(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల పిడికెడు మంది యువకులను నాకు అందిస్తే ఈ దేశాన్నే మారుస్తాను. నవతరం, యువతరంపై నాకు నమ్మకం. నా గురువు నాకు అప్పగించిన లక్ష్య సాధనకు యువత నుంచి సమర్థులు లభిస్తారు. సింహాల వలే కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు’
ఇది స్వామి వివేకానందుని విశ్వాసం.
పట్టు సడలించడకుండా గమ్యం చేరేంత వరకు విశ్రమించ వద్దని, భయం దుప్పటి విదిలించాలని, ప్రేమ విశ్వాసాలను పెంపొందించుకోవాలని జనతకు సూచించారు. ‘హృదయపూర్వకంగా స్పందించండి. లక్ష్య శుద్ధి, స్థిర మనస్సు కలిగి ఉండండి. పరిష్కారం తెలుసుకోండి’ అని చేసిన దిశానిర్దేశం సామాన్యుల నుంచి మాన్యుల వరకు ఆలోచింపచేసింది. బాహ్య ప్రపంచాన్ని జయించడం ఘనకార్యమే అయినా, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని అంత:ప్రపంచాన్ని వశం చేసుకోవడం వీరోచిత కార్యమని వ్యాఖ్యానించారు. సమున్నతమైన వ్యక్తిత్వానికి సమగ్ర రూపమైన హనుమ యువతకు ఆదర్శమని, దేహ, బుద్ధి, ఆత్మ బలాలతో సీతాన్వేషణ లక్ష్యాన్ని చేరుకున్నాడని గుర్తు చేస్తూ హనుమను ఆరాధించారు. ఈ లక్షణాలను పెంచేందుకు ప్రోత్సహించేందుకు జీవితాంతం కృషి చేశారు. ‘నువ్వు వేల మందికి నీడనిచ్చి సేదతీర్చే వటవృక్షంగా ఎదగాలి తప్ప నీ సొంత ఆనందాన్ని కాంక్షించే స్వార్థపరుడవు కారాదు. తోటి మానవుడిలో దైవాన్ని దర్శించడం అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి. యువతను చైతన్య పరచి సమాజ వికాసానికి పాటుపడడం కర్తవ్యం’ అనే గురువు రామకృష్ణ పరమహంస హితవు చెప్పారు. ఆధ్యాత్మికత , దేశభక్తి లక్షణాలు మూర్తీభవించిన నరేంద్రుడిపై గురువు మాటలు మరింత ప్రభావం చూపాయి. ‘ఈ జీవితం అత్యల్పం, ఈ స్వల్ప కాలంలో దక్కే కీర్తి ప్రతిష్ఠల కంటే పరుల కోసం జీవించిన వారే నిజంగా జీవించినట్లు. చినిగిన వస్త్రాన్ని వదిలివేసినట్లు ఈ శరీరాన్ని వదిలి వేయ వచ్చు కానీ నా ఆత్మ అక్షరాల మీకు అండగా ఉండి మీలో అత్మ విశ్వాసాన్ని నింపుతుంది’ అని ప్రకటించారు.
పడిలేచిన కెరటమే ఆదర్శం
జయాపజయాలు దైవధీనాలు అనే మాట అటుంచి ప్రయత్నించకుండా పరాజయాన్ని అంగీకరించరాదని, ఓటమికి కుంగిపోకుండా పడిలేచిన కెరటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉద్బోధించారు వివేకానంద(Vivekandana). జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు. గెలవడానికి భగవంతుడు ఎన్నో అవకాశాలు కల్పిస్తాడు. విజయం కలిగిందని విర్రవీగడం, అపజయానికి నిరాశపడడం సరికాదని, గెలుపు శాశ్వతం కానట్టే, అపజయం తుది మెట్టు కాదని అన్నారు. పరాజయం విజయానికి సోపానం కావచ్చు కానీ పరాజయం తుది మెట్టు కాదని ఆయన భావన. ప్రతి వ్యక్తిలోనూ శక్తి ఉంది. అందులో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. తమలోని శక్తియుక్తులను వారివారి సామర్ధ్యాలను బట్టి వినియోగిస్తారు తప్ప ఎవరూ అసమర్ధులు కారంటారు. ‘శక్తి అంతా మీలోనే ఉంది. మీరు ఏదైనా చేయగలరు. బలహీనులమని తలంచక మీలోని దివ్యత్వాన్ని ప్రకటించండి. మీలోని సర్వశక్తులను వెలికితీయండి, నిగూఢ తేజాన్ని ప్రకటించండి’ అని పిలుపునిచ్చారు.
నవతరానికి సనాతన విలువల పట్ల అవగాహన కలిగించాలి. ఆత్మన్యూనతతో వెనుకడుగు వేస్తున్న యువతలో విశ్వాసం పాదుకొల్పి, ఏకాగ్రత, ప్రశాంత చిత్తత అలవర్చాలన్నారు నరేంద్రుడు. మనిషికి ఆత్మన్యూనత, అధికమనుకునే గుణం రెండూ తగినవి కావని, హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతారని, తామే అధికులమనుకోవడమే నిజమైన అజ్ఞానమని వ్యాఖ్యానించారు. తెలివి, బలం, సత్యం, జ్ఞానం వంటివి తన కంటే ఇంకొకరికి ఎక్కువగా ఉంటే చిందులు తొక్కడం అవివేకమని, ఆ లక్షణాలు ఉన్నవారిని మన్నిస్తూనే వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన అవతలి వారిని ద్వేషించ వలసిన పనిలేదన్నారు.
మహిళా హితైషి
ఏ సమాజమైనా అభ్యుదయ పథంలో సాగేందుకు జనబాహుళ్యానికి విద్య అవసరం. పక్షి ఆకాశంలో ఎగిరేందుకు రెండు రెక్కలు సరిగా పనిచేయాలన్నట్లే సమాజ ప్రగతికి స్త్రీపురుషులలిద్దరికి సమాన విద్యావకాశాలు ఉండాలని ఉద్ఘాటించారు. కుటుంబ బాధ్యతల నిర్వహణలో సర్వం త్యాగం చేస్తున్న, కుటుంబం కోసం ప్రాణాలను కూడా పణంగా పెడుతున్న మహిళల కోసం ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. సర్వభూతాల్లో ఒకే ఆత్మ ఉందని వేదాంతం ఘోషిస్తుంటే స్త్రీ పురుష వ్యత్యాసం ఎందుకో అంతుపట్టదని, స్త్రీని స్త్రీగా కాకుండా మానవజాతిలో చూడగలినప్పుడే ప్రగతి సాధ్యమని పిలుపునిచ్చారు.
మహిళలు మానసిక పరిపక్వత సాధించి, జీవితంపై అవగాహన కలిగించుకునేందుకు వీలుగా వివాహ వయస్సు పెంచాలన్న ఆనాటి ఆయన సూచన నేటికి చట్టంగా మారనుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు. బాల్య వివాహాల తంతు దాటిపోయి వివాహ కనీస వయసు 18 సంవత్సరాలుగా నిర్ణయించినా, అది మరి కాస్త పొడిగింపునకు నోచుకోవాలని వివేకానంద సూచించారు. వివాహ కనీస వయస్సును 21 సంవత్సరాలకు సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టసభలో ప్రతిపాదన తెచ్చిన సంగతి తెలిసిందే.
చెన్నపురి-భాగ్యనగరితో బంధం
వివేకానంద చికాకో యాత్రకు ముందుగానే 1893 ఫిబ్రవరి 10-17 తేదీలలో హైదరాబాద్ సందర్శన విశేష ఘట్టంగా చెబుతారు. మదరాసు పర్యటనకు వచ్చిన ఆయనకు భాగ్యనగర వాసుల విన్నపం మేరకు ఇక్కడికి వచ్చి చార్మినార్, నిజాం నివాసం, ఫలక్ నుమా తదితర ప్రదేశాలను సందర్శించారు. 13వ తేదీన సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీ ఆవరణలో ‘మై మిషన్ టూ వెస్ట్’ అనే అంశంపై అనర్గళంగా ప్రసంగించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారట. దీనిని వివేకానందుని మొదటి ‘ప్రజోపన్యాసం’ గా చెబుతారు. మద్రాసు బహిరంగ సభల్లోనూ ప్రసంగించారు. ఆ తరువాత కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రయాణించారు.
ఈ భూమిపై స్వామి వివేకానంద నడయాడింది కేవలం ముప్పయ్ తొమ్మిదన్నరేళ్లు. ఈ తక్కువ జీవన ప్రస్థానంలో సాధించింది అనన్యం. జన్మభూమి ఆధ్యాత్మిక సాంస్కృతిక కీర్తి పతాకాన్ని విదేశీ వినువీధుల్లో ఎగరేశారు. ఆయన బోధనలు ఏ సమాజ యువతకైనా మేలుకొలుపు. ఆయన జన్మదినం జనవరి 12ను ఏటా జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తున్నాం.
(జనవరి 12న వివేకనందుని జయంతి, జాతీయ యువజన దినోత్సవం.)
ALSO READ: లెఫ్ట్ నేతలతో సీఎం భేటీ