మధుర గళాలు … తెలుగు వచో వైభవాలు

Date:

(డా. పురాణపండ వైజయంతి)

నారదుడు స్వర్గలోకంలో తన మహతి మీద వేదాలు మీటుతూ బ్రహ్మ దేవునికి ఆనందం కలిగిస్తున్నాడు. వ్యాసవిరచిత సహస్రనామాలను విష్ణుమూర్తి దగ్గర వల్లిస్తున్నాడు. శంకరాచార్య విరచిత స్తోత్రాలను శివుని గరళాన్ని చల్లబరిచేలా వినిపిస్తున్నాడు. ముక్కోటి దేవతలకు తన గంధర్వ గాత్రంతో ముల్లోకాలలోని సమాచారాన్ని శ్రావ్యంగా, మరింత కర్ణపేయంగా అందచేస్తున్నాడు. తన గాత్రంతో త్రిమూర్తులను సంతుష్టుడిని చేయటం నారదుడి నిత్యకృత్యం.
ఇలా ఉండగా –


ఒకనాడు
నూతనంగా అక్కడకు విచ్చేసిన త్రిమూర్తులు కనిపించారు నారదుడికి. ఒక సినీసంగీతకారుడు సినీ సంగీతాన్ని తన అమృత స్వరంతో శ్రోతల హృదయాలకు ఆశ్వాసన కలిగిస్తున్నాడు. తన గంధర్వగానంతో ప్రేక్షకుల కంట తడిపెట్టిస్తున్నాడు, మనసును ఆర్ద్ర పరుస్తున్నాడు. అంతేనా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు పలికిన భగవద్గీతను అజరామరం చేస్తున్నాడు. ఒకడు విరించిలా శ్రీరామశ్రీకృష్ణుల గాథను ఝరీ వేగంతో, జలద గంభీర గళంతో వినిపిస్తున్నాడు. మరొకడు గంధర్వ, తుంబురాది సంగీతకారులను మించిన స్వరజ్ఞానంతో, ఉచ్చైశ్రవంలా కర్ణాటక సంగీతాన్ని కర్ణపేయంగా వినిపిస్తున్నాడు. వారిని చూసి అవాక్కయ్యాడు నారదుడు.
‘‘నాకు మా త్రిమూర్తులు బాగా తెలుసు. తరవాతి కాలంలో కవిత్రయం అయిన నన్నయ, తిక్కన, ఎర్రన తెలుసు. ఆ పిదప సంగీత త్రిమూర్తులయిన ముత్తుస్వామి దీక్షితులు, త్యాగయ్య, శ్యామశాస్త్రి తెలుసు. ఈ త్రిమూర్తులు ఎవరో తెలియట్లేదు. వీరి గురించి సంపూర్ణంగా పరిశీలించాలి’’ అనుకుంటున్నాడు.
అప్పటికే …
త్రిమూర్తులు
కవిత్రయం
సంగీత త్రిమూర్తులు
గంధర్వులు
వ్యాసవాల్మీకులు
పలువురు పెద్దలతో పాటు దేవతా సమూహం… అక్కడికి చేరి, సంభాషించుకుంటున్నారు.
నారదుడు ఓ పక్కగా నిలబడి, వారి సంభాషణను సునిశితంగా వింటున్నాడు.


