విలువలకు తిలోదకాలిస్తున్నాయని వ్యాఖ్య
మాతృభాషను విస్మరించరాదని హితవు
హితోక్తులు, వ్యంగ్యోక్తులతో సాగిన ప్రసంగం
ఉపమానాలు, నానుడులు, సామెతలతో ఆసక్తికర ఉపన్యాసం
ముట్నూరు సంపాదకీయాలపై పుస్తక ఆవిష్కరణ
హైదరాబాద్, మార్చి 6: పత్రికలలోని వార్తల విషయంలో నాటికీ నేటికీ హస్తిమశకాంతరం ఉందని భారత ఉపరాష్ట్రపతి డా. ఎమ్. వెంకయ్యనాయుడు ఆవేదనతో అన్నారు. ముట్నూరు కృష్ణారావు సంపాదకీయాలపై వెలువరించిన ఎంఫిల్ గ్రంథాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ముట్నూరు సంపాదకీయాలు జాతిని ఉత్తేజితం చేశాయ నిపేర్కొన్నారు. ఆనాటి పత్రికలకూ నేటి పత్రికలకూ మధ్య విలువలే తేడా అని చెప్పారు. ముట్నూరు కృష్ణారావు సంపాదకీయాలపై మరుమూల దత్తాత్రేయ శర్మ ఎమ్‌ఫిల్ చేశారు. దీనిపై ప్రచురించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, శాంతా బయోటిక్స్ అధినేత పద్మభూషణ్ డా. కె. వరప్రసాదరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి, జి. వల్లీశ్వర్, ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి, దర్శనమ్ వ్యవస్థాపకుడు ఎమ్.వి.ఆర్ శర్మ, పుస్తక రచయిత దత్తాత్రేయ శర్మ పాల్గొన్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని జనానికి తెలియజెప్పే విధంగా దర్శనమ్ సంస్థ పనిచేస్తోందని అన్నారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఈ సాయం సంధ్యా సమయంలో చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. వల్లీశ్వర్ చేసిన గ్రంథ సమీక్ష నా మనసుకు ఎంతగానో నచ్చింది. ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతగానో ఉత్సాహాన్నిచ్చింది. మనవారందరిలో అసమాన ప్రతిభా విశేషాలున్నాయి. వాటిని బయటకు తీసుకువచ్చి, ప్రోత్సహించే అంశంలో వెనకబడి ఉన్నాం. అది సరైన పద్ధతిలో జరగడం లేదు. వేదికపై ఉన్న ప్రతి ఒక్కరిలో ఎన్నో ప్రతిభాపాటవాలున్నాయి. దాని గురించి చెప్పడానికి సమయం చాలదు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందు ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చింది. సంగీతం, సాహిత్యం వారి కంఠంలో జాలువారాయి. ఆ వ్యక్తి గిరిజన వాణి పేరిట ఓ విద్యాలయాన్ని నడుపుతున్నారు. ఉప రాష్ట్రపతి అయిన తరవాత నేను రాజకీయ సంరంభానికి దూరంగా ఉండడంతో ఇలాంటి సాహిత్య కార్యక్రమాలకు హాజరవుతున్నాను. రచయితలు, రచయిత్రులలో అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి. అవి బయటకు వచ్చేలా తగిన ప్రోత్సాహాన్ని మనం అందించాలి. చిన్న పిల్లల నుంచి, పెద్దవారి వరకే కాకుండా గృహిణులైన సాధారణ మహిళలు కూడా అద్భుతమైన రచనలు చేస్తున్నారు. కాని వారికి సరైన ప్రోత్సాహం లేదు. ప్రభుత్వాలూ ప్రోత్సహించవు. ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు.. అన్ని ప్రభుత్వాలూ ఇదే తీరు. సంస్థలు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించడం లేదు. పత్రికలు కూడా ఇదే దారిలో ఉన్నాయి. ఈ కారణంగా అనేకమంది ప్రతిభ లోకానికి వెల్లడి కావడం లేదు.
ముట్నూరి సంపాదకీయాలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి
ముట్నూరు కృష్ణారావు గారంటే భారత దేశ ఔన్నత్యాన్ని చాటిచెబుతూ, దేశ భక్తిని రగించిన జ్వాల. ఆయన ఆ రోజుల్లో రాసిన సంపాదకీయాలు నిరుపమానం. ఈ రోజు పత్రికలకు ప్రజాస్వామ్య రక్షణ ఉంది. ఏదైనా అన్యాయం జరిగితే కోర్టులున్నాయి. వీటన్నిటికీ మించి వ్యవస్థ ఉంది. ముట్నూరి గారి రోజుల్లో పరిపాలన అంతా పరాయి వారి చేతుల్లో ఉంది. ముట్నూరి గారు రాసిన సంపాదకీయాలు అగ్నిశిఖల వంటివి. అందరూ చదివి తీరాలి. నేటి యువతరం… ముఖ్యంగా తెలుగు ప్రజలు ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయాలు చదవాలి. వాటిని అధ్యయనం చేస్తే తగినంత స్ఫూర్తి వస్తుంది. ముట్నూరి వారి సంపాదకీయాలను పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చాలనేది నా ఉద్దేశం. భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు మెచ్చదగిన, ఎంచదగిన ప్రముఖులలో ముట్నూరిగారు ముందు వరుసలో నిలుస్తారు. వల్లీశ్వర్ ఈ పుస్తకానికి వెనుక రాసిన నాలుగు మాటలు చదివితే చాలు ముట్నూరి గొప్పతనం తెలుస్తుంది. దేశభక్తి కలిగిన పాత్రికేయులు ఈ పుస్తకాన్ని చదివితే … ఇంతకాలం చదవకపోవడం వల్ల చాలా కోల్పోయామనే భావన కలుగుతుంది. కేవలం కృష్ణా పత్రిక సంపాదకుడిగానే కాక, ముట్నూరిలోని బహుముఖ ప్రజ్ఞ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేయక మానదు. చేవ చచ్చిన కుర్రకారులో చింతనిప్పులాంటి దేశభక్తిని రగిల్చారు. మన యువతలో అద్భుతమైన ప్రతిభ ఉంది. కాని సామాజిక స్పృహ, దేశ భక్తి, జాతీయ భావం, అకుంఠిత దీక్ష వారికి కలిగిస్తే అది దేశానికి మరింత విజ్ఞానాన్ని, వికాసాన్నీ కలిగిస్తుందనే విషయాన్ని మనందరం గుర్తించాలి. రోజువారీ దర్బారుతో ఆయన తన ప్రజ్ఞతో అపర శ్రీకృష్ణ దేవరాయలుగా రాణించేవాడని విన్నాం. అలాంటి వారిని ప్రోత్సహించే పరిస్థితి ఈ రోజు లేదు.
అందరూ బిజీయే… ఏమిటని ప్రశ్నిస్తే తెల్లమొహాలే
రాజకీయ నాయకులు ఫుల్ బిజీ … ట్వంటీ ఫోర్ అవర్స్. మిగతా వాళ్ళందరూ బిజీ … ఏం బీజీ అని అడిగాను ఒకాయన్ని… బిజీ సార్ అన్నాడు. బిజీ అంటే అర్థం కావడం లేదు. కొద్దిగా చెప్పవయ్యా అని అడిగాను. బిజీ అంటే ఏం చేస్తావ్ అని అడిగాను. అదేదో వ్యాపారస్థుడో… మరొకరో కాదు… పిల్లలు కూడా బిజీ.. వాళ్ళ అమ్మమ్మలు అడిగితే బిజీగా ఉన్నా…ఇప్పుడు కాదు అంటారు. ఏం బిజీరా అంటే ఏం లేదు. ఏమీ లేని బిజీయే బిజీ. ప్రతి ఒక్కరూ ఈ రోజు ఏం చేశామని ఒక్కసారి ఆలోచించుకోండి. ఉదయం లేచిన తరవాత రాత్రి పడుకునే ముందు వరకూ ప్రతి క్షణం, ప్రతి నిముషం, ప్రతి గంటా ఏం చేశామో రాసుకుంటే తను ఎంత బిజీగా ఉన్నాడో అర్థం అవుతుంది. సమయాన్ని వృధా చేసుకుంటున్నామని అవగతమవుంది.
