‘అణగదొక్కుడు’ ప్రచారం అపవాదే….
తిరస్కృతే పెట్టుబడిగా ఉన్నత శిఖరాలకు ఘంటసాల
మీ గొంతు మైక్‌కు పనికిరాదన్న వారే మా సంస్థను మరిచారన్నారు
వారం వారం ఘంటసాల స్మృతిపథం
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
‘నేను మద్రాసు రైల్వేస్టేషన్ నిలబడి కొత్త గాయకులను రాకుండా అడ్డుకుంటున్నాను. అంతకు మించి నాకు పనిలేదు….’ ఇది గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యంగ్యోక్తి. తాను ఇతర గాయకులను ఎదగనీయడంలేదని వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ అనేక సందర్భాలలో బాధతో చేసిన వ్యాఖ్య అది. ఇలాంటి ‘అణగదొక్కుడు’ మాటలు ఘంటసాల వారి హయాంలోనూ ప్రచారంలో ఉండేవి. కానీ ఆయన అంత ఘాటుగా స్పందించి ఉండరు. స్పందించినా అప్పట్లో మాధ్యమం ఇంత విస్తృతం కాదు కనుక జనంలోకి వెళ్లి ఉండదు. ఆయనే అలా అనుకుంటే ఇతర గాయకులకు అవకాశాలు దక్కేవే కావని సమకాలీన సినీజనంతో పాటు అభిమానులు చెప్పుకుంటుంటారు. ఆంధ్రదేశంలో ప్రతిభకు కొరతలేదని, మరింతమంది గాయనీ గాయకులు రావాలని, సంగీత రంగాన్ని అలరించాలని వివిధ సందర్భాలలో ఘంటసాల అనేవారు.
సిఫారసులతో అవకాశాలా?
నటించే, పాడే అవకాశాలు దక్కడంలో సిఫారసులు కొంత వరకు పనిచేయ వచ్చు కానీ వాటివల్లే నిలదొక్కుకుంటారని చెప్పడానికి అవకాశం లేదు. అలా అనుకుంటే, హెచ్ఎంవీ సంస్థ సముద్రాల రాఘవాచార్యులు గారి సిఫారసు లేఖనే పక్కనపెట్టి ‘నీ గొంతు పనికి రాదు’ అని ఘంటసాల వారిని నిరాశే పరిచే అవకాశమే ఉండకూడదు. కానీ అదే ఎదురైంది. ఆ తిరస్కృతే ఆయన పట్టుదలకు పెట్టుబడి అయింది. పోయిన చోటనే వెదుక్కోవాలని, కాదన్న వారితోనే ఔననిపించుకోవాలనే లక్ష్యం ముందుకు నడిపింది. ‘నీ గొంతు మైక్ కు పనిరాదు’ అన్న స్థితి నుంచి’ మీరు మా సంస్థను మరచిపోయారు’ అనిపించుకునే స్థాయికి ఎదిగింది ఆ మధురగాత్రం. ‘గుమ్మడికాయంత కృషికి ఆవగింజంత అదృష్టం అవసరం’ సామెత నిజం కావచ్చేమో కానీ సామెతను తిరగేసి నిలదొక్కుకోవాలనుకోవడం ఊహించలేనిది. ముఖ్యంగా సినిమా వ్యాపారంతో కూడిన కళ. తమ అవసరాలు లేక ప్రయోజనాల మేరకే నిర్మాత, దర్శకులు వ్యవహరిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయంలో ఘంటసాల, ఎస్పీలకు కొన్నిచేదు అనుభవాలు తప్పలేదు. అనారోగ్యం, ఇతర కారణాల కారణంగా ఘంటసాల గారు ఐదు పదుల వయసుకే నేపథ్యగానానికి దూరం కావాలనుకోగా, ఏడు పదుల వయస్సులోనూ అద్భుతంగా పాడగలనని నిరూపించుకున్నా, బాలుగారికి అవకాశాలు సన్నగిల్లాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనే దీనిని పరోక్షంగా చెబుతూ, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పాటలకు న్యాయం చేశారు.
పాడలేక పాట మార్పా.!!
శ్యామలాదండకం (మహాకవి కాళిదాసు)లాంటి ఎన్నో సమాస భూయిష్టమమైన వాటిని గుక్కతిప్పుకోకుండా ఒకే టేక్‌లో పాడారు ఘంటసాల. అవసాన దశలో భగవద్గీతను అనన్య సామాన్యంగా ఆలపించిన ఘంటసాల గారు ఒక చిత్రంలోని ఒక పాటను మరింత సరళం చేయాలని కోరి, అవకాశాన్ని జారవిడుచుకున్న వ్యాఖ్యలో నిజమెంతో కానీ దానిని పాడిన గాయకుడిని ఆయన మనసారా ఆశీర్వదించారు. ఆ దర్శక నిర్మాతల అభిరుచిని మన్నించారు. పాడ(లే)క పోతే హుందాగా, మృదువుగా నచ్చెజెప్పేవారు తప్ప తన వీలుకోసం పాటలోనే పదాలను, భాషనే మార్చమనే వారు కాదని నాటి చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్నవారు చెబుతారు.
దాదాపు నేపథ్యగానానికి స్వస్తి పలికేందుకు మానసికంగా సిద్ధపడిన తరవాత కూడా భగవద్గీతను హృద్యంగా ఆలపించడాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ పాటల్లో ఒక్కటైనా ఘంటసాల గాత్రంలో పండాలని కోరుకున్న రచయితుల్లానే(ఉదా:వేటూరి), తమకు ఆయన పాడితే బాగుంటుందని ఆశించిన నటులూ ఉన్నారు.
మోమాట సాయం
కొందరు నటులకు నిర్ణీత గాయకులు పాడవలసి ఉన్నప్పటికీ కారణాంతరాలు, మోహమాటం కొద్దీ ఆ పద్ధతి తారుమారు కావచ్చు. ఉదాహరణకు శ్రీమతి సావిత్రమ్మ ఘంటసాల గారి మాటల్లో చెప్పాలంటే…‘లవకుశ’ చిత్రం నిర్మాణం వ్యయ ప్రయాసలతో సాగుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నిర్మాత ఇతర గాయకులకు పారితోషికం ఇచ్చుకునే స్థోమత లేక ‘ఆ పాటలూ మీరే పాడండి’ అని చిత్ర సంగీత దర్శకుడు కూడా అయిన ఘంటసాల గారిని కోరారు. ఈ చిత్రంలోనే వాల్మీకి పాత్రధారి, గాయకుడు చిత్తూరు నాగయ్య గారు తనకు తాను పాడుకునేందుకు అశక్తతను వ్యక్తం చేస్తూ, ఘంటసాలతో పాడించాలని నిర్మాతకు సూచించారు. ‘నాగయ్యగారి చిత్రాలలో చిన్నపాటి వేషాలు వేసి, గుంపులో గోవిందలా గొంతు కలిపి పొట్ట పోసుకున్న నేను ఆయనకు పాడడం ఏమిటి? ఎంత అపచారం?’ అనుకున్న ఆయన అటు నిర్మాత అసహాయతను, ఇటు నాగయ్య గారి ప్రోత్సాహాన్ని కాదనలేక పోయారు. ఇలాంటి సంఘటనలు ‘తొక్కేయడం’ కిందికి వస్తాయా? అన్నది ప్రశ్న. (వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)