ఆగిన యామిని అడుగుల సవ్వడి

Date:

84 వ ఏట న్యూఢిల్లీలో అస్తమయం
నా నాట్యంతోనే పండుగలు సందడి చేస్తాయి
(డా. పురాణపండ వైజయంతి)
హస్తినాపురిలో జాతీయ పండుగలకైనా, తెలుగువారి పండుగలకైనా…
ఆమె చిరు మువ్వల సవ్వడి చేయాల్సిందే…
ఆమె అడుగులు నెమలికి నాట్యం నేర్పాయి… ఆమె జతులు లేళ్లకు గెంతులు నేర్పాయి…
ఆ వయ్యారాలు నదులకు పరుగులు నేర్పాయి…
ఆ కళ్లు నాట్యాన్ని పలికాయి… ఆ పెదవులు కావ్యాలను ఒలికాయి…
ఆమె కదిలితే మెరుపు తీగలు….. ఆమె కంటిలో విద్యుల్లతలు…
ఆమె నర్తిస్తే మెరుపులు, ఉరుములు… ఆవిడ ముద్దుపేర్లు పేరు బిజిలీ, రాజా…
‘నాట్యమూర్తులు’ పేరిట 13 ఎపిసోడ్లు రూపొందించారు…
అసలు పేరు యామినీ పూర్ణ తిలక…. అందరికీ యామినీ కృష్ణమూర్తిగా సుపరిచితులు…
అనేక అవార్డులతో పాటు అత్యున్నత పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు…
జీవితాన్ని కూచిపూడి నాట్యానికి యామినీ కృష్ణమూర్తి అంకితం చేశారు. శనివారం ఆమె న్యూ ఢిల్లీలో కన్నుమూశారు. ఆదివారం ఆమె అంత్యక్రియలను నిర్వహిస్తారు. కొన్నేళ్ల క్రితం యామిని కృష్ణమూర్తి విజయవాడ వచ్చినప్పుడు వైజయంతి పురాణపండకు ప్రత్యేక ముఖాముఖీ ఇచ్చారు. ఆమె చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే…


పూర్ణ తిలకం
యామినీ పూర్ణతిలక పండిత వంశంలో పుట్టారు. తండ్రి కృష్ణమూర్తి ఆమెను కూడా పండితురాలిని చేయాలనుకున్నారు. అనుకోవడమే కాదు చేశారు. అందుకోసం రెండు ఇళ్లు, కొంత పొలం కూడా అమ్మేశారు. ‘‘మా నాన్నగారికి నన్ను విద్వాంసురాలిని చేయాలని బలమైన కోరిక ఉండేది. నేనా అస్సలు కుదురులేని అమ్మాయిని. ఎప్పుడు చూసినా చెట్లు ఎక్కడం, గోడలు దూకడం… ఒక్క క్షణం కూడా కదలకుండా కూర్చునేదాన్ని కాదు. నాలో నాన్నగారికి ఏమి కనిపించిందో కాని, నా ఏడవ ఏటే భరతనాట్యం నేర్పించడం ప్రారంభించారు. పది సంవత్సరాల వయసు వచ్చేసరికి నాట్యంలో నైపుణ్యం సాధించాను’’ అని తన నాట్య ప్రస్థాన ప్రారంభం గురించి వివరించారు.
రుక్మిణి అరండల్ వద్ద శిక్షణ
చెన్నైలోని రుక్మిణీ అరండేళ్‌ కళాక్షేత్రకు తీసుకువెళ్లారు తండ్రి. యామిని నాట్యానికి ముగ్ధులయిన రుక్మిణీ అరండేళ్, ఆమెకు తన దగ్గరే నాట్య శిక్షణ ప్రాంభించారు. అతి తొందరలోనే యామిని అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. భరతనాట్యమే కాకుండా ఇతర నాట్యాల మీద కూడా ఆవిడకు క్రమేపీ మక్కువ పెరిగింది. ‘నువ్వు నాట్యం చేయాలనుకుంటే చేసై, లేకపోతే నిరాశ చెందుతావు’ అని తండ్రి గారు పలికిన పలుకులు యామినికి టానిక్‌లా పనిచేశాయి.


