విమానం ఎక్కాలనుకునే వారికి ప్రత్యేకం

0
525

సృజనాత్మక ఆలోచనతో రూపుదిద్దుకున్న రెస్టారెంట్
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలంటారు… ముత్యాలముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ కనకారావు. దీనినే వ్యాపారానికి ఆపాదించుకుంటే….
వ్యాపారం అన్నాక కాస్త సృజన (క్రియేటివిటీ) ఉండాలంటున్నారు వెంకటరెడ్డి గారు. ఆయన సృజన గురించి కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను.

దాదాపు రెండు నెలల క్రితం ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ గారి పేస్ బుక్ పోస్ట్ చూసి మెసేజ్ పెట్టాను. వెంకటరెడ్డి గారి నెంబర్ ఇవ్వమని, వచ్చిన వెంటనే వెంకటరెడ్డి గారికి ఫోన్ చేశాను. ఆయన నా ఫోనుకు బాగా స్పందించారు. ఒకసారి వచ్చి నేనేమి చేస్తున్నానో చూడండని ఆహ్వానించారు. అప్పటినుంచి ప్రయత్నించగా ఈరోజుకు వెళ్లడం కుదిరింది. దీనికి కూడా కారణం ఉంది. నేను వాయిదాలు వేస్తుండడం చూసి వెంకటరెడ్డి గారే ఫోన్ చేసి ఇంట్లో ఉన్నారా అని అడిగారు. ఉండండి నేను వస్తున్నా అంటూ వచ్చేసి… కారెక్కించుకుని ఆయన వ్యాపార స్థలికి తీసుకెళ్లారు.

ఆకాశమంత ఆనందం
అక్కడికి వెళ్లిన తరవాత చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు. ఒక అర ఎకరం స్థలంలో ఒక విమానం.. విమానానికి వెనుకవైపున ఒక గుహ సెట్టింగ్, వాటర్ ఫాల్, కిచెన్ కనిపించాయి. ముందువైపు ఆఫీసు. దానికి ముందు టాప్ లెస్ జీపు. ఎడమవైపున రెండు కంపార్టుమెంట్లు కనిపించాయి. వీటి గురించి చదివి తెలుసుకోవడం కంటే… చూసి ఆనందించడమే మిన్న.

దుబాయిలో రెస్టారెంట్
ఇంతకీ వెంకట రెడ్డి గారు దుబాయ్ లో 18 సంవత్సరాల పాటు హైదరాబాద్ ధం బిర్యానీ పేరుతో రెస్టారెంట్ నడిపారు. కరోనా కారణంగా దానిని మూసివేసి, ఇండియాకు వచ్చేసారు. అప్పటినుంచి ఏమి చేయాలన్నదే ఆయన ధ్యాస. అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తారు. కానీ సృజనాత్మకంగా చేయాలని ఆయన తలపోశారు.

మేధోమధన ఫలితమే…
ఆయన మేధో మధనం నుంచి పుట్టిందే కె.వి.ఆర్స్. ఫ్లైట్ రెస్టారెంట్. ఇందుకోసం ఆయన ఒక ఫ్లైట్ కొన్నారు. ఢిల్లీ నుంచి దానిని హైద్రాబాదుకు తీసుకొచ్చారు. చేయాల్సిన హంగులన్నీ సమకూర్చారు. రెండు నెలల క్రితం ఈ రెస్టారెంటును ప్రారంభించారు. అక్కడ తయారు చేసే ఆహార పదార్ధాలన్నీ ఆయన సొంత ఆలోచనలోంచి పుట్టినవే. ఇంట్లో తిన్నట్టే ఉంటుందంటున్నారు. కాఫీ, టీలు కూడా ఆయన సొంత ఫార్ములాతోనే తయారు చేస్తారు.
బర్త్ డే పార్టీలకు, మహిళల కిట్టీ పార్టీలకు, కాలేజ్ స్టూడెంట్స్ చేసుకునే పార్టీలకు ఇది అనుకూలం. అంతకు మించి విమానం ఎక్కాలనుకునే వృద్ధులు, పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. అంతా చెప్పేస్తాను అనుకుంటున్నారా… అక్కడికి వెళ్ళండి. ఆనందించండి.

ఇలా వెళ్ళండి..
ఎక్కడుందంటే… హైద్రాబాదులోని గండిమైసమ్మ సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వెడితే డి. పోచంపల్లి వెళ్లే రోడ్డు వస్తుంది. ఒక్క రెండు ఫర్లాంగులు వెడితే ఫ్లైట్ రెస్టారెంట్ స్వాగతం పలుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం బయలుదేరండి ఫ్లైట్ రెస్టారెంటుకు…. డైనింగ్ వైల్ ఫ్లైయింగ్ …. ఎంజాయ్…

మరిన్ని వివరాలకు 8977334294 నంబరును సంప్రదించవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here