‘సమతామూర్తీ….!’నమో నమః

Date:

రోజుకు కోటిసార్లు అష్టాక్ష‌రి
108 దివ్య క్షేత్రాల న‌మూనాలు
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
భ‌గ‌వ‌ద్రామానుజుల విగ్ర‌హం స‌మతామూర్తి ఆవిష్క‌ర‌ణ‌ను పుర‌స్క‌రించుకుని వ్యూస్ అందిస్తున్న ప్ర‌త్యేక ధారావాహిక ఇది. ఫిబ‌వ్ర‌రి రెండు నుంచి 12 రోజుల పాటు సాగుతుంది. ఇందులో రామానుజ‌వైభ‌వం శీర్షిక‌న భ‌గ‌వ‌ద్రామానుజుల విశిష్ఠ‌త‌నూ, వైదుష్యాన్నీ వివ‌రించ‌బోతున్నాం. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ డాక్ట‌ర్ ఆర‌వ‌ల్లి జ‌గ‌న్నాధ స్వామి క‌లం నుంచి జాలువారే వ్యాస పరంప‌ర‌ను ఆస్వాదించండి. న‌లుగురికీ పంచండి. అడ‌గ‌గానే రాయ‌డానికి అంగీక‌రించిన జ‌గ‌న్నాధ స్వామిగారికి ధ‌న్య‌వాదాలు-చీఫ్ ఎడిట‌ర్‌, వ్యూస్‌

‘గతులన్నీ ఖిలమైన కలియుగమందును/గతి ఈతడే చూపె ఘన గురుదైవము’అని కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మాటలాడే దైవమే, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రధాన ప్రచారకర్త. భగవద్రామానుజాచార్యులు.‘నన్ను నడిపించే విష్ణువే నిన్నూ, సమస్త జీవజాలాన్ని నడిపిస్తు న్నాడు. అణువణువులోనూ ఆయన ఉన్నాడు. ఈ జగత్తు విష్ణుమయం. భగవంతుడి దృష్టిలో అంతా సమానమే. మనిషికి గుణమే కొలమానం తప్ప ఇతర అంశాలు కావు’ అంటూ సమతావాదాన్ని చాటారు. భగవద్రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంత వృక్షానికి పందిరిలాంటి వారు. విశిష్టాద్వైతం పూర్వాచార్యులు ఈ మతానికి పాదులు తవ్వితే రామానుజులు పటిష్ఠమైన పందిరి వేశారు. శ్రీవైష్ణవ సిద్ధాంత ప్రవక్తలలో ఆయన ప్రథములు కాకపోయినా, ప్రవర్తకులలో అగ్రస్థానంలో నిలిచారు. గురువుకే గురువయ్యారు. హంస క్షీరనీరాలను వేరుపరచినట్లే ‘పరమహంస’ రామానుజులు సర్వ మతాలలోని సుగుణాలను స్వీకరించి ‘రామానుజ మతం’తో సమన్వయించారు. ‘అందరి కోసం అందరు’ అన్నది ఆయన సిద్ధాంతం. సకలజన సమ్మతమైన రామానుజ మతం ఆచరణ ఎంతో సులభతరం. ప్రేమ స్వరూపుడైన భగవంతుడి కరుణా కటాక్షాలు పొందేందుకు సులభ మార్గాన్ని ప్రసాదించారు
ఏ చిన్న బాధ కలిగినా నిబద్ధత లేకుండా అవసరార్థం రోజుకొక్కరిని ఆశ్రయించడం కంటే ఒకే ఒక్కొక్క పరదైవాన్ని అనన్య భావనతో ఆశ్రయించాలని హితవు పలికారు. భగవంతుడిని భయంతోనో, కోరికలతోనో కాకుండా ప్రేమగా, ఇష్టంగా ఆరాధించాలన్నది రామానుజ సిద్ధాంతం.
అలా భగవంతుని ఆశ్రయించే మానసిక ప్రవృత్తి లేని వారి తరపున రంగనాథుని సన్నిధిలో శరణాగతి చేశారు.

సమతామూర్తి స్మృతి చిహ్నం
‘సమాజంలో అసమానతలను తొలగించి సమసమాజ స్థాపనకు విశేష కృషి చేసిన రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు (2017) పూర్తయిన సందర్భంగా ఆయన బోధనల సారాంశాన్ని,సనాతన ధర్మ విశిష్టతను తెలియచెప్పడమే ‘సమతా స్ఫూర్తి’ కేంద్రం ఉద్దేశం. వెయ్యేళ్ల క్రితం ఈ భూమి మీద నడయాడి, సామాజిక సమానతను బోధించి, భగవంతుడు అందరివాడు అన్న సమతాభావాన్ని ఆవిష్కరించిన మహనీయుడి ‘మూర్తి’ని ఆయన ఆవిర్భవించిన తమిళదేశంలో ఆవిష్కరించాలని తొలుత భావించాం. అక్కడ సకాలంలో స్పందన రాకపోవడంతో ఆ భాగ్యం భాగ్యనగరికి దక్కింది. 2014లో చేసిన సంకల్పం నేటికి సాకారమైంది’ అని ఈ బృహత్ క్రతువు స్రష్ట త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామిజీ వివరిం చారు.


భ‌ద్ర పీఠిక‌పై కొలువుదీరిన రామానుజులు
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలోని 45 ఎకరాల విస్తీర్ణంలో పీఠం సహా 216 అడుగుల ఎత్తున సుమారు వెయ్యి కోట్ల రూపాయల అంచనాతో ‘సమతా స్ఫూర్తి’ కేంద్రం రూపు దిద్దుకుంది. రామానుజులు ఆశీనులైన 54 అడుగుల ఎత్తు పీఠాన్ని భద్రవేదిక అంటారు. 27 అడుగుల ఎత్తుగల పద్మపీఠం కింద 36 ఏనుగులు, 18 జతల శంఖుచక్రాలు అమర్చారు. భద్రవేదికపై రామానుజుని విగ్రహం 108 అడుగులు కాగా, త్రిదండం ఎత్తు 135 అడుగులు. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులు. 1800 కిలోల బరువుతో 216 అడుగుల ఎత్తుగల పంచలోహాలతో చైనాలో తయారైన 1600 విడిభాగాలను ఇక్కడికి తరలించి, 60 మంది నిపుణులు విగ్రహరూపం ఇచ్చారు. మహా విగ్రహం దిగువన విశాలమైన గర్భాలయంలో బంగారంతో రూపొందించిన ఐదడుగుల మూడంగుళాల 120 కిలోల భగవద్రామానుజుల విగ్రహానికి నిత్యార్చనలు నిర్వహిస్తారు. 120 ఏళ్లు జీవించిన ఆయన స్మృతిచిహ్నంగా అంతే సంఖ్యలోని కిలోలతో విగ్రహాన్ని రూపొందించారు.


దేదీప్యమానం దివ్యసాకేతం
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు భాగ్యనగరం శివారు ముచ్చింతల్‌ సాకేత దివ్య క్షేత్రం ముస్తాబైంది. పన్నెండు రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఫిబ్రవరి 2న అంకురార్పణ, ఆ మరునాడు అగ్నిప్రతిష్ఠ జరుగుతుంది. 5వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ‘సమతామూర్తి’ మహావిగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. 8న సామూహిక ఆదిత్య జపం, 11న సామూహిక ఉపనయనాలు, 12న సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహిస్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 13వ తేదీన 120 కిలోల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ మరునాడు మహాపూర్ణాహుతి. పలువురు కేంద్రమంత్రులు, తెలంగాణ గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ వేడుకలకు హాజవుతారు.


నిర్మాణ విశేషాలు
సమతామూర్తి మహా విగ్రహం చుట్టూ 108 దివ్య క్షేత్రాల నమూనా ఆలయాలు దర్శనమిస్తాయి.వాటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపం నిర్మితమైంది. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియం కూడా ఏర్పాటైంది. ఈ ప్రాంగణంలో అష్టదళ పద్మాకృతిలో 45 అడుగుల ఎత్తు ఫౌంటెయిన్‌ మరో ప్రత్యేకత. పద్మపత్రాల మధ్య నుంచి నీరు రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలుగుతుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపిస్తాయి. ఆయన ప్రబోధించిన సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తరువాత మ్యూజిక్‌తో త్రీడీ షోగా ప్రదర్శిస్తారు. దివ్యక్షేత్రంలో అనేక రకాల పుష్ఫజాతులతో ఉద్యానవనాలు ఆకట్టుకుంటున్నాయి. క్షేత్ర సందర్శకులు ‘స్వయం మార్గదర్శిక పరికరం’(సెల్ఫ్ గైడెడ్ టూల్) సాయంతో తమకు నచ్చిన భాషలో క్షేత్ర విశేషాలు, విశిష్టతలు తెలుసుకోవచ్చు.
5 వేల మంది ఋత్త్కిక్కులు…
విగ్రహావిష్కరణలో భాగంగా 120 యాగశాలల్లోని 1,035 కుండాలలో హోమం నిర్వహిస్తారు. ఇందుకోసం రెండు లక్షల కిలోల దేశవాళీ ఆవు నెయ్యి సేకరించారు. ఈ యాగధూమం వల్ల వాతావరణంలోని ప్రమాదకరమైన వైరస్‌ అంతరిస్తుందని విశ్వసిస్తున్నట్టు జీయర్‌ స్వామి వెల్లడించారు. ఐదు వేల మంది ఋత్త్కిక్కులు హోమాల్లో, పారాయణంలో పరిచారకంలో పాల్గొంటారు. పండితులు రోజుకు కోటి సార్లు అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తారు. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...

గాంధీ గారి కుర్చీ

(డా నాగసూరి వేణుగోపాల్, 9440732392)2024 సెప్టెంబర్ 9వ తేదీన నేను మద్రాసులో...

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం

మా డిమాండ్ నెరవేరిస్తే కేంద్రానికి సహకరిస్తాంఫైనాన్స్ కమిషన్ సమావేశంలో రేవంత్ ప్రకటనహైదరాబాద్,...

పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి

ముందుకు వస్తున్న ప్రముఖ కంపెనీలుమౌలిక సౌకర్యాల కల్పన వేగిరపరచాలిఫార్మా సిటీ ప్రణాళికలపై...