రజనీతో బంధం ఇగిరిపోని గంధం

Date:

వారం వారం ఘంటసాల స్మృతిపథం-2
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)


‘ఈ లేఖ తెస్తున్న కుర్రవాడు సంగీతాన్ని అభ్యసించాడు. ఏ మాత్రం వీలున్నా రేడియోలో పాడించే అవకాశం కల్పించగలరు’ అని సినీగీత భీష్మాచార్యులు సముద్రాల రాఘవాచార్యులు గారు  మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్వహణాధికారి బాలాంత్రపు రజనీకాంతరావు గారికి సిఫారసు లేఖ రాసి పంపారు. ఆ యువకుడే  అనంతర కాలంలో లలిత సంగీత, సినీనేపథ్య రంగంలో త్రివిక్రమునిగా అల‌రారిన‌ ఘంటసాల వేంకటేశ్వరరావు. వేంకటపార్వతీశ్వర కవులలో ఒకరైన  బాలాంత్రపు వెంకటరావు గారి తనయుడు రజనీ రచయిత, వాగ్గేయ కారుడు, స్వరకర్త. తొలినాళ్లలో ఆకాశవాణి పేరు  చెప్పగనే  మొదటిగా స్ఫురించే వ్యక్తి. ఆ మాధ్యమాన్ని జనరంజకం చేసిన తొలి తరం వారిలో ముందు వరుసలో ఉంటారు. ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించేవారు. ఇక తెలుగు సినీ  నేపథ్యగాన‌ ప్రక్రియను జగద్విఖ్యాతం చేసిన గాయకుడు ఘంటసాల.


తండ్రీ తనయుల్లాంటి అనుబంధం
బాలాంత్రపు, ఘంటసాలది అధికారి ఆశ్రితుల సంబంధానికి అతీతమైనది. వారిద్దరి మధ్య వయోభేదం కేవలం రెండేళ్లే అయినా ఘంటసాల గారు ఆయనను పితృభావంతో మన్నించే వారు. ‘నాన్నగారు’ అని సంభావించే వారు. రజనీ గారు వృత్తిపరంగా మార్గదర్శి ‘చలనచిత్రసీమలో నేపథ్య గాయకుడిగా నిలదొక్కుకోక ముందు రేడియోలో పాడేందుకు అనేక అవకాశాలు కల్పించి నా జీవనానికి సహకరించారు’ అని  వినమ్రంగా   చెప్పేవారు.
‘ఘంటసాల కంఠబలాన్ని మొదటిసారిగా ఆకాశవాణి ద్వారా  వినిపించాను. స్వశక్తితో  అఖండ కీర్తి సంపాదించడం  కనులారా చూశాను. వినూత్న పద్ధతిలో తన  గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగించారు. నేపథ్యగాన ప్ర‌క్రియకు నూతన ఒరవడి పెట్టారు. లలిత సంగీతానికి అంతకంతకు ఎంతో సేవ చేయవలసిన వారు మధ్య వయసులోనే నిష్క్రమించడం కలచివేసిన సన్నివేశం. ఔత్సాహిక కళా కారులను  ప్రోత్సహించడం ఆకాశవాణి లక్ష్యం. ఆ తీరులోనే నా వంతు సాయం చేశాను. అటు పూజ్యులు  సముద్రాల గారి ‘మాటదన్ను’ఉండనే ఉంది. ఆచార్యులవారంతటి వారు సిఫారసు చేశారంటే  ఆయనలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే నేను ఘంటసాలను ఆకాశవాణి  శ్రోతలకు పరిచయం చేశాను అనడం కంటే ఆయన కీర్తిపతాక ఎగురుతున్నంత దాకా నా ప్రస్థావన ఉండడం నా భాగ్యం’ అని  ఘంటసాల గారితో గల అనుబంధాన్ని  రజని గారు  గ‌తంలో ఈ వ్యాసకర్తకు వివరించారు.
సినీ గాయకుడిగా విఖ్యాతులైన తరువాత కూడా ఘంటసాల రేడియోలో పాడేవారు. ఆ క్రమంలోనే  పాడేందుకు ఒకసారి ముందుగానే సమాచారం అందుకుని, అంగీకారం కూడా తెలిపారు. కారణాంతరాల వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అప్పటికి ఆయనకున్న స్థాయినిబట్టి దానికి చిన్నపాటి వివరణతో సరిపెట్టుకోవచ్చు. తన గైర్హాజరీకి పశ్చాత్తాపపూర్వక సంజాయిషీ లేఖ రాశారు. అది ఆయన సంస్కారమనీ, వినయం ఆయన సొంతమనీ, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే దానికి నిలువెత్తు నిదర్శనమనీ రజనీ గారు గుర్తు చేసేవారు. ఘంటసాల గానం చేసిన  ‘లైలా విశ్వరూపం’ రేడియో నాటకం లోనిదే. ఆ తర్వాత రజనీగారి అనుమతితో రికార్డుగా విడుదల చేయించారు.

సంగీత దర్శకత్వ అవకాశం
చలన చిత్రాలకు స్వరాలు సమకూర్చడంలో తాను సహకరించిన ‘స్వర్గసీమ’లో ఘంటసాల గాయకుడిగా గొంతుసవరించుకుంటే, ‘లక్ష్మమ్మ’కు తాను రాసిన గీతాలకు ఘంటసాల బాణీలు కట్టడాన్ని (సంగీత దర్శకత్వం) రజనీ గారు మురిపెంగా చెప్పేవారు. రజనీ గారు ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల ఇతర (మారు)పేర్లతో సినిమాలకు మాటలు, పాటలు, సంగీతం సమకూర్చే వారు (రేడియోలో పనిచేసే వారు ఇతర సంస్థలకు సేవలందించరాదనే నిబంధన ఉండేది. సంబంధిత అధికారులకు ముందుగా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందగలిగితేనే అలా పనిచేయవచ్చు. అప్పట్లో  అదంత సులువు కాదు). ఆ పద్ధతిలోనే ‘లక్ష్మమ్మ’కూ పాటలు రాశారు. సంగీతం దగ్గరకు వచ్చేసరికి తనకు సహకరించిన ఘంటసాల పేరు వేశారు. ‘పాటలకు తాను వరుసలు కట్టినా, వాటిని సినిమాకు తగ్గట్టుగా  ఘంటసాల మరింత మెరుగు పెట్టారు. పైగా వర్ధమాన కళాకారుడు. నేను రేడియో ఉద్యోగానికి అంకిత‌మయ్యాను.అతను సినిమా రంగంలో పైకి రావలసిన వాడు. మేము (నిర్మాత కృష్ణవేణి కూడా) అవకాశం ఇచ్చామనేకంటే ఆతని శ్రద్ధాస‌క్తులు  పనిచేశాయనడం సబబు. సంగీత దర్శ కుడిగా ఆయనకు ‘లక్షమ్మ’ తొలి చిత్రం అయినా  ‘కీలు గుర్రం’ మొదట విడుద లైందని చెప్పారు. జనబాహుళ్యంలో బాగా ప్రచారంలో ఉన్న నిజజీవిత కథతో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి నాయకా నాయికలుగా నిర్మితమైన ‘లక్షమ్మ కథ’  చిత్రం, తమ చిత్ర నిర్మాణం ఒకరోజు ప్రారంభమై, ఒకే రోజు విడుదలయ్యాయని, అంత పోటీలోనూ తమ చిత్రం విజయవంతమైందని, రజనీ, ఘంటసాల గార్ల సాహిత్య సంగీతాలు అందుకు సహకరించాయని నటి, నిర్మాత కృష్ణవేణి పేర్కొన్నారు.
‘మాదీ స్వతంత్ర దేశం….
రజనీ గారి స్వీయ రచన ‘మాదీ స్వతంత్ర దేశం-మాదీ స్వతంత్ర జాతి….’ గీతాన్ని  గాయని టంగుటూరి సూర్యకుమారి దేశానికి  స్వాతంత్య్రం  సిద్ధించిన నాడు పాడారు. పార్లమెంట్‌లో  పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం పూర్తయిన వెంటనే  ఈ గీతం ప్రసారమైంది. దేశానికి స్వరాజ్యం వచ్చాక ప్రసారమైన తొలి భక్తిగీతంగా నిలిచిపోయింది. స్వరాజ్య సమరంలో పాల్గొని పాటలు, పద్యాలు పాడి జైలు జీవితం అనుభవించిన ఘంటసాల ఆనాటి కార్యక్రమంలో ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా  నిలిచారట. (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

ghantasala karunasri
ghantasala karunasri

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: A battle between individuals

(Dr Pentapati Pullarao) Maharashtra is the second largest and richest...

Hurricane claims 50 lives in Florida

Washington: At least 50 people were killed, many injured,...

మన మౌనం ధర్మ వినాశనానికి దారివ్వకూడదు: పవన్ కళ్యాణ్

విజయవాడ, సెప్టెంబర్ 24 : తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన...

తిరుపతి లడ్డు వివాదం ..సమాధానం చెప్పవలసింది ఎవరు?

అపరిమిత అధికారాలిచ్చిన ఫలితం ఇది…(శివ రాచర్ల)సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు....