నిరసన తెలిపితే పాశవిక దాడులా?: కొడంగల్ ధర్నాలో రేవంత్

0
53

రాహుల్ గాంధీ రక్తం నేలకు చిందింది

రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్రం

నిందితులను శిక్షించకుండా విద్యార్థులపై దాడులా?

కేటీఆర్ బినామీ సంస్థపై బీజేపీకి ఎందుకంత ప్రేమ?

నరేంద్ర, ధర్మేంద్ర ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నారు

కొండంగల్, జులై 22: నీట్ పేపర్ లీక్ పై పోరాటం చేస్తున్న విద్యార్థులకు మద్ధతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే పాశవిక దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల పాశవిక దాడులపై కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ తో బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మార్చిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను అమ్ముకుని బీజేపీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసనకు రాజకీయాలకు అతీతంగా పార్టీలు మద్దతు తెలిపాయన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్లను జైల్లో పెట్టాల్సింది పోయి.. విద్యార్థులపై పాశవికంగా దాడి జరుపుతారా అంటూ ప్రశ్నించారు. విద్యార్థినులపై దుర్మారంగంగా దాడి చేయడమే కాకుండా.. విద్యార్థుల తలలు పగలగొట్టారన్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండా పోయారని, వారిని ఎక్కడికైనా తీసుకెళ్లారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా అని సందేహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని ఇంటి ముందు నిరసన చేపట్టారని, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పై పాశవికంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పాశవిక దాడితో రాహుల్ గాంధీ రక్తం నేలకు చిందిందని, దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని చెప్పారు. ఆంగ్లేయులతో పోరాడి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. దేశం కోసం రక్తం చిందించిన గొప్పకుటుంబం ఇందిరమ్మ కుటుంబం అన్నారు. బాంబు దాడితో శరీరం ముక్కలైనా దేశ సమైక్యత కోసం ప్రాణాలిచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు.

పదేళ్లు అధికారంలో ఉన్నా సోనియా గాంధీ ప్రధాని పదవి తీసుకోలేదని, కనీసం మంత్రి పదవి తీసుకోలేదని తెలిపారు. మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేసి త్యాగనిరతిని చాటుకున్న గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గేను నియమించారు తప్ప పదవులు తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రజా స్వామ్యంలో నిరసన తెలపడం అంబేడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కు అని, పేపర్ లీక్ పై పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రధాని అడ్డుకున్నారని విమర్శించారు.

దేశాన్ని దోచుకుంటున్న నరేంద్ర, ధర్మేంద్ర…

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో బీఆరెస్ అధికారంలో ఉన్న సమయంలో 2019లో ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా సంస్థ అవకతవకలకు పాల్పడిందని గుర్తు చేశారు. ఆ సంస్థ 27 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొందన్నారు. అనుభవం, అర్హత లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లతో ఆనాడు కేటీఆర్ తన బినామీ సంస్థ గ్లోబరీనాకు ప్రాజెక్టును అప్పగించిందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పప్పులు ఉడకవని గ్లోబరీనా సంస్థ Coempt Education గా పేరు మార్చుకుని గ్లోబరీనా సంస్థ కేంద్రం వద్దకు వెళ్లింది. ఢిల్లీ బీజేపీ వాళ్లతో మాట్లాడుకుని వాళ్లకు కేటీఆర్ కాంట్రాక్టు ఇప్పించారు. నీట్ పరీక్ష నిర్వహించడంతో దొంగతనం చేయొచ్చన్న ధైర్యం వాళ్లకు వచ్చింది. CBSE లో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విద్యార్థులు నిరసన తెలిపారని, ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి తొలగించకుండా విద్యార్థుల తలలు పగలగొట్టారని కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం తప్పుపట్టారు.

నరేంద్ర, ధర్మేంద్ర ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని, దేశాన్ని దోచుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థులు, యువత పక్షాన నిలిచి మోదీపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అందరం కలిసి పోరాటం చేసి మోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు.

అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ..

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్ లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఉదయం కొడంగల్ లోని నివాసంలో ఎస్ఐఆర్ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నేరుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరారు.

రాహుల్ గాంధీపై జరిగిన దాడి చిత్రాలతో కూడిన బ్యానర్ తో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకలుతో కలిసి భారీ ర్యాలీతో కాలినడకన సీఎం అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నియోజకవర్గ ముఖ్యనాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here