ఏపీ ఉప ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ
ఆస్పత్రి గుర్తుంది కానీ, అధికారి పేరు గుర్తులేదా?
వైఎస్సార్ పోయిన పదిహేడేళ్ల తరవాత ఆరోపణలా?
హైదరాబాద్, జూన్ 4: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ రెండో తేదీన హైద్రాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సందర్భంలో డాక్టర్ వైఎస్సార్ పై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, వైఎస్సార్ సహచరుడు డాక్టర్ కె.వి.పి రామచంద్రరావు స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. ఒక పోలీసు అధికారితో పవన్ కళ్యాణ్ గురించి అన్నట్టుగా చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాలు చేశారు. ఆ పోలీసు అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఒక వేళ అందులో ఆ అధికారి పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్నే చెబితే, తాను పది కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండుకో.. లేదా ఏదైనా స్వచ్చంద సంస్థకో ఇస్తానని కేవీపీ సవాలు విసిరారు. కేవీపీ రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది…
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. కాంగ్రెస్ అనగానే మీకు రాజశేఖరరెడ్డి గారు గుర్తుకు వచ్చినందుకు. నిజమే. రోజుకు ఒక రంగును మార్చే రాజకీయ ఊసరవెల్లులు ఉన్న ఈ కాలంలో నికార్సైన కాంగ్రెస్ నాయకుడు అంటే గుర్తుకు రావలసింది డా. వైయస్ రాజశేఖర రెడ్డి గారే.
గత రెండు రోజులుగా అనేక మంది వైయస్సార్ అభిమానులు, అనుయాయులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూశారా.. అయినా స్పందించరా.. అని ప్రశ్నించడంతో, మీ ఆవేశపూరితమైన, ఆలోచనాభరితమైన దీర్ఘ ప్రసంగాన్ని చూశాను. డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో మీరు బహుశః సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలను ఖండించక తప్పడం లేదు.
ముందుగా, డా.వైయస్ రాజశేఖరరెడ్డి కి, వైయస్సార్ సిపి పార్టీకి సంబంధం లేదన్న విషయాన్ని.. చాలామంది లాగానే, మీరు కూడా.. గుర్తించడంలో విఫలం అవుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. గమనించండి.

ఇక మీ ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలకు వస్తే, మీరు ఏదో చికిత్స నిమిత్తం.. ఆసుపత్రిలో చేరింది, 2005 లోనో, 2006 లోనో గుర్తు లేదు అన్నారు. కానీ, అప్పుడు రిలీజ్ అయిన మీ సినిమా పేరు మాత్రం కరెక్ట్ గా చెప్పారు. అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్ లోనూ, రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ లు, వయనాడ్ లోనూ, పివి నరసింహారావు నంద్యాలలోనూ పోటీ చేశారని చెప్పి గౌరవనీయులు డా. పి.శివశంకర్ 1998 లో తెనాలి పార్లమెంటుకు పోటీచేసి గెలిచిన విషయాన్ని మాత్రం ప్రస్తావించ లేదు.. మీకు తెలియదో, ఇది కూడా మర్చిపోయారో తెలియదు.
ఇక రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావిస్తూ, ఒక ఉన్నత పోలీసు అధికారి మీకు ఏదో చెప్పాడని, మీరు అమాయకంగా అది నమ్మలేదని.. అయితే రెండు సంవత్సరాల తరువాత అది నిజమైందని చెప్పారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే పూర్తి అసత్యమని తెలుస్తున్నది.. నాకు, రాజశేఖరరెడ్డి అభిమానులకు గుర్తున్నంతవరకు, ఆయన సీఎం గా ఉన్నప్పుడు మీ మీద, మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్లు ఆధారాలు లేవు. కానీ, కేసులు బనాయించారని మీరు ఒక ఆరోపణ చేశారు.

