కెరీర్‌లో లక్షకు పైగా కార్టూన్లు
దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఈనాడులో విధి నిర్వహణ
నవ్వుల పువ్వులు పూయించి విశ్రాంతి తీసుకుంటున్నారా!
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
శ్రీధర్ అంటే ఎవరో అనుకునేరు. ఈనాడులో ఇదీ సంగతి ద్వారా కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టిన కార్టూనిస్టు ఆయన. ఆయన గీత చాలు విషయం అర్థం కావడానికి. అంత సున్నితంగా, సునిశితంగా హాస్యాన్ని కార్టూన్ ద్వారా పండిస్తారు. క్యాప్షన్ లెస్ కార్టూన్లు వేయడంలో ఆయన దిట్ట. శ్రీధర్ గీసిన గీత చూస్తే చాలు.. అందులో ఉన్న రాజకీయ నాయకుడెవరో ఇట్టే గుర్తు పట్టవచ్చు.
కొందరి కార్టూన్లు ఉంటాయి… చక్కిలిగింతలు పెట్టుకున్నా నవ్వు రానట్లుగా ఉంటాయి. అంటే ఇక్కడ అలాంటి కార్టూనిస్టులను అవమానించడం కాదు. జస్ట్ ఉదాహరణ చెప్పడమే. శ్రీధర్ కార్టూన్లు మామూలుగా ఉండవు. చూస్తే చాలు పగలబడి నవ్వుకోవాల్సింది. కొన్ని కార్టూన్లనైతే తలచుకుని, తలచుకుని నవ్వుకుంటాం. ఇది ఆయన ప్రతిభకు నిదర్శనం. శ్రీధర్ గారి గురించి రాయడానికి ఆయన కార్టూన్‌లా చిన్న వ్యాసం సరిపోదు.
ఆయన వివాహానికి సెలవు తీసుకుని వెడుతున్నప్పుడు వేసిన కార్టూన్ నాకు ఇప్పటికీ గుర్తే. కారు మీద బెలూన్లు వేసి, డ్రైవ్ చేస్తున్నట్లు వేసుకున్నారు. నెలరోజులు సెలవు అని చెప్పడమే ఆ కార్టూన్ ఉద్దేశం. బహుశా పత్రికల చరిత్రలో ఇంత ఫ్రీడమ్ ఆస్వాదించిన కార్టూనిస్ట్‌వేరొకరు ఉండరనేది నిస్సందేహం.
రాజకీయ కార్టూన్ అంటే శ్రీధర్ వేయాల్సిందే అనేది అందరి నోట ముక్తకంఠంతో వెలువడే మాట. ఆయన తన గీతతో టీజ్ చేయని రాజకీయ నాయకుడు లేరంటే అతిశయోక్తి లేదు. బడ్జెట్ సమయాల్లో సామాన్యుల ఆశలను ప్రతిబింబించేలా వ్యంగ్య కార్టూన్లు వచ్చేవి.
ధరల పెరుగుదల ఆయన కార్టూన్లలో ప్రధాన అంశం. దీనికి తోడు ఈనాడు ఆదివారం మ్యాగజైన్‌లో ఒక పూర్తి పేజి కార్టూన్లు వచ్చేవి. ఒకటేమిటి? ఆలోచిస్తే… లెక్కిస్తే ఆయన ఈనాడులో వేసిన కార్టూన్లు లక్షకు పైనే ఉంటాయనేది నిర్వివాదాంశం.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఎందుకంటే… ఆయన ఇప్పుడు ఈనాడును విడిచిపెట్టారు. కొన్ని నెలల క్రితం ఆయన తన ఫేస్‌బుక్ ద్వారా ఆ విషయాన్ని ప్రకటించారు. ఒక్కసారిగా వచ్చిన ఈ ప్రకటన కార్టూనిస్టుల బృందంలో కలకలాన్నే సృష్టించింది.
రకరకాల ఊహాగానాలు వచ్చాయి. నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. ఇప్పుడేం చేస్తున్నారనేదే ముఖ్యం. బొమ్మలు గీయడంలో పిల్లలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటికే ఆ విషయాన్ని కూడా ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించారు.
దీనితో పాటు ఆయన వారానికి ఒకసారి ఆ వారంలో జరిగిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందిస్తున్నారు. ఇందుకు ఆయన తన యూట్యూబ్ చానెల్‌ను వేదికగా చేసుకున్నారు. ఆ చానెల్ పేరు అంతరార్థం. తన కార్యక్రమంలో తన కార్టూన్లు ప్రదర్శిస్తున్నారు.
అంశానికి తగ్గట్టుగా కార్టూన్లను గీస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ యూట్యూబ్ చానెల్‌ను శ్రీధర్ 2017లో ప్రారంభించారు.
కార్టూన్ ఎడిటర్‌గా తన ప్రస్థానాన్ని ముగించిన శ్రీధర్‌కు వ్యూస్.ఇన్ (vyus.in) అభినందనలు, బెస్ట్ ఆఫ్ లక్ చెబుతోంది. (కార్టూన్లు ఈనాడు సౌజన్యంతో)