శ్రీకృష్ణ దేవరాయల కాలంలో దర్బారులు నిర్వహించే వారు. ముట్నూరి కృష్ణారావుగారి హయాంలో మరో రకమైన దర్బారులుండేవి. పూజ్యలు తెన్నేటి విశ్వనాథం గారు విశాఖపట్నంలో దర్బారు నిర్వహించేవారు. ఆయనతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. దివాకర్ల వెంకటావధాని, తదితర ప్రముఖులంతా పాల్గొనేవారు. భగవద్గీత సహా, సంగీత, సాహిత్య చర్చలు నిర్వహించేవారు. వీటిలో నేను పాల్గొన్నాను. అవి వింటూ ఉంటే చాలా ఆసక్తిగా ఉండేది. సంగీతం, సాహిత్యం పట్ల అనురక్తి ఏర్పడింది. విశ్వనాథంగారు దేశ భక్తుడు, ప్రగతిశీలుడు. అంతకు మించి సంస్కారవంతుడు. అందరూ అలాంటి వారిని ప్రోత్సహించాలి. అలాంటి వారి గురించి ముందు తెలుసుకోవాలి. అందుకు మనకు కాస్త వినే ఓపిక ఉండాలి. వినే ఓపికే లేకపోతే ఎవరినైనా ఎలా ప్రోత్సహించగలం.
ఖైదీలకు ఇతిహాసాలు బోధించిన ముట్నూరి
స్వతంత్ర భారత పోరాటంలో జైలులో మగ్గాల్సిన ప్రతిసారి సహ ఖైదీలకు ఇతిహాసాలను, పురాణాలను, ఇంకా అనేక అంశాలను చెబుతూ వారికి విజ్ఞానాన్ని పంచేవాడాయన. తెలుసుకోవడం…తెలుసుకున్న దాన్ని పంచుకోవడం పెద్దవాళ్ళ ప్రవృత్తిగా ఉండేది. విజ్ఞానాన్ని పెంచుకోవాలి. పంచుకోవాలి. అలాగే ఆస్తి కూడా. పెంచుకోకుండా పంచితే ఏమవుతుందో నేను చెప్పాల్పిన అవసరం లేదు. పెద్దలు అనేవారు పెంచకుండా పంచితే పంచె మాత్రమే మిగులుతుంది బాబూ అని. నేను బహిరంగ సభల్లో అప్పుడప్పుడు చెణుకులూ, ప్రాసలు ఉపయోగిస్తూ ఉంటాను. ఎందుకంటే సులభంగా మనసుకు హత్తుకుని కాస్త మనసులో నిలబడుతుంది.
దురాచారాలపై అలుపెరగని పోరు
అంటరానితనం వంటి దురాచారాలను రూపుమాపడానికి సమాజాన్ని చైతన్యం చేసి, సంస్కర్తగా ముట్నూరి అవిశ్రాంతంగా పోరాడారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళకు అమృత మహోత్సవ్ నిర్వహించుకుంటున్న రోజుల్లో కూడా అంటరానితనం ఉండడం సిగ్గుచేటు. అక్కడక్కడ మన సమాజంలో ఎక్కువ, తక్కువ వంటి భావాలుండడం ఖండనీయం. అప్పర్ క్లాస్…లోయర్ క్లాస్ అంటుంటారు. ఏమిటిది.. మాట్లాడే వారి మైండ్ ఎలా ఉంటుందో అనడానికి ఇది ఉదాహరణ. రైల్లో ప్రయాణం చేయాల్సి వచ్చేటప్పుడు లోయర్ బెర్త్ కావాలంటాం. ఎందుకంటే ఎక్కలేం. అక్కడ అప్పర్ బెర్త్ అవసరం లేదు. సమాజానికి వచ్చేసరికి మాత్రం అప్పర్ క్లాస్… లోయర్ క్లాస్. ఎంత సిగ్గు చేటు. ఈ ఆలోచనను మనం యువతరం, నవతరంలో కలిగించాలి. ఇలాంటి దురాచారాలను రూపుమాపేలా ప్రోత్సహించాలి. జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నారు. వారికీ అవకాశాలివ్వాలి…ప్రోత్సహించాలి… ఇలాంటి ఆలోచనే చర్చకు రాదు. ఎందుకీ వివక్ష ఉండాలి. అమృతోత్సవం సందర్భంగా ఈ ఆలోచన పురుడు పోసుకోవాలి.
ప్రకృతిని గౌరవించాలి
నేను అప్పుడప్పుడు చెబుతుంటాను… ప్రకృతితో కలిసి జీవించాలని. ప్రకృతిని ప్రేమించాలి…ప్రకృతితో కలిసి జీవించాలి. అప్పుడే ఆనందం మరింతగా పెరుగుతుంది. లివ్ విత్ ద నేచర్. ప్రకృతి మనకి మానసికంగా ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. ఆనందాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగిస్తుంది. శాంతిని ఇస్తుంది. నేను ప్రకృతి ప్రేమికుణ్ణి. గాలి, వెలుతురు దేవుడిచ్చిన వరాలు. మనదేశంలో ప్రకృతి చాలా ఎక్కువ. విదేశాలకు పోయి చూస్తే మన ప్రకృతి విలువ తెలుస్తుంది. ఒకరోజు నేను లండన్‌లో కారులో వెడుతున్నాను. కారు డ్రైవర్ గుడ్ మార్నింగ్ చెప్పాడు. టుడే ఈజ్ సన్నీ డే అన్నాడు. వెంటనే నేను ఇక్కడ ఇవాళే సన్నీ డే. భారత్‌లో 365 రోజులూ సన్నీ డేసే అని చెప్పాను. ఈ సన్నీ డేస్‌ని మనం ఉపయోగించుకోవడం లేదు. కొత్త ఆర్కిటెక్చర్ ప్రకారం ఇళ్ళు కట్టుకుంటున్నాం. గాలి రాదు.. వెలుతురుండదు. నాలుగు గోడల మధ్య బందీలం. ఏసీకి అలవాటుపడిపోయాం. ఇంట్లో ఏసీ, ఆఫీసులో ఏసీ, సినిమా హాల్లో ఏసీ, కారులో ఏసీ… సూర్య రశ్మే తగలదు. ఇది ఆరోగ్యానికి ఎంత ఇబ్బంది కలిగిస్తోందో ఎవరికీ అర్థం కావడం లేదు. మన ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. ఆర్కిటెక్చర్లో కూడా మార్పు అవసరం. రావచ్చేమో. కొవిడ్ 19 మనని ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి కారణం ఏమిటి? ఇదే. గాలి.. వెలుతురు లేని నగరాలలో జీవనం మనని కొవిడ్ పాలు చేసింది. అదే ప్రకృతికి దగ్గరగా ఉన్న పల్లెల్లో దీని తీవ్రత లేదు. కారణం.. వారు మంచి గాలి..వెలుతురు,…చెట్ల మధ్య జీవించడమే. కాబట్టి మన మూలాల్లోకి వెళ్ళి ప్రకృతితో కలిసి జీవించడం అవసరం.
ముట్నూరి గురించి మహాత్ముడేం చెప్పాడంటే..
బ్రిటిష్ చట్టానికి లొంగని వ్యంగ్య రచనలతో ముట్నూరి ఆ కాలం పాఠకుల్ని ఉర్రూతలూగించాడని మహాత్మా గాంధీ చెప్పారు. ఆ రచనలలోని శ్లేష బ్రిటిషర్లకు అర్థమయ్యేది కాదు. మనంత తెలివి వారికి లేదు. వారికి రంగు, రుచే కానీ తెలివి చాలా తక్కువ వారికి. కానీ మనలో ఉండే బలహీనతలను గుర్తించి, మనని విభజించి పాలించారు. ఎక్కడినుంచో ఓడల్లో వచ్చి, మనలోని విభేదాలను బాగా పెంచి ఉపయోగించుకున్నారు. కళ్ళల్లో తేజస్సు వెనకాల దాగున్న ఆలోచనలు ఈ జాతిని జ్వలింపచేస్తాయి అంటూ మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీ గురించి అన్నారు. ఈ ఒక్క వాక్యం చాలు ముట్నూరి గొప్పతనం గురించి తెలుసుకోవడానికి. నిర్భీతి, నిజాయితీ, స్థితప్రజ్ఞత ఆభరణాలుగా బిపిన్ చంద్రపాల్ వంటి నాయకుల మనసుల్ని కూడా ముట్నూరి గెలుచుకున్నారు. ఇలాంటి విశిష్ట లక్షణాలు మూర్తీభవించిన ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాల మీద దత్తాత్రేయ శర్మగారు ఎంఫిల్ గ్రంథాన్ని రాయడం ముదావహం. ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఆ కాలంలో మనం ఎందుకు పుట్టలేదా అనిపిస్తోంది. ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపిస్తోంది. ముట్నూరిలాంటి వారి అవసరం ఇప్పుడు చాలా ఉంది.
సంపాదనకీయమైపోయిన సంపాదకీయం
ఈరోజు సంపాదకీయాలు సంపాదనకీయాలై పోయాయి. ఆనాటి సంపాదకీయాలు ఆలోచనలను జ్వలింపజేసేవి. ఆ ఉత్సాహం.. ఆ ప్రోత్సాహం అందరిలో ఆలోచనలను రేకెత్తించేవి. నేను నా తరంలో చదివిన నార్ల వెంకటేశ్వరరావు, కాసా సుబ్బారావు, నీలంరాజు శేషయ్య గార్ల సంపాదకీయాలు అద్భుతంగా ఉండేవి. ఆవేదనను పెంచి ఆందోళనను రెట్టింపు చేసేలా సంపాదకీయాలు ఉండకూడదు. టెన్షన్ క్రియేట్ చేయకూడదు. ముట్నూరి వారి సంపాదకీయాలను చదివి, వారి జీవిత విధానాన్ని అనుసరించగలిగితే మన సంపాదకీయాలు బాగుపడతాయని నేను అనుకుంటున్నాను. పాత్రికేయ రచనలో నూతన ఒరవడి ప్రవేశపెట్టిన ఆ మహానుభావుడి బాణీకి నివాళులు అర్పిస్తున్నాను. పత్రిక లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేం. పత్రిక లేదు అంటే చప్పగా ఉంటుంది. పత్రిక ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ప్రముఖమైనది. పత్రికలను మనం కాపాడుకోవాలి. మంచి పత్రికలను కాపాడాలి. ప్రోత్సహించాలి
రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టుకుంటున్నాయి. నాయకులు పత్రికలు నడుపుతున్నారు. సొంత డబ్బా కొట్టుకోవడానికీ, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఢంకా మోగించడానికే అవి పరిమితమవుతున్నాయి. రెండు పత్రికలు ఉంటే… ఒకదాంట్లో ఉన్నది రెండో దాంట్లో ఉండదు. ఒక దాంట్లో బ్రహ్మాండమైన సభ అని వేస్తారు.. రెండో దాంట్లో పేలవంగా మనుషులు లేని సభ అని ఉంటుంది… ఖాళీ కుర్చీల ఫొటోలు ప్రచురిస్తారు.
సమాచారం ముఖ్యం
సమాచారం అనేది చాలా ప్రధానమైనది. ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దేన్ అమ్యూనిషన్ అని నేనెప్పుడూ చెబుతుంటాను. సమాచారం ఒక అస్త్రం లాంటిది. ఆ సమాచారాన్ని అందించే బాధ్యత పత్రికలది. ప్రసార సాధనాలది. అవి స్వచ్ఛంగా, నిర్భయంగా, నిర్భీతిగా సమాచారాన్ని అందివ్వాలి. ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. మరింత దోహదకారి అవుతుంది. ఈ దేశ ప్రజల ఆలోచనలను సరైన మార్గంలో నడిపించే శక్తి పత్రికలకు మాత్రమే ఉంది. దానిని సరైన దిశలో ఉపయోగించుకునే సామర్థ్యం పత్రికలకు ఉండాలి. సమాజ శ్రేయస్సుకు, భద్రతకు అత్యంత మూలమైన
విలువలను పరిరక్షించడానికి ఎన్నో పత్రికలు మన దేశంలో కృషి చేశాయి. కృష్ణా పత్రిక తరవాత కూడా ఈ వైఖరి కొనసాగింది. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో యువశక్తికి దేశ భక్తిని నూరిపోశాయి. ఆలోచనలను రేకెత్తింపజేసి, జాతీయ భావాన్ని రగిలింపజేశాయి. అప్పుడు కూడా కొంతమంది దేశం సంగతి నాకేమి ఎరుక. చిట్టి నా బొజ్జకు శ్రీరామరక్ష అంటూ ఆలోచించారు. బ్రిటిష్ వారే మేలని భావించిన వారూ ఉన్నారు. మా తాతగారు …వాడు తింటే తేపడనా అని అనేవారు. ఇతరుల పరిపాలనలో బతికిన మనకి బానిస మనస్తత్వం అలవాటైపోయింది. అది మన విద్యా వ్యవస్థలోనూ, మన పరిపాలన వ్యవస్థలోనూ చొరబడి మన మనసుల్ని కలుషితం చేసేసింది. అందులోంచి మనం ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది. దేశానికీ, మనకీ కూడా ఎంతో మంచిది. దీనిని అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ప్రత్యేక స్థానం
తెలుగు ప్రజల హృదయాలలో కృష్ణా పత్రిక సంపాదకునిగా ముట్నూరు కృష్ణారావుగారికి ప్రత్యేక స్థానం ఉండేది. ఆయన సంపాదకీయం అంటే ఒక సంచలనం. చలనం తీసుకొచ్చేది సంచలనం. ఇప్పుడుండే సెన్సేషన్ గురించి నేను చెప్పడం లేదు. ఇప్పుడుండే సెన్సేషన్ సెన్స్‌లెస్. ముట్నూరి తన సంపాదకీయాలతో సంచలనం కలిగించేవాడు. నాలుగు దశాబ్దాలపాటు కృష్ణా పత్రిక సంపాదకత్వం వహించారు. కొంతకాలం ముందు ఒక అమ్మాయి నాతో అంది. సార్ మీరు గతంలో మనసు విప్పి మాట్లాడేవారు. ఇప్పుడేమిటో కాగితాలు చూసి చదువుతున్నారు… చాలా కొరతగా ఉంది అంది. ఇలా చూడటం బాధేస్తోంది అంది. కానీ, నాకు బాధ్యత ఉంది. రాజ్యాంగ పదవిలో ఉన్నాను. ఏది పడితే అది మాట్లాడకూడదు. నేను మాట్లాడే ప్రతిమాటనూ జనానికి చేరవేసే సందర్భంలో వక్రీకరించే ప్రమాదం ఉంది. వివాదాలే వాదాలైపోయాయి. మీరు మాట్లాడేటప్పుడు కాగితాలు పెట్టుకోండి… ఉంటే మంచిది. ఏం మాట్లాడారు… అనే దానికి అవి సాక్ష్యాలుగా ఉంటాయి అని కొందరు అంటారు. నాకు స్వేచ్ఛగా మాట్లాడాలని ఉంటుంది. మనసులో ఉన్న మాట చెప్పాలని ఉంటుంది. అది కూడా వీలయినంతగా మాతృభాషలో మాట్లాడాలి. మాతృదేశంలో మాతృభూమిలో మాతృభాషలోనే మాట్లాడాలి. మన ఎదురుగా ఉన్నవారికి మన భాష అర్థం కాకపోతే.. వారి భాషలో మాట్లాడాలి. అర్థమయ్యే వారికి మనం వేరే భాషలో మాట్లాడితే వ్యర్థమవుతుంది. మనం మాట్లాడేది వారు అర్థం చేసుకోగలుగుతారు.
పాఠ్యాంశాలు మాతృభాషలోనే బోధించాలి
మోడీగారి ప్రభుత్వం ఆ విషయంలో చొరవతీసుకుంది. మన పద్ధతి, మన సంప్రదాయం అని చెబుతుంటారు. మన కట్టు, మన బొట్టు, మన ఆట, మన పాట, మన మాట, మన భాష, మన యాస ఇవన్నీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. వాటిని అప్పుడప్పుడు మిస్సవుతున్నాం. నేను విదేశాలకు వెళ్ళినా ఇదే డ్రెస్‌లో వెడతా. చలిగా ఉంటే పైన ఏదైనా కప్పుకుంటా. ఈ డ్రెస్‌లో వెడితే నన్నెవడో తక్కువ చూస్తాడు అనే భావం కలగదు. మనసులో ఉన్న భావాలను మన మాతృభాషలోనే స్పష్టంగా చెప్పగలగాలి. మాతృభాష కళ్ళలాంటివి.. పరాయి భాష కళ్ళద్దాలలాంటివి. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళే లేకపోతే.. అవెందుకు పనికొస్తాయి. ఇంగ్లీషు నేర్చుకోకూడదా అని అంటే…ఎందుకు నేర్చుకోకూడదు… తప్పని సరిగా నేర్చుకోండి. ముందు అమ్మ భాష నేర్చుకోండి. ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి.. ఫ్రెంచ్ నేర్చుకోండి.. రష్యా నేర్చుకోండి. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. పరిపాలన భాషగా, బోధనా భాషగా మాతృభాష ఉండాలి. న్యాయాలయాల్లోనూ మన భాష ఉండాలి. ఆలయాల్లో కూడా మంత్రం చెప్పిన తరవాత దాని అర్థం తెలుగులో చెప్పాలని నేను అంటూ ఉంటాను. ఈ విషయాన్ని మనందరం గుర్తించాలి. మన భాషని మనం ప్రోత్సహించుకోవాలి. కృష్ణారావుగారి డ్రెస్ చూడండి. తలపాగ, చేతిలో కర్ర. ప్రతి దాంట్లో ఓ సందేశం ఉంది. చేతిలో కర్ర గురించి చెప్పనక్కరలేదు. తలపాగ… హుందాతనాన్ని ఇస్తుంది. చెమట పడితే తుడుచుకోవచ్చు.
ఎండ నుంచి రక్షణ. వాన నుంచి కొంత రక్షణ ఇస్తుంది. దీనివల్ల బహుళార్థ ప్రయోజనం ఉంటుంది. పెద్ద వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఒక సందేశం ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సంవత్సరాల పాటు జీవించిన పూర్వీకుల అలవాట్లను రంగరించి, మేళవించి వారసత్వంగా అందించారు. దాన్ని మనం విసర్జిస్తున్నాం. పక్కవాడు ఏమైనా అనుకుంటాడేమో అని భయపడుతున్నాం. అలంకరణ కన్నా అంతఃకరణ మిన్న.. నేనేమీ కాదనడం లేదు. అంతఃకరణ బాగుంటే అలంకరణ ఎలా ఉన్నా పరవాలేదు. దాంతో పాటు కులం కన్నా గుణం మిన్న అనేదీ తెలుసుకోవాలి. కుల వ్యవస్థ ఎంతటి అనర్థాన్నీ, నష్టాన్నీ కలిగించిందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది దాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీని వెనుక వాళ్ళ స్వార్థం ఉంటుంది. గుణం ఉంటే రాయంచలా జీవించవచ్చు. నేను కూడా మొన్నటి వరకూ రాజకీయ నాయకుణ్ణే. ప్రజా జీవనంలో క్యారక్టర్, కాండక్ట్, క్యాలిబర్, కెపాసిటీ ఈ నాలుగు సి (ఇంగ్లీషు సి) లు ఉండాలి. ఇప్పుడూ ఆ ఫోర్ సిలు ఉన్నాయి. ఈ సి లకు కొత్త నిర్వచనాలు ఇచ్చారు. క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఇవీ ఇప్పుడున్నవి. సమాజానికి ఇవి చాలా ప్రమాదకరం. ఇవి ప్రజాస్వామ్యాన్ని ఎంత బలహీనపరుస్తున్నాయో చూస్తున్నాం. పత్రికలు కూడా రాస్తున్నాయి కుల ప్రభావం ఎక్కువగా ఉంటోందని. ఏ కులానికి ఎన్ని ఓట్లున్నాయో చెబుతున్నాయి. రాయడమే కాదు విశ్లేషిస్తున్నాయి కూడా. విశ్లేషకులది కూడా ఇదే తీరు. కులం ఏం చేస్తుంది అక్కడ. ఎమ్మెల్యే, ఎంపీ ఎవడైనా కులం అంతటికీ మేలు చేయగలడా..ఓ ఊరికి కరెంటు ఇస్తే ఆ ఊరంతటికీ కరెంటొస్తుంది. నీళ్ళిస్తే అందరికీ అందుతాయి. పాఠశాల పెడితే అందరికీ ఉపయోగం. జనాన్ని కూడగట్టడానికి ఇప్పుడు తేలికైన మార్గం టెన్షన్ క్రియేట్ చెయ్యడం. ఈ విషయాలపై సమాజం ఆలోచించాలి. పత్రికలు చైతన్యం తేవాలి.