శుభాకాంక్షలు తెలిపిన వై.ఎస్. జగన్
అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్ష
విజయవాడ, ఏప్రిల్ 17 : రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలనీ, దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలనీ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అభిలషించారు. విజయవాడలో ప్రభత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో సీఎం వైయస్.జగన్ పాల్గొన్నారు.
రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు విజయవాడ, విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని, రాష్ట్రాభివృద్ధికి అందరూ ప్రార్థించాలని సూచించారు. అనంతరం ముస్లిం టోపీ, పవిత్ర కండువా ధరించి ముస్లింలతో కలిసి నమాజ్ ఆచరించారు.
ఇఫ్తార్ విందులో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ…మైనార్టీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడమే కాక పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు రాజకీయ సాధికారత కల్పించారని..మైనార్టీల సంక్షేమం కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన రాష్ట్రం ఏపీనేనన్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో ముస్లిం వ్యక్తి అయిన తనకు డిప్యూటీ సీఎం హోదాను కల్పించడమే కాకుండా శాసనమండలిలో ఒక ముస్లిం సోదరిని డిప్యూటీ చైర్ పర్సన్ చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. మైనార్టీలకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు కూడా కేటాయించారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పలువులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, అధికారులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.