Monday, December 11, 2023
HomeArchieveమూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం: జ‌గ‌న్‌

మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం: జ‌గ‌న్‌

ఎవ‌రి ప‌రిథిలో వారుండ‌క‌పోతే వ్య‌వ‌స్థ‌లు ప‌త‌నం
పరిపాలనా వికేంద్రీకరణ పై స్వల్ప వ్యవధి చర్చ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన సీఎం వైయస్. జగన్ ఏమన్నారంటే…
చాలా సుదీర్ఘంగా కేసు లాస్… జడ్డిమెంట్లు, ఇంకా అనేక రకాల అంశాలమీద గౌరవ సభ్యులు సుదీర్ఘంగా మాట్లాడారు. ధర్మానప్రసాద్, పార్ధసారధి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్ధిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అందరూ రకరకాల తీర్పులను, సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు. నవంబరు 26 ,1949 న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలో ఎవరెవరి పరిధి ఏమిటి ? అన్న విషయాన్ని రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. మూడు స్తంభాలు న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్ధలు. ఒకరి పరిధిలోకి మరొకరు చొరబడకూడదు. ఎవరి పరిధి వారిది. అలా చేయగలిగినప్పుడే వ్యవస్ధలన్నవి నడుస్తాయి. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ గౌరవ సభ్యులు మాట్లాడారు. మీ ద్వారా ప్రజలకు, అందరికీ కొన్ని విషయాలు తెలియజెప్పాలి, తెలియాలనే ఉద్దేశ్యంతో.. అసెంబ్లీలో ఈ అంశాన్ని చర్చిస్తున్నాన్నాం. ప్రస్తావిస్తున్నాం.
ఎవరి స్వతంత్రత వారి వారి పరిధిలో ఉంటేనే వ్యవస్ధలన్నవి నడుస్తాయి. అలా జరగకపోతే వ్యవస్ధలన్నీ కుప్పకూలిపోతాయన్నది ఒక కారణం.
రెండో కారణం… శాసనసభ ఫలానా విధానాన్ని, ఫలానా చట్టాన్ని చేస్తుందని ముందస్తుగానే ఊహించుకుని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవు.
(కోర్ట్స్ కెనాట్ ప్రియమ్ట్ ఇన్ డైరెక్ట్ ద లెజిస్లేచర్ నాట్ టు మేకే ఏ పర్టిక్యులర్ పాలసీ ఆర్ ఏ లా.. కోర్ట్స్ కెనాట్ ప్రిజ్యూమ్ )
రాబోయే రోజుల్లో ఒక లా రాబోతుంది… దానివల్ల ఫలానా రాజధాని ఫలానా చోట పెడతారు అని వాళ్లంతట వాళ్లే ఊహించుకునే పరిస్థితి.
ఎందుకంటే ఈ రోజు అలాంటి చట్టం ఏదీ లేదు. మన దగ్గర ఉన్నది కూడా మనం వెనక్కి తీసుకున్న పరిస్థితి. అప్పుడు ఎందుకు ఈ తీర్పు వెలువరించినట్లు. (దెన్ వై ఈజ్ దిస్ జడ్జిమెంట్ గివెన్). మూడు రాజధానులను చేస్తూ.. ఒక చట్టమే లేనప్పుడు… దాన్ని మనం ఉపసంహరించుకున్న తర్వాత ఈ తీర్పు ఎందుకు వచ్చినట్టు.
మెరుగైన చ‌ట్టం తెస్తాం
అంటే భవిష్యత్తులో మరలా మెరుగైన చట్టం తీసుకువస్తాం.. ఇంకా మూడురాజధానులకు సంబంధించి వాళ్ల ఆలోచన ఇంకా మెరుగ్గా ముందుకు వస్తుంది, అలా రాకూడదని చెప్పి ముందుగానే దాన్ని ప్రియమ్ట్ చేస్తూ కోర్టులు నిర్దేశించలేవు. శాసనవ్యవస్ధ నిర్ధిష్టమైన విధానం, చట్టం చేయకూడదని కోర్టులు ఆదేశించజాలవు.