‘‘ఓ వాణీ! నీ వీణా నాదం కంటె మధురమైన గళం ఈ ఘంటసాల మనకు వినిపిస్తున్నాడు. ఓయీ! గంధర్వా! నీ పేరును ఆయనకు చేర్చి, అపర గంధర్వగానం అంటున్నారు. వింటున్నావా. ఆయన ఆవేదనతో పాడే విలాప గీతాలు వింటుంటే నా గుండె ద్రవిస్తోంది. సంగీత విద్వాంసులను మించిన సంగీత సాధన చేసిన కంఠస్వరం అది. అందుకే చలనచిత్ర గీతాలకు సంగీతస్థాయిని తీసుకువచ్చాడు’’ అని ప్రశంసిస్తుండగా, పాదచారిౖయె సాధారణ వేషధారణలో అక్కడకు వేంచేశాడు శ్రీవెంకటేశ్వరుడు, ఘంటసాల ముందు ప్రేమగా రెండు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అది చూసిన ఆ విధాత.. ‘‘శేషశైలావాసా! శ్రీవెంకటేశా!’ అంటూ ఆ ఘంటసాల ఆలపించిన గీతంతో నువ్వు ఎంత మురిసిముగ్ధుడయ్యావో నాకు తెలుసు. ఆ ఒక్కటే కాదు, నీ మీద ఎన్ని పాటలు పాడాడో. వాటన్నిటికీ ఆ గళంతో కీర్తనల స్థాయిని తీసుకువచ్చాడు. ఏడుకొండల వాడా ఎక్కడున్నావయ్యా… అంటుంటే, శిలలా ఉండే నువ్వు ద్రవించిపోయావు. ఆయన గళంలో అమృతాన్ని నింపుతుంటే.. దానిని మించిన ఔషధమేదో ఆ గొంతులో ఆ అమృతాన్ని వెనక్కి తోసేసింది. ‘నమో వెంకటేశా! నమో తిరుమలేశా!’ ‘ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా!’ అబ్బో… ఎన్నని వివరించగలం. అంటూ పరవశంతో విరించి పలుకుతుంటే…

అక్కడకు శంకరి, శారదాదేవి.. ఒకరేమిటి ముక్కోటి దేవతలు ఒక్కటై ఏతెంచారు. సరస్వతీదేవి పరవశించిపోతోంది. అప్పుడు ఆ వాణీనాథుడు…‘అయ్యా, మహానుభావా, నువ్వు పాడుతుంటే, నీ గానానికి మా వాణి వీణానాదం అందించాలనుంది, ఆవిడ కోసం కొన్ని కీర్తన ఆలపించు. శివశంకరీ శివానందలహరీ, మది శారదాదేవి మందిరమే, రసికరాజ తగువారము కామా… వంటి శాస్త్రీయ సంగీత గీతాలతో ఆ శారద మదికి ఆనందం కలిగించవయ్యా. భూలోకంలో ఎలాగూ రాళ్లను కరిగించావు’ అంటూ ప్రేమగా, లాలనగా ఘంటసాలను ముద్దాడాడు. పరవశంతో ఘంటసాల గానం చేస్తుంటే, స్వర్గలోకమంతా తలలూపుతూ, మైమరచిపోయింది. మళ్లీ విరించి తన చతుర్ముఖాలతో… బొమ్మను చేసి ప్రాణం పోసి, రానిక నీ కోసం చెలీ, కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, జగమే మాయ, చందురుని మించు అందమొలికించు, కనుపాప కరవైన… అంటూ నువ్వు ఆ పాటలను నీ గొంతులో పలికించిన విషాదానికి చమర్చని చక్షువులు ఉంటాయా. ఏమి గొంతయ్యా నీది. మమ్మల్ని ఆనందింపచేయడానికా అన్నట్లుగా, అల్పాయుష్కుడై, చాలా తొందరగానే మా దగ్గరకు వచ్చేశావు’ అంటున్నాడు విధాత.

