24 గంటల ఉత్కంఠ
నక్సల్స్ డిమాండ్లకు తలొంచిన ప్రభుత్వం
ఇప్పుడు ఆ నక్సల్స్ ఎక్కడున్నారంటే…
ఈనాడు – నేను: 39
(కూచిమంచి వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

ఒక కంట్రిబ్యూటర్ ప్రభావం ఇంతగా ఉంటుందా? కంట్రిబ్యూటర్స్ అంటే వార్త పత్రికకు కీలక సమాచార సాధకులు. మారుమూల ప్రాంతాలనుంచి సైతం వార్తలను డెస్కుకు చేర్చడంలో నిపుణులు. అతి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో వార్తల సేకరణ అత్యంత కష్టతరం. సాధారణ వార్తలు జనబాహుళ్యానికి తెలియాలంటేనే రోజులు పడుతుంది. నక్సల్స్ దురాగతాలు వంటివి చేరాలంటే… దానికి ప్రధాన సాధనాలు న్యూస్ కంట్రిబ్యూటర్లే. నక్సల్స్ కూడా వీరికే ఉప్పందించేవారు. వీరు పత్రిక కార్యాలయాలకు చేరవేసేవారు. ఏజెన్సీ ప్రాంతాలలో కనీస సౌకర్యాలు ఉండేవి కావు. ఫోన్ సౌకర్యం అసలే లేదు. పోస్ట్ లేదా అత్యవసరమైతే టెలిగ్రామ్ మాత్రమే సాధనాలు.
వెళ్లిన పని ఒకటి… తెలిసింది మరొకటి…
అప్పుడే ఏజెన్సీ మారుమూల ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. దానికి రెండు రోజుల ముందు అడ్డతీగల రిపోర్టర్ సత్యనారాయణను ఒక ఎన్.జి.ఓ. సంస్థ సంప్రదించింది. యాంటీ నక్సల్ బృందాల వల్ల నష్టపోయిన భాషల, గిరిజనులకు సహాయం చేస్తామని ఆ సంస్థ చెప్పింది. పోడు అంటే గిరిజనులు చేసే వ్యవసాయం. గిరిజనులు ఒకే చోట ఉండకుండా… తమకు నచ్చిన చోట అడవులను కాల్చి ఆ ప్రాంతంలో సాగు చేసుకుంటారు. దీనిని పోడు వ్యవసాయమనీ, వారి పోడు గిరిజనులనీ పిలుస్తారు. ఈ ప్రాంతాలలోనే నక్సల్స్ ఎక్కువగా తిరిగేవారు. వీరికి సరిహద్దులో తిరిగే భాషల ప్రజలు అండగా ఉండేవారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, యాంటీ నక్సల్ బృందాలు వీరిపై దాడులు చేసేవారు. వారి ఇళ్లను తగులపెట్టేవారు. (భాషల ప్రజలు అంటే ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దులోని ఒరియా ప్రజలు. వీరు ఒరియా మాట్లాడతారు కాబట్టి, ఇది అర్ధం కానీ తెలుగు గిరిజనులు వారిని భాషలు ప్రజలు అని పిలిచేవారు). ఇలా భాషల ప్రజలను ఆదుకోవాలని ఎన్.జి.ఓ. సంస్థ సంకల్పించి అడ్డతీగల సత్యనారాయణను సంప్రదించింది. చింతపల్లి అటవీ ప్రాంతంలో తమను కలుసుకోవాలని కోరింది. దీనికి అంగీకరించిన సత్యనారాయణ 1987 డిసెంబర్ 25 న అడ్డతీగల నుంచి చింతపల్లికి బయలుదేరి వెళ్లారు. ఇది వై. రామవరం మండలానికి, సీలేరుకు మధ్య ఉంటుంది.

