విరాట్ విశ్వరూపం
వన్ డేలలో వరల్డ్ రికార్డు
50 వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
ప్రేక్షకులలో ఒక పక్కన అనుష్క శర్మ, మరో పక్కన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్… ఇంకొక పక్కన సహచర క్రికెటర్లు… అంతా చూస్తుండగా విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వన్ డే చరిత్రలో కొత్త చరిత్రను లిఖించాడు. క్రికెట్ దేవుడి సెంచరీల రికార్డును చెరిపేసాడు. రవీంద్ర వేసిన బంతిని బౌండరీకి తరలించి తన 50 వ సెంచరీని సాధించాడు. అంతే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. అనుష్క శర్మ స్టాండ్స్ నుంచే తన భర్త కోహ్లీకి ముద్దుల వర్షం కురిపించింది. ప్రతిగా కోహ్లీ సైతం ఒక ఫ్లైయింగ్ కిస్ ను సమాధానంగా పంపాడు. క్రికెట్ వరల్డ్ కప్ మొదటి సెమి ఫైనల్ లో కోహ్లీ చెలరేగి ఆడాడు. క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని నమోదు చేసి 117 పరుగులకు అవుటయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్
ముంబైలో బుధవారం మొదటి సెమి ఫైనల్లో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన రోగిట్ 38 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 47 పరుగులు చేసి అవుటయ్యాడు. అతనికి తోడుగా నిలిచినా శుభమాన్ గిల్ 77 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరాడు. కోహ్లీ – గిల్ జంట బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ స్టాండ్స్ లో అసహనంగా కదులుతూ కనిపించాడు. కొద్దిసేపటికి అశ్విన్తో ఏదో సందేశం పంపడం… ఆ తరవాత ఒక ఓవరుకే గిల్ రిటైర్డ్ హర్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ దశలో కోహ్లీకి జత కలిసిన శ్రేయాస్ అయ్యర్ ధాటిగా ఆడుతూ, కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలిపాడు. కోహ్లీ అవుటైన తరవాత అయ్యర్ బ్యాటింగ్ స్పీడ్ మరింత పెరిగింది. కోహ్లీ అవుటైన తరవాత అయ్యర్ బ్యాటింగ్ స్పీడ్ మరింత పెరిగింది. 67 బంతుల్లో సెంచరీ పూర్తిచేసాడు. 4 ఫోర్లు, ఎనిమిది సిక్సులు ఇందులో ఉన్నాయి. 105 పరుగులకు అవుటయ్యాడు. భారత్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. గిల్ 80 పరుగులు చేసాడు.