అప్పుడు ఆర్.బి. పెండ్యాల గారి సాయం
ఇప్పుడు ఠాగూర్ లైబ్రరీ తోడ్పాటు
ఈనాడు – నేను: 16
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
మనం పని చేయడం ఒక ఎత్తు అయితే… ఆ పనిని సానుకూలం చేయడానికి సాయపడేవారు ఒక ఎత్తు. అలాంటి వారిని జీవితంలో మరిచిపోకూడదు. పుష్కర శ్లోకాల అంశంలో నాకు సాయపడిన ఆర్.బి. పెండ్యాల గారికి ఈ సందర్భంగా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ భాగాన్ని ప్రారంభిస్తున్నాను.
ఆర్.బి. పెండ్యాల
ఖాదీ వస్త్రాలు ధరించి, ఎర్రఫ్రేమున్న కళ్ళ జోడు, భుజానికి సంచి తగిలించుకుని రోడ్డు మీద నడిచి వెడుతూ కనిపిస్తారాయన. స్వాతంత్య్ర సమరయోధుడు. నిస్వార్థజీవి. కుదిరితే సాయం చేయడం తప్ప వేరొకటి ఎరుగరాయన. ప్రతిఫలాన్ని అస్సలు ఆశించరు. నేను మా పెదనాన్నగారి దగ్గర కోస్తావాణిలో పనిచేసినప్పుడు తరచూ అక్కడికి వస్తుండేవారు. పాత్రికేయుడుకూడా. ఉదయాన్నే డిపిఆర్‌ఓ ఆఫీసుకు వెళ్ళడం.. కార్యక్రమాల వివరాలు తెలుసుకోవడం.. వాటికి హాజరవడం ఆయన విధుల్లో ఒకటి. తరచూ డిపిఆర్‌ఓ ఆఫీసులో ఏదో ఒక ప్రెస్‌మీట్ జరుగుతుండేది.. ఉదయం పూట ప్రెస్‌మీట్లలో టిఫిన్, కాఫీ ఏర్పాట్లుండేవి. పాత్రికేయులకు అప్పట్లో జీతాలు పెద్దగా ఉండేవి కావు. చాలీచాలని జీతాలు పుచ్చుకునే వారికి ఇవి ఎంతో సహాయకారిగా ఉండేవి. ఓ రోజు మా పెద్దనాన్నగారు కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారిని అడిగాను.. ప్రెస్‌మీట్ పేరిట పిలిచి టిఫిన్లు, కాఫీలు ఇవ్వడం.. వాటిని మనం తినడం తప్పు కాదా అని..
మనింటికి వస్తే కాఫీ ఇవ్వకుండా పంపుతామా… అయినా అందరూ కాఫీలకోసం వెడతారని అనుకోకు..
అది వారి మర్యాద. అది శ్రుతి మించితే… అంటే మనం ఫలానా ఐటమ్ కావాలని అడగడమో.. లేదా వారు తృణమో పణమో ఇవ్వడమో చేస్తే శ్రుతిమించడమవుతుంది… దానిగురించి ఎక్కువగా ఆలోచించకు అన్నారు. నీకు ఇష్టమైతే తిను.. లేకపోతే లేదు.. అని కూడా చెప్పారు. ఎందుకో నాకు రెండోదే సమంజసమనిపించింది. ఎందుకో తెలుసా….
ఈనాడు రిపోర్టర్ని చూసి…
అప్పుడు రాజమండ్రికి ఈనాడు రిపోర్టర్ ఎవరో గుర్తు లేదు..
పచ్చి మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాదాయన. ఏమిటని అడిగితే అది ఈనాడు విధానమని సమాధానం చెప్పారు. సంస్థ నాకు జీతం ఇస్తోంది.. నేను వారి పని మీద ఇక్కడికి వచ్చాను. కాబట్టి తినను లేదా తాగను అని కుండబద్దలు కొట్టారు.
ఇలాంటి ఓ సమావేశంలో పెండ్యాల గారిని ఒకే ఒకసారి పలుకరించా. రిపోర్టర్లందరికీ ఆయన తలలో నాలుకలా ఉంటారు. ఆయనంటే అందరికీ గౌరవం కూడానూ.. అదీ ఇదీ మాట్లాడుతుంటే.. అన్నారు.. టిఫిన్ కూడా చేయలేదు.. కనీసం కాఫీ తాగు అన్నారాయన. లేదండి అలవాటు లేదు.. అన్నాను.
