్వాల్, వి.శేషాద్రి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరక్టర్ కె.విజయ కుమార్, జాయింట్ డైరక్టర్ కె.రాములు, అసిస్టెంట్ డైరక్టర్ మాధవి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