40 సంవత్సరాల తరవాత థ్రిల్ ఫీల్ అయ్యాను…
ఆర్ఆర్ఆర్‌పై ఆర్జీవీ స్పందన
మాటలకందని భావన కలిగిందన్న వర్మ
ట్రిపుల్ ఆర్ సంచలన విజయాన్ని సాధించింది. అక్కడక్కడా విమర్శలు కూడా ఎదుర్కొంది. ఊహించని విధంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంపై స్పందించారు. చిన్నపిల్లాణ్ణయి పోయానన్నది ఆయన వ్యాఖ్య. ట్విటర్‌లో వర్మ స్పందించారు. రాజమౌళిని ఉద్దేశించి మాట్లాడిన ఆరు నిముషాల నిడివి ఉన్న ఆడియోను పోస్టు చేశారు. ఆయన స్పందన ఆయన మాటల్లోనే…. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూస్తుంటే నాలోని చంటిపిల్లాడు బయటకు వచ్చాడు. చంటిపిల్లాడు అంటే, ఇదేదో చిన్న పిల్లల సినిమా చూస్తున్నానని కాదు. పసిపిల్లలు అనే పదానికి చంటి పిల్లాడు అనే పదానికి చాలా అర్థం ఉంది. చంటి పిల్లలు చాలా హాయిగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. థ్రిల్ ఫీల్ అవుతారు. ఎటువంటి భేషజాలు అడ్డు రావు. ఈ సినిమా ఎలా తీశాడు, ఇందులో ఎటువంటి పరిజ్ఞానం ఉంది… లాంటివేవీ వాళ్ల మనసులో ఉండవు. కేవలం సినిమా చూడటం, థ్రిల్ ఫీల్ అవ్వటం… అంతే… నేను అదే ఫీల్ అయ్యాను. సుమారు 30 – 40 సంవత్సరాల తరవాత ఇలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అందుకే నాలో చంటిపిల్లాడు బయటకు వచ్చాడు అన్నాను. అలా చూడటానికి మన మనసు దేనినీ నిరోధించదు, ఇలా ఎలా జరిగింది అని హేతువు కోసం వెతకదు, మనకు మనమే స్వేచ్ఛా ప్రపంచంలో విహరిస్తాం.
నేను సాధారణంగా చాలా స్పష్టంగా మాట్లాడతాను. ఈ సినిమా గురించి చెప్పటానికి నాకు మాటలు చాలట్లేదు. పరుగులు తీసే నా ఆలోచనలు, నా మాటలు ఈ సినిమా గురించి చెప్పటానికి చాలట్లేదు. బాహుబలి – 2 చూస్తుంటే ఇప్పటికీ హెలెన్ ఆఫ్ ద ట్రాయ్, గ్లాడియేటర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాకి బెంచ్‌మార్క్ లేదు. ఇందులో అన్ని అంశాలు ఆశ్చర్యం కలిగించాయి. ఇదొక అనిర్వచనీయమైన దృశ్యకావ్యం. సినిమా చూస్తుంటే మతిపోయింది. అద్భుతంగా ఉంది. కథనం చాలా ప్రత్యేకంగా ఉంది. ఒక కళాకారుడి కుంచె గీసిన బొమ్మలా ఉంది. నేను కళాకారుడిని కాకపోవచ్చు, నా మనసుకి అలా అనిపించింది. చాలామంది రామ్‌చరణ్, తారక్ పాత్రలను పోల్చుతున్నారు. ఇందులో ఎవ్వరినీ ఎవరితోనూ పోల్చేలా లేదు. అందరి పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. వారిద్దరి మధ్య ఫైట్స్ బ్యాట్‌మాన్, సూపర్‌మాన్‌లా అనిపించాయి. నేను నా ఇమోషన్ ఏంటి అని చెప్పలేకపోతున్నాను. ఎక్కడా ఆపాలో కూడా తెలియట్లేదు.
ఇదొక జీవితకాలానికి ఇచ్చిన విందు. ఇది ఒక సొంత అనుభూతిని క్రియేట్ చేస్తుంది. గత 40 సంవత్సరాలుగా నేను ఇలా చంటిపిల్లాడిలా ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. ఈ సినిమాకి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను.
రాజమౌళీ! మీరు తెలుగు సినీ పరిశ్రమ ఆస్తి కాదు, భారతదేశ సినీ పరిశ్రమ ఆస్తి కాదు. ప్రేక్షకుల ఆస్తి… అంటూ ఆడియో సందేశాన్ని ముగించారు రామ్ గోపాల్ వర్మ.
SndUp | Post info (Can here RGV’s audio message in this clip)