వంద తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు: రేవంత్ రెడ్డి

0
68

పైలెట్ ప్రాజెక్టు త‌ర‌హాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌టి

  • ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో స‌క‌ల వ‌స‌తులు, ర‌వాణా సౌక‌ర్యం క‌ల్ప‌న‌
  • క్యూర్‌లో ఏడాదిలో స‌క‌ల వ‌స‌తుల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు సిద్ధం కావాలి..
  • 99 రోజుల కార్య‌క్ర‌మంలో వారం రోజులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో కార్య‌క్ర‌మాలు
  • ఏఐ సాంకేతిక‌పై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ‌
  • ప్రాథ‌మిక నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు బ్రేక్‌ఫాస్ట్
  • విశ్వ విద్యాల‌యాల‌కు నిధులు అంద‌జేత‌పై నివేదిక స‌మ‌ర్పించండి..
  • విద్యా శాఖపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి
  • ముఖ్య‌మంత్రికి తెలంగాణ విద్యా విధానం నివేదిక అంద‌జేసిన క‌మిష‌న్ స‌భ్యులు
  • నివేదిక‌లో చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిన అంశాలు.. అమ‌లు చేయాల్సిన అంశాల‌పై కేశ‌వ‌రావు క‌మిటీకి అప్ప‌గింత‌
  • ఫీజుల నియంత్ర‌ణ‌పై రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్ చీఫ్ సెక్ర‌ట‌రీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర క‌మిటీ

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దులు, క్రీడా మైదానం, ఇత‌ర అన్ని ర‌కాల వ‌స‌తులు, బోధ‌నా సిబ్బంది, ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌హాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాల‌ని సీఎం ఆదేశించారు. విద్యా శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. నాణ్య‌మైన విద్య‌కు చిరునామాగా తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం పేర్కొన్నారు. ఇందుకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్ పాఠ‌శాల‌ల త‌ర‌హాలో నిర్మించాల‌ని సీఎం ఇంజినీర్ల‌ను ఆదేశించారు. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని, ఏడాదిలో క్యూర్ ప‌రిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూత‌న పాఠ‌శాల‌ల నిర్మాణం పూర్తి కావాల‌ని సీఎం ఆదేశించారు. న‌గ‌రంలోని భార‌తీయ విద్యా భ‌వ‌న్‌, జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూళ్ల‌లో ఉండే అన్ని వ‌స‌తులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌ల్లో ఉండాల‌ని సీఎం తెలిపారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయ‌నున్న 17 పాఠ‌శాల‌లు, అద‌న‌పు గ‌దులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌నున్న 164 పాఠ‌శాల‌ల ప‌నుల్లో ఎటువంటి రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 99 రోజుల పాటు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాల‌కు కేటాయించాల‌ని సీఎం సూచించారు. ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఇత‌ర అంశాల‌ను తెలుసుకొని వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

