ఘనంగా ఆయుర్వేద దినోత్సవం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 : ఎన్‌ఐఐఎంహెచ్, హైదరాబాద్‌లో ఆయుర్వేద దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రజలకు ఆయుర్వేదం, ముఖ్యంగా ఆహారం, ఔషధ మొక్కల గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ వేడుకలు ఉదయం 8 గంటలకు ‘వాక్ ఫర్ ఆయుర్వేద’తో మొదలయ్యాయి. ఇందులో సంస్థ అధికారులు, ఉద్యోగులు, రెవెన్యూ బోర్డు కాలనీ గడ్డిఅన్నారం కౌన్సిలర్‌తో పాటు కాలనీ వాసులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

కేంద్ర ఆయుర్వేద విజ్ఞాన అనుసంధాన పరిషద్, న్యూఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. శ్రీకాంత్, విజయవాడ-ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఉత్తమ వైద్య పమ్మి సత్యనారాయణ శాస్త్రి, సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.పి. ప్రసాద్ ఈ ర్యాలీని ప్రారంభించారు. నినాదాలతో చుట్టుపక్కల కాలనీల్లో తిరుగుతూ ఆయుర్వేదాన్ని ఆదరించాలని కోరారు. ర్యాలీ ముగింపులో మందార పువ్వుల టీతో పాటు ఆయుర్వేద పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.

కొందరికి సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి సీసీఆర్‌ఏఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. శ్రీకాంత్ అధ్యక్షత వహించారు. సంస్థకు మాన్యుస్క్రిప్ట్‌లు, అరుదైన పుస్తకాలు, మ్యాగజైన్‌లు, మ్యూజియం వస్తువులను విరాళంగా ఇచ్చిన ప్రముఖులను సత్కరించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధన్వంతరి ప్రార్థన కార్యక్రమం మొదలైంది, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఇచ్చిన జాతీయ సందేశాన్ని చదివి వినిపించారు.

ఈ సందర్భంగా, డాక్టర్ డి.వి. శ్రీరామమూర్తి ప్రతినిధి వెంకట్ సూర్య సుజన్, వెంపటి రాధాకృష్ణ మూర్తి, డాక్టర్ వసంత కుమార్ ప్రతినిధి సులోచనా ఠాకూర్ సోదరి శ్రీమతి పద్మలను జ్ఞాపికలు, సర్టిఫికెట్లతో సత్కరించారు. దీనితోపాటు, సంస్థ మాజీ డైరెక్టర్ డాక్టర్ బి. రామారావు, డాక్టర్ పి. వి.వి. ప్రసాద్, డాక్టర్ డి. సుధాకర్, శ్రీమతి గాయత్రి సహా అనేకమంది ప్రముఖులకు కూడా సన్మానం జరిగింది.

ఆయుర్వేదం పై అవగాహన కార్యక్రమాలని నిమిత్తం, పలువురు నిపుణులు వివిధ అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చారు. డాక్టర్ ఎన్. శ్రీకాంత్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ‘ప్రపంచ ఆరోగ్యానికి ఆయుర్వేదం పాత్ర’ గురించి, మరియు ఉత్తమ వైద్య పమ్మి సత్యనారాయణ శాస్త్రి “పుష్పాల ఔషధ వినియోగం” పై ఉపన్యసించారు. డాక్టర్ జి.పి. ప్రసాద్, డాక్టర్ సుబోస్, డాక్టర్ వి. శ్రీదేవి, డాక్టర్ సంతోష్ మానే వంటి అధికారులు ‘వృద్ధాప్యానికి ఆయుర్వేదం’, ‘సమ్యక్ పోషణ’, ‘ఆయుర్వేదం మరియు మహిళల ఆరోగ్యం’, ‘ఆయుర్వేద ప్రాథమిక సూత్రాలు మరియు వైద్య ప్రయోజనాలు’ వంటి విషయాలపై చర్చలు జరిపి ప్రేక్షకులతో సంభాషించారు. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ మాధ్యమం ద్వారా పలువురు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

సంస్థ లైబ్రరీ, గ్రంథాలయం మరియు ఔషధ ఉద్యానాన్ని సందర్శించారు. హాజరైనవారికి ఔషధ మొక్కలు, సమాచార సామగ్రి, మందులను కూడా పంపిణీ చేశారు. కార్యక్రమం ముగింపులో, శ్రీ కె. శ్రీనివాస రావు అధికారులు, ఉద్యోగులు, హాజరైన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.