మూడోది ఈ రోజు అసెంబ్లీ ద్వారా దీనిపై ఎందుకు చర్చిస్తున్నామంటే… చట్టం చేసే అధికారం శాసన వ్యవస్ధ పరిధిలోనిది. అది కార్యనిర్వాహక వ్యవస్ధదో, న్యాయవ్యవస్ధ పరిధిలోనిదో కాదు. మంచి చట్టాలు తీసుకువస్తే ప్రజలు మరలా అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఒకవేళ ప్రజలకు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు నచ్చకపోతే ఐదేళ్లకొక్కసారి పార్లమెంటులో కానీ, శాసనసభలో కానీ ప్రతి ఒక్కరి పనితీరును మదిస్తారు. ప్రజలు వారి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆ ప్రభుత్వం పాలన, వారి చట్టాలు నచ్చకపోతే ప్రజలు వారిని ఇంటికి పంపించేస్తారు.
అందువల్ల ఇంతకముందు ధర్మాన ప్రసాదరావుగారు చెప్పినట్లు.. ప్రజలు గత ప్రభుత్వాలు చేసిన విధానాలు, చట్టాలు నచ్చలేదు కాబట్టే… ఈ రోజు 175 అసెంబ్లీ స్ధానాలకు 151 సీట్లు అంటే 86 శాతం అసెంబ్లీ స్ధానాలు మనకిచ్చారు. ఆ చట్టాలను, విధానాలను వ్యతిరేకించారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ప్రతి 5 సంవత్సరాలకు పార్లమెంటు సభ్యులు కానీ, అసెంబ్లీ సభ్యులు కానీ పరీక్షించబడతారు. ప్రజలు వద్దకు వెళ్లాల్సిందే. ప్రజలు మరలా వాళ్లను తూచి, వాళ్లు పాస్అయ్యారా ? ఫెయిల్ అయ్యారా ? అని మార్కులు ఇస్తారు. కోర్టులు ఈ వ్యవస్ధలో జోక్యం చేసుకూకూడదని చెప్పడానికే ఇది.
అసాధ్య‌మైన కాల‌ప‌రిమితులు కూడ‌దు
అదే విధంగా కోర్టులు అసాధ్యమైన కాలపరిమితిలు విధించకూడదు. నెల రోజుల్లోపు నువ్వు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి రోడ్లు, డ్రైన్లు , నగరాలను నిర్మించి ఇవ్వాలి. ఆరు నెలలలోపు ఇంకో రూ.5–6 లక్షల కోట్లతో రాజధాని నిర్మించి ఇవ్వాలని అని అసాధ్యమైన పనులను శాసనవ్యవస్ధను కోర్టులు శాసించలేవు. ఇది కూడా సరికాదు అని చర్చించడానికి అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం.
దీనిపై చాలా మంది వక్తలు చాలా బాగా మాట్లాడారు. వాళ్లందరినీ అభినందిస్తున్నాను. అవే అంశాలను మరలా ప్రస్తావించకుండా నేను కొన్ని అంశాలు చెబుతాను. ఈ గౌరవ సభ ద్వారా ప్రజా ప్రభుత్వంగా, ఒక బాధ్యతగా కొన్ని విషయాలను ఉంచదల్చుకున్నాను.
తెలంగాణ ఉద్య‌మ‌మే ఉదాహ‌ర‌ణ‌
మొదట తెలంగాణా ఉద్యమం అభివృద్ధి అన్నది లేకపోవడం వల్ల వస్తే.. రెండోసారి తెలంగాణా ఉద్యమం రాష్ట్రవిభజనకు దారితీసిన ఉద్యమం. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కావడం వల్ల వచ్చిందని.. 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ చెప్పిన విషయాలు.
వికేంద్రీక‌ర‌ణ‌తో అన్ని ప్రాంతాల‌కూ న్యాయం
అలాగే వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. మూడు రాజధానులు బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంలో గతంలో ఇదే సభలో అందరి ముందు ఈ అన్ని ప్రస్తావనలు ఉంచడం జరిగింది.
మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెడుతున్న సందర్భంలో మన ప్రభుత్వం ఏదైతో చెప్పింది ఆ మాటకు మన ప్రభుత్వం నేటికీ కట్టుబడి ఉందని మరొక్కసారి ఈసభ ద్వారా తెలియజేస్తున్నాను.
రాష్ట్ర రాజధాని, సీఆర్డీయే చట్టానికి సంబంధించి ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. రాష్ట్ర రాజధాని, సీఆర్డీయే చట్టానికి సంబధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు గమనించినట్లైతే… అటు రాజ్యాంగ పరంగానే కాకుండా, ఇటు రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలను కూడా ప్రశ్నించే విధంగా ఆ తీర్పు ఉందన్నది పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను.
