రూ.70 వేల కోట్ల పెట్టుబడి – 7 వేల మందికి ఉద్యోగాలు
టిసిఎస్, హైపర్వాల్ట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 05: దేశంలోనే అతిపెద్ద ఏఐ (AI) డేటా సెంటర్ క్యాంపస్‌ను హైద్రాబాదులో ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
టీసీఎస్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో శనివారం సచివాలయంలో సమావేశమైంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, హైపర్ వాల్ట్ సీఈఓ, ఎండీ దీపేష్ నందా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె. శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు.
హైపర్ వాల్ట్ తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది.
అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు.
దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది.
దేశానికే చారిత్రాత్మకమైన ప్రాజెక్టు: రేవంత్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకే కాకుండా దేశానికి ఇది చారిత్రాత్మక ప్రాజెక్టని అన్నారు.

ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు.
ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న తరుణంలో ఆ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమని అన్నారు.
తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టీసీఎస్ ప్రతినిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.

టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో తన కల నెరవేరిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆశించిన విధంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడిందని అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 ప్రకారం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అని అభివర్ణించారు.
ఈ భారీ పెట్టుబడి ద్వారా ఏఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలకు 2026 జనవరిలో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య సమావేశం నాంది పలికింది.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి కొద్ది నెలల్లోనే ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చాయి. దేశంలోని మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించింది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం మరింత చేరువైంది.

