ముంబైని వెంటాడే కాళరాత్రి

Date:

26/11 ప్రత్యక్షసాక్షుల జ్ఞాపకాలు
(డా.వైజయంతి)
ముంబై నగరం పైకి చూడటానికి ఎప్పటిలాగే అంతా ప్రశాంతంగా ఉంది. నగరవాసుల సాధారణ జీవితం చెక్కు చెదరనట్టుగానే కనిపిస్తోంది. కాని, వారి అంతరాంతరాలలో పేరుకుపోయిన ఒక బీభత్సం తాలూకు భయం మాత్రం ఇంకా పోలేదనిపించింది. ముంబై దాడులు జరిగి పదహారేళ్లు గడిచిపోయినా ఒక పీడకలగానే మిగిలిపోయింది. ఆ భయంకర సంఘటన నుంచి బయటపడలేకపోతున్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ రైల్వేస్టేషన్‌లో ఆ రోజు ప్రాణాలకు తెగించి అనౌన్స్‌మెంట్‌ ఇచ్చి అందర్నీ అప్రమత్తులను చేసిన అనౌన్సర్ల దగ్గర నుంచి మరుసటిరోజు అక్కడి శవాలను తొలగించిన పనిమనిషి వరకు ఒక్కొక్కరిదీ ఒక్కో జ్ఞాపకం. అక్కడే కాక వివిధ ప్రాంతాలలో జరిగిన దుస్సంఘటనలకు కూడా బాధితులైన ఎందరో సామాన్యులు ఉన్నారు. ఎన్నో చేదుఅనుభవాలు మిగిల్చిన ఆ రాత్రిని వారు మర్చిపోలేకపోతున్నారు. కాని ఆ చేదు జ్ఞాపకాలను దాటి వచ్చే గొప్ప ఐకమత్యం ముంబై వాసులలో కనిపిస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంతో, బిజీబిజీ ముంబై నగరంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారిలో కనిపించే ఐకమత్యానికి చేతులెత్తి శాల్యూట్‌ చేయబుద్ధేస్తుంది. ఆనాటి దుర్ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కొందరు ముంబై వాస్తవ్యులను పలకరించినప్పుడు వారు చెప్పిన వివరాలు…
ఇద్దరం ఆడపిల్లలం… నరకం చూశాం..
ఆ రోజు మా ఫ్రెండ్‌ పుట్టినరోజు. తనని కలవాలని బయలుదేరి వెళ్లాను. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర అందరం కలుద్దామని అనుకున్నాం. నేను వెళ్లేటప్పటికి తను ఇంకా రాలేదు. ఈ లోపల మరో ఫ్రెండ్‌ వచ్చింది. తను, నేను అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతలో మాకు ఫైరింగ్‌ వినిపించింది. ఏదో సినిమా షూటింగ్‌ అనుకున్నాం. కాని అంతలోనే కార్లన్నిటినీ ఆపేస్తున్నారు అక్కడి పోలీసులు. ఒక్కటి కూడా కదలడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేశారు. ఏం జరుగుతోందో ఎంత ఆలోచించినా మాకు తెలియలేదు. ఓ పక్కన పుట్టినరోజు పార్టీకి వెళ్లాలనుకుంటుంటే మధ్యలో ఈ హడావుడేంటో అర్థం కాలేదు. నెమ్మదిగా ఆ ప్రాంతమంతా పోలీసులతో నిండిపోయింది. టెర్రరిస్టులు తాజ్‌ హోటల్‌లో ప్రవేశించి ఘాతుకం సృష్టిస్తున్నారని చాలా సేపటి తర్వాత అర్థం అయ్యింది. అంతే మాకు కాళ్లు చేతులు ఆడలేదు. అప్పటికి సమయం రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలు. ఎక్కడికీ కదలడానికి వీల్లేదు. ఏం చేయడానికీ పాలుపోలేదు. ఉన్నవాళ్లం ఉన్నచోట ఉండాలే తప్ప అడుగుతీసి అడుగు వేయడానికి లేదు. పోలీసులు ఫైరింగ్‌ ప్రారంభించారు. రాత్రంతా అక్కడ జరుగుతున్న ఫైరింగ్‌ తాలూకు శబ్దాలు వింటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కంటి మీద కునుకు లేకుండా, గొంతు తడుపుకోవడానికి నీరు లేకుండా కూర్చున్నాం. ఫైరింగ్లో చనిపోతున్న వారి ఆర్తనాదాలు వినిపిస్తుంటే గుండెలు పగిలిపోయాయి. మేమిద్దరం అమ్మాయిలం. పెద్దవాళ్ల తోడులేకుండా అక్కడే ఉండి ఆ రాత్రి ప్రత్యక్ష నరకం చూశాం. మాకు తెలిసిన వారందరికీ ఫోన్‌ చేసి బయటకు రావద్దని, ఇక్కడ ఫైరింగ్‌ జరుగుతోందని సమాచారం అందించాం. ఇంతలోనే కమాండోస్‌ వచ్చారు. వారందరూ టెర్రరిస్టులతో ఎదురు పోరాడారు. ఇవన్నీ మా కళ్ల ముందే జరిగాయి. ఆ రాత్రంతా అక్కడ ఆరుబయట ఆ చావుకేకలు, బుల్లెట్‌ చప్పుళ్ల మధ్య ఎలా గడిపామో ఆ భగవంతుడికే తెలియాలి. మేం బతికి బయటపడటం మాకే వింత. మా పాలిట అదొక కాళరాత్రి. ఇప్పటికీ బయటకు వెళ్లి రాత్రి అయ్యాక ఇంటికి వస్తుంటే చాలా భయంగా ఉంటుంది. నిద్రపోతుంటే చాలు ఆ శబ్దాలు మా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. ఇది జరిగిన నాలుగు నెలల తరవాత నేను తాజ్‌ హోటల్‌లో మా వాళ్ల పెళ్లికి వెళ్లాను. అప్పుడు బాగా భయపడ్డాను. ఆనాటి సంఘటనలు ఒక్కొక్కటిగా క ళ్లముందు మెదిలాయి. మళ్లీ అది జరగదని తెలిసినా కూడా ఆ ఫోబియా ఇప్పటికీ పోలేదు. ఇప్పుడు ముంబయిలో చెకింగ్‌ బాగా ఎక్కువగా ఉంది. ఏది ఏమయినా మాత్రం ‘ఐ సాల్యూట్‌ ది స్పిరిట్యుయాలిటీ ఆఫ్‌ ముంబై పీపుల్‌’.
–శ్వేత (ఉద్యోగి)

ఇన్‌సెక్యూరిటీ పోలేదు
ఆ రోజు రాత్రి 9.40 అయింది. అప్పుడు బయట పేలిన చప్పుడు వినిపించింది. అది దీపావళి టపాకాయల చప్పుడు అని అమ్మా నాన్నా అన్నారు. కాని నేను మాత్రం అది బాంబు చప్పుడులా ఉంది అన్నాను. ఎందుకంటే అంతకు ముందొకసారి నేను పదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌లో ఉండగా గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర కార్‌ బాంబ్‌ పేలినప్పుడు చప్పుడు విన్నాను. ఈ చప్పుడు కూడా అలాగే అనిపించడంతో నాకుSఅది బాంబుల శబ్దం అనిపించింది. అయినా నన్ను కంగారు పడద్దని అమ్మ చెప్పింది. ఇంతలోనే ఎవరో ఫోన్‌ చేసి ఫైరింగ్‌ అవుతోంది అని చెప్పారు. మేం అది గ్యాంగ్‌వార్‌ అనుకున్నాం. నారిమన్‌ హౌజ్‌ మా ఇంటి నుంచి 400 మీటర్ల దూరంలో ఉంది. మా బాల్కనీలో నుంచి చూస్తుంటే అంతా కనిపిస్తోంది. నెమ్మదిగా జరిగిన విషయం అర్థం అయింది. అంతలోనే టెర్రరిస్టులు రిజర్వ్‌బ్యాంక్‌ క్వార్టర్స్‌ వైపుగా వచ్చారని కొందరు అన్నారు. మేం అందులోనే ఉంటుండటంతో టెర్రరిస్టులు ఎటువైపు నుంచి వస్తారోనని ఆ రాత్రంతా భయపడుతూనే ఉన్నాం. రిజర్వ్‌ బ్యాంక్‌ క్వార్టర్స్‌కి రెండుపక్కలా ఉన్న గేట్లను మూసేశారు. ఫైరింగ్‌ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం రోజూ ఆ నారిమన్‌ హౌజ్‌ మీద నుంచే షికారుకు వెళ్లేవాళ్లం. ‘మనం నిత్యం తిరుగుతున్న ప్రదేశంలో ఇలా జరిగిందే’ అని మనసుకు బాధ అనిపించింది.
నారిమన్‌హౌజ్‌లోకి హెలికాప్టర్‌లో కమాండోస్‌ వచ్చి దిగడం, అక్కడి సామాన్య పౌరులను రక్షించడానికి ప్రయత్నించడం, టెర్రరిస్టులను మట్టుపెట్టడం అన్నీ ప్రత్యక్షంగా చూశాం. వారం పది రోజుల వరకు మాకు చాలా టెన్షన్‌గానే అనిపించింది. ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. ఒకసారి ట్రైన్‌లో, ఒకసారి కారులో, ఒకసారి ఇక్కడ… ఇలా వారు ఎప్పుడు ఎక్కడ గురిచూస్తారో వారికి తప్పించి ఎవ్వరికీ తెలీదు. ఎంత ధైర్యంగా తిరుగుతున్నప్పటికీ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌ మాత్రం పోలేదు. జరిగిందంతా తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అలాగని ఆ ఫీలింగ్‌తో ఎవ్వరూ ఏ పనులూ మానలేరు. రొటీన్‌ మామూలుగానే ఉంది.
– అపరాజిత, కొలాబా (ఇంజినీరింగ్‌ విద్యార్థిని)

ఉండవలసినంత లేదు…
తాజ్‌ హోటల్‌కి పక్కనున్న సందులోనే మా ఇల్లు. అది టెర్రరిస్టులు ముంబైలోకి ప్రవేశించిన బధ్వార్‌ పార్క్‌కి బాగా దగ్గర. నా పని ముగించుకుని అప్పుడే ఇంటికి బయల్దేరాను. మొట్టమొదట ఫైరింగ్‌ అప్పుడే ప్రారంభం అయ్యింది. మరికాసేపటికి ఫ్రెండ్స్‌ ద్వారా, టీవీల ద్వారా విషయం తెలిసింది. ముందర నేను భయపడలేదు. ఎందుకంటే మేం ఉండేది దక్షిణ ముంబైలో. ఇది కొంచెం ఐసొలేటెడ్‌గా ఉంటుంది. అందుకని ప్రమాదం లేదులే అనుకున్నాను. కాని ఎప్పుడయితే తాజ్‌ ముందు భాగంలోంచి మంటలు వచ్చి, పేలుళ్ల తాలూకు శబ్దాలు మాకు వినిపించాయో అప్పుడు మాత్రం చాలా భయం వేసింది. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను భయపడ్డాను. అది బాంబుల చప్పుళ్లకో లేక మంటలు వస్తున్నందుకో కాదు. డయాబెటిక్‌ పేషెంట్‌ అయిన మా నాన్నగారు అంతకు ముందే మందుల కోసం బయటకు వెళ్లారు.

