(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)
ఒక్కొక్కరు ఒక్కోసారి ఒక్క వెలుగు వెలుగుతుంటారు. రాజమండ్రిలో బోనుమద్ది రామలింగ సిద్ధాంతి అని ఉండేవారు. తుమ్మలావ రోడ్డులో ఒక పాత ఇంటిలో ఆయన ఉండేవారు. అప్పటి దాకా రాజమండ్రి పట్టణ ప్రజలు అడపాదడపా ఆయన్ను కలుస్తుండేవారు. ఒక్కసారిగా ఆయన పేరు దేశమంతా మార్మోగిపోయింది. కారణం 1983 ప్రాంతంలో అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ రాజమండ్రి వచ్చి, సిద్ధాంతి గారిని కలవడమే. ఆనాటి నుంచి కొంతకాలం సిద్ధాంతిగారి ప్రభ వెలిగింది. రాజమండ్రి గురుగా ఆయన స్థిరపడ్డారు. జైల్ సింగ్ అసలు ఆయన ఇంటికి వచ్చి, ఎందుకు కలిశారు అనేది ఇప్పటికీ మిస్టరీయే. కానీ కొన్నేళ్ళ పాటు రామలింగ సిద్ధాంతి పేరు మార్మోగిపోయింది. దీని వెనక కారణాలు ఏమైనప్పటికీ…ఈనాటికీ అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రకాశం జిల్లాకు చెందిన రామదూత స్వామి అంశమూ ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన ఉన్నట్లుండి పెద్దవాడైపోయాడు. తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి యడ్యూరప్ప రావడంతో రామదూత స్వామికి ఒక్కసారిగా పేరొచ్చింది. తరవాత అనేకమంది ఆయన సమక్షంలో పూజలు చేయించుకున్నారు. ఈ స్వామి రాత్రి పూట మాత్రమే పూజలు నిర్వహిస్తారు. రామదూత స్వామి ఒకే ఒక సందర్భంలో బయటకు వచ్చారు. హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదే ఆయన బహిరంగంగా కనిపించడం ఆఖరు సారి.
సత్య సాయి బాబా గారి దగ్గరికి ఎంతమంది వచ్చి వెడుతుండేవారో అందరికీ తెలియనిది కాదు. సత్యసాయిబాబా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వాటికి అప్పటి నేతల ఇతోధిక సహకారం ఉండేది.
వార్తల్లో స్వరూపానందేంద్ర
ఇక వర్తమానంలోకి వస్తే, విశాఖ శారదాపీఠం వార్తల్లో నానుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర్నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి శారదా పీఠానికి సన్నిహితంగా మెలుగుతున్నారు. స్వరూపానందేంద్ర స్వామి ఆ పీఠానికి అధిపతి. వాస్తు, ముహూర్తాలు, తదితర అంశాలలో జగన్మోహన్ రెడ్డి స్వరూపానంద సూచనలు పాటించారని అంటూ ఉంటారు. హృషీకేశ్‌లో జగన్‌తో గంగా స్నానం చేయిస్తున్న స్వామివారి ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. స్వామీజీ జగన్‌తో రాజ శ్యామల అమ్మవారి యాగం చేయించారంటారు. ఆ యాగం కారణంగానే ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారనీ అంటారు.
జగన్ చాలా వరకూ నిర్ణయాలలో స్వామీజీ సలహాలు కూడా తీసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. దీనినే గురి కుదరడం అంటారు. గురి కుదిరితే పెరిగే ప్రభావం అంతా ఇంతా కాదు. ఆఖరుకు మూడు రాజధానులు ఏర్పాటుచేయాలనే నిర్ణయం వెనక కూడా స్వరూపానందేంద్ర సలహా ఉందంటారు. డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మహా సుదర్శన యాగం చేయించారనే వార్తలు కూడా వినిపించాయి. తమ మీద ఉన్న క్రైస్తవ ముద్ర పోగొట్టుకోవడానికి ఓ పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా డాక్టర్ వైయస్సార్ వ్యవహరించారు. ఇప్పుడు అదే బాటను వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారనడంలో సందేహం లేదు.
తెలంగాణ సీఎం సైతం
తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరవాత కె. చంద్రశేఖరరావు సైతం, ఓ పర్యాయం విశాఖ శారదాపీఠానికి విచ్చేసి, రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఆ సమయంలో కేసీఆర్‌కు ఆంధ్ర ప్రజలు సాదర స్వాగం పలికారు. ఆంధ్రలో కూడా టీఆర్ఎస్ పోటీచేయాలనే పోస్టర్లు కూడా అప్పట్లో వెలిశాయి. జగన్ ఉన్నతి వెనుక స్వరూపానందేంద్ర ప్రభావం ఉందని భావించడం వల్లే కేసీఆర్ కూడా విశాఖ శారదా పీఠానికి వచ్చారనే వార్తలూ వచ్చాయి. అంటే స్వరూపానందేంద్ర పేరు అంచెలంచెలుగా పాకిందన్న మాటే కదా! టీటీడీలో సైతం స్వరూపానందేంద్రకు పెద్ద పీట వేశారు. ఆయన చేసే చాతుర్మాస్య దీక్ష ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చి పెట్టింది. ఆ దీక్ష సమయంలోనే ప్రముఖులు ఆయన్ను కలుస్తూ ఉంటారు.
ఇప్పుడు హర్యానా ముఖ్యమంత్రి
అలాంటి ప్రభావశీలుడైన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సన్నిహిత భక్తుల జాబితాలో ఇప్పుడు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేరారు. ఇందుకు కారణం పూర్తిగా తెలియనప్పటికీ, దీని వెనక కీలకమైన అంశమే ఉంటుందంటున్నారు. హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రం. బీజేపీకి-వైయస్ఆర్ కాంగ్రెస్‌కు మధ్య సత్సంబంధాలే ఉన్నాయన్నది కాదనలేని సత్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిగారి ద్వారానే ఖట్టర్ శారదా పీఠానికి వస్తున్నారా? అధిష్ఠానం నుంచి ఏదైనా కీలక సందేశాన్ని పీఠాధిపతికి అందజేయబోతున్నారా? ఇవన్నీ ఊహలే. ఊహలు ఎప్పుడూ నిజం కావు. ఇద్దరి మధ్య సమావేశంలో ఏం జరిగిందో వారు చెబితేనే దానికి విలువ ఉంటుంది. ఇక్కడ మరో అంశం ఏమిటంటే…. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం విశాఖలోనే ఉండడం. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఉప రాష్ట్రపతి ఒకే రోజు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో ఉండడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించేదే!