(డా వి.డి. రాజగోపాల్, 9505690690)
సినీ గేయరచయితలలో మరో మాణిక్యం మన వేటూరి సుందరరామమూర్తి
పాత్రికేయుడుగా ప్రారంభం జీవన పోరాటం
ఆ పయనంలో అక్షర పరిమళం వీచింది
అది తెలుగు తేజం యన్టీఆర్‌కు సోకింది
మన వేటూరిని చెన్నపట్నం చేర్చింది
అటుపై కళాతపస్వితో పరిచయం,
ఎన్నో కళాఖండాలకు ఊపిరి పోసిన గానం
శంకరాభరణంతో మొదలై
తన పదాల ఆభరణాలు ఎన్నో వేశాడు
సినీ కళామతల్లి మెడలో
ఈ గాన లహరిలో సృష్టి కర్తలకోసం వెతకంగా దొరికిన ఓ వజ్రం మన వేటూరి
వజ్రం కఠినం వేటూరి కలం జటిలం
సినీపూదోటలో పరిమళపు సుగంధాల పాటలు ఎన్ని విరబూయించాడో
వేటూరి వారి పదవిన్యాసం బాలూ గారి గళవిన్యాసంతో మూడుపదులకాలం ఎన్ని కుసుమాలు మొలచెనో
అందు ఎన్ని భక్తిగీతాలో, ఎన్ని విషాదవలయాలో, ఎన్ని యుగళగీతాలో
దాదాపు పదివేలపైచిలుకే
శ్రీశ్రీ తరువాత జాతీయ స్థాయిలో పురస్కారాలందుకున్న తెలుగు తేజం
ఎనిమిది నందులు అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంట పండించిన నిత్య కృషీవలుడు
అందుకే అంటాడు కృషి ఉంటే మనుషులు
ఋషులవుతారని
వీరి పాటల పూదోటలో విహారం గగనవిహారమే సుమా!
ఆ పదాల అమరిక సాహితీ ప్రియుల
మెదడుకు విందు హృదయం కాసేపు
సాహితీ మదనంలో ఓలలాడుతుంది
అందు మచ్చుక ఓ కొన్ని చూద్దామా!
పిల్లన మ్రోవికి నిలువెల్ల గాయాలు అల్లన మ్రోవినిత్రాకితే గేయాలు
నువ్వు పట్టు చీర కడితే పుత్తడి బొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ ..
రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా….
సిరిమల్లెపువ్వా సిరిమల్లెపువ్వా చిన్నారి చిలకా నావారు ఎవరే….
ఆకాశదేశాన ఆషాఢ మాసాన… అంటూ ఓ ప్రియుడు తన విరహవేదనను ఓ మెరిసేటి మేఘం ద్వార తెలియజేయటం
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతిలోకంలో
అంటూ….అది మర్మ స్థానం కాదది నీ జన్మస్థానం అని ఆవేదనతో ఓ కామాంధులపై విరుచుకు పడే పాట …
పావురానికి పంజరానికి పెళ్లి చేసె పాడులోకం, కాళరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టె మూఢలోకం… అన్న పాటలో ఎంత తాత్వికత
ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేలకే
చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ మూడునాళ్ళే ఈ జీవయాత్రలో
జీవితాలు క్షణభంగురమనే తాత్వికత
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి….అంటూ మరో చక్కని యుగళం
విశ్వనాథ్ అడుగుజాడల్లో ప్రవేశించి
కవితా కళాఖండాలే కాదు సినీపోకడలకు తగినట్టుగా శృతిమీరిన శృంగార వీణలను మీటించగలనని తన పద బాణీలను మార్చాడు
ఆరేసుకోబోయి పారేసుకున్నాను…అంటూ
ఉతికేశాడు శృంగారాన్ని
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంతకమ్మగా ఉన్నదో యబ్బా…. అన్న రాఘవేంద్రరావు మార్కు పాటలెన్నో….
కొరమీను కోమలం సొరచాప శోభనం దొరసాని బురదకొయ్యా… అంటూ చేపలపేర్లతో ఓ పాట ఈయన చూస్తే పదహారణాల శాకాహారి..అంటే రవి గాంచనిచో కవి గాంచున్ అన్నది నిజం కదా
అమ్మతోడు అబ్బతోడు నీతోడు నాతోడు…అంటూ ప్రాసల పదాలతో చిందులు వేస్తాడు
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే…అనుకొని తాను అందరిలా రాలిపోయాడు
సాహితీ ప్రియులారా స్మరిద్దాం ఓ మారు
(కవిత రచయిత రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ)
వేటూరీ జోహార్లు! మీకు
Date: