ఇవాళ దాశరథి జయంతి
(రోచిష్మాన్ 9444012279)
తెలుగు కవిత్వంలో దాశరథి వందనీయులు.
నేను తెలుగు కవితను చదవడానికి అలవాటుపడుతున్న తొలినాళ్లలో ‘దాశరథి కవిత’ సంపుటిని చదివాను. నాకు బాగా నచ్చింది. అప్పటికి శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదివాను. రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి అనువాదాన్ని చదివాను.
“నీళ్లలో నిప్పు మాదిరి, నిప్పులోన
నీళ్లమాదిరి, కష్టాల నీడలందు
సుఖము నివసించునంట, ఉస్సురను వేడి
ఊర్పులోన పరీమళాలున్నవంట”
వంటివి దాశరథి కవితలో ఎన్నో నాకు నచ్చాయి. వారి పద్యరచన కూడా నాకు నచ్చింది. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనడమూ, “అగ్నిధార”, “హిమజ్వాల” వంటివి అనడమూ, “పూలను ముద్దుపెట్టుకొని ముండ్లను వద్దనబోకు నీవు; నీ కేలటు తాకినంత పులకింపవె కంటకముల్ సుమమ్ములై” అనడమూ, “ఉదయాకాశ పతాకం / యెదలో కదలాడే నేడు” అనడమూ, “నవయువక రక్తనాళాల నడుమ పారు / నూత్న చైతన్యధార అనడమూ, “మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు” అనడమూ, “తెలుగు నింగి దారులలో / వెలుగు పులుగు రెక్కలార్చి / చిమ్మి వైచె తరతరాల / చిక్కని చీకట్లనెల్ల” అనడమూ నాకు బాగా నచ్చాయి. నిజానికి వారి మహాంధ్రోదయం లోనే గజల్ భావజాలం మనకు కనిపిస్తింది.
చిన్నప్పుడు దాశరథి గారిపై ఏర్పడ్డ గౌరవం అంతర్జాతీయ కవిత్వం చదివాక కూడా, ఇప్పటికీ తగ్గలేదు. ఇంకా ఎక్కువయింది.
సాధారణంగా తెలుగు కవులకుండే దుర్గుణాలు, చవకబాఱుతనం, నీచత్వం లేని ఉన్నతమైన వారు దాశరథి అని తరువాతి నాళ్లలో తెలుసుకున్నాను. నాకు ఎంతో సంతోషం వేసింది.
ఒక ఉన్నతమైన కవి దాశరథి ఒక ఉన్నతమైన మనిషి కూడా.
దాశరథి స్వయంగా పీ.బీ. శ్రీనివాస్‌కు రాసిన ఒక ఉత్తరం చదివాను. దాశరథి గొప్ప వ్యక్తిత్వం తెలిసింది. ఒక కవి, అందులోనూ తెలుగు కవి అంత మానసిక పరిపక్వతతో, సంస్కారంతో, సహృదయతతో జీవించడం మహోన్నతమైన విషయం.
కవుల్లో అందులోనూ తెలుగు కవుల్లో దాశరథి అంత ఉన్నతమైన వ్యక్తులు వేళ్లపై లెక్కించగలిగినంత మంది మాత్రమే ఉంటారు.
దాశరథి ఒక ఉన్నతమైన కవి. ఒక ఉదాత్తమైన మనిషి.
దాశరథి తొలి తెలుగు గజల్ కవి. “వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది” తొలి తెలుగు గజల్ ను పలికించారు. అంతకు మునుపే జఫర్ తరంగాలు, గాలిబ్ గీతాలు పేర్లతో ఉర్దూ గజళ్లను తెలుగులోకి అనువాదం చేశారు.
“కలయైనా నిజమైనా నిరాశలో ఒకటేలే;
పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే” (సినిమా: మూగనోము) అంటూ సినిమా పాటలో గజలియత్‌ను పండించారు దాశరథి.
దాశరథి తెలుగు గజల్ కు మంజరి అని పేరు పెట్టారు. పీ.బీ. శ్రీనివాస్ గజల్ కు పెట్టిన వల్లరి అన్న పేరును కూడా తీసుకుని జ్ఞాన వల్లరి పేరుతోనూ రాశారు.
‘తెలుగులో గజల్ కు న్యాయం చెయ్యలేను’ అన్న ఆలోచనేమో? దాశరథి 13 కన్నా ఎక్కువ తెలుగు గజళ్లు రాయలేదు. ఇలా సీ. నారాయణరెడ్డి కూడా చేసి ఉంటే ఇవాళ తెలుగులో గజల్ అన్న విదూషకత్వం, వికారం, భాష విధ్వంసం ఉండేవి కావు. గజల్ పరంగా నారాయణరెడ్డి కాదు, దాశరథి వందనీయులు.
కొన్ని శతాబ్దుల క్రితమే తెలంగాణ ప్రాంతపు కవుల్లో దాశరథి మేలైన కవి అని విశ్వనాథ సత్యనారాయణ రాశారు! అది కాలం వడగట్టిన సత్యంగా ఈనాడు ఋజువౌతోంది. ఇటీవల సీ. నారాయణరెడ్డి ప్రభ తగ్గుతూ దాశరథి పునర్నవం పొందుతూండడం క్షేత్రవాస్తవం. తెర వెనుక ప్రయత్నాలతో తెచ్చుకున్న స్థితిని కాలం కొట్టిపారేస్తుందన్న సత్యాన్ని ఇటీవల నారాయణరెడ్డి మసకబారడం దాశరథి పునర్నవం పొందడం తెలియజేస్తున్నాయి.
“సత్యానికి గెలుపన్నది
సత్యంరా మానవుడా!
అన్యాయంతో స్వర్గం
అందదురా దానవుడా!”
అన్న దాశరథి మాటలనూ, ఈ సందర్భంగా వారినీ స్మరించుకుందాం. దాశరథి రానున్న రోజుల్లో మరింత స్మరణీయం ఔతారు.
దిగంబర కవిత్వం, పైగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, కమ్యూనిజమ్, కుల, మత వాద కవిత్వం, ఆ వాద కవిత్వం, ఈ వాద కవిత్వం, శివారెడ్డి, గోపి, అఫ్సర్, ఉచ్చల కవిత్వం దుష్ప్రభావాలకు తీవ్రంగా దెబ్బతిన్న తెలుగు కవిత్వానికి ఉపశమనం, తెరిపి దాశరథి కవిత్వం!
కవిత్వం పరంగా ప్రపంచంలో ఏ భాషలోనూ లేనంతగా వికృతమైపోయిన తెలుగుకు
గంటూరు శేషేంద్రశర్మ కవిత్వంతో పాటు దాశరథి కవిత్వం ఇప్పుడు ఎంతో అవసరం.
అజ్ఞానం, అతి-తెలివి, మేధ, మానసిక రోగం ఈ నాలుగిటి ధాటికి, దాష్టీకానికి బలైపోయిన ఈనాటి తెలుగు కవిత్వానికి దాశరథి కవిత్వం మేలైన వైద్యం. వ్యాధికి వైద్యం తప్పనిసరి; తెలుగుకు దాశరథి కవిత్వం అవసరం మరి.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

