పింగళి మాటల చాతుర్యహారం చంద్రహారం

0
436

మాటల డింగరీ పింగళి – 2

(డాక్టర్ వైజయంతి పురాణపండ)

కథ మాటలు పాటలతో పింగళి రూపంతో తయారుచేయించిన రజత గొలుసు ‘చంద్రహారం’
ఈ నగ చేయించడానికి పెద్ద కారణమేమీ కాదు కాని చిన్న కారణం లేకపోలేదు. ఉండనే ఉంది. ‘జై పాతాళ భైరవి’ అనగానే ‘నరుడా ఏమి నీ కోరిక’ అంటూ అంబ పలికిన ‘పాతాళభైరవి’ తరవాత సినిమా తల్లికి చంద్రహారం చేయించారు. ఇది పూర్తి మేలిమి బంగారంతో చేయించినా, ఎందుకో గిల్టు నగలా చాలా తొందరగా వెలిసిపోయింది. అందరికీ ఆనందం కలిగించలేదు.


ఎవరికి నచ్చినను, నచ్చకున్నను ఈ టాకీ బొమ్మ తెర మీద ఆడిపాడింది. ఈ కథ క్లుప్తంగా..
చందన రాజ్యాన్ని పరిపాలించే రాజుకి సంతానం లేకపోవటంతో తన బావమరిది ధూమకేతు (రేలంగి) ని రాజుగా ప్రకటిస్తాడు. ఒక స్వామివారు ఇచ్చిన పండు వల్ల భార్య ప్రసవిస్తుంది. కుమారుడికి చందర్‌ (ఎన్‌. టి. రామారావు) అని పేరు పెడతారు. ఆ కుమారుడికి యుక్త వయస్సు రాగానే వివాహం చేయాలని, లేదంటే ప్రాణ గండం ఉందని ఆ స్వామి ముందుగానే చెబుతాడు. చందర్‌ పెరిగి పెద్దవాడవుతాడు. యుక్తవయసు రాగానే తన కలల రాకుమారిని చిత్తరువులో బంధిస్తాడు. ఆమెనే వివాహం చేసుకుంటానంటాడు. ధూమకేతుకి నిక్షేపరాయుడు అనే ఒక తలతిక్క మనిషి అత్యంత ఆప్తుడుగా చేరతాడు. అతడికి చందర్‌ చిత్రించిన అందాలరాణి (జూ. శ్రీరంజని) కనిపించినా, ఆమెను రాజుకు కనపడనీయకుండా జాగ్రత్త పడతాడు. ఇంతలో గంధర్వకన్య చంచల (సావిత్రి) చందర్‌ని చూసి మోహిస్తుంది. తనవాడిని చేసుకోవాలనుకుంటుంది. చందర్‌ అంగీకరించకపోవడంతో అతని మెడలోని చంద్రహారాన్ని తీసేస్తుంది. ఆ చంద్రహారం లేనంత సేపు చందర్‌ మరణించినట్లే. తనకు కావలసినప్పుడు మళ్లీ ఆ హారం అతని మెడలో వేస్తుంది. చందర్‌ మెడలో చంద్రహారం ఉన్న సమయంలో ఒకనాడు తన కలల రాకుమారిని ఒక సామాన్యుని ఇంట చూసి మోహించి, వివాహం చేసుకుంటాడు. గంధర్వకన్య పగ బడుతుంది. వారి జీవితాలలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. చివరకు శాపవిమోచనమై చందర్‌ జీవిస్తాడు. వారిరువురూ తల్లిదండ్రులతో కలిసి రాజ్యపాలన చేస్తూ హాయిగా జీవిస్తారు. స్థూలంగా ఇదీ కథ.

ఇక ఈ మారు మన కథలోకి ప్రవేశ అడుగు పెట్టేద్దాం.
చందన రాజ్యాన్ని పరిపాలించే చంద్ర వంశీయ రాజు చంద్రభగవానుడిని ప్రార్థిస్తుంటాడు. ప్రపంచానికి సూర్య భగవానుడుంటే చందన రాజ్యానికి చంద్రభగవానుడు ఎందుకు ఉండకూడదు? సూర్యభగవానుడి తమ్ముడు చంద్రభగవానుడు.. ఇలా అనుకుంటే బావుందేమో.
ఇదేమి విచిత్రమో.. విచిత్రం కాదు. సచిత్రమే.
తన రాజ్యంలో అందరినీ… భక్తి తాత్పర్యాలతో… సేవించాలంటూ పద్యతాత్పర్యాన్ని తగిలించారు పింగళి చమత్కారంగా.
‘తల వంచు కిరీటం పెడతాను’ అంటే, కిరీటానికి తల వంచాల్సిందే, తల ఎత్తుకుంటే కుదరదు కదా మరి. ‘‘గురుతరగౌరవభారాన్ని చాలా సులువుగా వహిస్తాను’’ అని ధూమకేతు తల వంచాడు.
సాధువు ఇచ్చిని ‘‘పండు తిని పండులాంటి కొడుకుని కనడానికి పండు ముత్తైదువవు కాదు నువ్వు…’’ అంటూ చంద్రుడిని కేతువు మింగినట్టుగా భార్యను మాటలతో మింగేశాడు.
‘కిరీటం పెడతానంటే తలవంచాను, ఇప్పుడు తల ఎలా ఎత్తుకోవాలి… తల వంపులు’ అంటూ తలకోపాన్ని తలెగరేశాడు.
రాజుగారికి కుమారోదయం జరిగింది. చంద్ర వంశం, చంద్రభగవానుడి పేరును జతపరిచి కొంచెం మోడర్నీకరణ చేసి, చందర్‌గా కూర్చోపెట్టారు.
తన ఊహల అమ్మాయీమణిని, కలల కన్యకాంతను చిత్తరువు చేశాడు. అది చూసి, ‘పనికత్తెగా పనికొస్తుంది’ అని వెటకార శరాన్ని వేశాడు ధూమకేతు. చెలికత్తె తెలుసు, అందగత్తె తెలుసు.. ఈ పనికత్తె ఏమిటో.

ఇక రాజకూతుళ్ల వర్ణన…
బింబాధరవతి ‘వాడిన తమలపాకుల వలె ఏరిపారేస్తుంది’ అని కన్యా పరిచయం చేశాడు ధుమధుమల ధూమకేతు. మానవతి, అభిమానవతి, రూపవతి, గర్భవతి, గుణవతి… వీటితో పాటే బింబాధరవతి. అధరాలు వచ్చాయి కాబట్టి తమలపాకులు కూడా వచ్చాయి (బింబాధర మధురిమలు… అంటూ పాటలోనూ వచ్చికూర్చుంది). మరో … మత్తకాశిని.. పోక చెక్కలను ఖండించినట్లు కత్తరించింది… మత్తకాశిని కదా.. మదంతో ఖండించాల్సిందే. ఇక వివాహ కుమార్తెల కోసం … కార్యరంగంలోకి దిగాల్సిందే… అంటాడు ధూమకేతు.
చందర్‌తో… దేశయాత్రలు చేయించాలట. తీర్థయాత్రలలో యాత్ర, దేశాటనలో దేశం కలిపితే దేశయాత్రలు. కొత్త సమాసం. భేషుగ్గా ఉంది.

రాజ కూతుళ్ల కోసం బయలుదేరుతుంటే ధూమకేతువు ధుమధుమలాడుతూంటే, పక్కనే ఉన్న… ‘ఎంత చెబితే అంతే రాయుళ్లు’ … సానుభూతి చెప్పాలనుకుంటుంటే… ‘నేను స్వగతం మాట్లాడుకుంటున్నాను, వినపడినా వినపడనట్లు చావండి’ అంటూ పొగబండిలా గుప్పుగుప్పుమంటూ మంటపొగలను వదిలిస్తాడు.

