హాయి గొలిపే గానానికి చిరునామా

Date:

నేడు రావు బాలసరస్వతి జన్మదినం
(డా. పురాణపండ వైజయంతి)
విలక్షణ గాత్రం, బేస్‌ వాయిస్‌లో పాడే మార్దవ గళం, సినీపరిశ్రమలో పాడిన మొట్టమొదటి నేపథ్యగానం, అతి తక్కువ కాలంలోనే అజరామరమయిన పేరును సంపాదించి అనతికాలంలోనే పరిశ్రమకు దూరమయిన హిందుస్తానీ శైలి గాయని… ఆవిడే రావు బాలసరస్వతి. లలిత సంగీతానికి, అందమైన హాయి అయిన గానానికి చిరునామాగా నిలిచిన బాలసరస్వతి గారితో ఒక పదిహేను ఏళ్లనాడు చేసిన ఇంటర్వ్యూ ఇది. ఆనాటి సంగీత, సాహిత్యాల గురించి తన భావాలను ఆమె ఇందులో పంచుకున్నారు.

ప్ర. చాలా చిన్న వయసులోనే చదువు మానేసి సంగీతంలోకి వచ్చారు కదా, మీ ఇంట్లోవాళ్లు ఎప్పుడైనా ఎగతాళి చేసేవారా?
జవాబు: ఆ… చేసేవారు. అక్కకి ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలకి మూడు
వందలు వచ్చేవి. అక్కలా చదువుకుంటే నీకు కూడా బావుండేది కదా అన్నప్పుడు నాన్నగారు అక్కని పిలిచి, ‘ఇదిగో నువ్వు 30 రోజులు కష్టపడితే మూడు వందలు ఇస్తారు. బాలకి మూడు నిమిషాల పాటకి వెయ్యి రూపాయలు ఇస్తారు’, అని నన్ను సమర్థించేవారు.
ప్ర. మిమ్మల్ని ఆయన బాగా ప్రోత్సహించేవారట?
జవాబు: నన్ను మా నాన్నగారు బాగా ఎంకరేజ్‌ చేశారు. ఆయన వీణ, సితారు వాయిస్తారు. ఆ వారసత్వం నాకు వచ్చిందని ఆయనకి ఆనందం కలిగిందో ఏమో గాని నన్ను చంకలో ఎత్తుకుని మైక్‌ ముందర నిలుచుని పాడించారు. చదువు అబ్బలేదు. బడికి వెళ్లడం కూడా ఇష్టం ఉండేది కాదు. మా ఇంట్లో మిగిలిన వాళ్లు బాగా చదువుకున్నారు. సంగీతం మీద నాకున్న శ్రద్ధ చూసి నాన్నగారు నాకు కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం రెండూ నేర్పించారు. 1939లో ఆలకూరు సుబ్బయ్య గారి దగ్గర సంగీత సాధన మొదలుపెట్టాను. ఆ తరవాత ‘మనక్కాలై వరదరాజన్‌’ గారి దగ్గర నేర్చుకున్నాను. నాకు సంగీతం నేర్పిన గురువులు నేను సంగీతానికి పనికిరానని కితాబిచ్చారు. ఎందుకో గాని నాకు హిందుస్తానీ మీదే మనసు పోవడంతో ‘ఖేల్‌కర్‌’ దగ్గర చేర్పించారు. ఆ తరవాత నాన్నగారు నన్ను ముంబై తీసుకెళ్లి వసంతదేశాయ్‌ దగ్గర సంగీత సాధన చేయించారు.
గురువులందరి దగ్గర ఉన్న శిష్యులలో నేనే చిన్న దాన్ని. నా కోసం మా నాన్న (కావేటి పార్థపారధి) అహర్నిశలు కష్టపడ్డారు. ఇవేకాక మద్రాసులో పిచ్చుమణి అయ్యర్‌ దగ్గర వీణ నేర్చుకున్నాను.


ప్ర: తొలిపాట ఎప్పుడు, ఏ వయసులో పాడారు?
జవాబు:
1934లో…అప్పుడు నాకు ఆరేళ్లు. పరమపురుషా… పరంధామా.. అనే పాట పాడాను. అది విని అందరూ నన్ను చైల్డ్‌ ప్రాడిజీ అన్నారు.
ఆ తరవాత సి. పుల్లయ్యగారి సతీఅనసూయలో గంగ వేషానికిపిలిచారు. అందులో వేసిన వారందరిలోకీ నేనే చిన్నదాన్ని. ఆ చిత్రానికి ఆకుల నరసింహారావుగారు స్వరరచన చేశారు. నా అసలు పేరు సరస్వతి, చిన్నప్పుడు పాట పాడటానికి వెళ్లినప్పుడు ‘బేబీ’ సరస్వతి అని పిలిచారు. దానిని తెలుగులో ‘బాల’ సరస్వతి అన్నారు.
అప్పటి నుంచి నా పేరు బాలసరస్వతిగానే స్థిరపడిపోయింది.
ప్ర: మొట్టమొదట ప్లేబ్యాక్‌ ఎప్పుడు వచ్చింది? మీ సినీజీవిత విశేషాలు వివరించండి.
జవాబు:
నేను సుమారుగా 12 సినిమాలలో నటించాను. అన్నీ చిన్నపిల్లగా ఉన్నప్పుడే నటించాను. సాలూరి వారు రంగంలోకి వచ్చాక సినిమాలో నటించేవారికి పాడటం రాకపోయినా కూడా నాకు పాట నేర్పించి, నా చేతే పాడించారు. 1943లో ప్లేబ్యాక్‌ మ్యూజిక్‌ వచ్చింది. అప్పుడు భాగ్యలక్ష్మి సినిమాకి మొట్టమొదట ప్లేబ్యాక్‌ ఇచ్చాను. పెద్దయ్యాక ఇంక సంగీతం మీదే దృష్టి పెట్టాను. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో పాడాను. ముఖ్యంగా శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, కృష్ణశాస్త్రి గారల పాటలు ఎక్కువ పాడాను.


ప్ర: సాహిత్యానికీ, సంగీతానికీ ఉండాల్సిన సంబంధమేమిటి?
జవాబు:
పాటకు సాహిత్యం ప్రాణం. సాహిత్యంలో ఉన్న భావాన్ని పాటలో చూపగలిగితేనే ఆ పాట కలకాలం నిలబడుతుంది. నేను ముందర పాటను అర్థం చేసుకుని ఆ భావం పలికేలా పాడేదాన్ని. పాటలు పాడేటప్పుడు దాని అర్థం తెలుసుకుని, ఒకవేళ తెలియకపోతే ఎవరినయినా అడిగి తెలుసుకుని ఆ భావం పలికేలా పాడితేనే పాటకి అందం. లేకపోతే పాటలో మార్దవం ఉండదు. గొంతులో మార్పు వచ్చినప్పుడు పాడాలనే తాపత్రయం విడిచిపెట్టాలి. లేకపోతే ఇన్నాళ్లుగా సంపాదించుకున్న మంచి పేరు కాస్తా పోతుంది.
ప్ర: ఆనాటి రచయితల గురించి మీ జ్ఞాపకాలు…
జవాబు:
నేను బసవరాజు అప్పారావుగారి పాటలు ఎక్కువ పాడాను. ఆ తరవాత కృష్ణశాస్త్రి గారివి పాడాను. ఆయన పక్కనే కూర్చుని పదాలలో భావం వచ్చేలా ప్రోత్సహించేవారు. ఎక్కడైనా పదం మారుద్దామని సలహా ఇచ్చినా దానిని సహృదయంతో అంగీకరించేవారు. అలాగే ఆరుద్ర, శ్రీశ్రీ… ఒకరేమిటి ఆ తరం వారంతా రక్తం ధారపోసి పాటను సజీవం చేశారు. అందుకే ఇన్ని సంవత్సరాలయినా కూడా అవి నిలిచిపోయాయి. ఆరుద్ర గారికి నేనంటే అభిమానం. అన్ని విషయాలలోనూ చాలా కోఆపరేటివ్‌గా ఉండేవారు.