ఇంతకుముందు నేను చెప్పినట్లు.. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఈ మూడు కూడా మూల స్తంబాలు. ఈ మూడు కూడా తమ పరిధిలోనే అధికారాలకు లోబడి మరో వ్యవస్ధలో జోక్యం చేసుకోకుండా, మరో వ్యవస్ద మీద పెత్తనం చేయకుండా పనిచేయాల్సి ఉంటుంది. దీన్నే రాజ్యాంగంలోను కూడా స్పష్టంగా నిర్దేశించారు.
ప‌రిథిని దాటిన‌ట్ట‌నింపించే తీర్పు
ఇటీవల రాష్ట్ర హైకోర్టు తమ పరిధిని దాటినట్టుగా అనిపించే విధంగా మనందరి మనోభావాల్లో అనిపించింది కాబట్టే… ఇవాల మనందరం కలిసికట్టుగా ఈ చట్టసభల్లో కూర్చుని చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదేం తీర్పు…
రాజధాని ఎక్కడ ఉండాలా అన్న నిర్ణయంతో పాటు పరిపాలనా వికేంద్రీకరణపై రాష్ట్రశాసనసభకు ఎలాంటి అధికారం లేదంటూ కూడా తీర్పు ఇచ్చింది. 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆ నిర్ణయాధికారాలన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి తప్ప… ఈ విషయంలో రాష్ట్ర శాసనసభకు ఏ అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. ఆ మేరకు రాష్ట్ర రాజధానితో పాటు పరిపాలనా వికేంద్రీకరణపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని కూడా చెప్పింది అంటూ కోర్టుతీర్పులో ఒక భాగాన్ని చదివి వినిపిస్తున్నాను.
(దాంట్లో వుయ్ ఆల్సో హోల్డ్ దట్ ద లెజిస్లేచర్ హేజ్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు పాస్ ఎనీ రిజల్యూషన్/లా ఫర్ చేంజ్ ఆఫ్ కేపిటల్ ఆర్ బైఫర్కేటింగ్ ఆర్ ట్రైఫర్కేటింగ్ ద కేపిటల్ సిటీ.)
ఇక్కడ హైకోర్టు తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర శాసనసభ అధికారాలను పూర్తిగా హరించేలా ఈ తీర్పు ఉంది. నిజానికి రాజ్యాంగం ప్రకారం చూసినా ఈ నిర్ణయంలో కేంద్రం పాత్ర ఉండదు. కేంద్రం తన పాత్ర ఉంటుందని, అది తన అధికారమని కూడా ఎప్పుడూ కూడా కేంద్రం చెప్పలేదు. ఏ కోర్టులోనూ కూడా కేంద్రం ఈ రకంగా వాదించలేదు. ఇది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమేనంటూ.. ఆర్టికల్ 3 ని కూడా కోట్ చేస్తూ.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే హైకోర్టుకు కూడా నివేదించింది.
ఇది కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్. కోర్టుకు ఇదే అఫిడవిట్ రూపకంలో కేంద్ర ప్రభుత్వం ఫైల్ చేసింది. ( దాన్ని సభలో చూపించిన సీఎం)
అఫిడివిట్ ఫైల్ చేయడమే కాకుండా ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజధాని విషయంలో పార్లమెంటులో రాతపూర్వకంగా కూడా ప్రశ్నకు జవాబుగా ఇచ్చింది. ఈ ప్రశ్న అడిగింది తెలుగుదేశం పార్టీ సభ్యుడు కేశినేని నాని. ఒక రాష్ట్రానికి రాజధానికి ఎంపిక చేసేందుకు నిర్ధిష్టమైన విధానం ఏమైనా ఉందా అని అడిగితే… రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఒక రాష్ట్రం యెక్క రాజధానిని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పాత్ర అందులో లేదు అని పార్లమెంటు సాక్షిగా క్లారిటీ ఇస్తూ చెప్పారు.
హైకోర్టుకు కేంద్రం అద‌న‌పు అఫిడ‌విట్‌
మరో అదనపు అఫిడివిట్ను కూడా కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చింది. ఇందులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటు, మిగిలిన అంశాలకు సంబంధించి మాత్రమే నిర్దేశించింది. రాష్ట్రాల రాజధానుల ఏర్పాటుకు సంబధించిన ఏ నియమం కూడా ఇందులో లేదు. అందులోనే హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్న వాదనను కూడా కొట్టి పారేశారు. వాళ్లు చెప్పిన అఫిడివిట్లో అది కూడా స్పష్టంగా తెలుస్తుంది. రాజధానిలో హైకోర్టు అక్కడ ఉంది కాబట్టి… అక్కడే రాజధాని ఉండాలన్నది ఏమీ చట్టం కాదు అని వాళ్లే మరో అఫిడివిట్ వేశారు.
రాజధానితో పాటు , పరిపాలనా వికేంద్రీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
ఇక్కడే ఆశ్చర్యం కలిగించే మాటలున్నాయి. ఒకవైపు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని చెప్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారం అని, మా అధికారం కాదని ఏకంగా రాతపూర్వకంగా రాసి అఫిడివిట్తో సహా ఇస్తుంది. పార్లమెంటు సాక్షిగా చెప్తుంది. మరి ఇంత స్పష్టంగా ఈ అధికారం మీదే అని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు .. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం ఉందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు.. ఆ అధికారం లేదని చెప్పడం ఎంతమటుకు సమంజసం అని ఈ సభ ద్వారా వారిని కూడా కోరుతున్నాను.
హైకోర్టును కించ‌ప‌ర‌చ‌డానికి కాదు
మేం హైకోర్టును, దాని అధికారాలను అగౌరవపరచడానికి ఈ సభ నిర్వహించడం లేదు. మాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద గొప్ప గౌరవం ఉంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీకి ఉన్న గౌరవాన్ని, అధికారాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత లెజిస్లేచర్ పై ఉందన్నది వాస్తవం. కారణమేమిటంటే.. ఇదిమనతో ఆగిపోయేది కాదు. శాసనవ్యవస్ధ చాలా దశాబ్దాలుగా మనుగడులో ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ మూడు స్తంభాలుగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్ధలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడికి రావడానికి ఎవరో ఫేవర్ చేస్తే రాలేదు. ప్రజలందరూ ఓటు ద్వారా ఫలానా ప్రభుత్వం మాకు కావాలని చెప్పి ఎన్నుకుంటే శాసనసభ్యులు వచ్చారు.
గౌర‌వాన్ని కాపాడుకోలేక‌పోతే…
ఈ రోజు ఈ గౌరవాన్ని, ఈ అధికారాన్ని మనం కాపాడుకోలేకపోతే, ప్రశ్నించకపోతే ఆ తర్వాత శాసనవ్యవస్ధ అన్నదానికి అర్ధమే లేకుండా పోతుంది. ఆ తర్వాత చట్టాలు ఎవరు చేస్తారు అన్నదానికి… ఈ రోజు ఈ చర్చ జరగకపోతే… పెద్ద ప్రశ్నగా ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతుంది.
ఏ వ్యవస్థ అయినా కూడా తన పరిధి దాటకుండా ఇతర వ్యవస్థలను గౌరవిస్తూ తన అధికారాలకు లోబడి పనిచేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను.
తీర్మానం చేసే అధికారం శాస‌న స‌భ‌కు లేదా?
రాజధాని వికేంద్రీకరణ విషయంలో గౌరవ చట్టసభకు అందుకు సంబంధించిన తీర్మానం కూడా చేసే అధికారం కూడా లేదని హైకోర్టు తీర్పు చెప్పారు. గౌరవ న్యాయస్థానం తన పరిధి దాటి వ్యవస్థలో కీలకమైన శాసన వ్యవహారాల్లోకి ప్రవేశించటం అవాంఛనీయమైన సంఘర్షణే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. This is Unwanted, Uncalled. అదే విధంగా రాజధానితో పాటు నిర్మాణాలు అన్నింటినీ ఒక నెలలోపు రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ పూర్తి చేయాలి. ఆరు నెలల్లో మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాలిన ఆదేశాలు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది ఏమైనా సాధ్యమౌతుందా అన్నది గమనించాలి.
(హైకోర్టు తీర్పులో భాగాలను చదివిన సీఎం)
ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగదల్చుకున్నాను.
ఈ విధంగా ఆచరణకు సాధ్యం కాని ఆదేశాలు జారీ చేయరాదంటూ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు తీర్పు పూర్తి భిన్నంగా ఉంది. ఆచరణకు సాధ్యం కాని విధంగా హైకోర్టు తీర్పులు ఉండకూదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా ఇలా జరిగాయి.
మాస్ట‌ర్ ప్లాన్ గ్రాఫిక్స్ రూపంలో
రాజధాని నగరంతో పాటు ఈ ప్రాంతంలో చూపిన మాస్టర్ ప్లాన్ కేవలం కాగితాలపైన గ్రాఫిక్స్ రూపంలో ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ను అప్పటి ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో నోటిఫై చేయటం జరిగింది. CRDA చట్టం ప్రకారం ఆ మాస్టర్ ప్లాన్ కాలపరిమితి 20 ఏళ్లు. ప్రతి ఐదేళ్లకోసారి దాన్ని సమీక్షించాలని రాశారు. 20 ఏళ్లు కాదు, 40 ఏళ్లకు కూడా సాధ్యం కాని విషయం అన్నది అందరికీ తెల్సిన విషయమే. ఇప్పటికి ఆరేళ్లు అయిపోయింది. ఆరేళ్ల క్రితమే రూపొంది.. గ్రాఫిక్స్ కే ఇప్పటిదాకా పరిమితమై… ఈ మాస్టర్ ప్లాన్ పూర్తిగా పేపర్ పై ఉన్నది.
టీడీపీ అంచ‌నా ప్ర‌కారం ల‌క్షా 9వేల కోట్ల ఖ‌ర్చు
కేవలం ఈ 29 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో… అక్కడ కేవలం మౌలిక సదుపాయాలు అయిన రోడ్లు, డ్రైనేజి, వాటర్, ఎలక్ట్రిసిటీ మౌలిక వసతులు లేని ప్రాంతంలో వీటి కోసమే ఆనాడు వాళ్లు (టీడీపీ హయాంలో) వేసిన అంచనా ఎకరాకు రూ.2 కోట్లు చొప్పన 54వేల ఎకరాలుకు దాదాపు రూ.1.09 లక్షల కోట్లు అవుతుంది.
54 వేల ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఎంత పర్సంటేజ్. మిగిలిన రాష్ట్రం 99.9999 శాతం ఉంది. ఆ ప్రాంతామంతా కూడా అభివృద్ధి, సంక్షేమం వైపు చూస్తుంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది మర్చిపోకూడదన్నది ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను.
ఇక్క‌డ మాత్ర‌మే డ‌బ్బులు పెట్ట‌డం కాదు
ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఎజెండా. ఇదికాకుండా కేపిటల్ అని నామకరణం చేసి ఇక్కడ మాత్రమే డబ్బులు పెట్టడం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చాలన్నది మర్చిపోకూడదని తెలియజేస్తున్నాను.
సాధ్యం కానివి సాధ్యం చేయాలని… ఏ వ్యవస్ధలు కానీ న్యాయస్ధానాలు కానీ నిర్దేశించలేవు. అందుకనే వీటన్నింటిపైనా న్యాయసలహా తీసుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఆలోచిస్తున్నాం. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కటే హామీ ఇస్తున్నాను.
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా, పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకుని రావడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడుతాం. వారికి కూడా అండగా నిలుస్తాం.
వెన‌క‌డుగు వేసేది లేదు
వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేయం. ఎందుకంటే వికేంద్రీకరణకు అర్ధం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి. అందరి ఆత్మగౌరవం అందులో ఉంది కాబట్టి. అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం కాబట్టి. అందరికీ మంచి చేసేందుకు మన ప్రభుత్వం ఉంది కాబట్టి. ఈ చట్టసభకు ఈ విషయంలో సర్వాధికారాలతో పాటు రాబోయో తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. వికేంద్రీకరణ బాటలో సాగడం మినహా మరో మార్గం లేదని సవినయంగా తెలియజేస్తూ.. న్యాయవ్యవస్ధ మీద తిరుగులేని అచంఛలమైన విశ్వాసాన్ని మరొక్కసారి ప్రకటిస్తూ… డీసెంట్రలైజేషన్ ఈజ్ అవర్ పాలసీ.. డెసిసిన్ ఆన్ ది క్యాపిటల్స్ ఈజ్ అవర్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని మరొక్కసారి తెలియజేస్తూ… దేవుడి దయ, ప్రజలందరి చల్లనిదీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కూడా కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైయస్‌.జగన్ తన ప్రసంగం ముగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