కూచిపూడి, ఒడిస్సీ…
భరతనాట్య పెనుగాలికి రెపరెపలాడుతున్న కూచిపూడి నాట్యాన్ని నిలబెట్టాలనే కోరిక కలిగింది యామినికి. ఆ నాట్యానికి చెన్నైలో ఆదరణ లేని రోజుల్లో, కూచిపూడి వైభవానికి పాటుపడ్డారు. అది చాలా చిత్రంగా జరిగింది. ‘‘వేదాంతం లక్ష్మీనారాయణగారు నా గురించి విని, మా ఇంటికి వచ్చి, ‘తెలుగు ఇంటి ఆడపడుచువి, కూచిపూడి నేర్చుకోకపోతే ఎలాగ’ అని, ‘దశావతారాలు’ నేర్పారు. ఆ తరవాత నెలరోజులకే ఆయన కాలం చేశారు. ఆయన వేసిన బీజం నాలో బలంగా నాటుకుంది. కూచిపూడిని నా భుజస్కంధాల మీదకు ఎత్తుకున్నాను. నా దీక్ష చూసి, వెంపటి చినసత్యం… తాను చలనచిత్రాలకు పనిచేయనని, తన జీవితాన్ని కూచిపూడి నాట్య అభివృద్ధికి అంకితం చేస్తానన్నారు’’ అంటూ తన కూచిపూడి ప్రస్థానం గురించి వివరించారు. ప్రముఖ ఒడిస్సీ ఆచార్యులు కేలూచరణ్‌ మహాపాత్ర దగ్గర ఒడిస్సీ నృత్యం అభ్యసించారు. ‘‘నేను మూడు గంటల పాటు చేసే నా నాట్యప్రదర్శనలో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ… ఒక్కో గంట సేపు ప్రదర్శించేదాన్ని. మరొక విషయం చెప్పాలి. నాకు పండుగలన్నీ నాట్యవేదిక మీదే జరిగేవి. ప్రతి పండుగ సందర్భంలో నిర్వహించే వేడుకలలో నా నాట్యం తప్పనిసరిగా ఉండటమే ఇందుకు కారణం’’ అని వివరించారు.
ప్రభావితం చేసిన ఆలయాల శిల్ప భంగిమలు
యామినీ కృష్ణమూర్తి ఇల్లు, చిదంబర నటరాజ దేవాలయానికి చాలా దగ్గర కావడంతో, నిత్యం దేవాలయ కుడ్యాల మీద కొలువుతీరిన శిల్పాల భంగిమలు ఆమె మీద చెరగని ముద్ర వేశాయి. ‘‘రోజూ గుడికి వెళ్లేదాన్ని. ఆ శిల్పాలు చూసి ఇంటికి వచ్చాక, అదే భంగిమలో నిలబడేదాన్ని. ఇంకా… మా ఇంటి వెనకాల పంటపొలాలలో నిత్యం ఆడుతుండేదాన్ని. నేను నాట్యభంగిమలు, ముద్రలు అందంగా పెట్టడానికి ఇది ఒక కారణం అయి ఉంటుంది’’ అంటూ వివరించారు యామిని.


ఏకాంతం ఇష్టం…
ఒక్కోసారి అలసిపోయినా, నా గురించి నేను ఆలోచించుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉండేది కాదు. డ్యాన్స్‌ ప్రాక్టీస్, ప్రదర్శనలతో గడిచిపోయింది నా జీవితమంతా. పండుగలు, వేడుకలు… అన్నీ నాట్య వేదిక మీదే సాగాయి. క్రమేపీ వేదాంతం అలవడింది. మై వ్యూ ఆఫ్‌ లైఫ్‌ ఈజ్‌ డిఫరెంట్‌ ఫ్రమ్‌ అదర్స్‌. నేను నాట్యం చేస్తే ప్రేక్షకులు కొట్టే తప్పట్లే నాకు ఉత్సాహాన్నిచ్చాయి. భౌతిక వాంఛలకు దూరంగా ఉండాలనుకున్నాను. కారుణ్యం అలవర్చుకోమని చెప్పిన బౌద్ధం అంటే చాలా ఇష్టం.
నాన్నగారి ఆలోచనే ప్రేరణ
‘వేదాంతం రాఘవయ్య’ గారి రైతు బిడ్డ సినిమా చూశాక నాకు నాట్యం నేర్పించాలనే కోరిక కలిగిందట నాన్నగారికి. అప్పటికే వెంపటి పెద సత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి వీరంతా సినిమాలకి వెళ్లిపోయారు. వేదాంతం లక్ష్మీనారాయణ గారి దగ్గర నా కూచిపూడి నాట్యం ఆరంభమైంది. ఆయన మరణం తరవాత ఏలూరు వెళ్లి చింతా కృష్ణమూర్తిగారి దగ్గర భామాకలాపం నేర్చుకున్నాను.


కూచిపూడికి ప్రచారం
సంగీత నాటక అకాడెమీ వారు… భరతనాట్యం, కథక్, కథకళి, ఒడిస్సీ వంటివాటిని మాత్రమే సంప్రదాయ నృత్యాలుగా ఎంచుకున్నారు. కూచిపూడికి ఆదరణ పోయింది. నేను కూచిపూడిని విస్తృతంగా ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాను. దేశమంతా తిరిగి ప్రదర్శనలిచ్చాను. కూచిపూడిని సంగీత నాటక అకాడెమీలో ఎంచుకునేలా కృషి చేశాను.
మారిన నాట్యశైలిపై ఆవేదన
ఒకప్పుడు నాట్యానికి వెళ్లడమంటే దేవాలయానికి వెళ్తున్నట్లు భావించేవారు. ఇప్పుడంతా మారిపోయింది. నేను నాట్యం కోసమే పుట్టాను. నా జీవితాన్ని నాట్యానికే అంకితం చేశాను. వివాహానికి దూరంగా ఉన్నాను. మధ్యప్రదేశ్‌లో బందిపోట్ల దగ్గర సైతం రెండు సార్లు ప్రదర్శన ఇచ్చాను. నాన్నగారు భయపడొద్దని చెప్పారు. వారు నా నాట్యం మెచ్చుకోవడమే కాదు, నన్ను బిజిలీ అన్నారు. వాళ్లు కూడా మనుషులే. మనం నాట్యం చేస్తున్నాం. వాళ్లు దొంగతనం చేస్తున్నారు. అంతే!
నిధులు అవసరం…
అకాడెమీ అంటే బిల్డింగ్‌ కాదు కదా, పిల్లలకు నాట్యం నేర్పాలి. ఇందుకోసం ఫండ్స్‌ కావాలి. అవి ఉంటే నాట్యం మీద బాగా దృష్టి కేంద్రీకరించగలుగుతాను. ఒక్కో రిహార్సల్‌కు సంగీతకారులకు పది వేలు ఇస్తుంటే, ఎంత డబ్బున్నా చాలట్లేదు.


అది మధురానుభూతి
’ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సమక్షంలో ‘క్షీరసాగరమథనం’ నృత్యరూపకం ప్రదర్శించడం ఒక మధురానుభూతి అని యామిని చెప్పారు.
’ ఇందిరాగాంధీకి నేనంటే చాలా ఇష్టం. ఢిల్లీలో ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా, ఏ పండుగ సంబరాలు ఉన్నా వెంటనే ‘‘యామిని ఉందా’’ అని అడిగేవారు..
’ గుంటూరులో నాట్య ప్రదర్శన ఇచ్చి వారి ప్రశంసలు పొందితేనే నేను గొప్పదాన్ని అని అన్నారు చాలామంది. నా నాట్యంతోనే వారి విమర్శలకు సమాధానమిచ్చాను.


’ కలకత్తా ప్రజలను చూస్తే ‘ఆర్ట్‌ ఈజ్‌ ఎవ్రీవేర్‌ ఇన్‌ దెయిర్‌ హార్ట్స్‌’ అనిపిస్తుంది.
’ మేమిద్దరం తండ్రీకూతుళ్లల్లా కాదు, అంతకు మించిన బంధం ఉండేది.
’ ఆయన మరణం నాకు జీవితాంతం బాధనే మిగుల్చుతుంది.
’నేను లోన్లీ పర్సన్‌ కాను, ఎలోన్‌గా ఉంటాను, డిలైటెడ్‌గా ఉన్నాను.
’ నాట్యానికి స్వర్ణయుగం మళ్లీ వస్తుంది.
’ విమర్శించాలనుకునేవారు… సూర్యుడు ఉదయం తూర్పున ఉదయిస్తాడు, సాయంత్రానికి పడమట అస్తమిస్తాడు అని – సూర్యుడిని కూడా విమర్శించవచ్చు.
(2017 లో విజయవాడలో యామిని కృష్ణమూర్తితో వైజయంతి పురాణపండ ముఖాముఖి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

China and Trump Tariff war: China has upper hand

(Dr Pentapati Pullarao) The tariff –trade war, started by President...

A Movement of Hearts, Heritage, and Harmony

Culture, Language, Indian, and Connections (CLIC) & International Sweet...

Donald Trump’s Tariff War

(Dr Pentapati Pullarao) Ever since Donald trump was sworn as...

సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతిట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి...