సత్య సినిమాపై ఆలోచన రేకెత్తిస్తున్న ట్వీట్
(Dr. Vijayanthi Puranapanda)
అతనొక మేధావి.
ఆ మేధావితనానికి ఆరు పదులు దాటాయి.
మేధావితనానికి కూడా వయసు ఉంటుందా.
ఉంటుంది. అన్నిటికీ వయసు ఉంటుంది.
వయసు అంటే లెక్కించటమే కదా.
మేధావితనమంటే మెదడే కదా.
అమ్మ కడుపులో తెలివితేటలు మెదడుగా అల్లుకుంటున్నది మొదలుగా మేధావి వయస్సును లెక్కించాలి.
అందుకే ఆ మెదడు షష్టిపూర్తి పండుగ చేసుకుంది.
మరి ఆ మేధావి.. దారి తప్పిన మేధావా.
కావొచ్చు.
ఎందుకు కాకూడదు.
మెదడు పలికిన మంచితో, ‘ఛీ నువ్వు నాకు నచ్చలేదు. నాకు నచ్చినట్లు నా మెదడును నేను మార్చుకుంటాను’ అని పలికింది మెదడుతో మేధావితనం.
అందుకే దారితప్పిన మేధావి అనచ్చు హాయిగా.
అయినా ఆ మేధావి పరివారం, సైన్యం మాత్రం..
మాకు నీ మేధావితనమే కావాలి.
మాకు నీ దారితప్పిన మేధావితనం అక్కర్లేదు.. అంటూ.. అప్పుడప్పుడు ఆ మేధావి మెదడుకు పదునుపెడుతూనే ఉన్నారు.
https://twitter.com/RGVzoomin/status/1881184801765695523
ఎందుకంటే..
ఆ దారి తప్పిన మేధావి..
తనను తానే తగ్గించుకున్నాడు..
ఎవరికీ హాని చేయలేదు.
ఎవరినీ పరుషవాక్యాలతో నిందించలేదు.
ఎవరికీ చెడు చేయలేదు.
ఎవరితోనూ దుష్ప్రవర్తన లేదు.
ఈ దారితప్పిన మేధావిలో…
రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు…
ఒక్కరూ లేరు..
ఈ దారి తప్పిన మేధావిలో..
మంకుపట్టు, నిర్లక్ష్యం, తెగింపు, మేకపోతు గాంభీర్యం ఉన్నాయి.
మేధావి కదా…
దారితప్పిన ఆ మెదడు…
ఇప్పుడు ఆక్రోశిస్తోంది…
వ్యధ చెందుతోంది.
పశ్చాత్తాప పడుతోంది.
గుండె కరిగి కన్నీరై ఆ మెదడును తడి చేసింది…
వేదన పడుతోంది.
బంగారు గతాన్ని రాయిలా చేసుకున్నందుకు ఈ పాషాణ హృదయం ‘శివశంకరీ.. ’ పాటకు కరిగినట్లుగా కరిగి, వెన్నలా, మంచులా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహంలో మెదడు కారుస్తున్న కన్నీరు ఎవరికీ కనపడకుండా, ఆ మంచులో కలిసిపోతోంది.
అయినా కోట్ల హృదయాలు మంచుని తుడుచుకుంటూ, ఆ కన్నీటితో తమ హృదయాలను ఆర్ద్రం చేసుకుంటున్నారు.
ఆ మెదడు మళ్లీ బయటకు వస్తున్నందుకు, తప్పిపోయిన దారి నుంచి తెలుసుకున్న దారిలోకి ప్రవేశిస్తున్నందుకు…
ఎంత ఆనందం.
ఎంత ఆహ్లాదం.
ఎంత హాయి.
ఎంత మధురం.
ఎంత ఘాటు అనుభవం.
ఇదేమి లాహిరి… ఇదేమి లాహిరి..
ఎడారిలోన పూలు పూచె ఎంత సందడి…
అని సంతోషంగా పాడుకుందామా…
నిన్నలేని అందమేమో నిదుర లేచెనెందుకో…
అని ఆలాపిద్దామా…
భలే మంచి రోజు పసందైన రోజు అని…
పండుగ చేసుకుందామా..
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి..
అంటూ..
రెక్కలు విప్పి ఎగురుదామా…
ఎగురుదాం.. ఎగురుదాం…
అంతకంటె ముందు ఒక్క మాట గుర్తు చేద్దాం, చేసుకుందాం…
అది ఆర్జీవీ మెచ్చిన సీతారామశాస్త్రి గారు రాసిన పాట
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
నొప్పి లేని నిమిషమేది జననమైన
మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది
సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారధెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది
నీకె నువ్వు బాసటై™ó
నింగి ఎంత గొప్పదైనా
రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల
మొప్పముందు చిన్నదేనురా
పిడుగువంటి పిడికిలెత్తి
ఉరుమువల్లె హుంకరిస్తే
దిక్కులన్నీ పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి
అదుపులేని కదనుతొక్కి
అవధులన్నీ అధిగమించరా
త్రివిక్రమా పరాక్రమించరా
విశాల విశ్వమాక్రమించరా
జలధిసైతమాపలేని
జ్వాల ఓలె ప్రజ్వలించరా
ఈ పాటను శంఖంలో పోసి చెవిలోకి ప్రవహింపచేద్దాం.
ఈ పాటను తుచ తప్పకుండా ఆచరించమందాం.
అభిమానులున్నారు..
బంధువులున్నారు..
మెదడులోని మేధ ఉంది…
ఇంత కన్న సైన్యమేదిరా…
అని ఒక్కసారి అందరం పలుకుదాం.
చూద్దాం…
మనం కూడా ఓరిమిగా ఉందాం…
ఓటమిని అంగీకరించకుండా ఉందాం..
––––––––––––––
(సత్య 27 సంవత్సరాల సందర్భంగా ఆ సినిమాను పూర్తిగా చూసి, కన్నీళ్లు పెట్టుకుని తన మనసులోని భావాలను ట్వీట్ చేసిన రాముగారి ఆర్ద్ర అంతరంగానికి స్పందిస్తూ..)