రెండునెలల్లో సెన్సేషనల్ వార్త చెబుతా
బెంగళూరులో తెలంగాణ సీఎం కేసీఆర్
బెంగళూరు, మే 26: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బెంగళూరులో సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో దేశంలో మార్పు తథ్యమని వెల్లడించారు. రెండు నెలల్లో తాను ఒక సెన్సేషన్ వార్త చెబుతానని తెలిపారు.
దేశంలో ప్రధాని ఎవరు? అధికారం ఏ పార్టీది అనేది ముఖ్యం కాదు.. అభివృద్ధి చెందిందా లేదా అనేదే ప్రధానం అన్నారు. మనకు అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయి. సవ్యంగా ఉపయోగించుకుంటే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.
ఈ సారి దేశంలో అధికారం మార్పు తప్పదనీ, దీనిని ఎవరూ ఆపలేరని కేసీఆర్ అన్నారు. సరిగ్గా పనిచేస్తే భారత్ అమెరికాను మించి అభివృద్ధి సాధించగలదన్నారు. భారత జిడిపి 16 ట్రిలియన్ డాలర్లు ఉండాలనీ, దురదృష్టవశాత్తు 5ట్రిలియన్ డాలర్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా పరంగా చైనా మనమూ ఒకటే.. కానీ అభివృద్ధిలో వెనకపడ్డామని విచారం వ్యక్తంచేశారు.
దేశంలో యువశక్తిని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళయినా ఇప్పటికీ సాగు, తాగు నీటి కోసం దిక్కులు చూడాల్సి వస్తోందనీ, ఇది కడు దయనీయమైన పరిణామమనీ తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఎవరూ సంతోషంగా లేరన్నారు.
తొలుత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం మధ్యాహ్నం బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో భేటీ అయ్యారు. దేశ రాజకీయాల గురించి చర్చించారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.