మంచి కొత్తరకం మంత్రి కోసం కన్నులప్పళించి, ఎదురుచూస్తున్న సంగతి ఆ నోటా ఈ మాటా విన్న ఒక సరదా మంత్రి తానే దర్జాగా మంత్రినవుదామని ఆగమ ప్రవేశం చేశాడు. వీడి ఆకారం ఏమిటి ఇలా ఉందంటూ ఎగతాళి చేశాడు ధూమకేతు.
‘నా పేరు నిక్షేపరాయుడు. ఆకారం వికారంగా ఉన్నకొద్దీ బుద్ధి సూరేకారంలా పనిచేస్తుంది’ అంటూ దీపావళి సూరేకారం, గంధకం కలిపిన మతాబులను, చిచ్చుబుడ్లను గుర్తు జ్ఞాపకం చేశాడు. వాటిని కాలిస్తే ధూమం .. అదే ధూమకేతు కూడా వస్తుంది. మరి నిక్షేపరాయుడు అంటుంటే… తాండ్ర పాపారాయుడు గుర్తుకు రాడా. నిక్షేపంగా ఉన్నారు అన్నట్లుగానే నిక్షేపంగా ఉండేవారిని నిక్షేపరాయుడు అంటారనుకుందాం. నిక్షేపరాయుడు పేరు నిక్షేపంగా భేషుగ్గా ఉందంటూ జయజయశబ్దాలు పలికేద్దాం.
ఇక ఈ నిక్షేపరాయుడు… ‘చిన్న అవకాశం ఇస్తే పెద్ద ఘనకార్యం చేస్తాను’ అంటాడు.
పెద్ద ఏమిటో! ఘనం ఏమిటో..!
కవి స్వేచ్ఛాజీవి, నిరంకుశుడున్నూ.
తన పదాలు తన ఇష్టం.
తన సిరా తన ఇష్టం.
తన మాటలు తన ఇష్టం.
అంతా తన ఇష్టమే..
‘ఇక తాను పని సాధించలేకపోతే… నా తల కాసుకుంటాను’ … అబ్బా…. ఈ తల కాసుకోవటమేంటో! తల తెగకుండా కాసుకోవటమే తలను కాపలా కాసుకోవటమా! ఎంత బావుందో! తల కాసుకోవటం!! ఈ పదాలు వింటుంటే పింగళి తాతగారి చంకలో కాదు కాదు భుజాల మీద ఎక్కి కూర్చోవాలనిపించదూ. అనిపిస్తుంది! ఎందుకనిపించదు! హాయిగా ఎక్కి కూచ్చుందాం. తాతగారు భుజాలు ఎగరేస్తుంటే పడిపోకుండా గట్టిగా పట్టుకోవాలి సుమా.
అసలే ఆయన భలే భలే అంటూ తక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంటారు. జాగ్రత్త.
మళ్లీ కథలోకి పాదాన్ని అడుగేద్దాం…
‘అచ్ఛాకీ తచ్ఛాకీ సరకునంతా ప్రదర్శించి’.. అంటూ భరోసా ఇచ్చాడు. అచ్ఛాకీ అంటే మంచికి… తచ్ఛాకీ అంటే చెడుకి అనేమో. అస్మదీయులు… తస్మదీయులు… అచ్ఛాకీ… తచ్ఛాకీ… బాగు బాగు. మరి సరకునంతా ప్రదర్శించటమేంటి… తన సత్తానంతా చూపుతాననటమే కదా.
నిక్షేపరాయుడి మాటలు ధూమకేతును ఈసారి ఘుమఘుమలాడించాయి…
అంతే
వరం ఇచ్చేశాడు..


ఏమని…
‘ఇప్పుడు నా ఆంతరంగ మంత్రి. తరవాత బహిరంగమంత్రిగా ప్రకటిస్తాను…
అంతరంగం! బహిరంగం!!
అలా రెండు రకాలుగా ఉంటారేమో మంత్రులు. ఉంటారు కాదు. ఉండి తీరాలి. ఉండే తీరాలి. తథ్యం!!!
నిక్షేపరాయుడికి మర్యాదలు చేయాలి కదా. చేసేద్దాం.
అందుకోసం ధూమకేతు..
‘ఈయనను … అతిథిశాలకు తీసుకువెళ్లు..’ అంటూంటే.. పాకశాల, పాఠశాల, భోజనశాల పక్కన అతిథిశాలను పీట వేసి కూర్చోబెట్టేద్దాం.
ఇదేదో పేరు బావుంది కదూ…
మనం ఎప్పుడైనా హోటల్‌ పెడితే ఈ పేరును ఉపయోగించుకుందాం.
పేటెంట్‌ రిజిస్టర్‌ చేయించేసుకుంటే సరి.
–––––––––––––
అక్కడి దృశ్యాన్ని కత్తిరించి ఇక్కడకు వస్తే…
ఇక్కడ చిన్న పల్లెగ్రామంలో కథానాయిక నూతిలో జలోదకాన్ని తోడుతూ, పరసాయం చేస్తుంటుంది. చందనరాజు వివాహ కుమార్తె కోసం వస్తున్నాడంటూ స్నేహితులు పలుకుతుంటే, సన్నగా నవ్వుతుంటే… ‘చాతుర్యాలు పోతున్నావు’ అంటారు స్నేహకత్తెలు.
ఏం ఆయన పనిగత్తె అన్నప్పుడు మనం స్నేహకత్తెలు అనకూడదు.
అనొచ్చు…
హాయిగా అనొచ్చు.
కాళిదాసు చెప్పినట్లుగా ఈయన కూడా బంగారు మాటల దారి పరిచారు. అందుకే మనం కూడా ప్రయత్నిద్దాం.