కృత్రిమ మేథ (AI) ప్ర‌పంచాన్ని శాసిస్తున్న నేప‌థ్యంలో పాఠ‌శాల స్థాయి నుంచి దాని బోధ‌న‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. మారుతున్న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. AIతో ప్రపంచ వ్యాప్తంగా వ‌చ్చే మార్పుల‌ను తెలుసుకొని దాని ద్వారా వ‌చ్చే అవ‌కాశాలు మ‌న విద్యార్థులే అందిపుచ్చుకునేలా మ‌న స‌న్న‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణ‌మైన మార్పుల‌ను తీసుకురావాల‌ని సీఎం పేర్కొన్నారు. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్రేక్ ఫాస్ట్ అంద‌జేత‌కు సంబంధించి అధికారులు, హ‌రేకృష్ణ‌మిష‌న్ ప్ర‌తినిధుల‌కు సీఎం ప‌లు సూచ‌న‌లు చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్ర‌తి విద్యార్థికి పాలు అంద‌జేయాల‌ని.. ఇందుకు పాల‌ను విజ‌యా డెయిరీ నుంచి సేక‌రించాల‌ని సీఎం ఆదేశించారు. విద్యార్థుల‌కు ఎన్ని క్యాల‌రీలు అంద‌జేస్తున్నామ‌నేది తెలుసుకునేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.
పాఠ‌శాల విద్యార్థుల‌కు స్కూల్ యూనిఫాం, పుస్త‌కాల‌తో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అంద‌జేయాల‌ని అందులో స్కూల్ బ్యాగ్‌, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప‌న‌ర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్ష‌న‌రీ, బూట్లు, సాక్సులు ఉండాల‌ని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బ‌డ్జెట్‌లో పొందుప‌ర్చేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంట‌నే ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాలం చెల్లిన కోర్సుల‌ను తొల‌గించాల‌న్నారు. పాలిటెక్నిక్‌, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంట‌నే వివిధ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉపాధి అవ‌కాశాలు ల‌భించేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాల‌యాల‌కు నిధులు కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు. ఇప్ప‌టికే ఉస్మానియా యూనివ‌ర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయించిన విష‌యాన్ని సీఎం గుర్తు చేశారు. మిగ‌తా యూనివ‌ర్సిటీల‌కు ఎంత నిధులు అవ‌స‌ర‌మ‌నే దానిపై నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఉన్న‌త విద్యా మండ‌లి ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డిని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజుల నియంత్ర‌ణ‌కు సంబంధించి తెలంగాణ ప్రైవేటు పాఠ‌శాల‌ల ఫీజు రెగ్యుల‌ట‌రీ మానిట‌రింగ్ క‌మిష‌న్ త‌మ నివేదికలోని అంశాల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎదుట ఉంచింది. వివిధ రాష్ట్రాల్లో అమ‌ల్లో ఉన్న విధానాలు, తెలంగాణ‌లో తీసుకోవాల్సిన అంశాల‌ను వివ‌రించారు. సావ‌ధానంగా విన్న ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్‌, డీఈవోల నేతృత్వంలో పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించి ఫీజుల నిర్ణ‌యంపై నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు.. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్ర‌ట‌రీ స్థాయిలోని క‌మిటీ తుది క‌మిటీగా ఉండి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని తెలిపారు. అలాగే ఫీజు నియంత్ర‌ణ‌కు సంబంధించి విద్యార్థుల త‌ల్లిదండ్రులు, మేధావులు, సామాజిక‌వేత్త‌ల అభిప్రాయ సేక‌ర‌ణ‌కు ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

తెలంగాణ విద్యా విధానంపై తాము రూపొందించిన నివేదిక‌ను తెలంగాణ విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి, స‌భ్యులు
ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి స‌మ‌ర్పించారు. అమెరికా, వియ‌త్నాం, మ‌లేసియా దేశాల్లో స్వ‌యంగా ప‌ర్య‌టించ‌డంతో పాటు వివిధ దేశాలు, ప‌లు రాష్ట్రాల్లోని అత్యుత్త‌మ విధానాల‌ను ప‌రిశీలించి నివేదిక రూపొందించిన‌ట్లు విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్‌, స‌భ్యులు సీఎంకు తెలియజేశారు. నివేదిక‌లోని ఒక్కో అంశంపై ఛైర్మ‌న్ ముర‌ళి సుదీర్ఘంగా వివ‌రించారు. సావ‌ధానంగా ఆల‌కించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆయా అంశాల‌పై త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తూ ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం నివేదిక‌లో చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిన అంశాలు… వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అమ‌లు చేయ‌ద‌గిన అంశాల‌పై నివేదిక రూపొందించే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారు డాక్ట‌ర్ కేశ‌వ‌రావు నేతృత్వంలోని క‌మిటీకి ముఖ్య‌మంత్రి అప్ప‌గించారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్ట‌ర్ కేశవరావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శిగా యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు డైరెక్ట‌ర్ కృష్ణ ఆదిత్య‌, విద్యా శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వెంక‌టేష్ ధోత్రే, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌వీన్ నికొల‌స్‌, స‌మ‌గ్ర శిక్ష నోడ‌ల్ ఆఫీస‌ర్‌, డి.నాగ‌రాజు, ఉస్మానియా విశ్వ విద్యాల‌యం వీసీ ప్రొఫెస‌ర్ మొలుగారం కుమార్‌, డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యా క‌మిష‌న్ స‌భ్యులు ప్రొఫెసర్ పీ.ఎల్‌.విశ్వేశ్వ‌ర‌రావు, డాక్ట‌ర్ చార‌కొండ వెంక‌టేష్, జ్యోత్స్న శివారెడ్డి, ప్రొఫెస‌ర్ ప‌ద్మ‌జా షా, కార్తీక్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌, వీర వాస‌వి, డాక్ట‌ర్ జెన్న‌త్‌ఫ‌ర్ అజ్మీ స‌య్య‌ద్‌, డాక్ట‌ర్ ఎన్‌.వెంక‌టేష్‌, షేక్ జావేద్ అఫ్రోజ్‌, డాక్ట‌ర్ జే.స్వ‌ప్న‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here