ప్ర: లలిత సంగీతానికి రాజేశ్వరరావుగారి కంట్రిబ్యూషన్‌ ఏమిటి?
జవాబు:
ఆకాశవాణిలో లలితసంగీతం అప్పుడే ఇంట్రడ్యూస్‌ చేశారు. అది సాలూరి రాజేశ్వరరావుగారు మొదలుపెట్టారు. ఆయన వచ్చాక లలిత సంగీతంలో చాలా మార్పు వచ్చింది. అంతవరకు నాటకాల్లో పాడే పద్యాల మాదిరిగా సంగీతం ఉండేది. ఆయన స్వరరచనలో ఇద్దరం పాడేవాళ్లం. అవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నేను, సాలూరి వారు కలిసే ఎక్కువ రికార్డులు ఇచ్చాం. మేం ఇచ్చిన మొట్టమొదటి పాట
‘పొదరింటిలో నుండి పొంచి చూచెదవో ఎదురుగా రావోయి చందురుడా చందురుడా’ పాట. ఇది బాగా పాపులర్‌ అయ్యింది. ఆ పాట విడుదల కాగానే అందులో పనిచేస్తున్న సి.ఆర్‌. సుబ్బరామన్, బసవరాజు అప్పారావుగారి ‘తలుపు తీయునంతలోనే’ పాటకు స్వరరచన చేసి నాతో పాడించారు. ఆ తరవాత అందులోనే పనిచేస్తున్న పెండ్యాల చేసిన హనుమచ్ఛాస్త్రి గారి ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి’, కె.వి.మహదేవన్‌ చేసిన ఎస్‌.వి.భుజంగరాయశర్మ గారి ‘ఆలయమున వినపడునదివో…’ పాటలు పాడాను. అవి కూడా బాగా పాపులర్‌ అయ్యాయి. ఆ తరవాత మంచ్యాల జగన్నాథరావుగారి ‘బంగారుపాపాయి బహుమతులు తేవాలి,’ సాలూరి వారి తండ్రి గారయిన సన్యాసిరావు గారి రచన ‘ఆ తోటలోనొకటి’ రికార్డులు వచ్చాయి. ఈ పాట గురించి చలం తన మ్యూజింగ్స్‌లో ప్రస్తావించాడు.
ప్ర: మీరు ఎలాంటి పాటలను పాడడానికి ఇష్టపడేవారు?
జవాబు:
ఏ పాట ఎవరు పాడితే బావుంటుందో చూసి పాటను ఎంచుకుంటే బావుంటుంది. నేను జోలపాటలు, మంచి డాన్స్‌ పాటలు, విషాద గీతాలు, కథానాయిక పాడే సీరియస్‌ పాటలు ఎంచుకునేదాన్ని. మిగతా రకం పాటలు నేను పాడేదాన్ని కాదు. నా గొంతు వాటికి బావుండదు.
1954 నుంచి– 1974 దాకా పాడటం మానుకున్నాను. మళ్లీ పాడదామంటే సంగీతంలో వచ్చిన మార్పులను అంగీకరించలేక పాడటం మానుకున్నాను. కాని 1974లో విజయనిర్మల నిర్మించిన ‘సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో పాడాను. అప్పుడే నారాయణరెడ్డిగారు రచించిన మీరా భజనలు ఎల్‌ పి రికార్డు ఇచ్చాను.


ప్ర: మీకు ఎవరి పాటలంటే బాగా ఇష్టం?
జవాబు:
నాకు మొదటి నుంచి కె. ఎల్‌. సైగల్‌ పాటలంటే చాలా ఇష్టం. ఆయన పాడుతుంటే అరిచి కేకలు పెడుతున్నట్టుగా ఉండదు. మనసుకు సాంత్వన పలుకుతున్నట్టుగా హాయిగా ఉంటుంది. నాకు కూడా అలా పాడటం అంటేనే ఇష్టం. అందుకేనేమో ఆయన పాటలు నచ్చాయి. అలాగే కర్ణాటక సంగీతంలో బాలమురళి, జేసుదాసు సంగీతం అంటే చాలా ఇష్టం. బాంబే జయశ్రీ సంగీతమన్నా కూడా ఇష్టం.


ప్ర: మీ మనసులో పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలేవయినా ఉన్నాయా?
జవాబు:
నాకు ముందు నుంచి హిందీ సంగీత దర్శకుడు నౌషాద్‌ దగ్గర పాడాలని కోరికగా ఉండేది. అది తీరేది కాదని తెలుసు. కాని అది కలా నిజమా అనిపించేలా ఒకసారి ఆయన దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది. అది 1953లో. ఆర్కెస్ట్రా కళ్యాణ్‌జీ–ఆనంద్‌జీ. వెంటనే అక్కడికి వెళ్లాను. నేను నాలుగు పాటలు పాడాల్సి ఉంది. రెండు పాటలు రికార్డింగు పూర్తయ్యాక కారణాంతరాల వల్ల మిగిలినవి పాడలేకపోయాను.
నేను ఏ మాత్రం నిరాశ చెందలేదు. అసలంటూ పాడాను కదా అని తృప్తి చెందాను. ‘నిండుపున్నమి పండువెన్నెలలో’ పాటని బాలమురళి స్వరపరిచారు. నాకు అలా కాక వేరేలా పాడాలనిపించింది. అందుకని ఆయనని అడిగి నేను స్వరపరుస్తాను అంటే అందుకు ఆయన వెంటనే అంగీకరించారు. అది ఆయన సహృదయత.


ప్ర: పాట నాడు… నేడు?
జవాబు:
అప్పుడు చేసిన వారంతా మనుషుల రూపంలో ఉన్న దేవతలు.
అందరూ కొత్తగా ఈ రంగంలోకి రావడం కూడా ఒక కారణం. ఎవరికి వారు మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారు. శక్తినంతా ధారపోసి మంచి సాహిత్యాలు వచ్చేదాకా నిద్రించేవారు కారు. అంతేకాక స్వేచ్ఛగా రాసుకునే సౌకర్యం కూడా ఉంది. అలాగని ఇప్పటివారు బాగా రాయడం లేదనేది నా ఉద్దేశం కాదు. ఎవరికుండే పరిధులు వారికుంటాయి.


(రావు బాల సరస్వతి 97 వ పుట్టిన రోజు సందర్భంగా వ్యూస్ ప్రత్యేకం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...