చెట్ల సంరక్షణకే జీవితం అంకితం
తులసి గౌడ అరణ్య విజ్ఞాన సర్వస్వం
బీజేపీ సర్కారులో సామాన్యులకు అందలం
(వైజయంతి పురాణపండ, 8008551232)
కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ రాష్ట్రంలో తులసి గౌడ అందరికీ పరిచితురాలు. ఆవిడ వయస్సు 72 సంవత్సరాలు. సంప్రదాయ హళక్కి దుస్తులలో స్వచ్చంగా కనిపిస్తారు. ఇటీవలే ఆవిడ భారత రాష్ల్రపతి రామనాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకోవటంతో వార్తల్లో కనువిందు చేస్తున్నారు. ఆవిడకు భారత రాష్ట్రపతి అయినా ఒకటే సామాన్యులైనా ఒకటే అనే భావన ఉందేమో, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా భక్తిగా పద్మశ్రీని స్వీకరించారు. ఆవిడను అరణ్య విజ్ఞానసర్వస్వం అంటారు. హొన్నల్లిలోని అంకోలా తాలూకాలో నివసిస్తున్న ఆ తల్లి పేరుకు తగ్గట్టే తులసిమాత అనిపిస్తారు…. పద్మశ్రీ అందుకోవటం నాకు ఆనందంగా ఉంది. నేను మన ప్రధాని నరేంద్రమోడీనిక కూడా కలిశాను. చెట్లను నరక్కుండా చూడమని ఆయనకు విన్నవించుకున్నాను… అంటారు తులసీ గౌడ… మొక్కలు నాటడం చాలా మంచి పని. మనమందరం ఆ పని చేయాలి. నేను అనారోగ్యంతో బాధపడుతూ కూడా మరిన్ని మొక్కలను నాటాను… అంటూ ఆనందంగా, బాధ్యతగా చెబుతారు తులసి గౌడ.
ఈ వయో వృద్ధురాలు ఉత్తర కన్నడ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికి సుమారు ముప్పై వేల మొక్కలు నాటారు. అడవిలో మొక్కలు నాటే ఉద్యోగంలో తాత్కాలిక పద్ధతిలో చేరిన తులసి గౌడ అనతి కాలంలోనే తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకున్నారు. కర్ణాటక అటవీ శాఖలో చేరిన తులసమ్మ తన వృత్తి పట్ల గౌరవంతో పాటు, అంకిత భావంతో పనిచేయటం ప్రారంభించారు. మొక్కలు ఎంతో భక్తితో నాటటం ప్రారంభించారు.
వృక్షజాతుల పరిరక్షణ
పడమటి కనుమలలో మాత్రమే ఉండే కొన్ని జాతుల వృక్షాలను తులసమ్మ పరిరక్షించారు. అంతేకాకుండా తన చుట్టుపక్కల ఉన్నవారికి మొక్కలు నాటమని ప్రోత్సహించటంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటు కార్యక్రమానికి నాంది జరిగింది. కొంతకాలం ఒక నర్సరీలో కూడా పనిచేశారు… తులసమ్మకు మొక్కల పట్ల ఉన్న అంకితభావం చూసి, మూతపడే స్థితిలో ఉన్న నర్సరీ కోసం కొంతమంది కార్మికులను నియమించి, మళ్లీ ఆ నర్సరీకి పూర్వ వైభవం తీసుకొచ్చాం. ఆమె పదవీ విరమణ అయ్యేవరకు మాత్రమే కాకుండా, ఆ తరవాత కూడా పనిచేయటం ప్రారంభించారు. స్థానికంగా ఉండే మొక్కల గురించి తనకున్న పరిజ్ఞానం అందరికీ పంచారు తులసమ్మ. … అంటారు తులసమ్మ మనవడు శేఖర్ గౌడ.
పళ్ళ చెట్లను పెంచాలని అధికారులపై ఒత్తిడి
అడవిలోని జంతువులకు ఉపయోగపడే ఫలాలనిచ్చే వృక్షాలను విస్తృతంగా పెంచాలని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అంతేకాదు.. గంజాయి వంటి మత్తునిచ్చే వృక్షాలను పెంచకూడదని కూడా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు…. అటువంటి మొక్కల వల్ల ఉపయోగం లేదు. వాటి బదులుగా మంచి ఫలాలనిచ్చే వృక్షాలను పెంచటం వల్ల వానరాలు ఘాట్ రోడ్ల మీదకు రాకుండా స్వేచ్ఛగా హాయిగా జీవించగలుగుతాయి అంటారు తులసి గౌడ.
హక్కీ తెగకు అరుదైన గౌరవం
హక్కీ తెగకు ఇది రెండో గౌరవం. గాయని, సంఘ సేవకురాలు అయిన సుక్రీ బొమ్మ గౌడ ఇంతకు ముందే ఈ అవార్డును అందుకున్నారు. తులసి గౌడ భారతదేశం గర్వించదగ్గ మహిళ.
గత ఆరు దశాబ్దాలు కాలంలో తులసి గౌడ మొత్తం 30000 మొక్కలు నాటి, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు. మన భారత ప్రభుత్వం మట్టిలో దాగి ఉన్న నిజమైన మాణిక్యాన్ని గుర్తించింది. పద్మశ్రీ అవార్డు అందుకున్న తులసి గౌడను ప్రతిఒక్కరు అభినందించాల్సిందే. పడమటి కనుమలలో స్థానికంగా ఉండే ఔషధ వృక్షాలను పరిరక్షించడమే కాకుండా, మరింతమందిని కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు తులసి గౌడ.