స్వయంసిద్ధ…. సినీనటి రేఖ జీవిత చరిత్ర
(డాక్టర్ వైజయంతి పురాణపండ)
వెండి తెర మీద రంగులు వేసుకుని అందంగా కనిపించే కథానాయికల వెనుక ఎన్నో చీకట్లు ఉంటాయి. ఎన్నో కాటుక మరకలు ఉంటాయి. మరెన్నో పెనుగాలులు, సుడిగుండాలు, తుఫానులు.. ఉంటాయి.
సినిమా ఒక ఆకర్షణ శక్తి ఉన్న అయస్కాంతం.
ఎందరో అమ్మాయిలు ఆ అయస్కాంతానికి లోబడిపోతారు. అక్కడే తుప్పు పట్టిపోతారు, అక్కడే ఉక్కుముక్కలా తయారవుతారు, అక్కడే ఇనుపరజనులా పొడిపొడి అయిపోతారు.

అయినా
మళ్లీ మామూలే
ఆకర్షణ, తుప్పు, ఉక్కు, ఇనుపరజను…
అంతేనా అద్దాల మేడలో నిలబడి, అద్దం పగలకుండా జాగ్రత్తపడుతుంటారు.
ముళ్ల కంప మీద చీర పడినా, చిరిగిపోకుండా జాగ్రత్తపడతారు.
ఇదీ సినీ ప్రపంచంలో అమ్మాయిల జీవన విధానం.
అందులో హిందీ పరిశ్రమలో రేఖ జీవితం చాలా ప్రత్యేకం..

‘‘ఆమె తుఫానులా ప్రవేశించి, బాలీవుడ్ చిత్రపరిశ్రమలో కలకలం రేపింది. చిత్రసీమలో చిన్నారి రేఖ పోరాటం వివక్షతోనే ప్రారంభమైంది. లింగవివక్షను చూపే నిబంధనలను అప్రయత్నంగానే ఆమె సవాలు చేసింది. కఠోర పరిశ్రమతో ఉత్తమ నటిగా ఎదిగి, అలవోకగా మూస పద్ధతులను విచ్ఛిన్నం చేసింది. ఆమె ఉనికిని నిరసించిన సమాజంలోనే, తన శరీరాన్ని – వ్యక్తిత్వాన్ని ఏకకాలంలో అద్భుతంగా మలచుకొని, ఒక ఉన్నతమైన గుర్తింపును సాధించింది.
‘‘ముఖ్యంగా నేను స్త్రీని. దక్షిణాది భారత స్త్రీని. జీవితం ఆటుపోట్లు అనుభవించిన 64 ఏళ్ల సంప్రదాయ స్త్రీని. నాకు ఆడపిల్లలున్నారు. రేఖ జీవితం పట్ల, ఆమె బాల్యం పట్ల నాకు దుఃఖం సానుభూతి ఉన్నాయి. ఆమె కృషి, వ్యక్తిత్వం పట్ల గర్వం, అభిమానం ఉన్నాయి. ఎవరమూ మరొకరి జీవితాల మీద తీర్పులు చెప్పకూడదని నేను నమ్ముతాను. అల్లకల్లోలమైన పరిస్థితులలో రేఖ ఎలా నెగ్గుకొచ్చిందో మనం ఈ జీవిత చరిత్రలో తెలుసుకుంటాము. ఈ జీవిత కథ సినీ నటీనటులు కావాలనుకునేవారికి మాత్రమే కాక అమ్మాయిలకందరికీ ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందనటం అతిశయోక్తి కాదు. ఆ నమ్మకంతోనే ఈ పుస్తకం రూపుదిద్దుకుంది’’ అని ఈ పుస్తక అనువాద రచయిత శ్రీదేవి మురళీధరన్ స్వయంగా అన్ని మాటలివి.
‘‘ఒక మహిళ జీవిత చరిత్ర ఒక మహిళ రాస్తే అందులో ఆవిష్కృతమయ్యే అనుభూతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
రేఖ అన్నివిధాలా స్వయంసిద్ధ. స్వయంసిద్ధ అంటే ఎవరు. ఈమె తనకంటూ ఒక గుర్తింపు ఉన్న వ్యక్తి. స్వయంశక్తి గల మహిళే స్వయంసిద్ధ. భారతీయ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో రేఖ దిగ్గజంగా పరిగణించదగిన అత్యంత ప్రముఖ నటి. సాధారణత్వం నుండి గ్లామర్ శిఖరాగ్రం వరకు ఆమె చేసిన అసాధారణ ప్రయాణం సినీ పరిశ్రమలోనే గాక దాని వెలుపల కూడా ఎందరికో స్ఫూర్తినిచ్చింది’’ అంటున్నారు రచయిత్రి.