నేను కూడా మానేద్దామనుకున్నాను. అరవైఏళ్ళ అలవాటు… కుదరలేదు. ఈ జీతాలతో ఏదో నెట్టుకొస్తున్నా… అన్నారు.
ఇక్కడ మరికొంత డీవియేషన్…
నా పెళ్ళికి పెండ్యాల గారు కూడా హాజరయ్యారు. చూసి ఆశ్చర్యపోయా… ఏమిటి ఇక్కడికొచ్చారు… అని సత్యప్రసాద్ గారిని విచారించా… అప్పటిదాకా ఆయన పేరు కూడా అడగలేదు నేను… ఆయనా పెండ్యాల గారు.. ఉషశ్రీగారికి చాలా సన్నిహితులు.. ఎంతో ఉత్తముడు అని చెప్పారు.
ఇక్కడితో ఆయనపై నాకున్న కొద్దిపాటి చులకన భావం పటాపంచలైంది. ఉషశ్రీగారికి సన్నిహితులంటే… ఆయన కచ్చితమైన మనిషే. తేడాగా ఉన్న వారినెవరినీ దగ్గరకు చేరనివ్వరాయన. అప్పుడు నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నాను.
ఓరి! నువ్వా ఇక్కడున్నావేంటి… పెళ్ళి కొడుకు తరఫా… పెళ్ళి కూతురి తరఫా అంటూ నవ్వుతూ అడిగారు.
పక్కనే ఉన్న సత్య ప్రసాద్‌గారు భలేవారేనండి… ఆయనే పెళ్ళి కొడుకనడంతో పెండ్యాల గారు నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
అప్పటినుంచి మా ఇంటికి రాకపోకలుండేవి. రాత్రి ఎనిమిది దాటితే ఎవరూ ఉషశ్రీ గారి ఇంటికి రానవసరం లేదు. ఒకవేళ వచ్చినా… బంధువులైనప్పటికీ… గుమ్మంలోంచే పంపిస్తారు.. పొద్దునే రమ్మని. మొదటిసారి అనుమతి ఉంటుంది. రెండోసారి నుంచి వాళ్ళే వేళ దాటితే రారు. అలా ఓ సారి పెండ్యాల గారు ఉదయం ఆరు గంటలు కాకుండా వచ్చారు ఇంటికి.
ఏమిటింత పొద్దున్నే అడిగారు.. ఉషశ్రీ గారు..
రాత్రే వచ్చా… నీ రూల్ గుర్తుండి.. స్టేషన్‌లో పడుకుని ఇప్పుడొచ్చానన్నారు పెండ్యాల గారు..
పెండ్యాల గారొస్తే ఎంత రాత్రయినా రానిస్తారు.. ఆ సంగతి ఇద్దరికీ తెలుసు. కానీ ఎదుటి వారిని మన్నించడం.. వారి అలవాట్లను గౌరవించడం…
ఎంతమంది చేస్తారీ కాలంలో.. అదీ పెండ్యాల గారిలో విశేషం.
మరో సంఘటన..
మావగారికి ఆరోగ్యం బాగో లేకపోవడంతో ఓసారి ఆయన సాయం ఉండడానికి వచ్చారు. ఊరెళ్ళి సాయంత్రానికల్లా వచ్చేస్తానని వెళ్ళారు. అన్నట్లే వచ్చేశారు. వెళ్ళింది రాజమండ్రినే.. ఆ వయసులో వెళ్ళి రావడం ఎంత కష్టం. వచ్చిన తరవాత ఎందుకెళ్ళావని అడిగారు. ఈరోజు నాకు పెన్షన్ వస్తుంది.. తీసుకుని ఇంట్లో ఇచ్చి వచ్చా. లేకపోతే ఇబ్బందికదా.. అన్నారు.
నేనిచ్చే వాణ్ణి కదా.. ఎమ్‌ఓ చేసుంటే సరిపోయేది కదా అన్నారు ఉషశ్రీగారు.
అలా వద్దు…. నేను నీ దగ్గర డబ్బు తీసుకుంటే.. నేను మీ ఇంటికి వచ్చి తోడుగా ఉండడం స్వార్థమవుతుంది.. అది నాకు ఇష్టం లేదు అంటూ సమాధానం చెప్పారు పెండ్యాల గారు. ఇది ఆస్పత్రిలో వారిద్దరిమధ్య నేనుండగా జరిగిన సంభాషణ.
ఇలాంటివారెంతమందున్నారు… ఈ రోజుల్లో…
ఆయన మీద గౌరవం రెట్టింపైంది నాకు…
మరో ఘటన…
మావగారు హైదరాబాద్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా పెండ్యాల గారు ఆయన కూడా ఉన్నారు. అప్పుడూ ఇంతే.. హైదరాబాద్ నుంచి పింఛను ఇచ్చే తేదీకి రాజమండ్రి వెళ్ళి తీసుకుని ఇంట్లో ఇచ్చి మరుసటి రోజుకల్లా తిరిగొచ్చారు.. పెండ్యాల గారు.. స్నేహం అంటే అది.. నిజమైన స్నేహితుణ్ణి చూశానాయనలో…
సన్నిధానం శర్మగారు చెప్పిన ఆర్.బి. పెండ్యాల గారి పేరు నాలో ఉత్తేజాన్ని నింపింది.. కొత్త శక్తిని కూడా ఇచ్చింది. విజయం తథ్యమనిపించింది.
ఆయన సాయం అవసర పడింది ఇప్పుడు నాకు… పుష్కర శ్లోకాల సేకరణలో…
వెంటనే తెలుసున్న వాళ్ళకి ఫోన్ చేశాను పెండ్యాల గారితో ఎలాగైనా ఫోనులో మాట్లాడించమని..
సరిగ్గా గంటలో ఫోను.. ఆఫీసుకు…
పెండ్యాల గారే..
వెంటనే పని చెప్పా…
సరే చూసి చెబుతానన్నారు..
మరుసటి రోజు సాయంత్రానికి నేను టీకి వచ్చే టైముకి ఇంట్లో ఉన్నారు ఆ పుస్తకంతో.. (పోస్ట్ చేస్తే ఆలస్యమవుతుందని ఆయనే రాజమండ్రి నుంచి విజయవాడకు వచ్చారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది.. చెప్పడానికి ఈ సంఘటన చాలదూ )
దాదాపు ఎనబై ఏళ్ళనాడు ముద్రించింది అది…
అద్భుతం… కానీ సంస్కృతంలో మాత్రమే ఉన్నాయవి..
చాలు దొరికాయి..కావాలంటే వాటిని తర్జుమా చేయించుకోవచ్చనే ధీమా..
ఆ పుస్తకాన్ని ఆయనెప్పుడో గోదావరి పుష్కరాలకి వెళ్లినప్పుడు నాసిక్‌లో కొన్నారట..
దాచిపెట్టారు… నా కోసమే దాచారనుకున్నాను. ఏది ఎప్పుడు ఎవరికి ఎలా చేరుతుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి..
వాటిని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌గారితో తర్జుమా చేయించుకోవడం…
రోజుకో శ్లోకాన్ని పుష్కర రోజులలో ప్రచురించడం అయిపోయింది..
ఇదయిన తరవాత రామోజీరావు గారితో సమీక్ష సమావేశంలో..
మరో ప్రశంస.. బాగా చేశావని..
అప్పుడు ఆచంట సుదర్శన రావుగారు.. చెప్పారాయనకు
ఈనాడు పేపరును ప్రతి ఒక్కరూ స్నాన ఘట్టాలకు తీసుకెళ్ళారట. ఆ శ్లోకాన్ని చదువుకుని స్నానాలు చేశారట..
ఆ సంఘటనలను తాను ఓరోజు స్వయంగా చూశానని ఆచంట వారు చెప్పడం చాలా ఆనందమేసింది.
నా దురదృష్టం ఏమిటంటే… వాటిని నేను పదిల పరచుకోకపోవడం..
ఈనాడులో ఎల్లకాలం ఉండిపోతాననే భ్రమ… అదే కాదు.. నేను రాసిన ఏ ప్రచురణనూ నేను దాచుకోలేదు. ఇప్పుడు అడిగితే వారిస్తారో లేదో నాకు తెలీదు. అయినా నా ప్రయత్నం నేను చేస్తా… ప్రయత్నించాను. కానీ సఫలం కాలేదు. ఈ ఎపిసోడ్ రాయడానికి ముందు పదిహేను రోజులనుంచి అదే పనిలో ఉన్నాను. ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్ గారికి మెసేజ్ పెట్టాను. సమాధానం లేదు. కొందరు మిత్రులను అడిగాను. సాధ్యం కాదని చెప్పారు. ఈనాడు వారు ఇవ్వకపోవడానికి కారణం ఉంది.
నా వృత్తిలో భాగంగా ఈనాడు వ్యవస్థాపకులలో ఒకరైన ముసునూరు అప్పారావు గారు (డాల్ఫిన్ హోటల్ కు ఎండీ కావడంతో ఆయనను డాల్ఫిన్ అప్పారావు అని పిలిచేవారు) మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామోజీ రావు గారి గురించి కొంచెం పరుషంగా మాట్లాడారు. ఆ కారణంగా ఈ శ్లోకాలు ఇచ్చి ఉండరని నేను భావిస్తున్నాను. అందుకు నేనేమీ కుంగిపోలేదు.
విజయవాడ ఠాగూర్ లైబ్రరీ
గౌతమి, వేటపాలెం, గుంటూరు లైబ్రరీలనూ సంప్రదించాను. చివరి ప్రయత్నంగా దుగ్గరాజు శ్రీనివాసరావు గారి సలహా మేరకు శ్రీశ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావు గారికి ఫోన్ చేశాను. ఆయన తక్షణం ఠాగూర్ లైబ్రరీకి వెళ్ళమన్నారు. అక్కడ అన్ని సంవత్సరాల పత్రికలూ ఉన్నాయని చెప్పారు. అక్కడి లైబ్రేరియన్ గారికి నేను వచ్చిన పని చెప్పాను. ఆమె సంబంధిత గది తలుపులు తీయించి, చూస్తూ ఉండండి. మా అటెండర్ రాగానే పంపిస్తాను. అతను కూడా సాయ పడతాడు అని చెప్పడంతో నేను పనిలో పడ్డాను. ఈనాడు పత్రికలు ఉన్న రాక్ దగ్గరకి వెళ్ళాను. అక్కడ పత్రికలు సంవత్సరాలు… నెలల వారీగా చక్కగా సద్ది ఉన్నాయి. నాకు కావాల్సిన 1991 ఆగష్టు బౌండ్ వెంటనే కనిపించింది. నా ఆనందానికి హద్దులు లేవు. అది మెయిన్ పేజీ కావడంతో కొంత నిరాశ చెందాను.. ఈనాడు విజయవాడ మినీ ఉంటుందా అని. ప్రతి మెయిన్ పత్రిక తరవాత మినీ కనిపించింది. వెంటవెంటనే పేజీలు తిప్పి ఆగష్టు 14 వ తేదికి చూసేసరికి నా ఆనందం రెట్టింపు అయ్యింది. ఈనాడు విజయవాడ మొదటి పేజీలోనే పుష్కర శ్లోకం కనిపించింది.
అది కనిపించగానే.. వాటిని సేకరించడానికి నేను చేసిన కృషి అంతా నా కళ్ళ ముందు కదలాడింది. చకచకా నాకు కావాల్సిన పేజీలకు వెళ్లి పుష్కర శ్లోకాలను ఫోటోలు తీసుకున్నాను. లైబ్రేరియన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాను. ఇప్పుడు మొత్తం లైబ్రరీకి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. లైబ్రరీని చక్కగా నిర్వహిస్తున్నారు. ఏ విభాగానికి ఆ విభాగం ఉంది. ముఖ్యంగా పత్రికల విభాగంలో అన్ని దినపత్రికలూ ఎంతో శ్రద్ధగా సంవత్సరాలు, నెలల వారీగా పేర్చి ఉన్నాయి. ఇలాంటి అమరిక అవసరార్థులకు ఎంతో సాయం చేసినట్లవుతుంది. ఈ విషయంలో లైబ్రరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పి తీరాలి.
కృష్ణా పుష్కర తరంగిణి…
1991 గోదావరి పుష్కరాలకు విజయవాడలో ఉన్న మా డెస్కు 1992 కృష్ణా పుష్కరాలకు రాజమండ్రి చేరింది. అయితేనేం… కృష్ణా పుష్కరాలలో కూడా నా చేయి ఉంది…
అప్పుడేం చేశాను..దానికి ఫలితమేమిటి…రేపు చెబుతా…….