సత్యనారాయణను గమనించిన ఒక పరిచయస్తుడు ఇలా వచ్చారేమిటి… ఇక్కడ పరిస్థితులు బాగోలేవు… వెళ్లిపోండని సూచించారు. ఎందుకైనా మంచిదని సత్యనారాయణ తనను రమ్మన్న వ్యక్తికి తన రాక గురించి తెలియజేశారు. ఆ వ్యక్తి వెంటనే అక్కడికి వచ్చి… ఇప్పుడు వద్దు ఇక్కడ వాతావరణం తేడాగా ఉంది తొందరగా ఇక్కడనుంచి వెళ్లిపోవాలని కోరారు. ఈ మాట విన్న తరవాత సత్యనారాయణ అక్కడి నుంచి రంపచోడవరం చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వ గెస్ట్ హౌసులు అన్నీ సందర్శకులతో నిండి ఉండడాన్ని గమనించారు. ఇది డిసెంబర్ 26 వ తేదీ సాయంత్రం సంగతి. అప్పటికే అధికార వర్గాల్లో కలకలం మొదలైంది. ఈ సంఘటనకు రెండు రోజుల ముందే ఛార్జ్ తీసుకున్న ఎస్.పి. డి.టి. నాయక్ తక్షణం అక్కడికి చేరారు.

అప్పుడు తెలిసింది… వై.రామవరం మండలంలో ఆరుగురు ఐ.ఏ.ఎస్. అధికారులను కిడ్నాప్ చేసారని. ఇదే విషయాన్ని టెలిగ్రామ్ ద్వారా విజయవాడలోని డెస్కుకు సత్యనారాయణ తెలియజేశారు. పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు ఎస్.ఆర్. శంకరన్, జిల్లా కలెక్టరు ఎం.వి.పి. శాస్త్రి, జాయింట్ కలెక్టర్ టి. రాధ, రంపచోడవరం సబ్ కలెక్టర్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజమండ్రి సబ్ కలెక్టర్ పుష్ప తంపి,

ఐ.టి.డి.ఏ. ప్రాజెక్టు ఆఫీసర్ టి. విజయకుమార్,

కాకినాడ అసిస్టెంట్ కలెక్టర్ నరసింగరావు, గిరిజన కాఫీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓ.ఎస్.డి. మనోహర్ ప్రసాద్ అనే ఐ.ఏ.ఎస్. అధికారులను, వై. రామవరం మండలం అధ్యక్షుడు నీలం రెడ్డిని తమ అదుపులో ఉంచుకున్నారనీ, జైల్లో ఉన్న నక్సలైట్ నాయకులను విడిచిపెడితేనే వీరిని అప్పగిస్తామని అధికారులకు స్పష్టం చేశారనీ ఆ టెలిగ్రామ్ సారాంశం. ఈలోగా జాయింట్ కలెక్టర్ టి. రాధను నక్సల్స్ విడిచిపెట్టి వారి డిమాండును ప్రభుత్వానికి తెలిసేలా చేశారు.
అడవిలో విందు ఎందుకు?
ఇంతమంది ఐ.ఏ.ఎస్. అధికారులు తెలిసి తెలిసి అడవిలోకి ఎందుకు వెళ్లారు? దీనికి సమాధానం ఒక విందుకు వెళ్లారు అని. రెడ్డి సుబ్రహ్మణ్యం, పుష్ప తమ్పి అత్యంత సాధారణ రీతిలో వివాహం చేసుకున్నారు. వారు విందు ఇవ్వాలనుకుని, ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వై. రామవరం మండలాన్ని ఎంచుకున్నారు. గుర్తేడుకు సమీపంలో దీనిని ఏర్పాటు చేసుకున్నారు. దీనిని గమనించిన నక్సలైట్లు వారితో ఉన్నవారితో సహా, వై.రామవరం మండలాధ్యక్షుడిని కూడా తీసుకెళ్లారు. వీరిలో టి. విజయకుమార్ అప్పటి బీహార్ గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్య గారి దత్తత కుమారుడు కావడంతో ఈ అపహరణ పర్వానికి అంతులేని ప్రాముఖ్యత వచ్చింది.

వెంకట సుబ్బయ్య వచ్చి రంపచోడవరంలో బసచేశారు. మిగిలిన వారిలో ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్. ఆర్. శంకరన్(శేరుకట్లతురు రామనాథం శంకరన్ 1956 బ్యాచ్ అధికారి) కు మంచి అధికారిగా పేరు ఉంది. ఏనాడు ఆయన తన జీతాన్ని ఇంటికి తీసుకువెళ్లలేదని, పేదల సంక్షేమానికి ఖర్చు చేశారని అంటారు. మరొక ఐ.ఏ.ఎస్. మనోహర ప్రసాద్ రంపచోడవరం ఐ.టి.డి.ఏ. అధికారిగా పనిచేశారు. అధికారికంగా చెప్పింది ఏమిటంటే… ఒక సమీక్ష నిమిత్తం 25 మంది అధికారుల బృందం వై. రామవరం మండల లోతట్టు గ్రామాలకు వెళ్లి వస్తుండగా ఏడుగురిని నక్సల్స్ పట్టుకెళ్లారనేది ప్రకటన. అప్పుడు ఎన్ఠీఆర్ ఆధ్వర్యంలోని తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏపీ ప్రభుత్వం వివిధ సందర్భాలలో అరెస్టు చేసి జైలులో ఉంచిన తమ నేతలు వడ్కాపూర్ చంద్రమౌళి (బి.కె), పిల్లి వెంకటేశ్వర్లు అలియాస్ సత్యం అలియా జాంబ్రి, కమాండర్ ప్రకాష్ భార్య కొప్పుల శోభ, గుమ్మడివల్లి కృష్ణప్రసాద్ అలియాస్ అప్పన్న అలియాస్ ఉసెండి, పొన్నోజు పరమేశ్వర్ అలియాస్ నందు, శ్రీరామ్ నరేంద్ర అతని భార్య ఎస్. రాజేశ్వరిలను పోలీసులు 1987 డిసెంబర్ 15 న అరెస్ట్ చేశారు. వీరిని విడిపించుకోవడానికి కమాండర్ కొంగల సుధాకర్ అలియాస్ కృష్ణ, ప్రసాద్ అలియాస్ చంద్రన్న నాయకత్వంలో పది రోజులు తిరగకుండానే
అధికారులను కిడ్నాప్ చేశారు.
గవర్నర్ విడిదితో వార్త బహిర్గతం
ఎప్పుడైతే గవర్నర్ వచ్చి రంపచోడవరంలో విడిది చేశారో… మొత్తం ప్రెస్ అక్కడికి చేరింది. కిడ్నాప్ వ్యవహారం వెల్లడైపోయింది. నక్సల్స్ డిమాండ్స్ కూడా బయటకు రావడంతో అధికారుల విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అంతా నక్సల్స్ డిమాండును తీర్చే ప్రయత్నాలలో పడ్డారు. నక్సల్స్ ఇచ్చిన సమయం 24 గంటలు. ఆలోగా పరిష్కారం సాధించాలి. ప్రభుత్వ పరువు ప్రతిష్టలు కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఒక పక్క, చర్చలు… మరో పక్క జైలులో ఉన్న నక్సల్సును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు..
ఈ మధ్యలో ఒక ఆకస్మిక ఘటన. నక్సల్స్ అదుపులో ఉన్న నర్సింగరావు అనే ట్రైనీ ఐ.ఏ.ఎస్. కు విరేచనాలు మొదలయ్యాయి… బి.పి. పడిపోవడం ప్రారంభమైంది. అత్యవసరంగా వైద్యం అందించాల్సిన స్థితి. ఆ అధికారిని బయటకు పంపడానికి నక్సల్స్ అంగీకరించారు. ఒక ప్రభుత్వ వాహనం అక్కడికి వెళ్ళింది. అస్వస్థతకు గురైన నర్సింగరావును తీసుకొస్తుండగా… సత్యనారాయణ ఈ అంశాన్ని పసిగట్టారు. అప్పటికే విజయవాడ నుంచి వచ్చిన కొమ్మినేని శ్రీనివాసరావు గారితో ఈ విషయాన్ని చెప్పి మెల్లిగా బయటకు వెడదామని చెప్పారు.

అస్వస్థత కల్పించిన అవకాశం…
అక్కడ రిపోర్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళుండగా ఈనాడు వాళ్లంతా ఒకేసారి వెడితే అనుమానం వస్తుంది. అదీ కాక వీళ్ళు వెళ్ళాల్సింది వై. రామవరం వైపు అంటే ఐ.ఏ.ఎస్.లను ఉంచిన ప్రాంతం వైపు. కాబట్టి.. సత్యనారాయణ అక్కడి నుంచి బయటకు ఎలా వెళ్లాలో ప్రణాళిక చెప్పారు. వాహనం పాడైందని మరమత్తు చేయించుకుని వస్తామని చెప్పి, వాహనాన్ని నెట్టుకుంటూ ఒక పావు కిలోమీటరు వెళ్లారు. మిగిలిన ప్రెస్ కి కనిపించడంలేదని నిర్ధారించుకున్న తరవాత, అందరూ ఎక్కి కూర్చుని వాహనాన్ని స్టార్ట్ చేసి అక్కడినుంచి జారుకున్నారు. కొద్దీ దూరం వెళ్లేసరికి ఒక ప్రభుత్వ వాహనం వస్తూ కనిపించింది. వెంటనే ఆగి, ఆ వాహనాన్ని నిలిపి, తాము ఈనాడు బృందమని చెప్పారు. లోపల ఉన్నది విడుదలైన నర్సింగరావు అని నిర్ధారించుకున్న తరవాత న్యూస్ టైం రిపోర్టర్ ఆయనతో మాట్లాడి, తానే ఈనాడుకు కూడా వార్త ఇస్తానని అందులో ఎక్కి కూర్చున్నారు. ఆ వాహనం రాజమండ్రికి వెళ్లి పోయింది. న్యూస్ టైం రిపోర్టర్ విడుదలైన ఐ.ఏ.ఎస్. నర్సింగరావుతో మాట్లాడి, వార్త ఇచ్చారు. మరుసటి రోజున అది ఈనాడులో మాత్రమే వచ్చింది. ఎలా వచ్చింది అనేది ఎవరికీ అంతుపట్టలేదు. దీని వెనుక ఉన్నది అడ్డతీగల సత్యనారాయణ సమయస్ఫూర్తి. ఆయన ఆ విధంగా చేసి ఉండకపోతే ఈనాడు ఈ ఘనతను సాధించేది కాదు. వాస్తవానికి సమీక్షలో అడ్డతీగల సత్యనారాయణపై రాసిన కథనంలో ఈ అంశం కూడా ఉండి ఉండాలి.
కోర్టు ఉత్తర్వులు చూసి ఐ.ఏ.ఎస్.ల విడుదల
మరుసటి రోజున జైలులో ఉన్న నక్సల్ నేతల విడుదలకు కోర్టు ఉత్తర్వులు రాగానే, కిడ్నాప్ చేసిన నక్సల్సుకు చూపించి అధికారులను బయటకు తెచ్చారు. వారిని ఏ గ్రామంలో ఉంచింది ఇప్పటికీ తెలియదు. అది గుర్తేడుకు సమీప గ్రామం కాబట్టి, ఆ సంఘటనకు గుర్తేడు కిడ్నాప్ గా పేరొచ్చింది. మొత్తం మీద కథ సుఖాంతం కావడంతో అటు ప్రభుత్వమూ, ఇటు జిల్లా అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. రాసేందుకు ఇది చిన్న సంఘటనలా కనిపించవచ్చు. ఆ సమయంలో అధికారులు, కిడ్నాప్ అయిన అధికారుల కుటుంబ సభ్యులు ఎంతగా తల్లడిల్లి ఉంటారో తలచుకుంటే గుండె ఝల్లుమనక తప్పదు. ఈ కిడ్నాప్ ఉదంతం సుఖాంతం కావడానికి ఎస్. ఆర్. శంకరన్ కు సన్నిహితుడైన పౌరహక్కుల సంఘం నాయకుడు కన్నబీరన్ మధ్యవర్తిత్వం వహించారు.

విడుదలైన తరవాత వడ్కాపూర్ చంద్రమౌళి సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. 2006 లో కొయ్యురు వద్ద జరిగిన ఎంకౌంటర్లో పోలీసులు అతడిని హతమార్చారు. ఉసెండి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కీలక నేతగా ఎదిగారు. పిల్లి వెంకటేశ్వరరావు అలియాస్ సత్యం ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అయ్యాడు. కొంగల సుధాకర్ రెడ్డిని కూడా పోలీసులు ఎన్కౌంటర్లో మట్టుబెట్టారు. కొప్పుల శోభ, ఉసెండి నాలుగేళ్ల తరవాత పోలీసులకు లొంగిపోయారు.
ఈ సమయానికి నేను ఈనాడులో చేరలేదు. కానీ, వార్త ప్రాధాన్యత, అడ్డతీగల సత్యనారాయణ సాహసోపేతమైన నిర్ణయాలు చెప్పడానికి, ఆయనతో మాట్లాడి ఈ ఎపిసోడ్ రాశాను. గుర్తేడు కిడ్నాప్ ఘటన ప్రస్తుతం 40 వ సంవత్సరంలోకి ప్రవేశించింది.
(ఇన్ పుట్స్: అడ్డతీగల సత్యనారాయణ, గొర్రిపాటి శివ (ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియాలో కీలక ఉద్యోగంలో ఉన్నారు)