ఇందులో
జీవనరేఖలో మొత్తం 27 విభాగాలున్నాయి. అంటే మన తారలు లేదా నక్షత్రాలన్నమాట. రేఖ అనే సినీతార జీవితం 27 నక్షత్ర విభాగాలతో విభాజ్యమైంది.
రేఖ ఎంతోమందితో ప్రేమాయణం నడిపింది, ఎంతోమందిని వివాహం చేసుకుంది, వారి నుండి విడాకులు తీసుకుంది. కాని ధైర్యంగా నిలబడింది. తనను ఉన్నతస్థానంలో నిలబెట్టుకుంది.
‘‘బొంబాయి ఒక కీకారణ్యం లాంటిది. నేనేమో ఏమీ తెలియకుండా నిరాయుధంగా అడుగుపెట్టాను. నా జీవితంలోని అత్యంత భయానక దశల్లో ఇది ఒకటి… నా అమాయకత్వాన్ని, నిస్సహాయతను ఉపయోగించుకునే ప్రయత్నం జరిగింది, ఉపయోగించుకున్నారు కూడా…’’ అని రేఖ తన గురించి అనుకున్న విషయాన్ని ఈ పుస్తకంలో మనం చదవచ్చు.
సాధారణంగా సినిమాలో ప్రవేశించిన ఇటువంటి ఆడపిల్లలకు తండ్రి ప్రేమ ఎండమావి. అయినా రేఖ మాత్రం అలా అనట్లేదు. ‘‘మా నాన్నతో నాది ఎంతో సంతోషకరమైన బాంధవ్యం. నేను పోగొట్టుకున్నదంతా తిరిగి పొందాను. మా అమ్మ చనిపోయినప్పుడు, ఆయనను కలుసుకున్నాను. అయితే నేను ఆయనను ఎప్పుడూ నిజంగా పోగొట్టుకోలేదు. మాట్లాడకపోయినా, దగ్గర లేకపోయినా, ఆయన ఉనికి మా ఊహల్లో, మనసులో నిరంతరం ఉంది’’ అంటూ సిమీ గరేవాల్ షోలో రేఖ అన్నమాటలివి.
చాలామంది ఆడపిల్లలు సినీ రంగంలోకి ప్రవేశించడానికి ముఖ్య కారణంగా కుటుంబ ఆర్థికపరిస్థితులే కారణమని చెబుతుంటారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ మాటే చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాల్లోకి వచ్చానన్నారు. లేదంటే హాయిగా వివాహం చేసుకుని, కుటుంబం చూసుకుంటూ ఉండేదాన్ని అని చెప్పారు. రేఖ జీవితం కూడా అంతే. ‘‘పతనావస్థలో ఆ కుటుంబం సుడిగాలిలో నావలాగా ఊగిసలాడుతున్న సమయంలో, 1968 సంవత్సరంలో ఒక రాత్రి భానురేఖ అనే పద్నాలుగేళ్ల అమ్మాయి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఒక ఉత్తరం రాసింది. ఆమె పరీక్షల్లో మళ్లీ తప్పింది. ఇంటా, బయటా, జీవితంలో ఏ ఆశ, ఏ సంతోషం కనుచూపు మేరలో కనిపించలేదు. ఇక జీవించటం అనవసరం అనిపించి, ఆత్మహత్య చేసుకోదలచింది. గంటల తరబడి ప్రయత్నించి, డాక్టర్లు ఆమెను బతికించగలిగారు. ఆస్పత్రిలో కళ్లు తెరిచి చూసేసరికి, ఆ అమ్మాయికి తన తల్లి పుష్పవల్లి కన్నీళ్లతో నిలబడి కనిపించింది. తల్లీకూతుళ్లు మనసు విప్పి మాట్లాడుకున్నారు. జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నావని భానురేఖను అడిగింది పుష్పవల్లి. చేసుకుంటానంటే పెళ్లి చేస్తానంది. ఆసక్తి ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. నాట్యశిక్షణ పొందుతున్నది కాబట్టి భానురేఖ సినీ ప్రపంచంలోకి పూర్తిస్థాయిలోకి ప్రవేశించవచ్చు. శిథిలమవుతున్న పుష్పవల్లి ఇంటికి ఆ చిన్నపిల్ల ఆశాకిరణం. భానురేఖ అయిష్టంగానే సినీ మాయాప్రపంచంలో భాగం కావలసి వచ్చింది’’ అని రేఖ జీవితచరిత్ర చెబుతోంది.

కొన్ని దశాబ్దాల క్రిందట రావూరి భరద్వాజ రచించిన ‘పాకుడు రాళ్లు’ పుస్తకం వచ్చిందని గుర్తుండే ఉంటుంది. ఎన్ని ఏళ్లు గడిచినా సినీ రంగంలోకి ప్రవేశించాలనుకునే ఆడపిల్లల పరిస్థితిలో ఏ మార్పూ రావట్లేదు. ఒక తారలా మెరిసిపోవాలనే వారి కలను వాస్తవం చేసుకోవాలనే ఆశ వారిని మౌనవతులుగా చేస్తోంది.
రేఖ అందుకు భిన్నం కాదు.
రేఖ అందుకు అతీతురాలు కాదు.
రేఖ అందుకు ఏ మాత్రం నిషేధము కాదు.
అయినా
రేఖ
ఒక పోరాట యోధురాలు.
ఒక మార్గనిర్దేశకురాలు.
ఒక అలుపెరుగని అవిశ్రాంత జీవి.
ఒక స్వయం సిద్ధ.
శ్రీదేవీ మురళీధరన్ కలం నుండి అనువదింపబడిన ‘స్వయంసిద్ధ’ పుస్తకం ఆడపిల్లలు స్వయంసిద్ధగా ఎదగడానికి ఉపకరించే మంచి పుస్తకం.
భారతకాలం నాడు ద్రౌపది ఒంటరి పోరాటం చేసి, స్వయంసిద్ధగా నిలిచింది.
ఆడపిల్లలు ఇలా యోధులుగా ఉండాలని నేర్పిన పాత్ర ద్రౌపది.
ఈ యుగంలో రేఖ కూడా అంతేనేమో.
For Copies:
