ఖండించిన ఉప రాష్ట్రపతి కార్యాలయం
విశ్వసనీయతకు దూరంగా సోషల్ మీడియా
హైదరాబాద్, మార్చి 29: సోషల్ మీడియాకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. సమాచారాన్ని ధ్రువీకరించుకోకుండా ప్రచారంలో చేయడంలో ముందు ఉంటోంది. సోషల్ మీడియా ప్రచారం కారణంగా ప్రముఖులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధ్రువపడని సమాచారాన్ని జనాల్లోకి వదిలేసి, చేతులు దులుపుకునే వైఖరి ఇందుకు కారణం. ఒక వార్త ఏదైనా ఇలాంటిది ప్రచారంలోకి వస్తే అంతే సంగతులు. చేతిలో మొబైల్ అందులో వాట్సాప్ ఉంటే చాలు. క్షణంలో కోట్లాదిమందికి సమాచారం చేరిపోతోంది. నిజమా కాదా అనేలోగా అదే నిజమేనేమో అనే భ్రమను కలిగింపచేస్తోంది. తాజాగా ప్రచారంలోకి వచ్చిన సమాచారం రాష్ట్రపతి అభ్యర్థిగా ముప్పవరపు వెంకయ్యనాయుడును ప్రకటించారనేది. ఎంతో గౌరవంగా మెలిగే వెంకయ్యనాయుడు లాంటి వారికి ఇవి ఇబ్బంది పెట్టే వార్తలు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఉప రాష్ట్రపతిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారని వస్తున్న వార్తలపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారని తెలుస్తోంది.
రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారన్న సమాచారం తప్పని ఆయన కార్యాలయ వర్గాలు తెలియజేస్తున్నాయి. వార్తలను ప్రచారం చేసేముందు ధ్రువపరచుకోవాలి. గతంలో వార్తలు చదివే సమయంలో కూడా విశ్వసనీయ సమాచారం మేరకు అనేవారు. సోషల్ మీడియా చెవికి ఒక వండి వార్చిన వార్త అందితే అదే కచ్చితమైన వార్త అని నమ్మేస్తుంది. ప్రచారం చేస్తుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే కనీసం ఇంగితం సోషల్ మీడియాకు కొరవడుతోంది. అలాగని ఈ మీడియాలో వచ్చిన వార్తలన్నీ తప్పని చెప్పలేం. ప్రధాన మీడియా వెలువరించలేని నిజాలను కూడా సోషల్ మీడియా బయటపెట్టింది. శెహభాస్ అనిపించుకుంది. గౌరవనీయ స్థానాలలో ఉన్న వారిపై వార్తలను వదిలేముందు ధ్రువపరచుకుంటే వారికి ఇబ్బందులు ఏర్పడవనే అంశాన్ని గమనంలో పెట్టుకుంటే మంచిది.
ఉప రాష్ట్రపతి కార్యాలయం ఖండన
భారత రాష్ట్రపతి అభ్యర్ధిగా ముప్పవరపు వెంకయ్యనాయుడురిని ఎంపిక చేశారంటూ వస్తున్న వదంతులను ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. దయచేసి ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది.