ఆరోజు ఉదయించిన రెండో సూర్యుడు
ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఘటన
ఈనాడు – నేను: 27
జనవరి 8 , 1995 సాయంత్రం 6 50 గంటలు. అసలే చలికాలం. సూర్యుడు ముందే ముసుగేసుకుంటాడు. ఎప్పటిలాగే త్వరగా చీకట్లు అలుముకున్నాయి. అప్పుడు జరిగిందీ సంఘటన. ఆహ్లాదానికీ, ఆత్మీయతకు, అనురాగానికి పుట్టినిల్లయిన కోనసీమలోని ఒక కుగ్రామం. మామిడికుదురు మండలంలో ఉన్న పాశర్లపూడి.. అక్కడ సన్నగా మొదలైన ఎర్రటి కాంతిపుంజం క్రమేపీ పెరుగుతూ… సూరీడు మళ్ళీ పొడుస్తున్నట్టుగా తోచింది. ఆ ప్రాంతానికి దూరంగా ఉన్నవాళ్లు ఎక్కడో అగ్నిప్రమాదం అనుకున్నారు. ఎత్తు ప్రదేశంలో ఉన్నవారికి బుస్సున పైకి లేస్తున్న జ్వాలలు కనిపించాయి. ఆ అగ్నిశిఖా జ్వాల ఏమిటో లోకానికి వెల్లడవ్వడానికి కొద్దిసేపు పట్టింది. క్రమేపీ, చిటపట శబ్దాలు వినిపించాయి. వాయువు మండుతున్న శబ్దం యజ్ఞంలో హవిస్సును ఆరగిస్తున్న అగ్నిదేవుని శ్వాసలా తోచింది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కొర్పొరేషన్ లిమిటెడ్ తన తవ్వకాలలో భాగంగా కోనసీమలో సహజ వాయువును వెలికితీయడానికి పాశర్లపూడి గ్రామంలో ఒక గొట్టపు బావిని రిగ్ సహాయంతో తవ్వుతోంది. చిన్నపాటి తప్పిదం కారణంగా గ్యాస్ ఒక్కసారి బుస్సున పొంగివచ్చింది. దానిని అదుపుచేయడానికి బిగించబోయిన మర ( nut ) జారిపోయి రిగ్గులోకి దూసుకెళ్లింది. అంటే గ్యాస్ ప్రవాహం మరింత పెరిగి పెద్ద శబ్దంతో అదుపుచేయరాని స్థాయిలో మంటలు పైకి ఎగిశాయి. భయవిహ్వలులైన అక్కడి సిబ్బంది పరుగులు తీసి దూరంగా పారిపోయారు. తక్షణం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పని మొదలైంది. కొన్ని కిలోమీటర్ల మేర గ్యాస్ వాసన వ్యాపించింది. ఆ చుట్టుపక్కల మొత్తం విద్యుత్తు సరఫరా నిలిపేశారు. ఇళ్లలో పొయ్యి కూడా వెలిగించకూడదని ఆదేశాలు జారీచేశారు.
ఇలా జరగడం ఒ.ఎన్.జి.సి. సైట్స్ లో సహజమే. చిన్నగా జరిగే ప్రమాదాలను ఎప్పటికప్పుడు అదుపు చేసేస్తారు. అందుకు అవసరమైన అగ్ని నిరోధక సామగ్రి, సాంకేతిక నిపుణులు వారి వద్ద సిద్ధంగా ఉంటారు. ఇది సాదాసీదా అగ్ని కాదు. అందుకే రాత్రికి రాత్రే ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి విచ్చేశారు. అప్పడు లోకానికి వెల్లడైంది.. అది
B L O W O U T అని.
తెలుగులో దాని పేరు నిర్వాపణం. అంటే అగ్నిప్రమాదం అన్నమాట.
బ్లో అవుట్ సంభవించిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల పాటు కొబ్బరి తోటలు వేడికి ఎండిపోయాయి. కణకణమనే శబ్దాలు కోనసీమ గుండెల్లో సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. అప్పటివరకూ అక్కడక్కడా గ్యాస్ పైప్ లైన్ లీకులను మాత్రమే చూసిన ఆ ప్రాంతీయులు ఈ పరిణామానికి భీతిల్లిపోయారు. తల్లడిల్లిపోయారు. ఉన్న ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అలా ఎన్నాళ్ళో తెలీదు. మరొక పక్కనుంచి కమ్ముకొస్తున్న గ్యాస్ వాసన. ఉక్కిరిబిక్కిరవుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణ నష్టం లేదు.
ఈ మహా జ్వాల 65 రోజులపాటు కొనసాగింది. ఈ ప్రాంతాన్ని చూడడానికి ప్రజలు వెల్లువెత్తేవారు. వార్తల సేకరణకు వచ్చే పాత్రికేయుల హడావిడి సరేసరి. అప్పుడప్పుడు విచ్చేసే మంత్రిగణం ఒక పక్క, ఒ.ఎన్.జి.సి. ఉన్నతాధికారులు మరో పక్క… పాశర్లపూడిలో జాతర వాతావరణాన్ని తలపించింది. ఆ ప్రాంతం ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది.
ఇక ఈ మొత్తం అంశంపై ఈనాడు వార్తలు ఇచ్చిన విధానం… డెస్కు, పాత్రికేయుల సమన్వయం, బ్లో అవుట్ అదుపునకు చేపట్టిన డే టు డే అప్డేట్స్ ఇలా అనేక అంశాలు వచ్చే ఎపిసోడ్లలో వివరిస్తాను.