ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట

0
54

లీకేజీలను అరికట్టేలా ప్రభుత్వ శాఖల మధ్య మరింత సమన్వయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్‌ సుబ్రమణియన్ భేటీ
హైదరాబాద్, ఆగస్టు 07:
తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట ఖజానాకు జీఎస్టీ రాబడులను పెంచుకోవడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించడం, తద్వారా పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చించారు.

ఎంసీఆర్ హెచ్ఆర్ డీ బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై ఈ సందర్భంగా చర్చించారు.

ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై అరవింద్‌ సుబ్రమణియన్ తో చర్చించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లే దిశగా జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత సమాచారంతో ప్రక్రియను సులభతరం చేసే వ్యవస్థను తేనున్నట్టు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ను మెరుగు పరిచేలా టెక్నాలజీ వాడకం ఉంటోందని సుబ్రమణియన్ వివరించారు.

ప్రధానంగా భవన, నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టే విధంగా మున్సిపల్, రేరా, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం చేసుకోవాలని ఈ సందర్బంగా సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాలు వివరాలను నమోదు చేయాలన్నారు.

ఈ డేటా తోపాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు.

ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కమర్షియల్ టాక్స్ & ఎక్సైజ్ సెక్రటరీ రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here