వేద పండితుల నుంచి సన్నిధానం వరకూ
గౌతమి గ్రంధాలయం గొప్పదనం….
ఈనాడు – నేను: 15
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
మరుసటి రోజునుంచే… శ్లోకాల అన్వేషణ ప్రారంభించాను. శ్లోకాలుంటాయని అప్రయత్నంగా నేను అనడమేమిటీ… దానికి రామోజీరావుగారు గో అహెడ్ నువ్వు చేయగలవని ప్రోత్సహించడమేమిటీ… నేనా పనిని మొదలుపెట్టడమేమిటి? అంతా కలలాగ ఉంది. వాటి గురించి చిన్నపాటి ఆధారం కూడా లేదు. వేదాలు కాదు కదా.. సంస్కృతం కూడా చదువుకున్న వాడిని కాదు.. ఎలా… నిజంగానే ఓ డిటెక్టివ్ పనిలా పరిణమించింది. నాకు తెలిసున్న వారితో మొదలుపెట్టాను.
పాలపర్తి మార్గదర్శనం
ముందుగా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌గారు.. మా మావగారికి శిష్యులు. సంస్కృత పండితులు.. విజయవాడలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాలలో తెలుగు అధ్యాపకులు. పుష్కర శ్లోకాలకు సంబంధించిన సమాచారం తన వద్ద లేదన్నారు. ఆయన వేదాలను అభ్యసించారు. పద్దెనిమిది పురాణాలనూ చదివారు. అలాంటిదేమీ వినలేదన్నారు. కానీ వెతికితే దొరికే అవకాశం ఉందన్నారు. సుమారు యాబై ఏళ్ళ నాటి పుస్తకాలలో ఉండొచ్చని సూచించారు. ఆయన మరో పేరు సూచించారు.
రాణి నరసింహ శాస్త్రి గారు…
విజయవాడకే చెందిన సంస్కృత పండితులు. అధ్యాపకులు కూడా. సంస్కృత వ్యాకరణం మీద పరిశోధన గ్రంధాన్ని కూడా రచించారు. ఆయనను అడిగి చూడమన్నారు. నాలుగు రోజులు తిరగ్గా ఆయన దర్శనభాగ్యం కలిగింది. విజయవాడ సత్యనారాయణపురంలో ఆయన ఇల్లు. నన్ను నేను పరిచయం చేసుకుని వచ్చిన విషయాన్ని చెప్పా. ఉన్నాయి కానీ.. శ్లోకాలు ఏ పుస్తకంలో లభ్యమవుతాయో తెలీదన్నారు. అయినా నా వేట ఆగలేదు. అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు.. ఇలా అన్ని పట్టణాలలో సంస్కృత పండితుల్నందర్నీ కలిశాను. కొందరితో ఫోనులో మాట్లాడాను. ఉంటాయంటారు కానీ.. ఎక్కడ లభిస్తాయో చెప్పలేకపోయారు. ఒకాయన అన్నారు.
‘అదేమైనా వెంకటేశ్వర సుప్రభాతమా ఎక్కడపడితే అక్కడ దొరకడానికి.. ఎక్కడో మారుమూల ఉంటుంది. పుష్కరాలకు వచ్చి ముక్కు మూసుకుని భగవద్ధ్యానం చేస్తూ స్నానాలు చేస్తారు తప్ప.. శ్లోకం చదువుతూ కూర్చుంటారా’ అని.
ఇక రోజులలోకి వచ్చేసింది. విఫలమైనట్లేనా… నా శ్రమ వృధా అయినట్లేనా.. లెక్కకు మిక్కిలిగా ఆలోచనలు… రోజూ ఉదయాన్నే వీటికోసం శోధించడం.. రాత్రి విధి నిర్వహణ పూర్తయిన తర్వాత ఎవరో ఒకరిని కలవడం.. ఇలా ఇంచుమించు మూడు నెలలు ఫలితం శూన్యం. విజయవాడలోని రామ్మోహన గ్రంథాలయం, ప్రకాశం జిల్లాలోని వేటపాలెం గ్రంథాలయం, రాజమండ్రిలోని గౌతమి గ్రంథాలయం.. ఇలా పురాతన గ్రంథాలయాలనూ స్పృశించాను శ్లోకాల కోసం. శోకం మిగులుతుందేమోననిపించింది. అప్పుడు జరిగిందా సంఘటన.. ఓ రోజు రాజమండ్రి వెళ్ళాను.. గౌతమి గ్రంథాలయంలో పురాణ సంబంధ గ్రంథాలను పరిశీలిస్తున్నాను. అక్కడి లైబ్రేరియన్ సన్నిధానం నరసింహశర్మగారు నా దగ్గరికి వచ్చారు.
ఏమిటండి వెతుకుతున్నారంటూ అడిగారు. చెప్పా…
పుష్కర శ్లోకాలా… ఈ మధ్యే ఎవరో వచ్చి అడిగారండి.. అయినా ఇక్కడ అలాంటివి దొరికే అవకాశం లేదన్నారు.
మరింత నీరసం ఆవహించింది.
గోడ పత్రిక
ఇక్కడ గౌతమీ గ్రంథాలయం గురించి కొంచెం చెప్పుకోవాల్సి ఉంటుంది. 1898లో ఇది ప్రారంభమైంది. లక్షకు పైగా గ్రంథాలు ఇక్కడ కొలువుతీరాయి. తాళపత్ర గ్రంథాలు, ఎన్‌సైక్లోపీడియాలు.. నవలలు, ఇలా ఎన్నో ఉన్నాయిక్కడ. పద్దెనిమిదో శతాబ్దం నాటి పుస్తకాలను కూడా ఇక్కడ చూడవచ్చు. రాజమండ్రిలోని నాగదేవి (అప్పటి పేరు.. ఇప్పుడు అక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వచ్చింది) టాకీసుకు ఎదురు వీధిలో ఉండేది. ఇదంతా ఒక ఎత్తయితే.. అది నిర్వహించే గోడ పత్రిక ఒక అద్భుతం. గోడ పత్రిక ఏమిటంటారా.. వార్తలు.. ఉదయమే హడావుడిగా కార్యాలయాలకు వెళ్ళేవారు ఇక్కడ కొంత సేపు ఆగి.. పత్రికలలోని ఆనాటి విశేషాలను చదువుకుంటారు. గ్రంథాలయ ఉద్యోగి ఒకరు ఆరోజు హెడ్ లైన్స్‌ను తెల్లటి గోడ మీద నల్ల రంగు పులిమిన భాగంలో రాస్తారు. ఉదయాన్నే ఆరు గంటల కల్లా ఈ పని పూర్తవుతుంది. ఏ రోజైనా అలా వార్తలు రాయలేదంటే.. దారిన వెళ్ళేవారు లోపలికి వెళ్ళి మరీ లైబ్రేరియన్‌ను అడిగిన సందర్భాలున్నాయి. సన్నిధానం శర్మ గారు ఇలా నలబై ఏళ్ళ పాటు గోడపత్రికను నిర్వహించారు. రాజమండ్రి వెళ్ళిన వారెవరైనా ఇప్పటికీ ఆ గోడ పత్రికను చూడవచ్చు. పుష్కరాలకు వెళ్ళిన వారికి అదో ప్రత్యేక ఆకర్షణ.
ఎదురు దెబ్బ
మా తాతగారు కూచిమంచి సూర్యనారాయణ గారు ఆ గ్రంథాలయంలో కొంతకాలం పనిచేశారు. ఏం ఉద్యోగమో నాకు తెలీదు. నాకు ఆరేడేళ్ళ వయసున్నప్పుడు తీసుకెళ్ళేవారు ఆయన వెంట. నాకు బాగా గుర్తు ఓ రోజున కాలి వేలికి ఎదురు దెబ్బ(రాయి) తగిలింది. బొటబొటా రక్తం కారింది. వెంటనే ఆయన సపర్యలు చేసి, రోడ్డు మీద ఎలా నడవాలో నేర్పారు. ఆ రోజుల్లో హైవేలలో తప్ప మిగిలిన రోడ్లన్నీ కంకర రోడ్లే. మొనదేలిన కంకరరాళ్ళ కారణంగా ఇలా గాయపడుతుండడం మామూలే. అలాంటి గాయాల్ని తప్పించుకోవడానికి కాలు ఎత్తి ఎత్తి వేయాలని చెప్పారు. చెప్పడమే కాక చూపించారు కూడా. ఆ సమయంలో పంచె పిక్కల్ని దాటి పైకెళ్ళి పోయింది. నొప్పి పోయి పక్కున నవ్వాను.. ఏమైతేనేం కాళ్ళకి ఎదురు దెబ్బలు తగలకుండా నడవడం వచ్చింది. (ఉద్యోగ జీవితంలో మాత్రం తప్పలేదు లెండి). అలా నడుస్తుంటే తమాషాగా కూడా ఉండేది. నేనొక్కడినేమో అలా నడిచేదని పరికించి చూశా. అందరూ అలానే నడుస్తున్నారు. పరవాలేదనుకున్నా. అలా ఆయనతో లైబ్రరీకి వెళ్ళిన అనుభవం ఉంది. ఇలా అనుభవాల పుటల్నీ తెరిచి కందుకూరి వీరేశలింగం గారిని కూడా గ్రంథాలయం గుర్తు తెస్తుంది.
ఇక శ్లోకాలలోకి… సన్నిధానం నరసింహ శర్మగారు నా పని గురించి తెలుసుకుని ఓ పేరు చెప్పారు. ఆయనో స్వాతంత్య్ర సమరయోధుడు.. ఆయన దగ్గర లభించవచ్చు… అన్నారు. కొంచెం ఉత్సాహం వచ్చింది. ఇంతకీ ఆయన్నెలా పట్టుకోవడం… అన్ని నదుల పుష్కరాలకీ వెళ్ళిన మహానుభావుడాయన. ఇంతకీ ఆయన నాకు దొరికారా… శ్లోకాల జాడను నేను కనుగొనగలిగానా…. తెలుసుకోవడానికి రేపటిదాకా ఆగండోచ్…..