(వైజయంతి పురాణపండ, 8008551232)
‘మమతానురాగాలకు మనిషి రూపాన్ని అంటూ ఇస్తే… అది మా అమ్మనాన్నలే అవుతారు. వారిద్దరి మమతానురాగాలను కలగలిపి నన్ను మురిపిస్తుంటారు నా తోబుట్టువులు. ఇదే నా కుటుంబం అని అంటాను’’ అంటారు శ్రీపాద శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన శ్రీనివాస్ కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయంలో పనిచేశారు. ఎన్నికల ప్రచారసభలలో డా. వై. ఎస్ రాజశేఖరరెడ్డి వెంట నడిచారు. రాజకీయనాయకులకు సన్నిహితంగా పనిచేస్తున్న శ్రీపాద శ్రీనివాస్ ఆలోచనలలో భావుకత ఎక్కువ. అనుబంధాలకు విలువిచ్చే ఆత్మీయుడు శ్రీనివాస్. తన కథలలో ఆ అనురాగం, అభిమానం నిండుగా మెండుగా కనిపిస్తాయి. తన జీవితంలో ఎదురైన సంఘటనలకు అక్షర రూపం ఇచ్చారు శ్రీనివాస్. గోదావరి అలలలో అమ్మ పిలుపు, నిరీక్షణ, నగరంలో ఓ జీవితం, అమ్మ ముడుపు, బ్రహ్మయ్య బొమ్మలు, ఓ తీపి జ్ఞాపకం కూలిపోయింది, బ్రతుకు భరోసా, నా మనస్సు విలవిలలాడింది, నాటి స్కైలాబ్ భయాన్ని… అనే తొమ్మిది కథానికలతో పాటు, ఆరు కవితలు, మూడు స్వీయ సంఘటనలతో కలగలిసిన అరవై పేజీల పుస్తకాన్ని గుండె చప్పుళ్లు పేరుతో ప్రచురించారు. ‘గోదావరి ఘోషలో వేదాలతో పాటు ఆత్మీయత భావనలు వినిపిస్తాయి. ఈ నదిలోని అలలు ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పడానికి ఆరాటపడుతూనే ఉంటాయి. అందుకే నా తల్లి అఖండ గోదావరి. మా అందరికీ జనని’ అంటూ ముగింపు పేజీలో గోదావరి మాత మీద తనకున్న గుండె చప్పుడుని వినిపించారు శ్రీపాద శ్రీనివాస్. ఈ కథానికలు, కవితలు చదువుతున్నప్పుడు, వారి వారి గుండె చప్పుడు వారి చెవులకు గట్టిగా వినిస్తుందనటంలో సందేహం లేదు. తప్పక చదవవలసిన పుస్తకం. పుస్తకం చదివి, రచయితకు అభిప్రాయాలు తెలియచేస్తే, మరిన్ని మంచి కథలు ఆ కలం నుంచి జాలువారతాయి.
అనుబంధాల గుండె చప్పుళ్లు
Date: