ఏసీ బస్సులు – అగ్ని ప్రమాదాలు

0
263

కారణాలు, నివారణలు
(డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ, కాకినాడ)

ఇటీవల కాలంలో ఏసీ (Air-Conditioned) బస్సుల్లో అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. దీనికి మూల కారణం ఏమిటీ?
ఏసీ బస్సులో సాధారణ బస్సు కంటే విద్యుత్ వినియోగం చాలా రెట్లు అధికంగా ఉంటుంది. సాధారణ బస్సుకు 2-3 కిలోవాట్లు అవసరమైతే, ఏసీ బస్సుకు 15-20 కిలోవాట్ల వరకు శక్తి కావాలి. ఈ అధిక విద్యుత్ భారం కారణంగా కేబుల్స్ వేడెక్కుతాయి. ఎక్కువ కరెంట్ ప్రవహించడం వల్ల విద్యుత్ కేబుల్స్ త్వరగా వేడెక్కుతాయి. ఇది షార్ట్ సర్క్యూట్‌కు దారితీసి, మంటలు చెలరేగుతాయి.

నిరంతర వినియోగం, వేగం పెను సమస్యలు
సుదీర్ఘ ప్రయాణాలలో, 10-15 గంటలు ఏకధాటిగా ఏసీని ఆపకుండా నడపడం ఒక పెద్ద తప్పిదం. దీనివల్ల కంప్రెసర్, కూలింగ్ ఫ్యాన్లు, ఆల్టర్నేటర్ వంటి భాగాలు ఓవర్‌లోడ్ అవుతాయి. విద్యుత్ కనెక్షన్లు బలహీనపడతాయి. మన దేశంలో 45°C నుండి 50°C వరకు ఉండే వేసవి ఉష్ణోగ్రతలు, దుమ్ము, అధిక తేమ… కండెన్సర్ కాయిల్స్‌ను పాడు చేసి, విద్యుత్ పరికరాలు తుప్పు పట్టడానికి దారితీస్తాయి. ఇక గుంతల రహదారులు సృష్టించే వైబ్రేషన్‌లు (కంపనాలు) ఇప్పటికే బలహీనంగా ఉన్న కనెక్షన్లను మరింతగా దెబ్బతీసి, షార్ట్ సర్క్యూట్‌కు దారి తీస్తాయి. ఆధునిక బస్సుల అత్యధిక వేగం, వేగంగా బ్రేకులు వేసినప్పుడు కలిగే అధిక యాంత్రిక ఒత్తిడి కూడా వైరింగ్ లూజ్ అవ్వడానికి కారణమవుతాయి. వేగంగా ప్రయాణించేటప్పుడు ప్రమాదం జరిగితే, అగ్ని వ్యాప్తి, ప్రాణ నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.

ఏసీ వాడకాన్ని తగ్గించడమే భద్రతకు భరోసా
నిర్ణీత విరామాలు: ప్రతి 2-3 గంటలకు ఒకసారి 15-20 నిమిషాలు పాటు ఏసీని పూర్తిగా ఆపివేయాలి. ఈ విరామం కంప్రెసర్‌ను చల్లబరుస్తుంది, కేబుల్స్ వేడెక్కకుండా కాపాడుతుంది. దీనివల్ల 10-15% ఇంధనం కూడా ఆదా అవుతుంది.

సహజ వెంటిలేషన్: రాత్రి ప్రయాణాలలో వాతావరణం చల్లబడినప్పుడు, 30 నిమిషాల విరామం ఇచ్చి, వీలైతే కిటికీలు తెరిచి సహజ వాయు ప్రవాహాన్ని (Natural Ventilation) ఉపయోగించాలి.

ఆధునిక ఏసీ బస్సుల్లో వెంటిలేషన్ కిటికీలు లేకపోవడం, కేవలం డ్రైవర్ క్యాబిన్‌కే తలుపులు ఉండడం ఒక పెద్ద లోపం. ఇది దీర్ఘకాల ప్రయాణాలలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి, కార్బన్ డయాక్సైడ్ పెరగడానికి దారితీస్తుంది. బస్సులోని వాసనలు కూడా లోపలే నిలిచిపోతాయి. కాబట్టి, ఏసీని ఆపినప్పుడు సహజ వాయు ప్రవాహాన్ని మెరుగుపరిచే మార్గాలను అన్వేషించాలి.

ఆచరణాత్మక మార్పులు
డ్రైవర్లకు టైమర్ యాప్‌లు లేదా రిమైండర్ సిస్టమ్‌లు అమర్చడం ద్వారా ఏసీని ఎప్పుడు ఆపాలో, ఎప్పుడు ఆన్ చేయాలో గుర్తుచేయడం సులభమవుతుంది.

వాతావరణానికి అనుగుణంగా వాడకం: పగటి వేడిలో లేదా అధిక ఉష్ణోగ్రత ఉన్న రాత్రుల్లో మాత్రమే ఏసీ వాడకాన్ని పరిమితం చేయాలి. ఉదయం, సాయంత్రం లేదా చలికాలంలో కిటికీలు తెరిచి, సహజమైన గాలిని ప్రవహించనివ్వాలి .

హైబ్రిడ్ వెంటిలేషన్: అత్యంత ఉత్తమమైన పద్ధతి పవర్‌ఫుల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు (ప్రతి సీటు పక్కన ఒకటి) ఇన్‌స్టాల్ చేయాలి. , ఉష్ణోగ్రతను 24°C లేదా ఆపైన సెట్ చేయాలి. అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేయడం వల్ల ఓవర్‌లోడ్ పెరగడం తప్ప ప్రయోజనం ఉండదు.

నిరంతర ఏసీ వాడకం, అతి వేగం, నాణ్యతా లోపాలు, క్రమబద్ధీకరించని నిర్వహణే అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలు. అవసరం లేనప్పుడు ఏసీని ఆపడం, నాణ్యతా ప్రమాణాలు పాటించడం, క్రమబద్ధమైన నిర్వహణ ద్వారా మాత్రమే ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలం. సౌకర్యం కోసం భద్రతను త్యాగం చేయకూడదు. వాతావరణానుగుణంగా ఏసీ వాడితే మనమూ సురక్షితంగా ఉంటాం, పర్యావరణం కూడా కాపాడుకుంటుంది.

(వ్యాస రచయిత ప్రముఖ ఫిజీషియన్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here