అన్యాయంగా జైస్వాల్ ను పవెలియనుకు
మరో స్టుపిడ్ ఇన్నింగ్స్ ఆడిన పంత్
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
చెయ్యి దాటిపోయిన టెస్ట్ మ్యాచిని మన అందుబాటులోకి తెచ్చారు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో ఫాలో ఆన్ తప్పింది. తదుపరి బుమ్రా ప్రతిభావంతమైన బౌలింగ్ జట్టు విజయంపై ఆశలు కలిపించింది. అనుకున్నదొక్కటి.. అయ్యింది ఒక్కటి అన్నట్టు… టీం ఇండియా బోల్తా పడింది. కనీసం డ్రా చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. జైస్వాల్ అవుట్ అంశంలో థర్డ్ అంపైర్ ఏకపక్షంగా వ్యవహరించాడనిపించింది. మొదటి మూడు వికెట్లను 33 పరుగులకే కోల్పోయిన దశలో జైస్వాల్ – పంత్ జోడి లంచ్ నుంచి టీ బ్రేక్ వరకూ కుదురుగా ఆడారు.
మొదటి ఇన్నింగ్స్ మాదిరిగానే, పంత్ నిర్లక్ష్యంగా షాట్ ఆడి అవుటయ్యాడు. అంతకు ముందు రోహిత్, కోహ్లిలదీ ఇదే తరహా. ఇద్దరికీ 50 టెస్టులపైనే అనుభవం. ఏ సమయంలో ఎలా ఆడాలో తెలుసు వీరికి. అయినా ఉదాసీనంగా వ్యవహరించారు. రోహిత్ లేని మొదటి టెస్టులో భారత్ సునాయాసంగా గెలిచింది. ఫామ్ లో లేనప్పుడు ఆడడం ఎందుకు? నాలుగు టెస్టుల్లో రెండు, మూడో టెస్టులు డ్రాగా ముగిశాయి. నాలుగో టెస్టు మ్యాచ్ లో బుమ్రా – ఆకాష్ దీప్ కలిసి ఫాలో ఆన్ తప్పించారు. తరవాత రెండో ఇన్నింగ్సులో బుమ్రా చెలరేగి 5 వికెట్లు తీసి.. భారత్ వైపు మ్యాచ్ మొగ్గేలా చేశాడు.
గెలుపో లేదా డ్రానో అవుతుందని భారత క్రికెట్ లవర్స్ అంతా భావించారు. రోహిత్, కోహ్లీ, పంత్ బాధ్యతారహితంగా ఆడి అవుటయ్యాడు. మొదటి ఇన్నింగ్సులో పంత్ ఔటైన తీరు చూసి గవాస్కర్ స్టుపిడ్ అని తిట్టాడు.
రెండో ఇన్నింగ్సులో కూడా పంత్ స్టుపిడ్ గానే అవుటయ్యాడు. ఆస్ట్రేలియన్ టైల్ ఎండర్స్ పాటి వీళ్ళు ఆడలేకపోయారు. అన్నింటికీ మించి జైస్వాల్ ను అవుటుగా ప్రకటించి థర్డ్ ఎంపైర్ షర్ఫుద్దౌలా సైకత్ (బాంగ్లాదేశ్) పక్షపాతాన్ని ప్రదర్శించాడు. స్నికో మీటర్లో ఎక్కడా స్పైక్స్ కనబడకపోయినా అవుటు ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. లెగ్ ఎంపైర్ కు థర్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని తిరస్కరించే వెసులుబాటు ఉంది. కానీ లెగ్ ఎంపైర్ ఆ పని చెయ్యలేదు.
జైస్వాల్ నిరాశగా వెనుతిరగాల్సి వచ్చింది. అప్పుడే ఓటమి ఖరారైపోయింది. డ్రా చేసుకోవడానికి అవకాశం ఉన్నా ఆసీస్ ప్లేయర్స్ అందుకు తావు ఇవ్వలేదు. బ్యాట్స్ మాన్ చుట్టూ ఏకంగా ఎనిమిది మంది ఫీల్డెర్సును మోహరించారు. కరుకైన మాటలతో వారి ఏకాగ్రతను దెబ్బతీసేందుకూ ప్రయత్నించారు. ఈ కలలో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు సిద్ధహస్తులు.
ఈ గెలుపు వన్ ఆఫ్ ద బెస్ట్ అని కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నప్పటికీ, టెస్టు క్రికెట్ చరిత్రలో జైస్వాల్ అవుట్ థర్డ్ ఎంపైర్ కు తీరని మచ్చలా మారుతుంది. అంపైరింగ్ సిస్టం పైనే పునరాలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ సాయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.