(బి.వి.ఎస్. భాస్కర్)
ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు ఇంట్లో ఈరోజు తిరుపతి లడ్డుపై చర్చ జరుగుతోంది. జాతీయ వార్తగా కూడా ఈ అంశం ప్రసారం కాగానే అన్ని రాష్ట్రాల్లో భక్తులు దిగ్బ్రాంతికి గురయ్యారు.
బాధ్యత కలగిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు, తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు (ఆవు, పంది) కలిసిందని, అపవిత్రం అయిందని ఒక ప్రకటన వదిలారు. అలా ప్రకటన ఇచ్చే ముందు రాజకీయ కోణం అటుంచి హిందువుల మనోభావాలపై తన ప్రకటన ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించలేదనిపిస్తోంది. కానీ జగన్ ప్రభుత్వం, ఆయన నియమించిన అప్పటి టి.టి.డి. బోర్డు, ఇఓ, అధికారులందరికి ఆ రోజున కల్తీ నెయ్యి వాడిన లడ్డూ తయారుచేసిన పాపంలో భాగం ఉందని చెప్పక తప్పదు.
ఇక్కడ ప్రస్తుతానికి సమాధానం దొరకని అనేక ప్రశ్నలు ఉన్నాయి.
అసలు లడ్డు నాణ్యతపై వచ్చిన ల్యాబ్ నివేదికను ఆలస్యంగా ఎందుకు బయటపెట్టారన్న ప్రశ్నకు సమాధానం లేదు. నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్ ఎవరు? ఎప్పటి నుంచి ఆ కల్తీ నెయ్యి సరఫరా అవుతోంది? ల్యాబ్ టెస్ట్ కి ఏ బ్యాచ్ లేదా టాంకర్ నుండి సాంపుల్స్ పంపారు? ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి ఎక్కడ ఉంది. ఇప్పుడు ఏ కంపెనీ లేదా వ్యాపారి సరఫరా చేసిన నెయ్యి వాడుతున్నారు?
కొత్తగా వచ్చిన టీటీడీ ఇఓ లేదా జెఇఓ స్థాయి అధికారి కాకుండా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సోషల్ మీడియా వారు ల్యాబ్ టెస్ట్ కి పంపిన రిపోర్ట్ బయటపెట్టడం ఏమిటి? అసలు ల్యాబ్ టెస్ట్ కి టీటీడీ కదా ఆ నెయ్యి పంపాలి.
నాణ్యమైన నెయ్యి, పోటు వరకు చేరే దాకా ఉన్న అన్ని విభాగాలు, వాటిని పర్యవేక్షించే అధికారులు, అప్పటి టీటీ చైర్మన్, ఇఓల పాత్ర గురించి ఎవరు మాట్లాడుతున్నారు.
అసలు ఇంతవరకు ఎవరి మీద అయినా పోలీస్ కేసు నమోదు చేశారా?
ఇలా అనేక రకాల ప్రశ్నలకి సమాధానం ప్రస్తుత ప్రభుత్వం చెప్పాలి కదా అంటే, “ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం” అన్న సమాధానం వస్తుంది తప్ప…
అసలు ఇన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా మనం జంతు కొవ్వు లేదా చేప నూనె కలిసిన నెయ్యి లడ్డూనే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి నుంచి సామాన్య భక్తుల వరకు ఇప్పటి వరకు తిన్నారా అంటే అవుననే అనాలి.
రేపటి రోజు మన పిల్లలు, వృద్ధులు ఇంకా మన బంధువులు, స్నేహితులకు పవిత్రమైన ‘తిరుపతి లడ్డు’ అని ఇస్తే, ఇది జంతువుల కొవ్వుతో ఉన్న నెయ్యితో తయారైంది కాదుగా అని అడిగితే ఏం సమాధానం చెబుతాం. టీటీడీ ఇకపై “ఇది కల్తీ లేని స్వచ్ఛమైన లడ్డు. ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడ లేదు” అని ఒక కవర్ పై ముద్రించి లడ్డూలు అమ్మాల్సి వస్తుంది.
రాజకీయ కక్ష్య సాధింపు అంటుంచి, పై ప్రశ్నలకు చంద్రబాబు లేదా జగన్ లేదా టీటీడీ అధికారులు ఏం సమాధానం చెబుతారు.
(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)