ఒక అభిమాని సమర్పించిన అక్షర శరం
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
ఒక్కొక్క సాయంత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆహ్లాదభరిత సాయంత్రాలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. ఆ ఆహ్లాదానికి ఆప్యాయత, అనురాగం, అభిమానం తోడైతే… ఆ ఘట్టం మహత్తరంగా ఉంటుంది. ఒక అసాధారణ వ్యక్తిపై ఒక సామాన్యుడు సంధించిన అక్షర శరం దీనికి కారణం. యనమల ప్రకాష్ ఒక సగటు మానవుడు. పుస్తకాల రచన తెలియని వాడు. అతనికి ఎందుకో పుస్తకం రాయాలనిపించింది. అందుకు అతను ఎంచుకున్న వ్యక్తిత్వం ఆర్జీవీ (రామ్ గోపాల్ వర్మ). నిత్యం సంచలనాత్మక ట్వీట్లు, తనదైన మార్క్ వ్యాఖ్యానాలతో వార్తల్లో ఉండే అసాధారణ వ్యక్తిత్వం ఆయనది. ఎవరేమనుకున్నా తాను అనుకున్నది చెప్పేస్తారు. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినరు ఆయన.
ఇది రామాయణం కాదు….
అలాంటి ఆర్జీవీపై ప్రకాష్ రాసిన పుస్తకం పేరు రామ్ గోపాలాయణం. దీనికి అతను పెట్టిన టాగ్ లైన్ ఇది రామాయణం కాదు. అర్జీవీకి అసలు రామాయణం పడదు. పేరులో రాముడున్నప్పటికీ తనకు అది బోరింగ్ సబ్జెక్టు అంటారు ఆయన. తనలో గోపాలుడు కొద్దోగొప్పో ఉన్నాడని నిజాయితీగా అంగీకరిస్తారు. అందుకు ఏమాత్రం సందేహించరు. అలాంటి వర్మ గారిపై, రామాయణం పేరుతో పుస్తకం రాయడం ఏమిటని సందేహం వచ్చేవారికి ప్రకాష్ ఇచ్చే సమాధానం ఒక్కటే… ఆర్జీవీ నాకు దేవుడు అంటారు.
ప్రకాష్ ప్రయత్నానికి అభినందన
ఈ పుస్తకాన్ని ఆర్జీవీ ఆదివారం (జనవరి ఐదో తేదీన) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆర్జీవీతో పాటు, పుస్తక రచయిత యనమల ప్రకాష్, అతని తల్లి, సోదరి, ఆర్జీవీ సోదరి విజయలక్ష్మి, ఆమె భర్త సుబ్బరాజు, తల్లి సూర్యావతి, గాయని మేఘన శరణ్య, మాటల రచయిత రవి, వైజయంతి పురాణపండ, నటుడు కృష్ణుడు, తదితరులు మాట్లాడారు. ప్రకాష్ ప్రయత్నాన్ని అభినందించారు. సైకాలజిస్టు విశేష్ ఈ కార్యక్రమాన్ని నడిపించారు.
ఆర్జీవీతో పోల్చుకుంటే….
ఈ కార్యక్రమంలో ఎవరేమన్నారు అనే కంటే… పుస్తకంలో ఏమున్నది అనేదే ముఖ్యం. అందుకే ఈ పుస్తకాన్ని కొని, చదవండి. అమెజాన్ లో అందుబాటులో ఉంది. కార్యక్రమం ఆసాంతం చక్కగా సాగింది. అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేసిన ఆర్జీవీ ఒక సామాన్యుడిలా ప్రకాష్ తల్లి పక్కన ఒదిగి కూర్చోవడం ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టతను వెల్లడించింది. ఎంతమంది ఇలా ఉండగలరు? అని ప్రశ్నించుకుంటే సమాధానం జీరో.
విశేషమైన కృషి…
పుస్తకం రావడం వెనుక ప్రకాష్ పట్టుదలతో పాటు, విశేష్ విశేషమైన కృషి ఉంది. పేస్ బుక్ లో పరిచయమైన ప్రకాష్ ఆకాంక్షను అర్థం చేసుకున్న, ఆయన దగ్గరుండి నడిపించారు. పుస్తకం బయటకు రావడం నేపథ్యంలో కనిపించే వ్యక్తి విశేష్. ఈ కార్యక్రమాన్ని ఆయన తన వ్యాఖ్యలతో చక్కగా రక్తి కట్టించారు. ఆర్జీవీ చెల్లెలు విజయలక్ష్మి పుస్తకావిష్కరణను తమ సొంత కార్యక్రమంలా నిర్వహించారు.
ఒక జీవి ప్రయాణం అతని జీవితం… ఆర్జీవీ ప్రయాణం ఒక రామాయణం. రాముడిలా నిజమే చెప్పే రాము జీవితంలోని అంశాలు తీసుకుని తాను ఈ సాహసం చేశానని ప్రకాష్ చెప్పడం కార్యక్రమానికి శోభను తెచ్చింది.
For Copies:
Yanamala Prakash, Mobile Number: 9966060693