అన్నమయ్య అన్నది – 12
(రోచిష్మాన్, 9444012279)
“బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము”
అంటూ శ్రీవేంకటేశ్వరుని (అంటే మహావిష్ణువు) పాదంపై అన్నమయ్య పదం పాడుతున్నారు. బ్రహ్మ కడిగిన పాదం ఆ నీ పాదమే బ్రహ్మం అని అంటున్న అన్నమయ్యకు బ్రహ్మం వేంకటేశ్వరుడే లేదా విష్ణువే. అందువల్ల ఆయన పాదం కూడా బ్రహ్మమే. “ఉత్తమమైనదీ, నాశనంలేనిదీ అయిన విష్ణువే బ్రహ్మం” అని రాఘవేంద్రులు చెప్పారు.
ఇంక ఆ పాదం గుఱించి చెబుతున్నారు అన్నమయ్య ఇలా…
“చెఁలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము,
తలఁకక గగనము దన్నిన పాదము
బలరిపుఁ గాచిన పాదము”
విజృంభించి భూలోకాన్ని కొలిచింది నీ పాదం, బలి చక్రవర్తి తలపై మోపబడిన పాదం, జంకు లేకుండా (తలఁకక) ఆకాశాన్ని తన్నిన పాదం అని వామనావతార సంఘటనల్ని పునరుద్ఘాటిస్తున్నారు అన్నమయ్య.
తిరుప్‌పావై మూడో పాసురమ్‌లో “విజృంభించి లోకాన్ని కొలిచిన ఉత్తముడి నామ గానం చేసి” అనీ, అటు తరువాత తిరుప్‌పావై ఇరవైనాలుగో పాసురమ్‌లో “ఆనాడు ఈ లోకాన్ని కొలిచావు పాదానికి అభివాదం” అనీ అంటూ ఆణ్డాళ్ వామనావతారంలో విష్ణువు తన పాదంతో వసుధను కొలిచిన ఘట్టాన్ని చెప్పింది. ఆ మాటల ప్రేరణతోనే, లేదా ఆ మాటలు ఆధారంగానే ఇక్కడ అన్నమయ్య
“విజృంభించి లోకాన్ని కొలిచింది నీ పాదం” అని అన్నారని అవగతమౌతోంది.
ఆకాశంపై పెట్టిన పాదం అని అనడానికి బదులుగా ఆకాశాన్ని తన్నిన పాదం అని అన్నమయ్య మాత్రమే అనగలరు; అన్నారు. ఆపై ఇంద్రుణ్ణి రక్షించిన (బలరిపుఁ గాచిన) పాదం అంటూ ఇంద్రుణ్ణి పలుమార్లు రక్షించిన విషయాన్ని సూచిస్తున్నారు అన్నమయ్య.
“కామిని పాపము గడిగిన పాదము
పాము తలనిడిన పాదము,
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపుఁ బాదము”
అహల్య పాపము కడిగిన (శ్రీరాముడి) పాదం, పాము (కాళీయుని) పడగపై నర్తించిన (కృష్ణుడి) పాదం, ప్రేమతో లక్ష్మీదేవి (శ్రీసతి) పిసికే పాదం, భీకరమైన లేదా ఉద్దండమైన గుఱ్ఱం (అంటే కల్కి) పాదం అని చెప్పారు అన్నమయ్య.
ఇక్కడ కామిని పాపము కడిగిన పాదము అంటూ
అహల్య పాపాన్ని కడిగిన రాముడి పాదాన్ని సూచిస్తున్నారు అన్నమయ్య. కామిని పాపము అంటూ సాహసంతోనూ, సరిగ్గానూ అహల్యను కామిని అనేశారు అన్నమయ్య. ఇంద్రుడివల్ల అహల్య మోసపోలేదు. అహల్య చేసింది పాపం లేదా తప్పు. ‘పాపం చేసినందుకుగానూ రాయిలాగా జడపదార్థమై పడి ఉండమని గౌతముడు శపించాడు’ అనే రామాయణంలో వాల్మీకి చెప్పారు. చేసిన పాపానికి అహల్య కూడా సంఘ బహిష్కరణకు గురై జడపదార్థమై ఒక రాయిలా జీవిస్తోంది.
అప్పటికే చాల కాలం గడిచిపోయింది. తప్పులు చెయ్యడం మానవ నైజం. ఎంత కాలం ఒక మనిషికి శిక్ష కొనసాగుతుంది? ఇక అహల్యను సహజమైన జీవితంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో విశ్వామిత్రుడు జడపదార్థంలా, రాయిలా, జీవచ్ఛవంలా ఉన్న అహల్య ఆశ్రమానికి రాముణ్ణి తీసుకువెళతాడు. తన ఆశ్రమంలో రాముని పాదం పడగానే అహల్యకు ప్రాణం లేచివచ్చింది. అంత రాముడే అహల్య ఆశ్రమానికి వెళ్లి అహల్యను పరిగణించడం జరిగాక ఇతర ఆశ్రమవాసులు కూడా అహల్యను తమలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అహల్య మామూలు మనిషి అయింది. అలా రాముడి పాదంవల్ల అహల్య పాపం కడగబడింది. రాయిగా మారడమూ, రాముడి పాదం తగలగానే మళ్లీ స్త్రీ అవడమూ వాల్మీకి రాసింది కాదు. అహల్య రాయి అవలేదు. తప్పు చేశాక, శిక్ష అనుభవించాక ఎవరినైనా మళ్లీ మామూలు జీవనంలోకి తీసుకురావాలి అన్న విశ్వామిత్రుడి చింతన విప్లవాత్మకమైంది; ఆపై మహోన్నతమైంది. ఆ ఔన్నత్యమే రామాయణం మనకు నేర్పే సంస్కారం.
పామిడి తురగపు పాదము అని అనడంలో పామిడి అన్న పదానికి సముద్రాల లక్ష్మణయ్య ఉద్దండమైన ఆనే అర్థం సరిగ్గా ఉంటుందని తెలియజేశారు. అదే సరైన అర్థంగా ఇక్కడ పొసుగుతోంది. ఈ సంకీర్తనలో వామన, రామ, కృష్ణ , కల్కి అవతారాలు ప్రస్తావించబడ్డాయి.
మఱో సంకీర్తనలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని పాదాలను “పదములివి రెండు సంపదలు సౌఖ్యములు” అనీ, “నీ పాదములే మాకు విధి విధానములు” అనీ, “నీ పాదములే తల్లియును దండ్రి” అనీ, “నీ పాదములే గతి యిహము పరము” అనీ అన్నారు. “ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది” అంటూ మహా విష్ణువు పాదంపై ఇంకో సంకీర్తననూ చేశారు అన్నమయ్య . అందులోనూ “యీ పాదమే కదా యీ బ్రహ్మ కడిగినది” అనీ, “యీ పాదమే కదా యిల నహల్యకు గోరికైనది” అనీ అన్నారు.
ప్రస్తుత సంకీర్తనలో చివరగా …
“పరమ యోగులకుఁ బరిపరి విధముల
పరమొసఁగెడి నీ పాదము,
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము”
గొప్ప యోగులకు నానా విధాలుగా ముక్తిని ఇచ్చేది నీ పాదం, శ్రీ వేంకటగిరి శాశ్వతం అని చూపించిన ఉత్కృష్టమైన స్థానం నీ పాదం అని అన్నారు అన్నమయ్య.
ఈ చరణంలోని శయ్య లేదా పదాల అల్లిక ఎంత బావుందో గమనిద్దాం. అన్నమయ్య పద – పురోగతి అమోఘమైంది. భావాల్ని అక్షర రూపంలోకి తేవడం ఒక అద్భుతమైన కళ. ఆ కళాద్భుతంతో ఈ అన్నమయ్య కృతి ఒక నక్షత్రం. న+క్షత్రం నక్షత్రం; అంటే నశించనిది అని. ఈ కృతి ఎప్పటికీ నశించదు; బ్రహ్మం ఎప్పటికీ నశించదు.
శ్రీవేంకటేశ్వరుని పాదంపై పదంగా నక్షత్రమై ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