ఆ సుందర దృశ్యం చూస్తున్న పెండ్యాల, ఎస్‌. రాజేశ్వరరావు, సత్యం, సుసర్ల వంటి సంగీత దర్శకులంతా ముక్త కంఠంతో, ‘ఈ మహానుభావుడి కారణంగానే మేం సమకూర్చిన సంగీతానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ మహానుభావుడి గళంలో ఆ పాటలన్నీ శాశ్వతత్వాన్ని సంతరించుకున్నాయి’ అన్నారు. శ్రీశ్రీ, దాశరథి, దేవులపల్లి, మల్లాది, సముద్రాల.. ‘మా అక్షరాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. ప్రతి అక్షరాన్ని అర్థయుక్తంగా ఆలపించి, మాకు కూడా కీర్తిప్రతిష్ఠలు తీసుకువచ్చాడు…’’ అని ప్రశంసిస్తున్నారు. మురిపెంగా ముడుచుకుపోయాడు ఘంటసాల. బ్రహ్మదేవుని పాదాలకు వినయంగా శిరసు వంచి నమస్కరించాడు. సంగీతదర్శకులు, రచయితలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు ఘంటసాలను తన దక్షిణాంకం మీద కూర్చోపెట్టుకున్నాడు.
–––––––––––––––––––––––––––––––––––
ఇక ఆ పక్కన ఉన్న వ్యక్తి మీదకు దృష్టి సారించి, వాల్మీకిని చూస్తూ ఇలా పలుకుతున్నాడు విధాత…
‘ఏమయ్యా వాల్మీకీ! నువ్వేనా ఈ రామాయణం రచించినది. నీ రామకథ వాడి గళంలో ఎంత తియ్యగా ఉందో. చెరకు పానకం, ద్రాక్ష పాకం, నారికేళం… అన్నీ కలిసి వాడి గొంతులో తిష్ఠ వేసుకుని కూర్చున్నట్లుంది ఆ కంఠం వింటుంటే. ఎంత తియ్యగా చెబుతున్నాడో రామకథను. ఏ పదాన్ని, ఏ అక్షరాన్ని ఎంత పలకాలో అంతే పలుకుతూ, అంతే అందంగా అక్షరీకరించి, నీ రామాయణాన్ని లక్షల మంది ప్రజల ఇళ్లలోకి తీసుకువెళ్లాడు ఈ బాలుడు. భగవద్దత్తంగా వచ్చిన కంఠాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడో, ఆ కంఠంలో నిజాయితీ, ఆ పలుకులో సూటిదనం… ఇతగాడి గురించి ఏమనాలో తెలియడం లేదు. నీ సుందరకాండ లక్ష్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని, యువతను ఉత్తేజపరుస్తున్నాడు. హనుమంతుని వెంట నడుస్తుంటే, ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉంటారని జాతిని జాగృతం చేస్తున్నాడు. అందుకేనేమో వాడిని ‘ఆంధ్ర వాల్మీకి’, ‘రేడియో వ్యాసుడు’ అని ప్రజలు ప్రస్తుతించారు. వీడికి ఎవరు ఏ బిరుదు ఇచ్చినా తిరస్కరించాడు.

అందుకు కారణం కూడా ఇలా చెప్పాడు…‘వాల్మీకి, వాస్యుడు.. వీరికి మించిన కావ్యాలు రచించితే అప్పుడు బిరుదులు స్వీకరిస్తాను’ అని. మీరంటే వాడికి ఎంత ప్రాణమో. నీ రాముడిని, నీ సీతని, నీ హనుమని, నీ సుగ్రీవుడిని, నీ దశరథుడిని, నీ జనకుడిని… ఒకరనేమిటి నీ కలం నుండి జాలువారిన ప్రతి పాత్రను తన తల మీద పెట్టుకుని, కాపాడాడు. ఆ కారణజన్ముడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ధన్యులయ్యారు. తెలుగు జాతి చేసుకున్న అదృష్టం కొద్దీ వీడు ఇక్కడ మానవ రూపంలో పుట్టిన మహనీయుడు. నువ్వు రచించిన రామాయణ మహేతిహాసానికి మహోత్కృష్ట స్థానం కల్పించాడు… అని ఆ పక్కనే ఉన్న వ్యాసుని దిశగా తన శిరస్సును మరల్చాడు విధాత. ‘లక్ష శ్లోకాల భారతం రాసిన నువ్వు, వాడిని పొగడటానికి పదాలు వెతుక్కోవలసి వస్తోందంటే ఆశ్చర్యంగా ఉంది’ అని ఆనంద పారవశ్యంతో పలుకుతున్నాడు. ‘మహర్షీ! ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలి. వాడు నీ సుందరకాండకు తన మనసులో సుస్థిర స్థానం కల్పించాడు. ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. సమయపాలన వాడి ఆత్మ. అందుకే వాడి వాణి ఆకాశవాణి నుండి వాయురూపంలో మనలను చేరుతున్న సమయంలో నేను కూడా ఆ వాణిని ఆస్వాదించాను’’ అంటూ ఉషశ్రీని ముద్దులాడుతూ…


‘వ్యాసమహర్షీ! నీ భారత భాగవతాలను కరతలామలకం చేసేసుకున్నాడు వీడు. పాతికేళ్లు నిండకుండానే నీ సంస్కృత భారతాన్ని తండ్రి సహకారంతో ఆంధ్రీకరించాడు ఈ బుడతడు. నువ్వు ఏ లక్ష్యంతో భారత రచన చేశావో, ఆ లక్ష్యం పక్కదారి పట్టకుండా, చాదస్తాలు లేకుండా, వాడి తరానికి చేరేలా ఎంత గొప్ప ఉపమానాలతో చెబుతున్నాడో. నీ కృష్ణుడు, నీ భీష్ముడు, నీ ధర్మరాజు, నీ ద్రౌపది, నీ కుంతి, నీ కర్ణుడు, నీ ద్రోణుడు… నువ్వు రచంచిన లక్ష శ్లోకాల భారతంలోని ప్రతి పాత్ర ఔచిత్యాన్ని ఎంత శ్రద్ధగా సామాన్యులకు చేరవేస్తున్నాడో. తిక్కన శైలిని అందిపుచ్చుకుని, శ్రోతలకు కళ్లకు కట్టినట్లు వినిపించాడు జయ కావ్యాన్ని. ఉద్యోగపర్వంలోని రాయబారాలను ఎంత చక్కగా విశ్లేషించాడో. భారతాన్ని పక్కదారి పట్టించేవాళ్లకు సింహస్వప్నంలా నిలబడి, తన గంభీర జలదస్వర శరాలు సంధించాడు. మహర్షులారా! మీరు వేల సంవత్సరాల క్రితం రచించిన ఈ రెండు ఇతిహాసాలు నేటికీ సజీవంగా ఉండటానికి ఈ చిరంజీవి మీ ఇద్దరినీ తన చెరో భుజం మీద కూర్చోపెట్టుకుని ఒంటరిగా మోసాడు. ఆ బాధ్యతను ఒక తపస్సులా భావించి, మీకు సాష్టాంగ వందనం చేస్తూనే ఉన్నాడు.

ఆకాశవాణì ద్వారా తెలుగునాట ఇంటింటినీ నైమిశ తపోవనంగా మార్చేశాడు.. అంటూ విధాత పరవశించిపోతుండగా… క్రీగంట గమనిస్తున్న శ్రీరామచంద్రుడు.. తన చెంతనున్న జానకితో, ‘జానకీ! వారి మాటలు విన్నావుగా! వారందరి కంటె నేను పరమానంద భరితుడనవుతున్నాను. ప్రతి సంవత్సరం భద్రాచలంలో జరిగే నా కల్యాణాన్ని తన ఆప్యాయసర్వరంతో లక్షలమందికి ఇంటి దగ్గరే కల్యాణం జరుగుతున్న అనుభూతిని కలిగించాడు. నా పెళ్లికి నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు కానీ, నా పెళ్లికి పౌరోహిత్యం వహించి, తన మనసుకి కావలసిన విధంగా హృద్యంగా నడిపించాడు. నా చేత నీకు మూడు ముళ్లు వేయించాడు. నా చేతిలోని ముత్యాల తలంబ్రాలను నీలి రంగులోకి మార్చాడు. నిన్ను సిగ్గుపడమన్నాడు. ఆ మాటలను తలచుకుంటున్నప్పుడల్లా, నువ్వు సిగ్గులమొగ్గ అయిపోతుంటావు. నిన్ను అలా చూస్తూ నేను పరవశంతో మురిసిపోతుంటాను. నువ్వు ఇంతగా సిగ్గు పడటం, ఇంతగా మురిసిపోవటం, ఇంతగా పరవశమైపోవటం అంతకు మునుపెన్నడూ చూడలేదు నేను. నా కల్యాణ ఘట్టం ధన్యమైంది అనిపించింది’ అంటుంటే పసిబాలుడైపోయాడు ఉషశ్రీ. ఆ పసిబాలుడిని తన మరో అంకం మీద కూర్చోపెట్టుకున్నాడు విరించి.
–––––––––––––––––––––
వారిరువురి తరవాత.. బాలమురళిని చూస్తూ…
సంగీత త్రిమూర్తులు భక్తిపారవశ్యంతో ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్నారు. తన మరో శిరస్సుతో గమనిస్తున్న చతుర్ముఖుడు, ‘‘‘త్యాగయ్యా! నీ జన్మ ధన్యమైంది. ఈ బాలుడు… నువ్వు రాసిన కీర్తనలకు శాశ్వతత్వం తీసుకువచ్చాడు, ఆ గొంతులో భావం పలికే విధానం పరిశీలించావా. ఎక్కడ ఏ స్థాయిలో పాడాలో తెలిసిన అమృత గళుడు. బహుశః అమృత కిరణుడి నుంచి వెలువడే సుధా కిరణాలను గోరుముద్దలతో పాటు మింగేశాడేమో. బాలగంధర్వుడు వీడు. ఆరేళ్లు నిండకుండానే నీ ఆరాధనోత్సవాలలో అద్భుతంగా పాడి అందరిచేత శభాష్‌ అనిపించుకున్నాడు. మీరు ఎన్ని కృతులు రాస్తే ఏంటి, ఎన్ని సంకీర్తనలు రాస్తే ఏముంది… ఇటువంటి వారు ఆ కీర్తనలు అమృత స్వరంతో ఆలపిస్తేనే కదా చిరస్థాయిగా నిలిచేది.

