ఆ చూపు ఇప్పటికీ గుర్తుంది
ఈనాడులో సిస్టం ఎలా ఉంటుందంటే…
ఈనాడు-నేను: 21
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
ప్రారంభ దినాలలో పట్టణానికి సంబంధించిన వార్తలిచ్చే పేజీలను స్లిప్ పేజీలని పిలిచే వారు.. పట్టణ సర్క్యులేషన్ ఎంతుందో అంతమందికే అది చేరేది.. కాకినాడ… రాజమండ్రి… తొలుత ప్రారంభమైన స్లిప్ పేజీలు…
హృద్యమైన వార్తలు, హృదయ విదారక కథనాలు, స్ఫూర్తిమంతమైన వ్యక్తిత్వాలూ, ఆసక్తికరమైన ఛాయాచిత్రాలు… ఇవే కాకుండా ఇతర స్థానిక వార్తలు…. ఇవీ స్లిప్ పేజీలకు ఆలంబన. ఒకవేళ జిల్లాలో వాడాల్సి వస్తే అది జిల్లా పేజీకి ఇచ్చేవారం… పొరపాటున… జిల్లా వార్త స్లిప్ పేజీలో వాడామా… రామోజీరావు గారి డేగ కళ్ళు ఇట్టే పట్టేసేవి.. వెంటనే
ఈ వార్త ఇక్కడ వాడాలని నిర్ణయించింది ఎవరు? అనే వ్యాఖ్యానం ప్రత్యక్షమయ్యేది… ఆఫీసుకు రాగానే ప్రతి ఉద్యోగీ… అడ్మినిస్ట్రేషన్ తో సహా తెరిచేది రామోజీరావుగారు కామెంట్లు రాసిన పత్రిక ఫైలునే. వారెందుకనుకుంటున్నారా… ప్రకటనలపై కూడా ఆయనకు ఒక దార్శనికత ఉంది. వాటి మీద కూడా కామెంట్లు రాసేవారు…
ఇక నా విషయానికి వస్తే..
రాజమండ్రి స్లిప్ పేజీలో ఓ రోజు ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ప్రచురించాను. అది స్కూలు పిల్లలు గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు ఓ చిత్రాన్ని ఆసక్తిగా చూస్తున్న దృశ్యాన్ని వాడాను. అంతా బాగానే ఉంది… అందరూ ఆ పేజీని చూశారు. ఓకే చేశారు. ఈనాడులో ఏ డెస్కులో పనిచేసిన సబ్ ఎడిటరైనా డ్యూటీలోఉంటే… పేజీలన్నింటినీ అందరూ చూడాల్సిందే. ఏమో ఎవరికి ఏ తప్పు దొరుకుతుందో… తప్పు బయటకు వెళ్ళకూడదు అంతే.. వెడితే చెడ్డపేరు అది రాసిన… లేక పేజీలో పెట్టించిన సబ్ ఎడిటర్‌కా… కానే కాదు.. సంస్థకే.. ఈనాడులో ఇలా వచ్చిందంటారు కానీ.. ఫలానా సుబ్బారాయుడు ఆ తప్పు చేశాడని పాఠకులకు తెలీదు కదా.. అందుకే ఇంత జాగ్రత్త. అంతా అంత జాగరూకతతో ఉంటారు కాబట్టే ఈనాడు బ్రాండ్‌కు అంత ఇమేజ్.
గుండె గుభిల్లు….
మరుసటి రోజు ఉదయం.. నిద్ర లేచి పేపరు చూసే సరికి గుండె గుభేలుమంది. కారణం.. నేను పెట్టిన ఆ ఫొటో రైటప్ తప్పుగా రావడం.. తప్పు అంటే అక్షర దోషం కాదు.. అలాగైతే పరవాలేదు.. సర్దిచెప్పుకోవచ్చు… ఏమిటంటారా… ఆ తప్పు.. మీరే చదవండి..
చిన్నారులు చిత్రించిన జంతువుల చిత్రాలను ఆసక్తిగా చూస్తున్న జంతువులు….
ఇదీ రైటప్…. అర్థమైందా… మీకు… చివరలో ఉన్న జంతువులు బదులు తల్లిదండ్రులు అని ఉండాలి…
నాకు గుండె గబగబా కొట్టుకుంది.. ఆఫీసుకు వెళ్ళగానే… విషయాన్ని ఇన్చార్జి దృష్టికి తీసుకెళ్ళాను…
అరె… చూసుకోలేదా… అన్నారు..
సరే ఎలా జరిగిందో ఓ వివరణ రాసిమ్మన్నారు…
ఇచ్చాను..
మడత పెట్టి… పెర్సనల్ ఫైలుకు పంపించారు…
మరికొద్ది రోజుల్లో సమీక్ష సమావేశం…
ఏం చెప్పాలి…
ఎలా కన్విన్స్ చేయాలి..
చాలా మధన పడ్డాను..
తిండి సహించలేదు..
నిద్ర పోలేదు..
అందరితోనూ ఇది నేను కావాలని చేసినది కాదని చెప్పుకొచ్చాను..
ఎలా జరిగిందో కూడా అర్థం కాలేదు.. ఏదో ట్రాన్స్‌లో చేసినట్లయిపోయింది..
మరి ఈ పేజీని అందరూ చూశారుగా.. ఎవరికీ దొరకలేదేం..
చూసికూడా కావాలని వదిలేశారా.. నన్ను ఇబ్బందిపెట్టడానికే ఇలా చేశారా..
ఇలా..రకరకాల ఆలోచనలు ముప్పిరిగొన్నాయి.
సమీక్ష నివేదికలో కూడా నేను మొదట రాసింది ఆ తప్పిదం గురించే…
పొరపాటు జరిగింది… క్షంతవ్యుణ్ణి అని రాసుకున్నాను అందులో..
రామోజీరావుగారు వరుసగా అందరి నివేదికలూ చదువుతున్నారు…
నా వంతు వచ్చింది…
పేజీలు తిప్పేసి… ఇంతేనా… అన్నారు…
నేనేం మాట్లాడలేదు…
నా పక్కన కూర్చున్న సబ్ ఎడిటర్ నివేదిక అందుకున్నారు..
ఈలోగా మేనేజర్ జివి రావుగారు…
రైటప్‌లో తప్పొచ్చిందండి… అన్నారు..
ఏమిటది.. ప్రశ్న
తల్లిదండ్రులకు బదులు జంతువులు అని వచ్చింది…
కాసేపు నిశ్శబ్దం…
అది రాసిన ఆ జంతువెవరు….
రామోజీరావు గారి వ్యాఖ్య…
కళ్ళజోడు పైనుంచి చూస్తున్నారాయన..
బిక్కచచ్చిపోయాను…
ఆ జంతువు ఎవరు? అన్నందుకు కాదు..
నేరుగా నన్నేమీ అనలేదే అని..
సున్నితంగానూ….మహా స్ట్రాంగ్ గానూ చేసిన ఆ వ్యాఖ్య ఇప్పటికీ నా మస్తిష్కంలో నిక్షిప్తమై పోయింది..
ఆ ఒక్కమాటే అని ఎందుకు నన్ను వదిలేశారో… అర్థం కాలేదు.. నాకు..
శర్మగారు(ఇన్చార్జి) చెప్పేవరకూ..
ఆ పొరపాటు జరిగినప్పట్నుంచీ మేనేజర్ నన్ను గమనించమని చెప్పారుట..
భయపడుతున్నానా లేదా.. పశ్చాత్తాపం ఉందా లేదా..
నా ప్రవర్తన ఎలా ఉంది..
మామూలుగానే ఉన్నానా.. బెరుకుగా వ్యవహరిస్తున్నానా…
అంటూ …
ఈనాడే లోకమనుకున్నాను.. ఓ ప్రభుత్వోద్యోగంలా భావించాను… ఆ తప్పు చూపించి.. ఇంటికి పంపిస్తే…
జీవనమెలా… అనే ఆలోచన నన్ను మీటింగ్ అయ్యే దాకా వెంటాడింది.. ఎప్పుడూ అందర్నీ నవ్విస్తూ… ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉండే నాలో వాళ్ళకి చాలా స్పష్టమైన మార్పు కనిపించిందట… అది గమనించే.. నేను విపరీతంగా భయపడుతున్నాననే నిర్ధారణకు వచ్చిన మేనేజర్ జివి రావుగారు… ఏమీ అనవద్దని.. పని బాగా చేస్తాడనీ… రామోజీరావుగారికి ఫీడ్ బ్యాక్ ఇచ్చారట.
