నా సమాధానం విని ఉషశ్రీ గారు….?
ఈనాడు – నేను: 09
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
(అంతకు శర్మ గారికి ఇచ్చిన మాట ప్రకారం వారింటికి వెళ్లాలనుకున్నాను.. సత్యప్రసాద్ గారింటికి ఉషశ్రీ గారి దంపతులు వస్తారని, అక్కడకు వెడదామని అన్నారు.)
శర్మ గారితో బెరుగ్గా సత్య ప్రసాద్ గారి ఇంటి లోపలికి వెళ్ళాను. అప్పటికే ఉషశ్రీగారి దంపతులు వాళ్ళింటికి వచ్చారు. సత్యప్రసాద్ గారు ఎదురొచ్చారు. రండి..కూర్చోండన్నారు.
నన్ను ఆయనకు పరిచయం చేశారు. నమస్కరించాను. ఈలోగా లోపలి నుంచి ఉషశ్రీగారి శ్రీమతి కూడా వచ్చారు. మహాలక్ష్మి కళ ఉట్టిపడేలాఉన్న ఆవిడను చూస్తే ఎంతో సంతోషమనిపించింది.

వెంటనే మా అమ్మగారు గుర్తుకొచ్చారు. మా అమ్మగారికి ధర్మ సందేహాలు కార్యక్రమమంటే ఎంతో ఇష్టం. క్రమం తప్పకుండా వినేవారు. ఆ సమయానికి ఏ పనున్నా వాయిదానే. ఆవిడేకాదు.. ఉషశ్రీ గారి కంఠంలో పురాణ ప్రవచనాన్ని విన్న ఎవరికైనా అదే పరిస్థితి. వేణుగానానికి ముగ్ధులైన గో గణంలాగ మారిపోవలసిందే. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ మనసులో ఉన్న భావాలన్నీ కనుమరుగైపోతాయి. కోట్లాదిమంది ఎదలు గెలిచిన గొంతు ఎదురుగా కూర్చోవడమే అదృష్టమనుకున్నాను. అమ్మగారినే తలచుకున్నాను. 1989నాటికి ఆమె గతించి అయిదేళ్ళు.
మీ నాన్నగారేంచేస్తుంటారు…. అడిగారు ఉషశ్రీగారు.
చెప్పాను…
ఇంటిపేరు….
కూచిమంచి…. నా సమాధానం
సత్య సుబ్రహ్మణ్యం గారు ఏమౌతారు… మరో తూణీరం

మా పెదనాన్నగారండి… మా నాన్నగారు ఆయన అన్నదమ్ముల బిడ్డలు…..నా జవాబు
అప్పటిదాకా ఆయన ముఖంలో ఉన్న ప్రశ్నార్థక కవళిక కనుమరుగైంది.
చిరుమందహాసం తాండవించింది…
ఇంకేం మాట్లాడేదేం లేదన్నట్లు… చూశారు… సత్యప్రసాద్ గారికేసి…
ఆ విషయం నాకు చెప్పలేదేమిట్రా అంటూ సత్యప్రసాద్‌గారు.. శర్మ గారిని అడిగారు..

మా పెద నాన్న గారి పేరు చెప్పే సరికి.. నా గురించి మొత్తం సమాచారాన్ని గ్రహించేశారు ఉషశ్రీ గారు.
సరే వీలు చూసుకుని మా ఇంటికి రా…. అన్నారు..
నాన్నగారితో మాట్లాడి.. చెబుతానన్నాను..
అక్కడి నుంచి నిష్క్రమించాను. ఆ రోజు నవంబర్ ఇరవయ్యో తేదీ…
విషయాలన్నీ మా నాన్నగారికి వివరించా. వెంటనే నాకు సెలవు దొరకదు..
నువ్వెళ్ళి అమ్మాయిని చూసిరా.. తరవాత మేమొస్తామని చెప్పారాయన.
మా తాతగారు.. ఎప్పుడెళ్ళాలో చెప్పారు.. శర్మగారికి చెప్పాను.
మరోసారి ఉషశ్రీగారిని చూడబోతున్నాను…. ఇదే నా మదిలో ఆలోచన..
అమ్మాయిని చూడాలి… బాగుందో లేదో చెప్పాలి.. ఇవన్నీ తలపులోకే రాలేదు.

ఆ రోజు… నవంబర్ 26వ తేదీ రానే వచ్చింది. శర్మ గారు మళ్ళీ ఇంటికొచ్చారు.
ఈసారి వాళ్ళ మేనమామగారు… సత్యప్రసాద్‌గారు కూడా ఉన్నారు.
రండి సుబ్రహ్మణ్యం గారు… అమ్మాయిని చూడ్డానికి వెళ్ళొద్దాం..
నేను దిగాను.. నా వాహనాన్ని తీయబోతుండగా.. బండి అక్కరలేదు..
ఇక్కడే అంటూ ముందుకు నడిచారు..
నడిచేంటత దూరంలోనా… అంటే నాకు దగ్గరే ఉన్నా..
తెలుసుకోలేకపోయానా.. అనుకుని నన్ను నేనే తిట్టుకున్నా..
అయినా ఇప్పటికైనా తెలుసుకోవాలి..
మా ఇంటి నుంచి సరిగ్గా రెండు ఫర్లాంగుల దూరంలో ఉందాయన ఇల్లు. .
నేనున్నది సున్నపు బట్టీల సెంటర్ నుంచి స్టెల్లా కాలేజీకి మధ్య అశోక్ నగర్ బస్టాప్ ఎదురుగా ఇల్లు. వీళ్ళది ఐటిఐ బస్టాపు ఎదురు రోడ్డులో…. ఇవతలినుంచి చూసిన ఇల్లు కనిపిస్తుంది.
రెండు నిముషాల్లో ఇల్లు చేరాం…
లోపలకు వెళ్ళాం.. నేరుగా హాల్లోకి తీసుకెళ్ళారు మమ్మల్ని అక్కడ డైనింగ్ టేబుల్… టిఫిన్లు రెడీ…
కూర్చోమన్నారు. గుండె గబగబా కొట్టుకుంటోంది.. ఒకే సీటున్న వైపు నేను కూర్చున్నాను..
రెండో వైపు సీటు ఖాళీ.. మిగిలిన నాలుగు సీట్లలో ఉషశ్రీగారి దంపతులు.. శర్మ గారు.. సత్యప్రసాద్ గారు కూర్చున్నారు.
టీవీలో ఏదో హిందీ సినిమా వస్తోంది. ఎడమపక్కనున్న టీవీని యధాలాపంగా చూశాను…
ఎవరో ఒక యువతి అక్కడ టీవీ చూస్తోంది…
వెనకనుంచి చూశా…
గులాబీ రంగు చీర కట్టుకుని ఉంది..
ఆమేనా……! సందేహం….
ఈలోగా ఉషశ్రీగారి సతీమణి… ఇలా వచ్చి కూర్చోమ్మా…!!! అని పిలిచారు.
అంతే విసవిసా నడిచొచ్చి నా ఎదురు సీట్లో కూర్చుంది…
ఇంతకీ ఆమెను చూశానా… మాట్లాడానా.. మాట్లాడితే ఏం మాట్లాడి ఉంటాను…. మళ్ళీ రేపు చదువుదురుగానీ…
https://vyus.in/my-school-experience-in-guntur/ఇంటికి పరుగులు తీయించిన కంఠం…