ప్రధాని ప్రసంగ సారాంశం ఇదే!!
5 రాష్ట్రాల ఎన్నికలకు తప్పిన వైరస్ సాకు
మోడీకి సాటి రాగల నేత బీజేపీలో కరవు
అదే జమిలి ఎన్నికలకు అసలైన అడ్డు
(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదం ఇప్పట్లో సాధ్యపడేలా కనిపించడం లేదు. ఒకే దేశం ఒకే పన్నులాంటి కీలకమైన నిర్ణయాలను రాజకీయ చతురతతో సాధించిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది సవాలుగానే కనిపిస్తోంది. ప్రధాని మోడీ తాజాగా దేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారనగానే… అందరి దృష్టీ రెండు అంశాలపైనే కేంద్రీకృతమయ్యాయి. మొదటిది ఈ నెల 31, జనవరి 1 తేదీలలో సంపూర్ణ లాక్ డౌన్, రెండోది ఒమిక్రాన్ వైరస్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల వాయిదా! ఆశ్చర్యకరంగా మోడీ ఈ రెండు అంశాలనూ ప్రస్తావించలేదు. ఒమిక్రాన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కరోనా వారియర్స్‌కు బూస్టర్ డోస్ గురించి చెప్పారు. 15-18 ఏళ్ళ మధ్య వారికి వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 60ఏళ్ళు పైబడిన వారికీ వైద్యుల సలహాపై బూస్టర్ డోస్ ఇస్తామన్నారు. డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ కాకుండా నాసల్ వ్యాక్సిన్ గురించీ మాట్లాడారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనాను ఇంతవరకూ ఎలా అదుపు చేసిందీ చెప్పుకొచ్చారు. అక్కడితో ఆ ప్రసంగం ముగిసింది. ఎన్నికలను వాయిదా వేస్తారేమో, ఆందోళనకు దిగుదామనుకున్న ప్రతిపక్షాల ఆశలు అడియాశలయ్యాయి. వాస్తవానికి బీజేపీ పరిస్థితి అంత ప్రోత్సాహకరంగా లేదు. కానీ ప్రతిపక్షాల అనైక్యత దానికి కలిసి వస్తోంది. ముందు ఈ 5 రాష్ట్రాలలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలననే నమ్మకంతో బీజేపీ ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని తిరిగి సాధించడం పార్టీ లక్ష్యం. జమిలి ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చనేది దాని ఉద్దేశం. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉంది కాబట్టి, జమిలి దిశగా బీజేపీ అడుగులు వేయడం లేదు. బీజేపీని సమర్థించే కొన్ని రాష్ట్రాలలో కూడా పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ఇటీవలి కాలంలో కాశ్మీర్ లోయలో తీవ్రవాదులు మళ్ళీ విజృంభిస్తున్నారు. పదుల సంఖ్యలో సైనికులు అమరులవుతున్నారు. కొద్ది రోజుల క్రితం హెలికాప్టర్ కూలిన సంఘటనలో చీప్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, భార్య సహా 14మంది సైనికాధికారులు పా్రాణాలు కోల్పోయారు. చైనాతో ముప్పు ఎటూ ఉండనే ఉంది. చైనాతో సంభవించిన ఘర్షణలోనూ పదుల సంఖ్యలో భారత సైనికులు అమరులయ్యారు. అంటే అంతర్జాతీయంగానూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో జమిలి ఎన్నికలకు దిగే సాహసం చేయకూడదనేది బీజేపీ భావనగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.
బీజేపీకి ఇప్పుడు మరో చిక్కు కూడా ఎదురైంది. అది నరేంద్ర మోడీ వయసు. ఇప్పుడాయనకు 71 సంవత్సరాలు. మరో నాలుగేళ్ళలో 75కు చేరతారు. అంటే అధికారానికి దూరమవుతారు. ఈలోగా కొత్త ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలి. ఆ అభ్యర్థి కూడా మోడీ ధీటైన వాడు కావాలి. మాటకారితనం, ఆకర్షణ, సమయస్ఫూర్తిలో బీజేపీలో మోడీ సాటి రాగలవారెవరూ లేరు. 2024 ఎన్నికల నాటికి మోడీకి 74 సంవత్సరాలు వస్తాయి. మళ్ళీ ఆయననే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటే పార్టీలో వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముంది. అంటే వచ్చే ఎన్నికలలోగా ఆ లోటును అధిగమించాలి. ఒకవేళ వచ్చే ఎన్నికలలోనూ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి, అధికారంలోకి వస్తే, ఆయన 2026 నాటికి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అమిత్ షా లాంటి మంత్రాంగం నడపగల నేతలు ఎందరో బీజేపీలో ఉన్నారు. కానీ, వాగ్ధాటి, ఆకర్షణ శక్తి ఉన్న వారు కనిపించరు. ఇదే బీజేపీకి అసలు సమస్య. ఈలోగానే ఆరెస్సెస్ తగిన అభ్యర్థిని అన్వేషించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని ఇప్పటికే ఆరెస్సెస్ పెద్దలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ మాదిరిగా వారసత్వ ఆనవాయితీ బీజేపీకి లేదు. ఒక్క సిందియా కుటుంబంలోనే ఆ అలవాటు కనిపిస్తోంది. ఇప్పుడు సిందియా కూడా బీజేపీలోనే ఉన్నారు. దక్షిణాదిన సమర్థులైన నాయకులే బీజేపీకి లేరు.
ఎన్నో ఏళ్ళుగా దక్షిణాదిలో ఒక నాయకుడిగా కోసం పార్టీ అన్వేషిస్తూనే ఉంది. ఒక్క కర్ణాటకలో తప్ప ఇంతవరకూ బీజేపీకి చోటు చిక్కలేదు. ఏపీలో మాత్రం టీడీపీ పంచన చేరి, అధికారాన్ని అనుభవించింది. బీజేపీ అవసరం టీడీపీ కూడా అంతే ఉండడంతో ఆ అవకాశం దక్కింది. తమిళనాడులో అన్నాడీఎంకేను అడ్డం పెట్టుకుని చక్రం తిప్పాలన్న ప్రయత్నం కాషాయ పార్టీకి ఫలించలేదు. ఏపీలో ముఖ్యమంత్రిపై ఉన్న కేసులు బీజేపీకి వరమే. కానీ అది అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువే. ఉత్తరాదిన కూడా పట్టుకోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కిందటి ఎన్నికలలో సర్జికల్ స్ట్రైక్స్ కలిసొచ్చాయి. ఓటర్లు ఆ పార్టీకి నేరుగా పట్టం కట్టారు. అయినప్పటికీ పార్టీ మిత్రులను వదులుకోలేదు. సైద్ధాంతిక విభేదాలతో శివసేన బీజేపీకి దూరమైంది. పంజాబ్, హర్యానాల రైతాంగం వ్యవసాయ చట్టాలపై పట్టిన పట్టుతో మోడీ వెనకడుగు వేయడమే కాకుండా రైతాంగానికి క్షమాపణ చెప్పారు. వెనకడుగు వేసినంత మాత్రాన రైతుల విశ్వసనీయత చూరగొంటారన్న నమ్మకమైతే లేదు. అదుపు తప్పిన పెట్రోలు ధరలు, ఇతర అంశాలు బీజేపీ పట్ల వ్యతిరేకతను పెంచాయి. ఇన్ని వ్యతిరేకతల నడుమ జమిలి ఎన్నికలకు వెళ్ళడం అంత అనాలోచిత చర్య వేరొకటి ఉండదని బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుందన్న సామెతను గుర్తుచేసుకుని, సమయం కోసం వేచి చూడాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.