ఆ కారణంగానే నన్ను ఆ ఒక్కమాట అని విడిచిపెట్టేశారు.. జీవన భృతి ముందు.. అన్నం పెట్టే వారితో ఓ మాట అనిపించుకోవడంలో తప్పేంలేదు.. తప్పు చేశాము కాబట్టే కదా..మాట పడాల్సి వచ్చింది.. అని నాకు నేను సర్దుబాటు చేసుకున్నాను.
ఆ సమావేశ అనుభవంతో… ప్రతి సమావేశానికీ ముందు ప్రతి ఉద్యోగిపైనా మేనేజర్ వ్యక్తిగత నివేదికను సమర్పిస్తారనీ… దానిపై ఆధారపడే రామోజీరావుగారు ఉద్యోగులతో మాట్లాడతారనీ అవగతమైంది… వేలాదిమంది ఉద్యోగులను అదుపు చేయడం ఎంతకష్టం… ఇలాంటి ప్రక్రియ ఏదో ఒకటి ఉండాల్సిందే… దానికే ఈనాడులో సిస్టం అని పేరు… (ఇప్పుడు అది గతి తప్పింది. దాని గురించి నా అనుభవాల మాలిక చివరిలో రాస్తాను)
వ్యవహారశైలి మొదలు.. వార్తలు తెప్పించుకోవడం.. వాటిని ఎడిట్ చేయడం నుంచి.. ప్రచురించడం వరకూ ఓ సిస్టం ఉండాలంటూ అనేవారాయన. సిస్టం ఉంటే తప్పిదాలకు ఆస్కారం తక్కువ ఉంటుందనే వారు.. ఎవరు రాయాలి.. ఎవరు దిద్దాలి.. ఆ వార్తకు ఏ ఏ ఫొటోలు వాడాలి… ఇలాంటి అన్ని అంశాలనూ ముందే నిర్ణయించుకోవాలని సూచించేవారు.
నిజమే సిస్టం లేకుంటే అంతా సత్రోల్ (అల్లకల్లోలం) అయిపోతుందని.. ఒక చీఫ్ రిపోర్టర్ పురుషోత్తంగారు అంటూ నవ్వించేవారు అఃదరినీ.
ఏదైనా ప్రమాదం జరిగిందంటే…
ఒకరు వార్తను ఫోనులో తీసుకోవడం… వెంటనే రాయడం.. మరొకరు దాన్ని చదవడం.. ఇంకేం అంశాలు అవసరమో సూచించడం… ఫొటోలు ఎలా వస్తున్నాయో కనుక్కోవడం.. వచ్చిన వాటిలో ఏఏ ఫొటోలు వాడాలో నిర్ణయించడం.. ఫైనల్‌గా పేజీలో ఆ వార్తను ఎక్కడ ఎలా వాడాలి.. ఎలాంటి మేకప్ చేయాలి.. ఇలా అనేక అంశాలను ఓ సిస్టం ప్రకారం చేసేవారం..
అందుకే అప్పట్లో ఈనాడులో మాత్రమే పక్కాగా వార్తల సమర్పణ ఉండేది. ఈ రోజుల్లోలాగా ఇరవై ఏళ్ళ క్రితం.. మెయిల్స్ లేవు.. ఇంటర్నెట్ లేదు… ఫొటోలు బస్సు పార్సిల్‌లో రావాలి. ఆ ప్యాకెట్లను బస్టాండులో ఏర్పాటు చేసే డబ్బాల్లో వేసే వారు.. అక్కడి నుంచి తెచ్చుకోవాలి…
లేదా… ప్రమాద తీవ్రతను బట్టి.. సంబంధిత రిపోర్టర్ వాళ్ళనీ, వీళ్ళనీ బతిమాలుకుని స్కూటర్ మీద యూనిట్‌కి వచ్చి ఇవ్వాలి. ఈలోగా మరొకరికి వార్త చెప్పే బాధ్యతను అప్పగించేవారు.. ఫొటోలు వచ్చేదాకా టెన్షనే.. వచ్చేవాడికి మధ్యలో ఏమీ కాకుండా ఉండాలి…
చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతిలాగ
ఆ బయలుదేరిన రిపోర్టర్ వచ్చే దాకా.. నిరీక్షణే..
ఇలా నిరీక్షించిన రోజులకు లెక్కలేదు..
కానీ సిస్టం కారణంగా… ఎప్పుడూ ఎక్కడా వైఫల్యం లేదు…నిరీక్షణ తప్ప..
ఇలా నిరీక్షించిన ఘట్టాలలో అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవం ఒకటి..
శ్రావణ పౌర్ణమి రోజున స్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు..
రాత్రి పది గంటల తరవాత ఆ వైభోగం ప్రారంభమవుతుంది…
వెంటనే ఆ చిత్రాన్ని కెమెరాలో బంధించి.. స్కూటర్ మీద వచ్చి ఇచ్చేవారు…
అన్నవరం కంట్రిబ్యూటర్ వివివి శాస్త్రి, జగ్గంపేట కంట్రిబ్యూటర్ తులా రాము (తదనంతరం ఆయన అన్నవరం, సింహాచలం దేవస్థానాల పి.ఆర్.ఓ.గా పనిచేశారు). అన్నవరం నుంచి రాజమండ్రి తొంబై కి.మీ.. మొత్తం జాతీయ రహదారే.. విపరీతమైన వేగంతో బస్సులు, కార్లు.. వాటిని మించి క్వారీ లారీలు దూసుకెడుతుంటాయి… అయితేనేం.. వారు ఇద్దరూ లెక్కచేసేవారు కాదు.. వారి లక్ష్యం ఒక్కటే… ఆ చిత్రాన్ని డెస్కుకు చేర్చడం… గంటన్నరలో వచ్చేసేవారు. అప్పట్లో మా డెడ్‌లైన్ 11.45…
వారు వస్తూనే…. డార్క్ రూమ్‌లో దూరేవారు..
వెంటనే ఎక్స్‌పోజ్ చేసి చూసుకునే వారు…. ఇక్కడో టెన్షన్..
ఫొటో సరిగ్గా వస్తుందో రాదోనని..
అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల ఏనాడు… ఫొటో బాగా రాకపోవడం లేదు…
వెంటనే ఖాళీ ఉంచిన జాగాలో ఫొటో పెట్టేసి ప్రింటింగ్‌కు పంపేవారం…
అలా వచ్చిన ఫొటోలకు గుడ్ కామెంట్ తప్పనిసరి…
సమావేశంలో అభినందనలు సరేసరి…
ఒకానొక సమావేశంలో రామోజీరావుగారు ఓ హెచ్చరిక కూడా చేశారు..
ఫలానా వార్తను స్కోర్ చేయాలనో.. ఫొటోను ఎక్స్‌క్లూజివ్‌గా వాడాలనో అనుకుని దుస్సాహసాలకు పూనుకోవద్దని సూచించారు..
ఏమైనా జరిగితే… జీవితాంతం బాధపడాల్సి వస్తుందనీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరేవారాయన.. (ఇప్పుడు ఏ సంస్థలోనూ ఇలా చెప్పేవారు లేరు)
ఇలా చెప్పిన ఆయనే… ఒకవేళ విఫలమైతే సమావేశంలో ఏమనే వారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా…
స్కోర్ వార్తలకూ…. అందుకు కారకులైన వారికీ ప్రోత్సాహకాలుండేవి… తన శ్రమకు ఫలితం లభించడం కంటే ఏం కావాలి.. ఆ వ్యక్తికి….
ఈనాడు కోసం సర్వశక్తులూ ధారపోసేవారికి కొదవలేదు… అలాంటి వ్యక్తినొకరిని మీకు త్వరలో పరిచయం చేస్తాను..
1980 దశకంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఐదుగురు ఐఎఎస్ ఆఫీసర్లను కిడ్నాప్ చేసిన ఘటన గుర్తుందా…
సమాచార సాధనం ఏమీ లేని ఆ రోజుల్లో ఈ వార్తను లోకానికి వెల్లడించారు ఆ వ్యక్తి. అదీ ఈనాడు ద్వారా… ఈనాడు ద్వారా అది వెలుగులోకి వచ్చే వరకూ ఆ అధికారులు ఏమై పోయారో ఎవరికీ తెలీదు… అదీ ఈనాడు కోసం పనిచేసే సిబ్బంది… తపన…
మిగిలింది….రేపు