నీ ఆరాధనోత్సవాలలో పంచరత్న కీర్తనలు ఆలపించి, వాటì కి కీర్తిని, యశస్సును, చిరంజీవిత్వాన్ని తీసుకువచ్చాడు. నీకు మరో విషయం తెలుసా త్యాగయ్యా. వాడు పెద్దగా చదువుకోలేదు. ఏనాడూ పాఠశాలకు కూడా వెళ్లలేదు. వాడు కారణజన్ముడు. కొత్త రాగాలు కనిపెట్టాడు. తిల్లానాలు రచించాడు. వాటిని వింటుంటే… నాకు కూడా పాడాలనిపిస్తుంది. పాడి ఊరుకోవడం కాదు, ఆ తిల్లానాలు వాడి ఎదుట పాడి వినిపించాలనిపిస్తుంది. అయ్యా శ్యామశాస్త్రి! మీరు భూమి మీద యశఃకాయులమయ్యారంటే అందుకు వాడి గళమే కారణం. మీరు ఏ రాగంలో ఏ భావంతో, ఏ అర్థంతో రచించారో, అంతకు మించిన అనుభూతితో, అమరత్వాన్ని తెచ్చిపెట్టాడు వాడు. చిత్రమేమిటంటే వాడు నిత్య బాలుడు.

అందుకే బాలముర ళి అయ్యాడు… అంటూ అలతి పదాలతో ప్రస్తుతిస్తుంటే… భక్తిపారవశ్యంలో ముగినిపోతున్న త్యాగయ్యను పరికించి, నీ రాముడిని ప్రస్తుతిస్తూ, తన మురళీగానంతో గోపాలకృష్ణుడిలా పాంచజన్యం పూరించినట్లుగా పాడుతుంటే, శిశువులు, పశువులు కూడా పరవశించిపోయాయని ప్రజలు ఆ బాలుడిని వారి చంకలకెత్తుకున్నారయ్యా. ఆ చిరునవ్వులోని పసితనం, ఆ గళంలోని స్వచ్ఛత, ఆ ఆలాపనలోని నిక్కచ్చితనం… వాడిని పొగడటానికి పదాలు రావటంలేదయ్యా. ఆ రాముడిని వందల కీర్తనలలో కీర్తించిన నీకు, వీడిని కీర్తించడానికి పదాలు వెతుక్కోవలసి వస్తోంది కదూ. వాడు ఎంతటివాడంటే… కర్ణాటక సంగీతమంటే తమిళులదే అన్నట్లుగా ఉండేవారి దగ్గరకు వెళ్లి, నెగ్గుకొచ్చాడు.

తన బాణీలో పాడుతుంటే, ప్రపంచమంతా రాగాలసాగరంలో తేలియాడుతూ, తాళాల పల్లకిలో ఊరేగుతూ, పల్లవుల శాఖల మీద ఊగిసలాడారయ్యా. ఉత్తరాదివారికి దక్షిణాదివారంటే చులకన. అటువంటివారిని కూడా జుగల్‌బందీ పేరున ఓడించాడు. అదీ వాడి గుండె నిబ్బరం. అదీ వాడి కీర్తి. అదీ వాడి ఘనత. ఏమి గాత్రం, ఏమి స్థాయి. ఇటువంటి వాడు ఒక్కడే పుడతాడు. వాడు బహుముఖప్రజ్ఞాశాలి. చలన చిత్రాలలో నారద పాత్రను పోషించాడు. నర్తనశాల చిత్రంలో బృహన్నల పాత్రకు ‘సలలిత రాగ సుధారస సారం’ అంటూ కీర్తనలాంటి పాట పాడాడు. ఏటిలోని కెరటాలు అంటూ తత్త్వం పలికాడు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా, పాడనా వాణి కల్యాణిగా… అంటూ ఆ రంగానికీ తన గళంతో వన్నె తీసుకువచ్చాడు.. అంటుంటే వీణాపాణి వాణి బాలమురళిని తన ఒడిలోకి తీసుకుని గోరుముద్దలు తినిపించింది.

––––––––––––––––

బ్రహ్మదేవుని అమృత వాక్కులలో తడిసి ముద్దయిపోతున్నారు వారు మువ్వురూ. తేనెలూరే పలుకులు పలుకుతూ, ఏడుకొండలవాడిని పరికిస్తూ, ‘అయ్యా! వెంకటేశ్వరా! గోవిందా! వడ్డికాసులవాడా! శ్రీనివాసా! ఈ గళత్రయానికి ఒక పోలిక ఉంది. నీ సన్నిధిలో వీరు మువ్వురికి సత్కారం జరిగింది. నీకు వీరంటే ఎంత ప్రేమ కాకపోతే వారిని ఎందుకు నీ దగ్గరకు రప్పించుకుంటావు’ అని విధాత పలుకుతూంటే, ఆ గోవిందుడు తన మూడు నామాల వెనుక నుంచి కంటితో నవ్వుతున్నాడు.
అప్పుడు నారదుడితో బ్రహ్మదేవుడు…త్రిలోక సంచారీ! నువ్వు ఈ మువ్వురి గురించి వినలేదా! ముల్లోకాలలోని సమాచారాన్ని నువ్వే కదా మాకు తెలియచేసేది. వీరి గురించి ఎందుకు తెలుసుకోలేకపోయావు’ అంటుంటే…
నారదుడు ఉలిక్కిపడి…
తెలియకపోవడమేమిటి. ఏవో సమాచారాలు సేకరించటంలో తలమునకలైపోయి ఉండటం వల్ల వెంటనే వీరి గురించి మీకు చెప్పలేకపోయాను. వీరిలో ఆ ఘంటసాల అందరి కంటె ముందుగా మన దగ్గరకు వచ్చేశాడు, ఆ తరువాత తొందరపడి మనలను చేరినవాడు ఉషశ్రీ. ఇక చివరగా హాయిగా అన్నీ అనుభవించి వచ్చినవాడు ఆ బాలమురళి. వీరి రాకతో మన సభకు నిండుదనం చేకూరింది. ఇక రోజూ మనకు ఘంటసాల సుప్రభాతం, ఉషశ్రీ ప్రవచనాలు, బాలమురళి కీర్తనలతో విందుభోజనమే.
వీరు మువ్వురి గురించి నా వ్యాఖ్యానం ఒకటి చెప్పాలి కదా మరి…

ఘంటసాల గానం ఘంటసాల గానమే
ఉషశ్రీ గళం ఉషశ్రీ గళమే
బాలమురళి గాత్రం బాలమురళి గాత్రమే.
వీరికి సాటివచ్చువారలు గతమునందు కానరాకుండిరి, వర్తమానంబున కానరాలేదు,భవిష్యత్తునందు కానరాబోరు. వారి వారి గళంబులతో వారు చిరంజీవులు అగుగాక… అంటూ నారదుడు ఆ వాణిత్రయాన్ని ఆశీర్వదించాడు.

(తెలుగు మహాసభల సందర్భంగా వ్యూస్ సమర్పిస్తున్న సృజన రచన)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...