పెద్దవయసు, దానికి తోడు సుగర్‌. ఇంటికి ఎలా వస్తారా అని ఆయన కోసం బాగా టెన్షన్‌ పడ్డాను. దేవుని దయ వల్ల ఆయన మందులు తెచ్చుకుని ఏ ఇబ్బందీ లేకుండా క్షేమంగా ఇల్లు చేరారు. మా ఫ్రెండ్స్‌ చాలామంది ఆ రాత్రి ఎక్కడి వాళ్లు అక్కడే రోడ్డు మీద ఉండిపోయారు. వాళ్ల గురించి చాలా దిగులు పడ్డాను. మా ఇంటి దగ్గర రెండురోజుల పాటు కర్ఫ్యూ విధించారు. ఏ పనికీ వెళ్లడానికి లేదు. మాకు పాలు, బ్రెడ్, కూరలు ఏవీ లేవు. షాపులన్నీ మూసేశారు. ఈ పరిస్థితుల వల్ల మా ఫ్రెండ్‌ పెళ్లి కేన్సిల్‌ అయ్యింది. అది ఆ అమ్మాయికి, వారి కుటుంబానికి కూడా చాలా దుఃఖం మిగిల్చింది. సుమారు రెండు వారాలపాటు ఎక్కడికి వెళ్లాలన్నా కొంచెం బెరుకుగానే అనిపించింది. నెమ్మదిగా అన్నీ మర్చిపోయాం. ముంబైలో ఇప్పుడు సెక్యూరిటీ బాగానే ఉంది. అయితే ఉండవలసినంత లేదు. దురదృష్టమయినప్పటికీ ఇది మాత్రం వాస్తవం.
– డా. నీషా (డెంటల్‌ డాక్టర్‌)
తలుచుకుంటే చాలు…
ఆఫీసుల పని మీద నేను ముంబై నగరమంతా తిరుగుతుంటాను. ఆ రోజున సరిగ్గా ఆ సమయంలో ట్రైడెంట్‌ హోటల్‌ దగ్గరలో ఉన్నాను. సడెన్‌గా కాల్పుల చప్పుళ్లు వినిపించాయి. కాసేపటి దాకా జరుగుతున్నదేంటో అర్థం కాలేదు. అటుగా వచ్చిన పోలీసులు అందరినీ చెల్లాచెదురు చేశారు. అన్ని పక్కల రోడ్లు బ్లాక్‌ చేశారు. మాకు ఎటు Ðð ళ్లడానికీ దిక్కు తోచలేదు. అంతలోనే బుల్లెట్‌ మా పక్కనే ఉన్న ఇంటి కిటికీలోంచి దూసుకు Ðð ళ్లింది. మేం ఉన్నవాళ్లం ఉన్నచోటే స్థాణువుల్లా ఉండిపోయాం. పోలీసులు రెండుపక్కల నుంచి ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ఆ సంఘటన చూసిన మేం షాక్‌కు గురయ్యాం. ఇటువంటివన్నీ సినిమాలలో చూడటమే కాని ప్రత్యక్షంగా ఏ నాడూ చూడలేదు. ఈ దుర్ఘటనలకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ టివిలలో చూశాం. ప్రత్యక్షఃగా చూసిన అనుభవం లేదు. అక్కడ నుంచి పారిపోదామనుకుంటే కదలలేని పరిస్థితి.

నిద్రాహారాలు లేకుండా ఆ రాత్రంతా ఎలా గడిపామో ఆ దేవుడికే తెలియాలి. టెర్రరిస్టులు పేల్చడం, ఆ వెనకాలే పోలీసుల కాల్పులు ఒకదాని మీద ఒకటి కంటికి కనపడుతూనే ఉన్నాయి. పోలీసు బలగాలు రావడం, ప్రత్యక్షంగా జరుగుతున్నది చూడటం తలుచుకుంటే గుండెలు పగిలిపోతాయి. వాస్తవానికి ముంబైలో మాఫియా గొడవలు, కొట్టుకోవడాలు, పేల్చుకోవడాలు మాకు మామూలే. ఆ సంఘటనలలో వారిలో వాళ్లు గొడవలు పడతారే కాని వేరెవ్వరి జోలికీ రారు. అటువంటిది ఈ సంఘటనలో టెర్రరిస్టులు సామాన్యులను బలి తీసుకోవడం చూస్తే చాలా బాధ అనిపించింది. మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు మేం మా ఇళ్లకు చేరాం. ఇప్పటికీ ఆ సంఘటన మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. రెండేళ్లు గడిచాయి కాబట్టి మళ్లీ ఏదో జరుగుతుందనే భయం మాకు లేదు. నాటి సంఘటన మాత్రం మమ్మల్ని తరుముతూనే ఉంది. ఏది ఎలా ఉన్నా ఎవరి పనులు వారికి తప్పవు. ఎప్పటిలాగే మేం మా జీవితాన్ని గడుపుతున్నాం.
– మసూద్‌ రెహ్మాన్‌ (బ్యాంకు ఉద్యోగి)


నేరం ఒకరిది, శిక్ష మరొకరికా?
ముంబయి నగర ప్రజలు టెర్రరిస్టుల గుప్పిట్లో భయం భయంగా గడిపి నేటికి సరిగ్గా పదహారేళ్లయింది. ఇన్నిరోజులు వారు ఎలా ఉన్నారో తెలీదు కాని మళ్లీ 26/11 వచ్చిందంటే అక్కడి మత్స్యకారుల గుండెల్లో ఏదో తెలియని ఆందోళన. చరిత్ర పునరావృతం కాకపోవచ్చు. కాని నాటి సంఘటనలు వారి కళ్ల ముందు కదలాడి మనసులను కలవరపెట్టక మానవు. ఈ తేదీ వస్తే కాళరాత్రి జ్ఞప్తికి రాక తప్పదు. ముంబయి వెళ్లిన నేను టెర్రరిస్టులు ఇండియాలోకి ప్రవేశించిన మచ్చీమార్‌నగర్‌కి వెళ్లాను. అక్కడ ఉండేవారంతా మత్స్యకారులే. లౌక్యం తెలియని ఈ అమాయకులను చూస్తే ఆ భయంకరమైన రోజు ఎలా గడిపారా? అని నా మనసు కలుక్కుమంది. నాటి సంఘటనను గురించి వారిని ప్రశ్నించాను. వారు గుర్తు తెచ్చుకుంటూ, ‘‘పదిమంది టెర్రరిస్టులు పాకిస్థాన్‌ నుంచి గుజరాత్‌ మీదుగా ముంబయిలోకి ప్రవేశించారు. వారు గుజరాత్‌లో స్పీడ్‌బోట్‌ని తీసుకుని అందులో ఉన్న వారందరినీ చంపేసి, దారి చూపడానికి మాత్రం ఒక్కడిని తమతో ఉంచుకుని ముంబయిలో వారు దిగవలసిన ప్రదేశం దగ్గరకి వచ్చాక ఆ ఒక్కడినీ కూడా చంపేసి నేరుగా ఇక్కడి నుంచే ప్రవేశించారు. వారు భుజాలకి బ్యాగ్‌లు తగిలించుకుని వచ్చారు. అందులో ఏమున్నాయో కూడా మాకు తెలీదు. వాళ్లని చూస్తే చదువుకునే పిల్లల్లా ఉన్నారు. కాబట్టి అందులో ఉన్నవి పుస్తకాలు అయి ఉంటాయని అనుకున్నాం. వాళ్లు కొత్తవారిగా అనిపించడంతో ‘ఎవరని’ అడుగుతుంటే మమ్మల్ని ఒక్కతోపు తోసి రోడ్‌ మీద ఆగి ఉన్న ట్యాక్సీలోకి ఎక్కి వేగంగా నారిమన్‌ హౌస్‌ వైపుగా వెళ్లిపోయారు. నిజానికి మాకు ఎవరినీ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేవు. కాని మా ప్రయత్నం మేం చేశాం, ఫలించలేదు. ఒక్క విషయం మాత్రం చెప్పగలం… ఆ రోజు రాత్రి నారిమన్‌ హౌస్‌ నుంచి వచ్చిన అరుపులు విన్నప్పుడు మా గుండె చెరువయింది. తుపాకుల శబ్దాలు, వాటి వెనుకే ఆర్తనాదాలు…నిజంగా మాకు అది భయంకర రాత్రి. ఇప్పటికీ రాత్రి అయిందంటే మాకు ఆ శబ్దాలు వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. మళ్లీ ఆ ముష్కరులు ఎటునుంచి వచ్చి దాడి చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాం. మాకు ఏ ఆపద వచ్చినా వెంటనే ఫోన్‌ చేయమని పోలీస్‌శాఖ వారు నంబరు ఇచ్చారు,’’ అని ఆర్ద్రతతో నిండిన గొంతుతో వివరించాడు హరేశ్వర్‌ కేశవ్‌ తాండిల్‌. వారి మాటలు విన్న నాకు ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి – ‘‘ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది?’’ అని అడిగాను. దానికి, ‘‘ఇప్పుడు మేము సముద్రంలోకి ప్రవేశించడానికి అనేక షరతులు విధించారు. మెడలో ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా వేసుకోవాలి. ఎప్పుడు అడిగితే అప్పుడు వారు అడిగిన వివరాలన్నీ చెప్పాలి, ఏ రోజు కార్డు మర్చిపోయినా ఆ రోజు ఇంక మేం చేపలు పట్టడానికి వీలు దొరకదు. అందునా పోలీస్‌ వారి చెకింగ్‌ సముద్రంలో ఉంది. అక్కడి దాకా వెళ్లాక మా దగ్గర కార్డు లేకపోతే మమ్మల్ని వెనక్కి పంపేస్తారు. వాళ్లు చేసేది మంచిపనే అయినా మాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటోంది,’’ అని జగన్నాథ్‌ తాండిల్‌ అనే మరో మత్స్యకారుడు తమకు కొత్తగా వచ్చిన కష్టాలను ఏకరువు పెట్టాడు. నిజానికి ఇవన్నీ వారి క్షేమం కోసమే. అయితే ఇంతకాలం సముద్రంలో చేపల్లాగే స్వేచ్ఛగా బతికిన వీరు ఈ టెర్రరిస్టుల కారణంగా ఇక్కట్ల పాలవ్వవలసి వచ్చింది. ‘నేరం ఒకడు చేస్తే శిక్ష వేరొకరు అనుభవిస్తున్నారు’ అని నా మనసుకు అనిపించింది. ఒక కష్టం వెనుక ఒక సుఖం ఉంటుంది, ఇదంతా వారి మంచి కోసమే అని నన్ను నేను సమాధానపరచుకున్నాను.
మత్స్యకారులు నివసిస్తున్న ఇళ్లకి పక్కనే ప్రభుత్వం పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసింది. వారి మనోగతం ఎలాగుందోనని ప్రశ్నిస్తే, ‘‘అనుక్షణం కంటికి రెప్పలా కాపలా కాస్తున్నందున ప్రజలకు ఎటువంటి భయం అక్కరలేదనీ, యంత్రాంగం చాలా చక్కగా పనిచేస్తోంది’’ అని వారు చిరునవ్వుతో వివరించారు. వాస్తవానికి టెర్రరిస్టుల దగ్గర ఉన్నన్నిఆధునిక ఆయుధాలు వారి దగ్గర లేవు. వారిలోని దేశభక్తి, అకుంఠితదీక్ష, నిస్వార్థసేవ ఇవన్నీ టెర్రరిస్టులను ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి అని నాకు అనిపించింది. ఎంతోమంది పోలీసు అధికారులను కోల్పోయినా వీరిలో మాత్రం మొక్కవోని దీక్ష ఉంది. మరింత మందిని పోగొట్టుకోవడానికి వీరు సిద్ధంగా లే రని వారిని చూస్తే నాకు అనిపించింది.
ఏది ఏమయినా జరగవలసినదంతా కళ్ల ముందర జరిగిపోయింది. టెర్రరిస్టులు దర్జాగా, ఘరానాగా చేయవలసిన దంతా చేసేశారు. ప్రశాంతమైన, అమాయకమైన జీవనాన్ని సాగిస్తున్న మత్స్యకారులు హాయిగా ఉండవలసింది పోయి ఎన్నో నిబంధనలకు, కట్టడులకు లోబడి జీవించడం చూస్తే వీళ్ల జీవితాలు వలలో చిక్కిన చేపల మాదిరిగా ఉందే అని గుండె బరువుతో నిండిపోయింది.

(పదేళ్లనాడు ముంబై సందర్శించినప్పుడు రాసిన కథనం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాత్రల్లో జీవించిన గొప్ప నటుడు రమణారెడ్డి

పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ బ్రహ్మానందంహైదరాబాద్: తిక్కవరపు రమణారెడ్డి ఎన్నో పాత్రల్లో జీవించిన...

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...