స్నేహకత్తెలతో మాట్లాడుతుంటే.. సవతి తల్లి ప్రవేశించి…
‘తాచుపామునైనా పెంచొచ్చు కానీ సవతి కూతురిని పెంచలేం’ అనే సరికొంగొత్త సామెతను నుడువుతుంది. అదీ సవతి మనసు.. ఆ మనసు అలాగే మాట్లాడాలి.. మాట్లాడనూగలదు.. మాట్లాడుతుంది… అని ఆవిడతో పలికించారు పింగళి. సరిగ్గా అక్కడికి సమీపంలో గట్టున… ఎంతచెబితే అంతేగాళ్లు బిందెలతో నీళ్లు పోస్తుంటే..
‘ఆగురో ఆగు ఆగండి… ఆగు ఆగు ఆగాలి’ అని అక్షర పలుకులు వింటుంటే రామః రామౌ రామాః అంటూ సంస్కృత శబ్దాలు గుర్తుకు రావట్లేదూ!!!
ఆయన తెలుగు పదశబ్దాలు రాశారు అంతే!!!
అంతలోనే దూరంగా చందర్‌ కోరిన కన్య కనిపించగానే నిక్షేపంగా కళ్లు తిరిగి పడతాడు నిక్షేపరాయుడు.
మళ్లీ తేరుకుని… ఎంతచెబితే అంతేగాళ్లతో…
‘నేనురా చచ్చింది… మీరు బతకండి… పొయ్యండి…’ అంటూ చచ్చినవాడిలాంటి వాడితో సాయితం మాట్లాడించారు పింగళి.
ఇక స్నానం పూర్తి చేసిన ధూమకేతు..
‘మన ఏక పాద సింహాసనం’ అంటూ పలుకుతుంటే… త్రిపాది నక్షత్రాన్ని, చతుష్పాద సింహాసనాన్ని మది తలుపులు తెరిచి తలపులలోకి తీసుకువస్తారు. అసలు ఈ ఏకపాద సింహాసనం ఎక్కడ నుంచి వచ్చిందా అనిపిస్తుంది.
ఏం? ఏకశిలా విగ్రహాలు, ఏకశిలా నగరాలు ఉన్నప్పుడు ‘ఏకపాద సింహాసనం ఏం తక్కువ చేసింది.
ఒంటి స్తంభం మేడలాంటిదే ఇది కూడా.
ఒక స్తంభం మీద మేడ ఉండటం సాధ్యమైతే, ఒక పాదం మీద సింహాసనం ఉండటమూ సాధ్యమేగా.
మళ్లీ తిరిగి కథలోకి…
నిక్షేపరాయుడు… చందర్‌ చిత్రించిన కన్య తనకు ఆ గ్రామంలో కంటి పిల్లకు అదే… కంటిపాపకు కనీకనిపించగానే… ‘ఈ వార్త ఎవ్వరికీ చాటొద్దు’ అంటూ ఆజ్ఞామాటలు ఆదేశించాడు. వార్తను చేరవేస్తాం కానీ చాటింపు వేస్తామా. చేరవేయటమే చాటింపు. నిక్షేపరాయుడు నోరు తెరిస్తే చాలు మహామంత్ర బీజాక్షరంలాగ… ‘టిక్కవో టుమ్రే’ అంటూ నిక్షేప పలుకులు సాక్షాత్కారం అవుతాయి.
ఇదేమిటో???
ఏదో ఒకటి!!!
అన్నిటినీ ప్రశ్నిస్తే ఎలాగ…!!! ???
నిక్షేపరాయుడు ఎంతో నిక్షేపంగా ఇలాంటి చిత్ర విచిత్ర శబ్ద పలుకులు తొక్కి వక్కాణిస్తుంటాడు.
‘ఇక చందనరాజుకి అంత్యక్రియలు… ధూమకేతు మహారాజుకి పట్టాభిషేకం’ అని ప్రకాశంగా ప్రకటన పలుకుతాడు.