జలగం వెంగళరావు గారి నుండి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు అనేక కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పనితీరును గమనించే అవకాశం నాకు లభించింది. ఆ స్థాయి వ్యక్తి ఎవరూ తమ రాజకీయ ప్రణాళికల గురించి అలా పోలీసు ఆఫీసర్లతో చర్చించడం జరగదు. ఇక రాజశేఖర్ రెడ్డి ఒక పోలీసు అధికారితో అలా అన్నారనడం పూర్తిగా సత్య దూరం. మీ ఆరోపణలలోని సత్యాసత్యాల నిగ్గు తేల్చడానికి, ఆయన అసంఖ్యాక అభిమానుల కోరిక మేరకు, నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. మీరు చెప్పిన ఉన్నత పోలీసు అధికారి (అప్పటికి IG ఆపై స్థాయి ఆఫీసర్) ఎవరైనా” లై డిటెక్టర్” ముందు మీరు ఆరోపించిన విధంగా రాజశేఖరరెడ్డి చెప్పారని చెపితే, లక్షలాదిగా ఉన్న రాజశేఖరరెడ్డి గారి అభిమానులు, నేను కలిసి 10 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు గానీ లేదా అది మీకు ఇష్టం లేకపోతే, మీరు చెప్పిన ఏ స్వచ్ఛంద సంస్థకు గానీ ఇవ్వడానికి సిద్ధం అని తెలియచేస్తున్నాను. మీ ఆరోపణలు నిజమని కనీసం మీరు బలంగా నమ్ముతుంటే మీరు ఈ చాలెంజ్ కు అంగీకరించండి.

ఈ ప్రతిపాదన మీకు వింతగానో, విడ్డూరంగానో అనిపించవచ్చు.. కానీ రాజశేఖరరెడ్డి వంటి ఒక ప్రజా నాయకుడి గురించి, ఆయన చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా, గుండెల్లో గుడి కట్టి పూజించుకుంటున్న అసంఖ్యాక అభిమానులకు, ఆయనపై ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం చాలా బాధను కలిగిస్తుంది. నిజాన్ని నిగ్గు తేల్చాలనిపిస్తుంది.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి గానీ, రాజశేఖర్ రెడ్డికి గానీ 2005- 2006 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆదరణకి.. మీ గురించి గానీ, మీ భవిష్యత్తు రాజకీయ ప్రణాళికల గురించి గానీ.. ఆలోచించవలసిన అవసరం లేదు. తీరిక అసలే లేదు. చరిత్రను తిరగేయండి.
ఇక అప్పట్లోనే మీరు రంగంలోకి దిగితే, ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగైపోతారు అన్నంత ప్రజాభిమానం మీ పట్ల పొంగిపొరలినట్టు దాఖలాలు కూడా లేవు. కాబట్టి మీ గురించి అప్పట్లోనే ఆలోచించి కుట్రలు చేయవలసిన అవసరం ఉందనుకోవడం ఒక అందమైన ఊహ మాత్రమే అని జనాభిప్రాయం.
అప్పటికి మీరు, మీ కుటుంబం ఎవరూ రాజకీయాలలోకి రాలేదు. వస్తున్నట్లు పొగ కూడా లేదు. కాబట్టి, మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. నిజానికి అంత ప్రజాభిమానం మీ పట్ల అప్పుడూ లేదు. ఆ తరువాతా లేదన్నది సత్య సన్నిహితం. ఇక మీ పట్ల ప్రజలకు ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. 2019 (రెండు చోట్ల మీరు స్వయంగా పోటీచేసి ఓడిపోయిన సందర్భం), 2023 తెలంగాణ శాసనసభ, తరువాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలు అనేది ప్రజాభిప్రాయం.

వాస్తవానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉంటూ మీరు.. అప్పటి కాంగ్రెస్ నాయకుల పై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము మీ మీద ఏ కేసులు పెట్టలేదు. కాంగ్రెస్ లో ఒక స్థాయి ఉన్న ప్రతి నాయకుడు కూడా మీ వ్యాఖ్యలను పిల్ల చేష్టలుగా తీసిపారవేసారు. కానీ, గతంలో మీ ఆరాధ్యుడైన చేగువేరా మార్గం నుండి, ఇప్పుడు సనాతన ధర్మ పరి రక్షకుడిగా పరిణితి చెంది కూడా, ఇలా అర్ధం లేని ఆరోపణలు చేయడం, మీ స్థాయి వ్యక్తికి తగనిపని అని ప్రజలు భావిస్తున్నారు.
కొంతమంది తెలంగాణా నాయకులు వారికి ఉన్న సమాచారం మేరకు, నిజానిజాలు నిర్దారించుకున్నారో లేదో నాకు తెలియదు గానీ, మిమ్మల్ని ప్యాకేజి స్టార్ అని పెయిడ్ ఆర్టిస్ట్ అని అనడం మీ హృదయాన్ని ఎంత గాయపరిచిందో అర్ధం చేసుకోగలను. అలానే జనం మెచ్చిన నాయకుడి పై అసత్య ఆరోపణలు చేస్తే, ఆయన అభిమానులు కూడా బాధ పడతారు. గ్రహించండి.
రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయని కూడా మీరు వాపోయారు. నిజమే. “రాజశేఖర్ రెడ్డి ఉంటే మాకు అన్యాయం జరగదు” అన్న వారి అచంచల విశ్వాసమే దానికి కారణం. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న గొప్పదనం ఆయనది. ఆ విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వగలిగిన నాయకుడిని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తారు. అనుమానం అవసరం లేదు.
రాజకీయంగా రాజశేఖర రెడ్డికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వారిలో కొంతమంది ఒక హీరోగా మిమ్ములనూ అభిమానిస్తారు. వారిలో కొంతమంది ప్రస్తుతం మీ జనసేనలోనూ ఉన్నారు. మీరు అనవసరంగా రాజశేఖరరెడ్డిని నిందించి, వారి మనసులను గాయపరిచి, మీ పట్ల విముఖత కలిగేలా ప్రవర్తించవద్దనేది ప్రజల కోరిక.
తెలంగాణలో మీరు పెట్టాలనుకున్న సభకు అనుమతి నిరాకరించడానికి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహేతుక కారణాలు ఉండొచ్చు. ఆ కారణాల గురించి తెలుసుకోకుండా కాంగ్రెస్ ను, రాజశేఖరరెడ్డిని నిందించి ప్రయోజనం లేదు.. వ్యక్తుల తోనో, పార్టీలతోనో, మీకు రాజకీయ శత్రుత్వం ఉంటే..అది వారితో తేల్చుకోండి. మధ్యలో రాజశేఖరరెడ్డిని, కాంగ్రెస్ పార్టీని లాగి..అభాసుపాలు కాకూడదు అనేది ప్రజల ఆకాంక్ష.
మొన్నటి సంఘటన పై మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, కొంతమంది తెలంగాణా నాయకులు మీ పట్ల చేసిన వ్యాఖ్యలలో తప్పులు వెదికారు కాని, తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా, పవిత్రంగా జరుపుకుంటున్న వారి మధ్యలో, తెలంగాణ రాజధానిలో ఆయన డిప్యూటీ సీఎం గారు ఆవేశంతో కలకలం సృష్టించడం గురించి సూచన ప్రాయంగా కూడా విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
అయినా తెలంగాణలో కూడా మీరు ప్రజానాయకుడుగా ఎదగాలనుకుంటే.. తప్పేమిలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు, ఆంధ్రకు ఇంకా తీర్చవలసిన హామీలు చాలా ఉన్నాయి. కానీ, అసలు హామీలను దాచిపెట్టి, పాచిపోయిన లడ్డూలను పంచి పెడుతున్న మోడీని ఎదిరించి, తమను సాధించే యోధుడి కోసం అవి గత పన్నెండేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నాయి.
ఆ హామీలను సాధించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నది. వాటిని సాధించడానికి కేంద్రంపై యుద్ధానికి కాంగ్రెస్ కు సహకరించండి. లేదా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారిని ఒప్పించి, కూటమి తరుపునో లేదా వ్యక్తిగతంగానో పోరాడి, ఆ హామీలను సాధించి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని పవన్ కళ్యాణ్ కు కేవీపీ సూచించారు.

