రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్
ఇండియా అంటే బిజినెస్
ఐఎస్‌బి దిదశాబ్ది వార్షికోత్సవంలో నరేంద్ర మోడీ
ఆసియాలో అత్యుత్తమ సంస్థ అని ప్రశంసలు
హైదరాబాద్, మే 26: ప్రపంచానికి భారత యువత నాయకత్వం వహిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన యువతపై ప్రశంసల వర్షం కురిపించారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉందని ప్రధాని చెప్పారు. ఇంటర్నెట్ వినియోగంలో రెండో స్థానంలో ఉందన్నారు. స్టార్టప్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఆసియాలో హైదరాబాద్ ఐఎస్‌బి టాప్ ప్లేస్‌లో ఉందని చెప్పారు.
ఐఎస్‌బి వెనుక ఎంతో మంది కృషి ఉందన్నారు. ఐఎస్‌బి విద్యార్థులు అనేక స్టార్టప్‌లు ప్రారంభించారన్నారు. ఇక్కడ చదివిన వారు విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. భారత్ అంటే బిజినెస్ అనే స్థాయికి చేరిందని ప్రధాని చెప్పారు. ప్రపంచాన్ని నడిపించే దిశలో ఇప్పుడు బారత్ ఉందన్నారు. ఐఎస్‌బి ఇప్పుడు తన ప్రయాణంలో కీలక దశకు చేరిందని తెలిపారు. దేశానికే ఐఎస్‌బి గర్వకారణమని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోందన్నారు. జి 20 దేశాలలో భారత్ వేగంగా అబివృద్ధి చెందుతోందన్నారు. భారత్‌కు రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారత యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది. కొవిడ్ సమయంలో భారత్ తన సత్తా చాటిందని చెప్పారు ప్రధాని. నామీద నాకు నమ్మకం ఉంది… మీమీద మీకు నమ్మకం ఉందా అంటూ విద్యార్థులను ప్రశ్నించారు.
మీరు చేపట్టబోయే కార్యక్రమాలు దేశానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించమని ప్రధాని వారిని కోరారు. మీ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలకు జోఎడించాలని పిలుపునిచ్చారు. దేశ యువతకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
ఎనిమిదేళ్ళుగా దేశంలో సంస్కరణలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మన విధానాలను, పరిపాలనను ప్రపంచం మొత్తం అధ్యయనం చేసే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని తెలిపారు. మన దేశం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కన్స్యూమర్ మార్కెట్ అని వెల్లడించారు. దేశ పరిపాలనలో, వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చామని వెల్లడించారు.
రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌పామ్ లక్ష్యంగా యువత సాగాలని పిలుపునిచ్చారు. ఖేలో ఇండియా నుంచి ఒలింపిక్ క్రీడల వరకూ ఎన్నో సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు. కరోనా సమయంలో భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసాయన్నారు.
ఇప్పుడు దేశంలో పిపిఇ కిట్లు తయారు చేసే సంస్థలు 1100 ఉన్నాయని తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్లు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. యువత కోసం దేశంలో ఎన్నో సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని తెలిపారు.
రాజకీయ అనిశ్చితి వల్ల దేశంలో మూడు దశాబ్దాలుగా కీలకమైన నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకోలేకపోయాయని ప్రధాని చెప్పారు. తొలుత ఐఎస్‌బి ద్విదశాబ్ది వేడుకల లోగోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి శ్రీనివాస యాదవ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీజీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్కాలర్లకు ప్రధాని మెడల్స్ అందజేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ను 2001లో అప్పటి ప్రధాని వాజపేయి ప్రారంభించారు.