అంత్యక్రియలు అంటే? చివరి పనులనా… మరణమనా…
ఏమో? ఏదైనా కావొచ్చు.
మరో పక్క…
గంధర్వకన్య చంచల వచ్చి చందర్‌ని మోహిస్తుంది. తిరస్కారానికి గురవుతుంది. చందర్‌కి మరణ గండం ఉందని, చిరంజీవిత్వం ప్రసాదిస్తాను, ‘చిరంజీవ’ అంటుంటే… ‘నాకు కావలసింది చిర జీవితం కాదు.. చిరకాలం తరించటం…’ అంటూ తర్కించాడు చందర్‌.
‘చివరిమాట’ చెప్తున్నానంది చంచల.
ఇటువంటివి ‘కొస’ ఉన్న ‘చివరి’ మాటలు లెక్కకు ‘కొస’ లేనన్ని ‘చివరి’ లేనన్ని దొరుకుతాయి.
‘అంటల్లేదు… తింటున్నాను’ ‘హెచ్చవేతలు, తీసివేతలు, తోసివేతలు, కుక్క కావలి… ఈ పదప్రయోగాలు మచ్చుకు మరికొన్ని.
ఒకానొకసారి… ఒకే ఒక్కసారి…
అంకెలు వరసగా చెబుతూ…
ఒకటికి ఒకటి కలిపితే రెండు… అంటూనే… ఏడు సంఖ్య రాగానే… మూల కూర్చుని ఏడు… అంటూ విసుగు గారాం చేసింది మరిడమ్మ (ఋష్యేంద్రమణి)
మరి కొన్ని పదప్రయోగ విన్యాస భంగిమలు…
‘ఎద్దునడిగి గంట కడతామా…
కడుపు నిండని వారికి కళ అక్కర్లేదు..
గిరిదుర్గ నాయకుడు…
నిద్రాహారాలు తప్పిస్తే అన్ని వేళలా ఆలోచిస్తున్నారు… రోగి చావుకి పెడితేనే కానీ లంఖణానికి ఒప్పుకోరు..
నా అంతవాడిని నేను బోధించినా ఏమీ లేదు కనుకనే వైరాగ్యం…
మహారాజు ఒప్పుకోకపోతే ఆగాలే కానీ నువ్వు నేను కూర్చోపోతే ఆగదు..
వరాలు నేనివ్వాలట వరించటానికి నేను పనికిరానట…
మీ కర విన్యాసం…


బతికుండి ఉప్పు పాతరలో పడాల్సిందే…
శిక్ష నాకు ముట్టాలి… ఎవరి యోగం వారిది…
ఇటువంటి పదగుప్పింపులు కోలక్షలు, కోవేలవేలూనూ…
ఎన్నని పొగడగలం…
ఎంతని వీరతాళ్లు వేయగలం…
అయ్యా! మహానుభావా!! పింగళీ!!!
నిన్ను కీర్తించటం, ప్రశంసించటం, పొగడటం.. మా తరం కాదు!!
మీరు సృష్టించిన వీరతాళ్లు మీరే వేసుకోవాలి.
అవి వేసే అర్హత మాకు లేదు, మునుపు రాలేదు, ఇక రాబోదు.
నమో పింగళీ! నమోన్నమః!!!
ఆహా భలే హాయిలే ఈ మాటలు.
మరి మనం కూడా ఒకసారి చంద్రహారం చూసేద్దాం. బంగారు పాళీ సిరా పదాలను ఓహో ఓహో అంటూ నవ్వుల తాళ్లు వేసేసుకుందాం.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here