జిల్లాలో పూర్తైన కీలకమైన వంతెన
వేదికపైకి పిలిచి చెప్పిన బాలయోగి
ఈనాడు – నేను: 33
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
కీలక స్థానంలో ఉన్న ప్రజా ప్రతినిధులు సాధారణంగా సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సలహాలు స్వీకరించరు. ఏ నిర్ణయమైనా సంయుక్తంగా తీసుకుంటారు. జిల్లాకు సంబంధించి కీలకమైన ఒక వంతెన అంశంలో మాత్రం అప్పటి లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి ఈ పని చేశారు. కోనసీమకు అత్యంత కీలకమైన వంతెన ఇది. కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. శంకుస్థాపనకు కూడా నోచుకోని పని ఇది. ఈ వంతెన పూర్తయితే, కోనసీమకూ – జిల్లా కేంద్రం కాకినాడకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. కాకినాడకు వెళ్లాలంటే ఎదుర్లంక నుంచి వాహనాలను పంటుపైకి ఎక్కించి రేవు దాటించాల్సి వచ్చేది. అప్పట్లో రాజకీయ కారణాలే కాకుండా, ఇతర అంశాలవల్ల కూడా ఈ వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. వంతెన పడితే, పక్కనే ఉన్న యానాం నుంచి మద్యం కోనసీమలోకి వరదలా ప్రవహిస్తుందని కొందరు నాయకులు అంటుండేవారు. ప్రజా ఉద్యమాలు సైతం ఈ కారణంగానే నీరుగారిపోయాయి. వంతెన నిర్మాణానికి అప్పట్లో నిధుల లేమి అనే కారణాన్ని ప్రధానంగా తెరపైకి తెచ్చి అడ్డుకునే వారు.

ఈ క్రమంలో కోనసీమ కేంద్రం అమలాపురంలో ఉన్న ఈనాడు రిపోర్టర్ పరసా సుబ్బారావు, అప్పటి లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగికి ఒక సూచన చేశారు. అలా చేస్తే నిధుల సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. బాలయోగి ఇది అవుతుందంటావా.. చెబితే కలెక్టర్ పాటిస్తారా అంటూ సందేహం వ్యక్తం చేస్తూనే.. సమంజసంగానే తోచింది. కానీ ఎలా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా ఆ రిపోర్టర్ మార్గం సూచించారు.

1996 లో సంభవించిన తుపాను కారణంగా చిన్నాభిన్నమైన కోనసీమకు ఆదుకోడానికి, విడుదలైన నిధులలో తొమ్మిది కోట్ల రూపాయలు కలెక్టర్ ఖాతాలో ఉండిపోయాయి. ఇంటి ఆవరణలో కూలిపోయిన కొబ్బరి చెట్ల యజమానులకు వీటిని పంపిణీ చేయాలి. వివిధ కారణాల వల్ల అవి ఖజానాలో మూలుగుతున్నాయి. అవి మురిగిపోకుండా, వంతెన నిర్మాణానికి వినియోగించాలని, కలెక్టరుకు చెబితే బాగుంటుంది అనేదే పరసా సుబ్బారావు చేసిన సూచన.

సంబంధిత పంచాయితీలు ఈ నిధులను వంతెన నిర్మాణానికి వాడుకోవడానికి అభ్యంతరం లేదని తీర్మానించి పంపితే సరిపోతుందనేది దాని సారాంశం. ఇది బాలయోగి గారికి మహా గొప్పగా నచ్చేసింది. సరే అన్నారు. సమయం చూసి చెబుతానని సుబ్బారావుకు మాట ఇచ్చారు. అన్నట్టే, ముమ్మిడివరం ఏర్పాటు చేసిన ఒక సభలో వేదికపై ఉన్న కలెక్టర్ సతీష్ చందర్ కి బాలయోగి ఈ విషయం చెప్పారు. మీరు సరేనంటే, నాకు అభ్యంతరం ఏముంటుంది. పంచాయితీలు తీర్మానం చేసి ఇస్తే, నిధులు విడుదల చేస్తానని కలెక్టర్ చెప్పారు. అదే వేదికపైకి బాలయోగి సైగ చేసి సుబ్బారావును పిలిచారు.

కలెక్టర్ గారు ఓకే అన్నారు. వార్త రాసుకో… రికార్డెడ్ గా ఉంటుందని చెప్పారు. అంతే, దీనిని సుబ్బారావు పాటించారు. అప్పట్లో ఆ వంతెన నిర్మాణానికి 71 కోట్ల రూపాయలు అంచనా వేశారు. బాలయోగి, తన పరపతిని ఉపయోగించి నిధులను దాదాపు 35 కోట్ల వరకూ సేకరించారు. అది బ్యాంకులో డిపాజిట్ చేస్తే మరొక పది కోట్ల రూపాయలు వడ్డీ వచ్చింది. దీనికి తోడు యానాం ఎం.ఎల్.ఏ. మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. వంతెన పనులను పర్యవేక్షించడానికి పైకి ఎక్కడానికి స్థంభాలపైకి ఇనుప నిచ్చెనలు వేసుకుని ఎక్కేవారు. ఆయనను రిపోర్టర్లు అనుసరించేవారు.

ఎప్పుడైతే సుబ్బారావు ఆలోచన బాలయోగి గారి ద్వారా అమలుకు నోచుకుందో మిగిలిన నిధులు కూడా వివిధ మార్గాలలో సమకూరాయి. వంతెన పూర్తయ్యింది. శంకుస్థాపన చేసిన బాలయోగి గారే, దీనిని ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ విధి బలీయమైంది కదా… వంతెన పూర్తికాక మునుపే బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అయితేనేమి… జిల్లా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచి ఉంటుంది. ఆ బ్రిడ్జికి బాలయోగి పేరే పెట్టారు. కాకినాడ నుంచి కోనసీమ వైపు వస్తుంటే యానాం దగ్గరకు రాగానే, ఈ వంతెన ఠీవిగా కనిపిస్తుంది. అఖండ గోదావరికి వజ్రాభరణంలా భాసిస్తూ, కనువిందు చేస్తుంటుంది ఈ వంతెన. వాహనాలు రయ్యిరయ్యిమని వేగంగా పరుగులు తీస్తుంటే, బాలయోగి విగ్రహం ఆనందంతో పరవశిస్తున్నట్టు అనిపిస్తుంది. వంతెన ఎక్కగానే, కొబ్బరి తోటలు తలలు ఊపుతూ సందర్శకులను రారమ్మని ఆహ్వానిస్తాయి.
ఈ విజయం వెనుక ఉన్నది ఈనాడు రిపోర్టర్ పరసా సుబ్బారావు. అది అతనికి వ్యక్తిగతంగా ఎంతో గర్వకారణం. ఈ విజయం కూడా ఈనాడు ఖాతాలోనే పడడం సంస్థకు గొప్ప. ఇలా ఎంతమంది బుర్ర పెట్టి ఆలోచిస్తారు. వృత్తితో పాటూ కోనసీమకూ పనికొచ్చే సూచన చేసిన సుబ్బారావు అభినందనీయుడే కదా?
వచ్చే ఎపిసోడ్ లో జి.ఎం.సి. బాలయోగి తూర్పు గోదావరి జిల్లాకు చేసిన సేవలు… ఆయన హఠాన్మరణానికి సంబంధించిన వివరాలు చదవచ్చు…
Sri బాలయోగి గారు ప్రజల తోనూ, పాత్రికేయ మిత్రులతో నూ సన్నిహితంగా మెలిగి సలహాలూ, సూచనలు స్వీకరించే వారు. ప్రజోపకార్యక్రమాలు ఎన్నో చేసిన స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు. ఒక పత్రికా విలేఖరి సలహాను పాటించి జనులందరికీ ఎంతో ఉపయోగకరమైన వంతెనను నిర్మించడం ఎంతైనా అభినందనీయం. ముదావహం. అరుదైన రాజకీయ నాయకుడు.👌👌