బాండ్లు కొనుగోలు చేసిన ఎల్.ఐ.సి.
వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం
(నవీన్ పెద్దాడ)
అదానీ గ్రూపును గట్టెక్కించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక పెద్ద పథకం వేసిందన్న ఆరోపణలు గట్టిగా వున్నాయి. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రచురించిన ఒక కథనం భారత ఆర్థిక రంగంలో ఒక దుమారమైంది.
ఇందులో ఏదీ చట్టవిరుద్ధం కాదు. ప్రజల డబ్బుని భద్రంగా వుంచవలసిన ఎల్ ఐ సి, అదానీ సంస్థల బాండ్లను కొనడం ద్వారా పెద్ద రిస్క్ చేసింది. పెట్టుబడుల విషయంలో సొంత ప్రమాణాలను పక్కన పెట్టి హడావిడిగా బాండ్లు కొనెయ్యడం, ఎల్ ఐ సి తప్ప మరేసంస్ధా బాండ్లు కొనకపోవడాన్ని బట్టే రిస్క్ “లోతు”ని అర్ధం చేసుకోవచ్చు. మోదీ షా ద్వయంతో అదానీ సాన్నిహిత్యాన్ని బట్టే ఆ లోతున వున్న ఉద్దేశ్యాలను అర్ధం చేసుకోవచ్చు. “ వడ్డించే వాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా మనకి కావలసినది వచ్చే తీరుతుంది” అన్న సామెతను మరోసారి గుర్తు చేసుకోవలసిన సందర్భం ఇది. ఇది ప్రజలకు జవాబుదారీతనంపై, పక్షపాత పెట్టుబడిదారీ విధానంపై (crony capitalism) తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అంతర్గత పత్రాలను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ఈ వివరాలు వెల్లడించింది. 2025 మే నెలలో ఈ ప్రతిపాదన రూపుదిద్దుకున్నట్లు ఆరోపించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం (Department of Financial Services) ఈ పథకాన్ని రూపొందించింది. అదానీ గ్రూప్ కంపెనీలు జారీ చేసిన బాండ్లలో ఎల్ఐసి $3.9 బిలియన్లు పెట్టుబడి పెట్టాలి. ఇది భారతీయ కరెన్సీలో సుమారు 33,000 కోట్ల రూపాయలు.
హిండెన్‌బర్గ్ దాడి ప్రభావం నుంచి అదానీ గ్రూప్ అప్పుడే ఇంకా పూర్తిగా కోలుకోని సమయంలో ఈ పరిణామం జరగడం గమనార్హం. ఈ చర్చల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, ఎల్ఐసి అధికారులు పాల్గొన్నారని పోస్ట్ ఆరోపించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ బెయిలౌట్‌ను గట్టిగా సమర్థించినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదానీని “దార్శనిక పారిశ్రామికవేత్త”గా అభివర్ణించింది. ఎల్ఐసిని ఒక ‘మార్క్యూ ఇన్వెస్టర్’గా (ప్రధాన పెట్టుబడిదారు) ఉపయోగించుకోవాలని మంత్రిత్వ శాఖ భావించింది. తద్వారా అదానీ గ్రూపుపై మార్కెట్‌లో విశ్వాసాన్ని “సంకేతం” (signaling) చేయాలి. ఇతర దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను పెట్టుబడుల వైపు ఆకర్షించాలి. ఇదే వారి అసలు వ్యూహాత్మక లక్ష్యం.
అంతేకాదు, అదానీ బాండ్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జారీ చేసే సెక్యూరిటీల కంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని ఎల్ఐసికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఆరోపణలు ఎల్ఐసి ప్రాథమిక బాధ్యతనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎల్ఐసి వద్ద ఉన్నది కోట్లాది మంది పాలసీదారుల నమ్మకం, వారి ధనం. 2024 మార్చి నాటికి ఎల్ఐసి లైఫ్ ఫండ్ విలువ రూ. 47.85 లక్షల కోట్లు. సంస్థ మొత్తం పెట్టుబడులలో 97 శాతం, అంటే రూ. 52.89 లక్షల కోట్లు, పాలసీదారుల నుండే సమీకరించినవి.
ఎల్ఐసి తన పెట్టుబడుల విషయంలో చాలా సంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తుంది. మొత్తం పెట్టుబడులలో 60 శాతానికి పైగా సురక్షితమైన ప్రభుత్వ సెక్యూరిటీలలోనే పెడుతుంది. కార్పొరేట్ బాండ్లలో పెట్టేది కేవలం 2.5 శాతం మాత్రమే. అలాంటిది, ఒకే కార్పొరేట్ గ్రూపులో, అదీ ప్రమాదంలో ఉన్న గ్రూపులో ఇంత భారీ మొత్తం పెట్టాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు రావడం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
$3.9 బిలియన్ల భారీ పథకం ఆరోపణల వరకే ఉంది. కానీ అదే సమయంలో ఒక కీలకమైన వాస్తవ లావాదేవీ జరిగింది. 2025 మే 30న, ఎల్ఐసి ఒక అదానీ పోర్ట్స్ అనుబంధ సంస్థ బాండ్ ఇష్యూలో $585 మిలియన్లు పెట్టుబడి పెట్టింది. ఇది సుమారు 4,950 కోట్ల రూపాయలు. ఆశ్చర్యకరంగా, ఈ బాండ్ ఇష్యూకు ఎల్ఐసి “ఏకైక చందాదారు” (sole subscriber) కావడం గమనార్హం. అంటే, ఆ బాండ్లను కొనుగోలు చేయడానికి మరే సంస్థా ముందుకు రాలేదని స్పష్టమవుతోంది.
ఏది ఏమైనా, ప్రభుత్వ “సిగ్నలింగ్” వ్యూహం ఫలించినట్లే కనిపిస్తోంది. ఎల్ఐసి పెట్టుబడి తర్వాత, అదానీ గ్రూప్ సులభంగా నిధులు సమీకరించగలిగింది. ఆ తర్వాత అదానీ గ్రూప్ కనీసం $10 బిలియన్ల విలువైన బాండ్లను జారీ చేసింది. యుఎస్-ఆధారిత అథేన్ ఇన్సూరెన్స్ సంస్థ $750 మిలియన్లు పెట్టుబడి పెట్టింది. ఇతర దేశీయ పెట్టుబడిదారులు సైతం ధైర్యంగా ముందుకు వచ్చి, కనీసం రూ. 13,750 కోట్లు ($1.625 బిలియన్లు) పెట్టుబడి పెట్టారు.
వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ఎల్ఐసి ఖండించింది. ఆరోపణలకు ఆధారమైన పత్రం ఏదీ లేదని చెప్పింది. తమ పెట్టుబడులన్నీ బోర్డు స్వతంత్ర నిర్ణయాల మేరకే జరుగుతాయని పేర్కొంది. అయినప్పటికీ, $585 మిలియన్ల లావాదేవీ, దానికి ఏకైక చందాదారుగా ఎల్ఐసి ఉండటం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ మొత్తం ఉదంతం ప్రభుత్వ జవాబుదారీతనంపై, పాలసీదారుల నిధుల భద్రతపై నీలినీడలు పరుస్తోంది.

(వ్యాస రచయిత ప్రముఖ జర్నలిస్టు)

