సీఎం తో టిఫిన్ .. ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి
జర్నలిస్ట్ జ్ఞాపకాలు
(బుద్దా మురళి)
మాసిన బట్టలతో దాదాపు 60 ఏళ్ళ వయసున్న అతను సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరికీ టీ ఇచ్చేవాడు. అటెండరాగానే పరిచయం. అక్కడికి వచ్చే నాయకులు ఇచ్చే మొత్తమే అతని బతుకు తెరువు. ఓ రోజు ఎందుకో హఠాత్తుగా అప్పటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి చరణ్ మురళి అతను ఎవరో నీకు తెలుసా? అని అడిగాడు. అటెండర్ గురించి తెలుసా అని అడగడానికి ఏముంటుంది? అనిపించింది. సంగడు తెలియక పోవడం ఏముంది అన్నాను. అప్పటి వరకు నాకు తెలిసిన అతని పేరు సంగడే .. అందరూ అతన్ని సంగడు అనే పిలిచేవారు. అతని పేరు సంగడు కాదు, సంగమేశ్వర్ రావు గారు అని స్వామిచరణ్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో నాలుగురైదుగురికి మాత్రమే ఏసీ కారు ఉన్న రోజుల్లో అతను సిటీలో అడుగుపెట్టాడు. అతనికోసం ఏసీ కారు వచ్చేది అని చెబితే నమ్మలేక పోయాను. 1988-89 ప్రాంతంలో సంగారెడ్డిలో జిల్లా రిపోర్టర్ గా ఉన్నప్పుడు మాజీ స్పీకర్ పి రామచంద్రారెడ్డి బిల్డింగ్ లోనే జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఉండేది . అక్కడే సంగడు పరిచయం.
స్వామి చరణ్ చెప్పింది నమ్మలేక సంగమేశ్వర రావు గారు సంగడుగా ఎలా అయ్యాడని అతన్నే అడిగాను .
**
ఉదయం సీఎంతో టిఫిన్ చేసి, ప్రధానితో లంచ్ చేయాలి అంటే జర్నలిజంలోకి రండి .. ఇలానే సాగేది హైదరాబాద్ లో ఓ ప్రైవేటు జర్నలిజం స్కూల్ ప్రకటన. ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఓ 20 ఏళ్ళ క్రితం ఈ ప్రకటన రోజూ కనిపించేది. నిజంగా జర్నలిస్ట్ జీవితం అంత అద్భుతంగా ఉంటుందా? ఇప్పుడు కాదు ఎప్పుడూ అంత అద్భుతంగా లేదు. ఉండదు. సీఎం లకు, పిఎంలకు మరే పనిలేనట్టు జర్నలిస్ట్ లతో టిఫిన్ చేయడం, లంచ్ చేయడమే పనా? ఇంట్లో భార్యా పిల్లలకు జ్వరం వచ్చినా ఆస్పత్రికి వెళ్లేంత సమయం ఉండదు. కానీ ఓ సినిమా యాక్టర్ భార్య ప్రసవిస్తే గంటల తరబడి ఎండలో కెమెరాలతో ఆస్పత్రి వద్ద పడికాపులు కాయాలి. వాస్తవానికి, ప్రకటనలకు ఎంత తేడా ఉంటుందో ఈ ప్రకటన, ఆస్పత్రి వద్ద పడిగాపులు కాసిన జర్నలిస్టుల ఫోటోనే సాక్ష్యం.
ప్రజాప్రతినిధులు, అధికారులు, చివరకు అందరినీ వణికించే లోకల్ గుండాలు సైతం నమస్తే అన్నా అని పలకరించడం మద్యం కన్నా మత్తుగా ఉంటుంది. సగం జీవితం … అయిపోయాక ఆ మత్తు దిగి అసలు జీవితం అర్థం అవుతుంది.
నక్సలైట్ల నాయకుడిగా లక్షల రూపాయల డెన్ బాధ్యతలు నిర్వహించి, తరువాత జర్నలిజం లోకి వచ్చి తమను తాము కంట్రోల్ చేసుకోలేక దయనీయమైన స్థితిలో చనిపోయిన జర్నలిస్ట్ మిత్రులు తెలుసు….
ఓ వీడియో ఆ మధ్య బాగా పాపులర్ అయింది. టివి 9 రిపోర్టర్ అంటే లోకల్ గా చాలా శక్తిమంతుడు అని అర్థం. ఆ శక్తి మొత్తం చేతిలో లోగో ఉన్నంత వరకే . లోగో లాగేసుకుంటే నీటిలో నుంచి బయట పడ్డ చేపలా గిలగిల కొట్టుకుంటారు. ఏం జరిగిందో అతన్ని ఛానల్ నుంచి తీసేస్తే టివి 9 స్టూడియోలో రవిప్రకాష్ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుతున్నాడు. ఎవరో దీన్ని వీడియో తీశారు.
కొంతకాలానికి రవిప్రకాష్ ను కూడా ఇలానే బయటకు పంపారు. అలానే గిలగిల కొట్టుకున్నా, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకో ఛానల్ పెడతారు, ఛానల్ పెట్టే వారు దొరుకుతారు. అలాంటి వారి పరిస్థితి వేరు. కానీ ఛానల్ లోగోను చూసుకొని తమంతటి మొనగాడే లేదు అనుకునే వారు, లోగో లాగేసుకుంటే హీరో నుంచి ఒక్కసారిగా జీరో అవుతారు. మారిన కొత్త జీవితాన్ని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఎడిటర్ గా ఉన్నప్పుడు తలపొగరుతో ఉండే ఒకరు పీకేశాక ఓ జర్నలిస్ట్ తో చాలా సేపు ఆప్యాయంగా మాట్లాడారు. అది నిజమా అని అతను నమ్మలేక పోయాడు. కలిసిన వారందరికీ ఈ విషయం చెప్పుకున్నాడు. ఇందులో నమ్మక పోవడానికి ఏముంది ? పీకేసిన ఎడిటర్ ను పలకరించే వాడు ఎవడు? నువ్వు కలిశావు కాబట్టి అంత ఆప్యాయంగా మాట్లాడాడు అని చెప్పాను. లోకల్ రిపోర్టర్ ( స్ట్రింగర్ ) మరణించినప్పుడు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి …
ఇది సరే ముందు సంగమేశ్వర రావు సంగడు గా ఎలా మారాడో అది చెప్పు అంటున్నారా ? అక్కడికే వస్తున్నాను . ఇదే ప్రశ్నను సంగడిని అడిగితే …
మదన్ మోహన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా పాపులర్. ముఖ్యమంత్రి తరువాత అంతటి వైభవం. సంగడు మదన్ మోహన్ కు ఆత్మ లాంటి వాడు. (ఆత్మ అంటే లెక్కలేనన్ని కోట్లు వెనకేసుకున్న ఆత్మ కాదు.)చేయని పాపం లేదు .. ఆడ పిల్లల ఉసురు తగిలింది. మదన్ మోహన్ రాజకీయ జీవితం ముగిసింది. నా జీవితం ఇలా అయింది. అనుకుంటాం కానీ పాపం తగులుతుంది సార్ అంటూ .. చాలా విషయాలు పశ్చాత్తాపంతో చెప్పుకొచ్చాడు.
చాత నైతే నలుగురికి మంచి చేయాలి, లేదా ఊరికే ఉండాలి. అన్యాయం చేస్తే ఏదో రూపంలో పాపం మనకు చుట్టుకుంటుంది అని నా నమ్మకం. ఇది మూఢనమ్మకం అన్నా నాకు అభ్యంతరం లేదు. మనిషిని మనిషిగా ఉండేట్టు చేసే మూఢ నమ్మకం ఐనా నాకు ఇష్టమే .
సీఎం లతో టీ తాగి , పీఎంలతో లంచ్ చేస్తాం అనే భ్రమలు ఎంత త్వరగా వీడితే అంత మంచిది. వాస్తవంలో జీవించి, ప్రాక్టికల్ గా ఆలోచించాలి. మహా మహులే రాలిపోయారు, లోగోలతో మనకెందుకు అహంకారం. (Author is a senior journalist)