ఎడిట్ చేసే షాట్ కనిపించలేదన్న దర్శకుడు
నిజాయితీగా విమర్శలు గుప్పించిన వర్మ
(వైజయంతి పురాణపండ, 8008551232)
మూడు రోజుల క్రితం ఒక యూ ట్యూబ్ చానల్‌లో కశ్మీరీ ఫైల్స్ చిత్రం గురించి ఆర్‌జీవీ ఎంతో చక్కగా వివరించారు. చిత్రంలోని ప్రతి కోణాన్నీ తన కోణంలో విశ్లేషించారు. ఈ చిత్రం కొత్త దర్శకులను తీసుకువస్తుందన్నారు. ఈ సినిమా చూశాక తనలో కూడా కొత్త ఆలోచనలను వస్తున్నాయని ఎంతో నిజాయితీగా మాట్లాడారు. సినిమాని అణువణువునా నిశితంగా పరిశీలించి తన అభిప్రాయాన్ని ఎప్పటిలాగే నిర్మొహమాటంగా చెప్పారు. ఎవ్వరినీ సమర్థించకుండా ఒక ఫిల్మ్ మేకర్‌గా ఆర్‌జీవీ చేసిన విమర్శ, కొత్తగా సినిమా తీసేవారికి ఒక పాఠం అవుతుంది. నాణానికి ఒక వైపు కాకుండా రెండో వైపు నుంచి మాట్లాడటం చాలా అవసరం. ఆర్‌జీవీ అదే మాట్లాడారు. రెండు వైపులా దృష్టి పెట్టారు. ఆ ఇంటర్వ్యూని నిశితంగా పూర్తిగా వింటే సినిమాని ఏ విధంగా చూడాలో అర్థమవుతుంది.
ఆయనేమన్నారంటే…
‘ఇది సినిమానా! కాదా!’ అని నేను చెప్పను. సినిమా అంటే కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఇందులో అసలు కథ ఉందా లేదా అనేది నాకు సందేహమే. తీసిన విధానంలో కథ ఉందని నేను వ్యక్తిగతంగా అనలేను. నేను మామూలు ప్రేక్షకుడిలా చూడను.
నేను సినిమా వైపు కాకుండా తీసిన విధానం మీద దృష్టి పెడతాను. ఈ సినిమాని ప్రేక్షకులు దెయ్యం పట్టినట్టుగా చూస్తున్నారు’’ అంటూ కశ్మీరీ ఫైల్స్ చిత్రం గురించి ఆర్‌జీవీ ఒక ఇంటర్వ్యూలో ఎప్పటిలాగే చాలా నిజాయితీగా, సూటిగా మాట్లాడారు. ఈ సినిమా మామూలు ఫార్ములాకి భిన్నంగా పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్తోందన్నారు నిశితంగా పరిశీలించిన ఆర్‌జీవీ. ఈ చిత్రంలో అనుపమ్‌ఖేర్, మిథున్ చక్రవర్తిలాంటి సుపరిచిత ముఖాలు రెండుమూడు మాత్రమే ఉన్నాయి. వాళ్లు లేకపోయినా కూడా నడుస్తుందని వర్మ చాలా గట్టిగానే అన్నారు.
నమ్మిన దాన్ని తెరపై చూపిన దర్శకుడు
‘ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడానికి కాకుండా, తను నమ్మినదాన్ని తెర మీద చూపాడు వివేక్ అగ్నిహోత్రి. ఇందులో ట్రూ ఎక్స్‌ప్రెషన్ చూపాడు వర్మ. ‘నేను అనుకున్నది ఇలా చెప్తాను. నీకు నచ్చేలా చెప్పటానికి నేను ప్రయత్నించను’ అనేది మొట్టమొదటిసారి ఈ సినిమాలో చూశాను. వివేక్ అగ్నిహోత్రి చాలా మెచ్యూర్డ్‌గా కనిపించాడు’ అంటున్న ఆర్‌జీవీ ఇదే విషయాన్ని వివేక్ అగ్నిహోత్రికి ఫోన్ చేసి చెబితే, ‘యూ ఆర్ ద ఒరిజినల్ డిస్‌రప్టర్’ అని తనను అంటే అందుకు సమాధానంగా ‘‘నువ్వు డిస్ట్రాయర్’’ అన్నారు ఆర్‌జీవీ.
సినిమాలో ప్రధాన పాత్ర ఎవరు అనే విషయం తనకు ఇప్పటికీ తెలియట్లేదనీ, కంటెంట్ గురించి సీరియస్‌గా తీసుకోవట్లేదని చెప్పిన ఆర్‌జీవీ… ప్రపంచ యుద్ధాలు, కంబోడియాలో జరిగిన జెనోసైడ్, చెన్నైలో యాంటీ బ్రాహ్మిన్ ఫీలింగ్… అంటూ అనేక విషయాలను చర్చించారు. చరిత్ర విద్యార్థులకు ఇదొక పాఠంలాగ అనిపించేలా మాట్లాడారు. బ్రాహ్మణ వ్యతిరేకత ఉన్న చెన్నైలో ఈ సినిమా ముందర మూడు థియేటర్లలో విడుదలై ఇప్పుడు 30 థియేటర్లలో ఆడుతోందన్నారు ఆర్‌జీవీ. అందరి తరఫున వకాల్తా పుచ్చుకుని ‘ఇది వాస్తవం’ అని తాను చెప్పనన్నారు.
శంకరాభరణం ఇప్పటికీ తనకు మిస్టరీయే
సినిమా పుట్టిన తరవాత 2022, మార్చి పదో తారీకుకి ముందు పెద్ద పెద్ద నటులుంటేనో, మంచి విజువల్స్ ఉంటేనో, మంచి పాటలు ఉంటేనో ప్రేక్షకులు సినిమాకి వస్తారని అందరూ భావించేవారు. మార్చి 11, 2022 తరవాత అవన్నీ ఎగిరిపోయాయంటూ కశ్మీరీ ఫైల్స్ చిత్రీకరణ మీద ప్రశంసల బుల్లెట్లు కురిపించారు. ఈ సందర్భంగా గతంలో విజయం సాధించిన ఇటువంటి చిన్న సినిమాల గురించి ప్రస్తావిస్తూ, ఒడిస్సా ఫైల్స్ అనే సినిమా వచ్చింది. అది కూడా కమర్షియల్‌గా తీశారనీ, ‘జై సంతోషిమా’ సినిమాకి ఒక గుడికి వెళ్లినట్లు వెళ్లిపోయార నీ, కాలేజీ విద్యార్థిగా వేటగాడు, డ్రైవర్ రాముడు సినిమాలు వచ్చిన సమయంలో శంకరాభరణం సినిమా విద్యార్థుల దాకా ఎందుకు వచ్చిందనేది తనకు మిస్టరీగా అనిపించిందంటూ, ప్రతిఘటన, శివ వంటివి ఇమోషనల్ సినిమాలకు కూడా అందరూ కనెక్ట్ అయ్యారంటూ సినిమా ప్రపంచంలో వచ్చిన వాటిని గురించి నిశితంగా విశ్లేషించారు.
కశ్మీర్ ఫైల్స్… హిందువులను ముస్లిములు ఊచకోత చేశారనేది కథ. కశ్మీర్ పండిట్స్ అనే సెపరేట్ ఇమోషన్ ఉండదు. ఈ సినిమా గురించి మోడీ ట్వీట్ చేశారు అంటూ కొందరు అంటున్నారు.
మోడీ మీద తీసిన సినిమానే చూడలేదు. ఆయన ప్రమోట్ చేస్తే చూస్తారా.
ఈ సినిమా ఒక డ్రాయింగ్ రూమ్ డిస్కషన్‌కి ఎక్స్‌టెన్షన్ అని ఈ సినిమా గురించి ఏకవాక్య తీర్మానం చేసేశారు ఆర్‌జీవీ. సంఘటలను సంబంధించి మీడియా రిపోర్ట్స్ అనేవి ప్రభుత్వమే ఇస్తుంది. ఈ సంఘటన 30 సంవత్సరాల క్రితం జరిగింది. అక్కడ వాస్తవంగా ఏం జరిగిందనేది ఎవ్వరికీ తెలియదు. ఎవరో ఒకరిని నమ్మాలి. అనుకూలంగా, ప్రతికూలంగా రెండూ ఇస్తారు. అది ఎప్పటికీ ఋజువు కాదు. మనకి కావలసింది నమ్మాలి. మనకు నేరేటివ్స్ వస్తాయి. దేనికీ ప్రూఫ్స్ లేవు. ఈ చిత్రంలో కూడా వివేక్ అగ్నిహోత్రి ఎటువంటి ముగింపు ఇవ్వలేదు. అంతా నేరేటివ్‌గానే ఉంటుంది. కథను తమకు తగ్గట్టుగా ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. కాశ్మీర్‌లో ఏమైనా జరిగిందో లేదో తెలీదు. కంబోడియా కమేరూలో 20 లక్షల మందిని చంపారు. ప్రభుత్వానికి వ్యతిరేకులు ఉండకూడదనే ఉద్దేశంతో ఇలా చేశారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ ఏం చేశాడనేది అందరికీ తెలుసు’ అంటూ చరిత్రను ప్రస్తావించారు. వర్మ చెబుతున్న అంశాలు వింటుంటే, ఒక చరిత్రకారుడు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. అంత స్పష్టంగా విశదీకరించారు.
ఎంతమందికి తెలుసు?
‘ఎక్కడో కాశ్మీర్‌లో ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎలా ఎందుకు చంపేశారనేది ఎవరికి తెలుసు. అసలు ఆ విషయం గురించి విజయవాడ వారికి అవసరం ఏముంది. కాని అందరూ చూస్తున్నారు. మూడు నాలుగు సీన్లు తను తీయదలచుకున్న కథను సపోర్ట్ చేసేలా తీశారు. రాధిక (పల్లవి జోషి) ఒక సెక్యులర్ పాత్ర. చిత్రమేమిటంటే ఈ చిత్రంలో పాత్రలు కాకుండా ప్రేక్షకులు కన్విన్స్ అయినట్లు సినిమా ఉండటం మొట్టమొదటి సారి నేను చూస్తున్నాను. ఈ సినిమాలో కశ్మీరీ పండిట్ల అంశాన్ని లేవనెత్తారు. అంతే, దీనికి పరిష్కారం ఏమీ చూపలేదు. ఇది పెద్ద డిబేట్‌గా వదిలేశారు.
ఈ సినిమా గురించి ప్రజల రియాక్షన్ తరవాత రాజకీయ నాయకులు రియాక్ట్ అయ్యారు. థియేటర్‌లో జై భారత్ అంటూ ఇమోషనల్ అయిన తరవాతే రాజకీయనాయకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాకి వారం ముందు అమితాబ్ సినిమా విడుదలైంది. చాలామంది ట్వీట్ చేశారు. కాని ఒక్కళ్లు కూడా ఆ సినిమా చూడలేదు. 5 కోట్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా ఇప్పటికి 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది సినిమాలా అనిపించదు. అందువల్ల థియేటర్‌లో చూస్తారనుకోలేదు.
ఈ సినిమా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది సినిమా కాదు. ఇది పాయింట్.
అపోజిట్ డైరెక్షన్ చూపిన అగ్నిహోత్రి
నేను ఒక ఫిల్మ్ మేకర్‌గా రియాక్ట్ అయ్యాను. ‘సినిమా అనేది ఇలా తీయకూడదు… ఇలా తీస్తేనే ఆడుతుంది’ అని ఒక నమ్మకంతో ఉన్నాం ఇప్పటి వరకు. బాలీవుడ్, టాలీవుడ్ ఒకవైపు ప్రయాణిస్తుంటే, ఇతను ఇప్పుడు సడెన్‌గా ఆపోజిట్ డైరెక్సన్‌లో వెళ్లాడు. ఇప్పుడు అందరినీ ఒక ఆలోచన దెయ్యంలా వెంటాడుతుంది.
కంటెంట్ గురించి కాదు, అసలు ఆ కంటెంట్ ఎలా చెప్పాడు అనేది నాకు నచ్చింది. అనుపమ్‌ఖేర్ పాత్ర, ఒక సనినవేశంలో, బయటకు వచ్చి బాధపడుతున్న సీన్‌లో మూడు నిమిషాల పాటు డైలాగ్ లేకుండా, ఒక క్లోజప్ హోల్డ్ చేశాడు. అది అనితర సాధ్యం. ఇటువంటి సీన్ పండుతుందని ఎడిటింగ్ రూమ్‌లో ఎవ్వరూ నిర్ణయించుకోలేం.
తీసిన విధానం, స్క్రీన్‌ప్లే చాలా బావున్నాయి. ఏ కమర్షియల్ ఫార్ములాలు లేకుండా ఈ సినిమా హిట్ అయిపోయింది.
రియలిస్టిక్ సినిమాలు ఆడతాయనే ధైర్యంతో, కొత్త కొత్త ఫిల్మ్ మేకర్లు ముందుకు వస్తారు. బాహుబలి వంటి చిత్రాలు ఖర్చుతో కూడినవి కనుక ఎవ్వరూ సాహసంచేయరు. కశ్మీరీ ఫైల్స్ లాంటి చిత్రాలు చేయటానికి హైదరాబాద్‌లో చిన్న నిర్మాతలు వందలమంది ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాల కోసం కరన్‌జోహార్లు అక్కర్లేదు. పెద్ద స్టూడియోలు అక్కర్లేదు.
ఈ చిత్రం గురించి వర్మ ఏమన్నారంటే….
హిందూస్ అనే కోణం రియలిస్టిక్, ముస్లిమ్స్ అనే కోణం కమర్షియల్. ఈ సినిమాకి ఫార్మాట్ లేదు. ఇంత వ్యక్తిగతంగా ఆలోచించి తీస్తే బావుంటుంది. ఇది ట్రూ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఆర్టిస్ట్.
నేను ఫాలో స్పీల్‌బర్గ్, షోలే, అర్థసత్య… వంటివి చూసి వాటిని అనుసరించాను. ఈ చిత్రం ట్రూలీ ఒరిజినల్. ఆర్ట్ ఫామ్‌లో వచ్చిన ఒకే ఒక చిత్రం కశ్మీరీ ఫైల్స్.
ప్రేక్షకులు ఎవరి నిర్ణయం వారు తీసుకున్నారు
ఇందులో ఏదీ కమిట్ కాలేదు. ప్రేక్షకులు వారికి వారు నిర్ణయం తీసుకున్నారు. మిథున్ చక్రమర్తి మీద పెట్టిన కెమెరా మూమెంట్‌తో పాటు, మిథున్ చక్రవర్తి పాత్రను కూడా స్ట్రాంగ్‌గా చూపాడు. ఆ ఇమోషన్‌కి కనెక్ట్ అవుతారు. బిట్టాలో ఏ భావన లేదు. వాడు కోల్డ్ బ్లడ్‌లో ఉన్నాడు. మిథున్ చక్రవర్తి ఇమోషన్‌లో ఉన్నాడు. తను కళ్లతో చూశాడు. మొసలి, పాములలో ఏ భావన ఉండదు. సింహం పులి…వీటికి ఇమోషన్ ఉంటుంది.
ఏ ఇమోషన్ లేకుండా చంపేశాడు. అలాగే మాట్లాడాడు.
మిథున్ చక్రవర్తిలో ఇమోషన్ ఉంది.
కట్ చేసే షాట్ కనిపించలేదు
నేను నా విమర్శను వివేక్ అగ్నిహోత్రికి వివరిస్తే, అతను ఆవేశంతో ‘ఓన్లీ గై హూ అండర్‌స్టుడ్’ అన్నాడు.
నేను అర్థం చేసుకుSన్నది నేను చెప్తాను. ఇదే కరెక్ట్ అని చెప్పను. ఇది నా ఆలోచన నుంచి వచ్చింది.
అనుపమ్‌ఖేర్ ఇందులో నటిస్తున్నాడా అనిపించింది. డెత్‌సీన్‌లో, బిస్కెట్ సీన్లో కాని, ఇమోషన్ ఎంతో బావుంది. ఎడిట్‌లో ఎక్కడా షాట్ కట్ చేద్దామనిలేదు.
అందరూ మనింట్లో మాట్లాడుతున్నట్లే మాట్లాడారు.
హారర్ సినిమా అంటే ఏ క్షణంలో ఏమవుతుందోననే టెన్షన్ ఉంటుంది. ఈ సినిమాలో అవేమీ లేకపోయినా, బిట్టా వస్తాడనే భావన ఈ సినిమాని నడిపింది. వివేక్ తను ఏమనుకున్నాడో అదే తీశాడు. ఆనెస్ట్ ఎక్స్‌ప్రెషన్. సినిమా పరిశ్రమ మీద ప్రభావం చూపుతుంది. గతాన్ని పక్కకు తోస్తుంది.